– ప్రతిపక్షాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న రాజ్యం
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన రాజ్యం ప్రశ్నించే వారిని నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ యాక్ట్ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.
ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 28వ రోజు గురువారం మధిర మండలం చిలుకూరు గ్రామం లో మొదలైంది. గ్రామ సర్పంచ్ సంధ్య వంశీలు భారీ గజమాలతో సీఎల్పీ నేతను సత్కరించారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలను పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురి చేయడం వల్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమ్మన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి నడుం బిగించానని తెలిపారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు.