– లోక్‌సభలో ఒంటరి పోరేనన్న బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి
– జనసేనతో ఇక పొత్తు ఉండదని స్పష్టీకరణ
– జనసేనకు వృధాగా 8 సీట్లు ఇచ్చామంటున్న బీజేపీ నేతలు
– లేకపోతే ఓటు శాతం పెరిగేదని ఆవేదన
– జనసేన ఎన్డీఏలో భాగస్వామేనన్న కిషన్‌రెడ్డి
– కానీ ఇక తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదట
– ఏపీలో మాత్రం టీడీపీతో జనసేన పొత్తు
– ఎన్నికల్లో బీజేపీ సహకరించలేదంటున్న జనసైనికులు
– పవన్‌తో కలసి ప్రచారం చేసేందుకు భయపడిన బీజేపీ
– కేసీఆర్ తమపై ఆంధ్రాపార్టీ అని ముద్ర వేస్తారన్న భయం
– క్యాడర్ కోసమే తెలంగాణలో పోటీ చేసిన పవన్
– పవన్ ఇంటికెళ్లి మరీ పొత్తు పెట్టుకున్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్
– ఇప్పుడు పొత్తు లేదని నిర్మొహమాట ప్రకటన
– ఇదో ‘పొత్తు’ విచిత్రం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వారిద్దరిదీ రాజకీయ విచిత్ర బంధం. నిన్నటి వరకూ ఒక రాష్ట్రంలో ఒక పార్టీతో పొత్తు. ఆ పార్టీకి మరొక రాష్ట్రంలో ఇంకో పార్టీతో పొత్తు. చివరకు ఇప్పుడు ఇద్దరూ కలసి పోటీ చేసిన రాష్ట్రంలో, ఇకపై పొత్తు ఉండదని తేల్చింది. కానీ జాతీయ స్థాయిలో ఇద్దరూ ఒకేతాను ముక్కలని సెలవిచ్చింది. పక్క రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ, ఇంకో పార్టీతో పొత్తు బంధం పెట్టుకుంది. జాతీయ స్థాయిలో మాత్రం తన భాగస్వామి అయిన పార్టీ.. ఒక రాష్ట్రంలో మాత్రం పొత్తు లేదంటోంది. ఈ చిత్ర విచిత్ర.. గందరగోళ.. అయోమయ..అనుబంధ సిద్ధాంతకర్త , జాతీయ పార్టీ అయిన బీజేపీ అంటే మీరు నమ్మగలరా? యస్. నమ్మి తీరాలి. ఎందుకంటే అది బీజేపీ కాబట్టి!
బీజేపీ-జనసేన బంధం తెగిపోయింది. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ-జనసేన, ఇకపై కలిసే అవకాశం లేదు. జనసేనకు ఇకపై తెలంగాణ వరకూ విడాకులు ఇస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు-కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ప్రకటించేశారు. అయితే జనసేన ఎన్డీఏ భాగస్వామేనని, ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగుతుందని సెలవిచ్చారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి.. ఈవిధంగా రాష్ట్రానికో సిద్ధాంతం ఉంటుందన్న కొత్త విషయాన్ని, కిషన్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్టయింది.
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాతో కలసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,ఎంపి లక్ష్మణ్ కలసి పవన్ ఇంటికి వెళ్లి పొత్తుపై చర్చించారు. నద్దా పిలుపు మేరకు పవన్ ఢిల్లీ వెళ్లి, బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. చివరకు ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు కూడా కాకముందే.. కమలంతో పవన్ ‘కల్యాణం’ ముగిసిపోవడమే ఆశ్చర్యం.
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ అయిన బీజేపీ ఫలితాల తీరుపై పోస్ట్‌మార్టం చేసింది. గతంలో కంటే సీట్లు-ఓట్లు ఎక్కువగా వచ్చిందని మురిసిపోయిందట. అయితే జనసేనకు అనవసరంగా 8 సీట్లు ఇచ్చామని, కమలదళాలు తెగ బాధపడ్డాయట. ఆ 8 సీట్లలో కూడా తామే పోటీ చేసి ఉంటే, మరిన్ని ఓట్లు వచ్చి ఉండేవని విశ్లేషించారట. మొత్తంగా జనసేనతో పొత్తు వల్ల నష్టపోయామన్నది కమలదళాల కవి హృదయమన్నమాట!
నిజానికి గత ఎన్నికల్లో 8 సీట్లలో పోటీ చేసిన జనసేనకు, ఒక్క కూకట్‌పల్లిలోనే 40 వేల ఓట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల నోటా కంటే తక్కువగా, మరికొన్ని నియోజకవర్గాల్లో నోటా కంటే ఎక్కువగా పోలయ్యాయి. దీనిపై ఏపీ సీఎం జగన్ కూడా, పవన్‌పై వ్యంగ్యాస్త్రలు సంధించారు. ‘దత్తపుత్రుడి పార్టీ కంటే మా సోదరి బర్రెలక్క బెటర్’ అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. కానీ అదే జగన్ నాయకత్వంలోని వైసీపీ.. గతంలో అదే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి, దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. జగన్ విమర్శలకు జనసైనికులు ఎదురుదాడితో జవాబిచ్చారు. అది వేరే విషయం.
అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పెద్దగా పర్యటించలేదు. కూకట్‌పల్లి వంటి చోట మాత్రమే ఎన్నికల సభ నిర్వహించారు. మోదీ-నద్దాతో కలసి సభలో ప్రసంగించారు. నిజానికి తెలంగాణలో పార్టీ క్యాడర్ డీలా పడకూడదన్న ఏకైక లక్ష్యంతోనే, పవన్ ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా.. బీజేపీ ఒత్తిడి మేరకు ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో, క్యాడర్ నిరుత్సాహం చెందింది.
అసెంబ్లీకి సైతం పోటీ చేయకపోతే, క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమవుతుంది. పైగా తెలంగాణలో పార్టీ ఉనికి ఉండదు. ఈ కోణంలోనే పవన్, అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్ధులను నిలబెట్టింది. నిజానికి తెలంగాణలో జనసేనకు ఏమాత్రం పట్టు లేదు. పవన్‌కు సినిమా పరంగా ఉన్న అభిమానులే తప్ప, రాజకీయపార్టీగా ఎలాంటి పునాది లేదన్నది నిష్ఠుర నిజం. ఆ పార్టీ నేతలు జనాలతో పెద్ద సంబంధాలున్న వారు కాదు. అంతా చోటామోటా నాయకులే. అయినా క్యాడర్ డీలాపడకుండా, వారి ఒత్తిళ్ల మేరకు పవన్ అయిష్టంగానే చేసిన ప్రయత్నం విఫలమయింది. తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉండి, ఇప్పుడు బలహీనపడిన టీడీపీలో కూడా.. చోటా మోటా నేతలే రాష్ట్ర నేతల అవతారమెత్తారు. డివిజన్ స్థాయి నాయకులు కూడా, రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నారు. జనసేన ది అంతకంటే కొంచెం దయనీయం. మిగతాదంతా సేమ్ టు సేమ్!
కానీ జనాకర్షణ ఉన్న పవన్‌ను, అటు బీజేపీ కూడా వాడుకునేందుకు భయపడటం ఆశ్చర్యం. పొత్తు ఉన్నప్పటికీ పవన్‌ను ఎన్నికల ప్రచార సభలకు ఆహ్వానించలేదు. కలసి ప్రచారం నిర్వహించలేదు.
ఎందుకంటే…పవన్ విస్తృత ప్రచారం చేస్తే, కేసీఆర్ ఎక్కడ బీజేపీపై ఆంధ్రాపార్టీ ముద్ర వేస్తారన్న భయం! గత ఎన్నికల్లో ఇదేవిధంగా చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి, కాంగ్రెస్‌ను పేల్చి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు పవన్ భుజంపై తుపాకీ పెట్టి తమను ఎక్కడ పేలుస్తారన్న భయంతో, పవన్‌తో కలసి ప్రచారం చేసేందుకు బీజేపీ భయపడిందన్నది మనం మనుషులం అన్నంత నిజం.
కిషన్‌రెడ్డి తాజా ప్రకటనతో, ఇక తెలంగాణలో బీజేపీ-జనసేనకు పొత్తు బంధం తెగినట్లేనన్నది సుస్పష్టం. మరి ఆంధ్రాలోనయినా ఉంటుందా అంటే అదీ లేదు. ఎందుకంటే జనసేన-టీడీపీ పొత్తు బంధం ఇప్పటికే కొనసాగుతోంది. రెండు పార్టీలూ కలసి, రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లోకేష్-చంద్రబాబు కార్యక్రమాలకు జనసైనికులు విస్తృతంగా పాల్గొంటున్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ, రెండు పార్టీలూ సమన్వయ కమిటీలు ఏర్పాటుచేసుకుని, జగన్ సర్కారుపై కలసి కదం తొక్కుతున్నాయి. ఈ క్రమంలో జనసేన-బీజేపీ బంధం ఏపీలో కూడా కొనసాగదన్నది, మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమయి తీరాలి. భవిష్యత్తులో బీజేపీ కూడా వారి కూటమిలో చేరితే తప్ప.. ఆంధ్రాలో జనసేన-బీజేపీ పొత్తు అసాధ్యం.
కానీ విచిత్రంగా జనసేన ఇప్పటికీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీయేనని, కిషన్‌రెడ్డి సెలవివ్వడమే వింత. తెలంగాణలో బీజేపీతో జనసేనకు పొత్తు లేదని స్వయంగా కిషన్‌రెడ్డే సెలవిచ్చినప్పుడు.. ఆంధ్రాలో పేరుకు బీజేపీతో పొత్తు ఉన్నా, తీరుకు మాత్రం టీడీపీతో కలసి ఉన్న జనసేన… ఎన్డీఏ భాగస్వామి ఎలా అవుతుందన్నదే ప్రశ్న.