– క్రెబ్స్, కేకేఆర్ కంపెనీల డొమెస్టిక్ పవర్‌కు ఓకే
– లేకపోతే లోపల రసాయనాలతో ప్రమాదమట
– అనుమతి మంజూరు చేసిన కమిటీ పెద్దలు
– మరి ఇన్నాళ్లూ ఎందుకు అనుమతి ఇవ్వలేదు?
– రసాయన ప్రమాదం ఇప్పుడే గుర్తుకొచ్చిందా?
– కెమికల్స్ ఎప్పుడో డెడ్ అయిపోతా యంటున్న ఇంజనీర్లు
– ఇప్పుడు కరెంటు.. రేపు మొత్తం కంపెనీ ప్రారంభానికి వ్యూహం?
– ఫిబ్రవరిలో గన్నవరం వద్ద పొలాల్లో విష వ్యర్థాలు పారబోసిన క్రెబ్స్, కేకేఆర్ కెమికల్స్
-ఇక గడ్డి కూడా మొలవనంత నాశనమైన పొలాలు
– దానితో వాటిని సీజ్ చేసిన పీసీబీ చైర్మన్
– అసెంబ్లీలో ప్రస్తావించిన టీడీపీ ఎమ్మెల్యే బొండా
– అదే క్రెబ్స్‌పై పీసీబీకి ఎమ్మెల్యే బొండా ఫిర్యాదు
– మళ్లీ చర్యలు వద్దని ఒత్తిడి చేస్తున్నారంటూ సీఎంఓకు వివరణ
– రాంకీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న బొండా
– బొండా తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం
– ఇప్పుడు అదే క్రెబ్స్ కెమికల్స్‌కు డొమెస్టిక్ పవర్‌కు అనుమతించిన పీసీబీ
– పవన్ కల్యాణ్‌కు తెలిసే జరుగుతోందా?
– అంటే అంతా ‘సర్దుకు’న్నట్లేనా?
– మరి ఆ పొలంలో పోసిన విషవ్యర్ధాల సంగతేమిటి?
– ఇప్పుడు శుద్ధి చేస్తే వచ్చే లాభమేమిటి?
– పెనాల్టీ, క్రిమినల్ కేసులు అటకెక్కినట్లేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అసెంబ్లీలో చర్చనీయాంశమైన ఒక కెమికల్ కంపెనీ వ్యవహారం ఎట్టకేలకు ‘సర్దుకు’పోవడం ప్రారంభించింది. రైతుల పొలాలను రసాయన విష వ్యర్ధాలతో నింపిన క్రెబ్స్, కేకేఆర్ అనే కెమికల్ కంపెనీపై పీసీబీ విధించిన నిషేధం.. క్రమంగా ఎత్తివేసే ‘తొలిదశ’ వ్యూహానికి తెరలేచింది. అంటే తొలి దశలో సీజ్ చేసిన వాటికి డొమెస్టిక్ పవర్ ఇవ్వాలని పీసీబీ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. కారణం..ఇన్నాళ్లు కరెంటు లేకుండా ఉంటే లోపల బయోలాజికల్ ల్యాబ్‌లోని రసాయనాలు మిక్సయి ప్రమాదం జరిగే అవకాశం ఉందట.
అందుకే వాటికి ముందు డొమెస్టిక్ పవర్ పర్మిషన్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రెండు కంపెనీలు గత ఫిబ్రవరిలో తమ విష రసాయన వ్యర్ధాలను ట్రీట్మెంట్ చేయకుండా, నేరుగా గన్నవరం పొలాల్లో కుమ్మరించిన వైనం సంచలనం సృష్టించింది. ఆ విషయం తెలిసిన పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ రెండు కంపెనీలు సీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు.
దీనిపై తొలుత ‘మహానాడు’ ప్రత్యేక కథనం వెలువరించింది. ఆ తర్వాత శాసనసభలో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. దానిపై స్పందించిన పీసీబీ.. ఆ కంపెనీల ఖర్చుతోనే రసాయన వ్యర్ధాలతో నిండిన పొలాలను తిరిగి శుద్ధి చేసి, యధాతధ స్థితిని కొనసాగించే ప్రక్రియ ప్రారంభించింది. నిపుణులను సంప్రదించింది. యూనివర్శిటీ విద్యార్ధులతో సర్వే చేయించింది. చివరకు హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌కు పంపించాలని నిర్ణయించింది. మరి ఆ నివేదిక వచ్చిందా? లేదా అన్నది ఎవరికీ తెలియదు. నిజంగా నివేదిక వచ్చి ఉంటే.. నిపుణులు ఎప్పుడో ఆ పొలంలో దిగిపోయిన రసాయ వ్యర్ధాలను శుద్ధి చేసేవారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగితే టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగి, ఒక్కరోజులోనే శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభించేవారు.
ఇప్పుడు ఇది ఫిబ్రవరిలో జరిగినా ఇప్పటివరకూ చర్యలు తీసుకునే దిక్కులేదు. అసలు ఈ పనికి పాల్పడిన ఆ రెండు కంపెనీలపై అప్పుడే క్రిమినల్ చర్యలు తీసుకుని, భారీ మొత్తంలో పెనాల్టీ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ ఆ పని చే యలేదు. కాగా ఆ కంపెనీల లైజనింగ్ సిబ్బంది రోజూ పీసీబీలో దర్శనమిస్తున్నారంటే, తెరవెనుక ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి మేధావులే కానక్కర్లేదు. ఇప్పుడు కూడా ఆ కంపెనీలకు డొమెస్టిక్ పవర్ ఇచ్చేందుకు పీసీబీ కమిటీ చెబుతున్న కారణాలు కూడా న మ్మశక్యంగా లేవని కెమికల్ ఇంజనీర్లు వాదిస్తున్నారు. ‘‘ఫిబ్రవరిలోనే కంపెనీని మూసి వేసినందున, ల్యాబ్‌లోని బయోలాజికల్ కల్చర్ ఎప్పుడో డెడ్ అవుతుంది.
ఇప్పుడు దానిని ఓపెన్ చేయకపోతే ప్రమాదమని చెప్పడంలో అర్ధం లేదు. ఆ పేరుతో ముందు తాళాలు తెరిపించుకుని, చిన్నగా మిగిలిన పర్మిషన్లు తీసుకునేందుకే ఈ వ్యూహం. అందరూ ఇలాంటి టెక్నిక్కులే ప్లే చేస్తుంటారు’’ అని కెమికల్ ఇంజనీర్లు తమ అనుభవం చెబుతున్నారు. విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమ క్రెబ్స్-కేకేఆర్‌పై చేసిన ఫిర్యాదులేమిటి? దానికి ఆయన ఇచ్చిన ఆధారాలేమిటి? మరి క్రెబ్స్-కేకేఆర్ కంపెనీల ఉల్లంఘనలపై పీసీబీ ఎంత పెనాల్టీ వేసింది? దానిని ఆ కంపెనీలు చెల్లించాయా? నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను పీసీబీ తన వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు? అసలు నాగార్జున యూనివర్శిటీ నిపుణులు చేసిన సిఫార్సులేమిటి? ఎప్పుడో ఫిబ్రవరిలో ఘటన జరిగితే, ఇప్పుడే ఎందుకు వాటికి డొమెస్టిక్ పవర్‌ను ఎందుకు అనుమతించింది? ఇప్పుడు డొమెస్టిక్ పవర్‌కు అనుమతి ఇచ్చినందువల్ల వచ్చే ఉపయోగమేమిటి? పెనాల్టీలు చెల్లించకుండా వాటికి డొమెస్టిక్ పవర్‌కు ఎందుకు అనుమతించింది? పీసీబీలో ఆ రెండు కంపెనీల తరఫున లాబీయింగ్ చేస్తున్న వ్యక్తిని, కార్యాలయంలోకి ఎందుకు అనుమతిస్తున్నారు? గన్నవరంలో నాశమైన భూమికి చెందిన మట్టిని, ఇప్పటిదాకా సిమెంట్ కంపెనీలకు ఎందుకు తరలించలేదు? అసలు ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడిన ఆ రెండు కంపెనీలపై ఇప్పటిదాకా క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.
అది కమిటీ సిఫార్సు: కృష్ణయ్య కాగా ఆ కంపెనీలకు డొమెస్టిక్ పవర్ అనుమతించాలన్న నిర్ణయం నిపుణుల కమిటీ తీసుకుందని పీసీబీ చైర్మన్ కృష్ణయ్య చెప్పారు. లోపల ఉన్న రసాయనాల వల్ల ప్రమాదం జరగకుండా ఉండేందుకే, కమిటీ ఆ నిర్ణయం తీసుకున్నట్లుందన్నారు. అయితే ఆ కంపెనీలపై పెనాల్టీ ప్రక్రియతోపాటు, ఇతర చర్యలు కొనసాగుతాయని కృష్ణయ్య వివరించారు. మురళీ ఫార్చూన్ వేదికగా లాబీయింగ్? రెండు కంపెనీలను సీజ్ చేసిన తర్వాత, దానిని ఎత్తివేయించుకునేందుకు రంగంలోకి దిగిన కంపెనీ ప్రతినిధుల లాబీకి.. విజయవాడ బందరు రోడ్ లోని మురళీ ఫార్చూన్ వేదికయినట్లు తెలుస్తోంది. ఆ మేరకు లభించిన వీడియో కూడా అదే చెబుతోంది. కంపెనీల ప్రతినిధులు, ఓ కంపెనీ యజమాని, అందులో పనిచేసే ఉద్యోగులు విజయవాడలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు ప్రజాప్రతినిధి మిత్రుడొకరు డీల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమను ఈ సమస్య నుంచి బయటపడేయాలంటూ.. నెల్లూరుకు చెందిన ఓ కీలకమంత్రి బావమరి దయిన ఓ రెడ్డిగారిని ఆశ్రయించగా, ఆయన పీసీబీ ప్రముఖుడితో మాట్లాడినట్లు సమాచారం. అయితే ఆ కంపెనీలపై కేసు నడుస్తుందన్న, ఈ విషయంలో తానేమీ చేయలేనని, సదరు పీసీబీ ప్రముఖుడు త న నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పవన్ కల్యాణ్‌కు తెలుసా? కాగా పీసీబీ నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించి, పొలాల్లో విష వ్యర్ధాలు పారబోసి, సీజ్‌కు గురైన ఆ రెండు కంపెనీలకు.. డొమెస్టిక్ పవర్ అనుమతించిన వ్యవహారం ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలుసా? అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీలో చర్చ జరిగి, పవన్‌కల్యాణ్ ఆగ్రహానికి గురైన ఈ అంశంలో.. పీసీబీ కీలక నిర్ణయం తీసుకునే ముందు, సహజంగా ఆయన అనుమతి తీసుకోవాలి. కనీసం తాను తీసుకున్న నిర్ణయంపై సంబంధిత మంత్రి అయిన పవన్ కల్యాణ్‌కు సమాచారం ఇవ్వాలి. మరి ఆ ప్రకారంగా..క్రెబ్స్-కేకేఆర్ కంపెనీలకు డొమెస్టిక్ పవర్ అనుమతించాలన్న నిర్ణయం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా అన్నదే ప్రశ్న.


