– పంచాయతీరాజ్ రోడ్డు ప్రారంభంలో నిర్లక్ష్యం
– మంత్రి పవన్ పేరు లేకుండానే శిలాఫలకం
– పేరు లేకపోవడంపై జనసైనికుల ఆగ్రహం
– యనమల పేరు ముందు..ఎంపి పేరు తర్వాతనా?
– ప్రొటోకాల్ లేని వారికీ స్థానం
– తమ పేర్లు ఎందుకు ముద్రించలేదన్న ప్రశ్నలు
– సోషల్‌మీడియాలో ట్రోల్ అవుతున్న వైనం
(సుబ్బు)
శిలాఫలకంపై పేర్లు రాజకీయ రచ్చకు.. ముష్టియుద్ధాలకు దారితీసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు తుని నియోజకవర్గంలోనూ అదే జరిగింది. ముష్టియుద్ధమైతే జరగలేదు గానీ, రాజకీయ రచ్చకయతే తెరలేచింది. పంచాయతీరాజ్ నిధులతో 8లక్షల రూపాయలతో తొండంగి గ్రామం కృష్ణాలయం వీధిలో, సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి అధికారులు సిద్ధం చేశారు. దానిని ఈనెల 16న ప్రారంభించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ శిలాఫలకంపై సంబంధిత శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం జనసైనికుల కన్నెర్రకు కారణమయింది.
సహజంగా ఇలాంటి చిన్న చితకా కార్యక్రమాలకు సంబంధిత మంత్రులు హాజరుకారు. ఎంపీలు కూడా రారు. కానీ ఆయా శాఖల మంత్రుల పేర్లు మాత్రం శిలాఫలకంపై ముద్రించడం రివాజు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపి, కౌన్సిలర్, గ్రామ సర్పంచుల పేర్లు కూడా ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ముద్రిస్తుంటారు. కానీ తునిలో మాత్రం పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం, తమ ఎంపి ఉదయ శ్రీనివాస్ పేరు రెండోవరసలో చేర్చి, ఎమ్మెల్సీ అయిన యనమల రామకృష్ణుడు పేరును పైకి చేర్చడంపై జనసైనికులు కారాలుమిరియాలు నూరుతున్నారు.
పంచాయతీరాజ్ శాఖ నిధులతో రోడ్డు నిర్మించినప్పుడు సంబంధిత మంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు పక్కనపెట్టడంపై జనసైనికులు కస్సుమంటున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ పేరు ముందు ఉంటుందా? ఎంపీ పేరు ముందుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రొటోకాల్ లేని మాజీ ట్రస్టుబోర్డు మెంబరు యనమల రాజేష్, కాకినాడ జిల్లా తెలుగుయువత జిల్లా కార్యదర్శి దూలం రామకృష్ణ, తొండంగి మండలం యూత్ అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్ పేర్లు ఏవిధంగా ముద్రిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని టీడీపీ నేతల పేర్లు ముద్రించినప్పుడు, జనసేన నేతల పేర్లు ఎందుకు ముద్రించలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ శిలాఫలం ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.