Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుపై ఉన్న కక్షతోనే జగన్ తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు

– టీడీపీ అధినేత అరెస్ట్ ద్వారా ప్రజల్ని దారిమళ్లించి, అంతిమంగా తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలన్నదే జగన్ లక్ష్యం
• చట్టాన్ని అమలుచేయాల్సిన వాళ్లు వైసీపీ చుట్టాలైనప్పుడు… ఆ చట్టాల్ని ఎలాగైనా ఎవరిమీదైనా తాము అనుకున్నట్టు అమలు చేయవచ్చు
• అసైన్డ్ భూములైనా …ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారమైనా, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వానిది అదే విధానం
• చంద్రబాబుతో వదిలిపెట్టరు.. ఇంకా చాలామందిని అరెస్ట్ చేయడం అంతిమంగా టీడీపీని డిస్టర్బ్ చేయడమే వీళ్ల లక్ష్యం
• తాను, తనప్రభుత్వం ప్రజల్లో పరాభవం ఎదుర్కోబోతున్నామని తెలిసి కనీసం తెలుగుదేశాన్ని అయినా నిర్వీర్యంచేయాలన్న కుట్రతప్ప మరేమీ లేదు
• జగన్ కంటే దుర్మార్గంగా నియంత్రత్వంతో విర్రవీగిన ఇందిరాగాంధీ ఎలా ఓడిపోయిందో తెలుసుగా?
• జగన్ చేసిన తప్పుడు పనితో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 2, 3 స్థానాలకు పరిమితం కానుంది
– పీఏసీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

నానాటికీ ప్రజల్లో తనపై, తనప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, దిగజారిపోతున్న తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి, పెరిగినధరలు, పెరుగుతున్న రైతుల ఆత్మహ త్యలు.. మహిళల కష్టాలు.. యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీ, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, టీడీపీని డీ స్టెబిలైజ్ చేయాలన్న కుట్రలో భాగంగానే జగన్ రెడ్డి ఈ దురాగతానికి పాల్పడ్డాడని టీడీపీ శాసనసభ్యులు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ తెలుగుదేశం పార్టీ అనేది ట్రైనింగ్ గ్రౌండ్ అని పదేపదే చంద్రబాబు చెబుతుండే వారు. వేలాది నాయకుల్ని చంద్రబాబు తయారుచేశారు. అంతకు పదింతలు సుశిక్షితులైన సైనికుల్లాంటి కార్యకర్తలు తెలుగుదేశానికి అండగా ఉన్నారు. రేపు జరగబోయే రాజకీయ రణక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ రెట్టింపు ఉత్సాహంతో జగన్ రెడ్డిని ఎదుర్కో వడం ఖాయం.. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మట్టికరిపించడం ఖాయం.

తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్రతప్ప..మరేమీలేదు
వైసీపీ నేతలే మావాడు అనుకున్నట్టే చంద్రబాబుని జైలుకు పంపాడని చెప్పుకుంటున్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి..చంద్రబాబుని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలన్న దురుద్దేశం తప్ప ఎక్కడా ఏ తప్పూ జరగలేదు. ప్రజల్లో తనపై పెరుగుతు న్న వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే జగన్, టీడీపీ అధినేతపై తప్పుడు కేసులు పెట్టించాడు. తాను, తనప్రభుత్వం ఎలాగూ ప్రజల్లో పరాభవం ఎదుర్కోబోతున్నామని తెలిసి, కనీసం తెలుగుదేశాన్ని అయినా నిర్వీర్యంచేయాలన్న కుట్రతప్ప మరేమీ లేదు. జగన్ కంటే దుర్మార్గంగా నియంత్రత్వంతో విర్రవీగిన ఇందిరాగాంధీ ఎలా ఓడిపోయిందో తెలుసుగా? జగన్ చేసిన తప్పుడు పనితో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 2 స్థానాలకు పరిమితం కానుంది.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు.. దానిలోని సంస్థల పనితీరు బాగుందని చెప్పిన ఈ ప్రభుత్వమే మరలా అవినీతి జరిగిందనడం కేవలం కుట్రలో భాగమే
4 ఏళ్లలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఇదిగో ఇంత సొమ్ము.. ఫలానా వారి నుంచి ఫలానా వ్యక్తికి చేరిందని జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం నిరూపించలే కపోయింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని సదరు కార్పొరేషన్ గానీ, ప్రాజెక్ట్ లోభాగస్వాములైన సంస్థలు గానీ చెప్పలేదు.

2021 చివర్లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు అన్నిరకాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిందని వైసీపీ ప్రభుత్వంలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ధృవీకరించింది. ఇదే ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎండీగా అన్నిసంస్థలు అద్భుత పనితీరు కనబరిచాయని ప్రశంసించారు. మీ ప్రభుత్వమే అప్పుడలా చెప్పి.. ఇప్పుడు అవినీతి జరిగిందని చంద్రబాబుని అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపే.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా చేర్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?
పేరు బాగుందని సీమెన్స్ సంస్థను పెట్టారనడం.. సజ్జల చెప్పిందాన్ని ప్రచారం చేయడం తప్ప మంత్రులు అవగాహనతో మాట్లాడటంలేదు వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితో దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ ఈడీనే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి ఏమీలేదని నిర్ధారించింది. వైసీపీ ప్రభుత్వంలోని విచారణసంస్థలు బలవంతంగా జప్తుచేసిన సంస్థల ఖాతాల్ని కూడా హైకోర్ట్ విడిపించింది. రూపాయి పోనప్పుడు, రూపాయి రానప్పుడు ఎలా సీజ్ చేస్తారని హైకోర్ట్ మొట్టికాయలు వేసింది నిజంకాదా?

ఈడీకేసుల్లో బెయిల్ రావడం ఎక్కడా జరగలేదు. సాక్ష్యాధారాలు లేనందునే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో హైకోర్టు అందరికీ బెయిల్ మంజూరు చేసింది. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో సొమ్ములు పోనాయ్ నానేటి సేత్తాను అన్న ఆయన కూడా ఈకేసులో అవినీతి జరిగిందంటున్నాడు. సీమెన్స్ సంస్థకు, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తో సంబంధంలేదని ఎవరు చెప్పారు? అవినీతికేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి తాను ఎలాంటి అవినీతి చేయలేదని రాసిస్తే, ఆయన నిర్దోషని న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇచ్చేస్తాయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, డిజైన్ టెక్, సీమెన్స్ సంస్థలు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకోసం త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయనేది వాస్తవం. సీమెన్స్ సంస్థకు సంబంధంలేదనడం కేవలం వైసీపీ కట్టుకథే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకోసం చేసుకున్న ఒప్పందంలో సీమెన్స్ సంస్థ ఉన్నప్పుడు, దాన్ని ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదో ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి. సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా చేర్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు?

అదే చేస్తే నిజాలు మొత్తం బయటకు వస్తాయి. అందుకే ప్రభుత్వం ఆ ధైర్యం చేయడంలేదు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఈడీ చెప్పలేదు, సీఐడీ నిర్దారించలేదు. జీఎస్టీ నిధులు పక్కదారి పట్టాయని నిరూపితంకాలేదు. సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా చేరిస్తే ఈ ప్రభుత్వం కచ్చితంగా ప్రజల్లోదోషిగా నిలబడుతుంది. అందుకే మొత్తం ప్రాజెక్ట్ లో 90 శాతం నిధులు పెట్టిన సంస్థను వదిలేసి, కేవలం 10శాతం నిధులు వెచ్చించిన ఆనాటి టీడీపీప్రభుత్వంపై పడ్డారు.

తెలుగు యువత మేథస్సు, శక్తి సామర్థ్యాలను చంద్రబాబు ప్రపంచానికి పరిచయంచేస్తే, జగన్ వాలంటీర్ ఉద్యోగాలిచ్చి, యువత సామర్థ్యాన్ని నీరుగార్చాడు
యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారు. నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగురాష్ట్రాల్లోని పిల్లలు ఐటీరంగంలో అద్భుతాలు సాధిస్తున్నా రంటే దానికి కారణం చంద్రబాబు ఆలోచనలే. రాష్ట్రానికి 350 ఇంజనీరింగ్ కాలేజీలు చంద్రబాబు అందిస్తే, జగన్ రెడ్డి యువతను వాలంటీర్లను చేశాడు. సీమెన్స్ సంస్థ ఏపీలో చేపట్టిన కార్యక్రమం గ్లోబల్ ప్రోగ్రామ్. కాలానుగుణంగా మార్పు చెందే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చు కోవాలన్న సదుద్దేశంతో చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను తప్పుపట్టడం వైసీపీప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.

యువత పేదరికంలో మగ్గిపోవాలని వారిని వాలంటీర్లుగా మార్చి, నిత్యం వారు తమపై, తమప్రభుత్వంపై ఆధారపడి బతకాలని జగన్ రెడ్డి భావిస్తే, చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తో తెలుగుయువత మేథస్సు, శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి ప్రాజెక్ట్ పై ఇష్టానుసారం దుష్ప్రచారం చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. నిజంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే, రాష్ట్రంలోని శిక్షణా కేంద్రాలను వైసీపీప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?

చంద్రబాబు అరెస్ట్ పై హైకోర్టుకు ఏం చెప్పాలో తెలియక ప్రభుత్వ న్యాయవాదులు నీళ్లు నమిలారు
చంద్రబాబు అరెస్ట్ పై ఏసీబీ కోర్టుని కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. నేడు హైకోర్ట్ లోజరిగిన వాదనలలో కూడా సమాధానం చెప్పలేక తప్పించుకుంది. అవినీతి జరిగిందని చెప్పబడుతున్న కేసుల్లో ఎలా వ్యవహరించాలో కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. వాటిప్రకారం ప్రతిపక్షనేత, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ విషయం చెప్పలేకే హైకోర్టు లో ప్రభుత్వ న్యాయవాదులు నీళ్లునమిలారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.371 కోట్లు దారిమళ్లాయనేది కూడా పచ్చి అబద్ధం. సీమెన్స్ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారమే రాష్ట్రంలో వ్యవహారం నడిచింది. ఆ సంస్థను ప్రతివాదిగా చేర్చకుండా ప్రభుత్వం ఎన్ని కట్టకథలు అల్లినా అవేవీ నిలబడవు. కేవలం టంగుటూరు మిరియాలు తాటికాయంత అంటూ చేసే ప్రచారంలో భాగం తప్ప, చంద్రబాబు తప్పు చేశారు అనడానికి ఎక్కడా, ఎలాంటి ఆధారాలు లేవు.

నాలుగున్నరేళ్లలో న్యాయవాదులకు పెట్టిన ఖర్చుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
చట్టాన్ని అమలుచేయాల్సిన వాళ్లు వైసీపీ చుట్టాలైనప్పుడు… ఆ చట్టాల్ని ఎలాగైనా ఎవరిమీదైనా తాము అనుకున్నట్టు అమలు చేయవచ్చు. అసైన్డ్ భూములైనా …ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారమైనా, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వం ఇదే విధానం అనుసరిస్తుంది. చంద్రబాబుతో వదిలిపెట్టరు.. ఇంకా చాలామందిని అరెస్ట్ చేయడం అంతిమంగా టీడీపీని డిస్టర్బ్ చేయడమే వీళ్ల లక్ష్యం. ఇలాంటివి ఎన్నిచేసినా న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటాం. వీళ్లు ఎన్నిచేసినా ధైర్యంగా ప్రజాపోరాటంతోనే ఎదుర్కొంటాం.

అసెంబ్లీ సమావేశాలు పెట్టేది పెద్దపెద్ద స్క్రీన్లపై తాము అనుకున్నది దుష్ప్రచారం చేయడానికే. వారు చెప్పేది ప్రచారం చేసుకుంటారు…మేం ఏదైనాచెబితే అసలు బయటకే రానివ్వరు. పీఏసీ కమిటీని నియమించలేదు. సీమెన్స్ గ్లోబల్ సంస్థ, సీమెన్స్ ఇండియాతో తమకు సంబంధంలేదని చెప్పిందని వీళ్లు అంటున్నారు. సీమెన్స్ ఇంఢియా.. సీమెన్స్ గ్లోబల్ .. రెండూ ఒకటే. జగన్మోహన్ రెడ్డితో తనకేం సంబంధంలేదని విజయసాయిరెడ్డి చెబితే నమ్మేస్తారా?

ఇద్దరూ ఏ1, ఏ2లుగా ఉన్న కేసుల్ని కొట్టేస్తారా? వైసీపీప్రభుత్వం చెప్పేది నిజమే అయితే సీమెన్స్ సంస్థను తక్షణమే ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలి. 90శాతం నిధులు ఎవరైనా ఇస్తారా అని ప్రభుత్వ న్యాయవాది సుధాకర్ రెడ్డి వితండవాదన చేస్తున్నారు. ఆయన మేథావి తనాన్ని ఉపయోగిస్తూ, వేరే ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నప్పుడు, మొత్తం పెట్టుబడి తానే పెడతాను అన్నప్పుడు ఆయన వారితో కలిసి పనిచేయడా? 90శాతం నిధులు సీమెన్స్ సంస్థ ఏపీలోనే పెట్టిందా? దాదాపు 6రాష్ట్రాల్లో పెట్టింది. అక్కడెలా పెట్టారంటే ఏం సమాధానం చెబుతాం.

వైసీపీ నాయకులు ఎవరూ ప్రజా క్షేత్రంలో నేరుగా మాతో పోరాడలేరు. ఎంతసేపువ్యవస్థల్ని అడ్డంపెట్టుకొని బతకండం తప్ప. ప్రజాధనాన్ని ఉపయోగించి, దేశంలోని అత్యంతఖరీదైన న్యాయవాదుల్ని ఈ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. గంటకు 50లక్షలు, కోటి, రూ.2కోట్లు చెల్లిస్తున్నారు.

నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థలో ఉపయోగించుకున్న న్యాయవాదులకు ఎంత ఖర్చుపెట్టిందనే వివరాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలదా? కింద పోలీస్ వ్యవస్థను ఒకరకంగా ఉపయోగించుకుంటూ, సీఐడీ, సీబీసీఐడీలను మరోరకంగా ఉపయోగిస్తూ, న్యాయవ్యవస్థను మరోలా దుర్వినియోగం చేస్తున్నారు.” అని కేశవ్ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE