– పార్టీ పిలుపు మేరకు ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
– నెక్లెస్‌రోడ్ నుంచి రాజభవన్ వరకూ పాదయాత్రగా ర్యాలీలో పాల్గొన్న రేవంత్
– ఖైరతాబాద్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్
– ఎవరిపైనా కేసులు పెట్టని ఖాకీల రాజభక్తి
– ఇతరులనయితే మొదలుపెట్టిన చోటనే అరెస్టులు
– ఖైరతాబాద్ చౌరస్తాలోనే లాఠీచార్జి
– ఈ వెసులుబాటు రేవంత్‌కు ఒక్కరికేనా? అందరికీనా?
– కమిషనర్ వారిపై కేసులు పెట్టరా?
– ప్రభుత్వమే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుందా? హవ్వ!
– చట్టం పాలకులకు చుట్టమా?
-రేపు కోర్టు ఆగ్రహిస్తే చర్యలు ఎవవరిపై తీసుకుంటారు?
– రేవంత్ సర్కారుపై సోషల్‌మీడియాపై విమర్శల వర్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇటీవల సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అలా జైలుకు వెళ్లి.. ఇలా వచ్చేసిన హీరో అల్లు అర్జున్ నటించిన ‘డీజే’ సినిమా చూశారా? అందులో హీరో అల్లు అర్జున్ ఒక డైలాగు వాడతాడు. ‘మీరు సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు‘? అని ప్రశ్నిస్తుంటాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్రశ్ననే ప్రజలు, నెటిజన్లు రేవంత్‌రెడ్డిని.. ట్రాఫిక్ మొత్తం ఆపేసి, ప్రభుత్వంలో ఉన్నవారే ధర్నా చేసి సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు! తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, తన పార్టీ నాయకత్వం పిలుపుమేరకు నిర్వహించిన చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు. సహచర మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కలసి ధర్నా కూడా నిర్వహించిన వైనం వివాదానికి కారణమయింది.
అదానీ అవినీతిపై పార్లమెంటు జెపిసి వేయాలంటూ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానితో కోపం వచ్చిన కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ, దీనికి ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దానితో టీపీసీసీ పిలుపు మేరకు ైెహ దరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి, రాజభవన్ వరకూ నిరసన యాత్ర నిర్వహించి, అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్శింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. భారీ బ్యానర్‌ను పట్టుకుని సీఎం రేవంత్, మంత్రులు ముందుండి నడిచారు. ఇవన్నీ మీడియాలో ప్రజలు చూసిన దృశ్యాలే.
అయినా పోలీసులకు ఇవేమీ కనిపించకపోవడమే విచిత్రం. సహజంగా ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ నుంచి, ఆందోళనకారులు చలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇస్తుంటారు. అప్పుడు పోలీసులు ఆందోళనకారులను ఇందిరాపార్కు వద్దే అడ్డుకుని, వాహనాల్లో వేరే పోలీసుస్టేషన్లకు తరలిస్తుంటారు. ఇక ఎవరైనా పొరపాటున రాజ్‌భవన్‌కు వెళ్లకుండా.. ఖైరతాబాద్ చౌరస్తాలో రాజ్‌భవన్ వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో మూసేసి, అక్కడ పోలీసులు మోహరించే దృశ్యాలు తరచూ కనిపించేవే. పైగా ముఖ్యమైన ఆందోళన కార్యక్రమాలయితే, ఆయా పార్టీల నాయకులను హౌస్ అరెస్టు చేస్తుంటారు.
ఒక్కోసారి మాటవినని ఆందోళన కారులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేసి, వాహనాల్లో ఈడ్చుకు వెళ్లే ఘటనలు కోకొల్లలు. అసలు ఏదైనా అంశంపై ఆందోళన కోసం పార్టీలు, ప్రజాసంఘాలు ముందుగానే పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటాయి. అయితే చలో రాజ్‌భవన్ వంటి ఆందోళనా కార్యక్రమాలకు, పోలీసులు అసలు అనుమతి ఇవ్వరు. అందులో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకూ నిరసన యాత్ర అంటే అసలు అంగీకరించరు. ట్రాఫిక్ సమస్య, వీఐపీల రాకపోకలు, శాంతిభద్రతల సమస్యనే దానికి కారణం.
అయితే విచిత్రంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఆందోళనకు పిలుపునివ్వడం.. అందులో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం.. వారి కోసం పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడం.. ఈ సందర్భంగా చలో రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయకపోవడం.. అసలు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దనే ర్యాలీని అడ్డుకోకపోవడమే ఆశ్చర్యం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12-40 నిమిషాలకు అసెంబ్లీ నుంచి నెక్లెస్‌రోడ్‌కు బయలుదేరారు. మళ్లీ తిరిగి 2 గంటలకు అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. అంటే ఇన్ని గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారుల పరిస్ధితి ఎంత నరకమన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మూడున్నర గంటలపాటు జనం ట్రాఫిక్‌లో ఇరుక్కుని, నరకయాతన అనుభవించారన్నమాట.
సహజంగా సీఎం వస్తున్నారంటే ట్రాఫిక్ నిలిపివేస్తారు. మళ్లీ బయలుదేరేముందూ అదే దృశ్యం కనిపిస్తుంటుంది. అందులోనూ ఒకవైపు అసెంబ్లీ నడుస్తోంది. ఇక స్వయంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ నడుచుకుంటూ వస్తున్నారంటే, ట్రాఫిక్ ఎంతసేపు స్తంభించి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ఎపిసోడ్‌లో అటు పోలీసు సిబ్బంది కూడా ఎంత ఒత్తిళ్లు ఎదుర్కొని ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అటునుంచి రాజ్‌భవన్-అసెంబ్లీ రోడ్డును అనుమతించడం కొంత ఊరట.
కానీ ఖైరతాబాద్, సోమాజీగూడ, లక్డీకాపూల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన వాహనదారులు, ఆటోలు సీఎం పాల్గొన్న ఆందోళనా కార్యక్రమం దెబ్బకు గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవలసిన విషాదం. వీరిలో వృద్ధులు, మహిళలు, గర్భిణుల పరిస్థితి మరీ దారుణం. వారి అవస్థలకు కారణం ఎవరు? ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వీపీఐలా? వారిని అడ్డుకోని పోలీసులా? అన్నది సోషల్‌మీడియాలో నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు. వీటికి సమాధానం చెప్పేదెవరు?
ప్రభుత్వమే ధర్నాకు కూర్చోవడం కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి కడుపులో నొప్పి ఉండవచ్చు అని సీఎం రేవంత్‌రెడ్డి సెలవిచ్చారు. దేశ ప్రజల కోసమే నిరసన దీక్ష చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవచించారు. రైటే. రేపు బీజేపీ కూడా ఇదే మాదిరిగానే నెక్లెస్‌రోడ్డు నుంచి రాజ్‌భవన్ గేటు వరకూ ర్యాలీ చేసి.. మేం దేశం కోసం- ధర్మం కోసం నిరసన దీక్ష చేస్తున్నామని చెబితే, పోలీసులు వారిని అనుమతిస్తారా? బీఆర్‌ఎస్ కూడా తాము తెలంగాణ ప్రజల కోసమే నిరసన దీక్ష చేస్తున్నామని వాదించవచ్చు. కమ్యూనిస్టు పార్టీలు, మానవహక్కుల సంఘాలు తాము కూడా ప్రపంచ ప్రపంచప్రజల కోసమే నిరసన దీక్ష చేస్తున్నామని చెప్పినా.. రేవంత్-భట్టి భాష్యం ప్రకారం.. వారి వాదనను తప్పుపట్టనవసరం లేదేమో? ఎటొచ్చేండెక్కేది నిబంధనలు, శాంతిభద్రతలే!
అసలు హైదరాబాద్‌లో ఏ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలన్నా.. ధర్నా చేయాలన్నా అందుకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ను, కోర్టు ఆదేశాల మేరకు ఎంపిక చేశారు. కేసీఆర్ జమానాలో ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను రద్దు చేస్తే, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం మళ్లీ అక్కడే ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆమేరకు ఉత్తర్వులిచ్చింది. మరి కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వయంగా ప్రభుత్వమే ఉల్లంఘించి, చలో రాజ్‌భవన్ పేరుతో నిరసన యాత్ర నిర్వహించడం ద్వారా పాలకులు సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నట్లు?
ప్రభుత్వమే నిర్ణయించిన ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ధర్నా కార్యక్రమం నిర్వహించకుండా, రాజ్‌భవన్ వద్ద ధర్నా నిర్వహించిన సీఎం, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలనే భవిష్యత్తులో ఆందోళనకారులు ఆదర్శంగా తీసుకుంటే, శాంతిభద్రతలకు పూచీ ఎవరు? ఇందిరాపార్కులో ధర్నా నిర్వహించి, సీఎం, మంత్రులు డెలిగేషన్‌గా వెళ్లి గవన్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదన్నదే ఆశ్చర్యం. బహుశా అదానీపై జెపిసికి రాహుల్ అంతటి పెద్దాయన పోరాడుతుంటే.. ఓ నాలుగైదు గంటలు ప్రజలు ట్రాఫిక్‌లో ఉండి త్యాగం చేయలేరా? అన్న విశాల దృక్పథం కావచ్చు.
రేపు ఏ బీజేపీనో, ఏ బీఆర్‌ఎస్ పార్టీనో, ఏ కమ్యూనిస్టు పార్టీలో.. ఇలాగే నెక్లెస్ రోడ్ నుంచి చలో రాజ్‌భవన్ నిర్వహించి, రాజ్‌భవన్ గేటు ముందు వరకూ వెళ్లి ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతిస్తారా? వారిని అడ్డుకోకుండా, అరెస్టు చేయకుండా.. ఇప్పటిమాదిరిగానే సగౌరంగా, సాదరంగా ట్రాఫిక్ క్లియర్ చేసి, ట్రాఫిక్ ఆపి మరీ వారిని రాజ్‌భవన్ గేటు వద్దకు సాగనంపుతారా? అన్నదే సోషల్‌మీడియాలో పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్నలు.
మరి ట్రాఫిక్ స్తంభించడానికి కారణమయి, రాజ్‌భవన్ గేటు వద్ద ధర్నా చేసిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను అరెస్టు చేయకపోగా, ఆ ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసుల ధిక్కార చర్యపై, రేపు ఏ పెద్దమనిషయినా కోర్టుకు వెళితే.. బలయ్యేది పోలీసులా? పాలకులా?
సహజంగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ర్యాలీలపై నిషేధం విధిస్తుంటారు. మరి ఇప్పుడు ఆ నిబంధనలు ఉన్నాయా? వాటి బంధనాలు తెంచేశారా? అన్నదే సందేహం. అంటే ఇకపై పోలీసుబాసులు చెప్పే.. చట్టం అందరికీ సమానమే. చట్టం తన పనితాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారిని విడిచిపెట్టం.. వంటి రొటీన్ పడికట్టు పదాలను, ప్రజలు నమ్మాల్సిన పనిలేదేమోనన్నది బుద్ధిజీవుల ఉవాచ.