Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి

– రాష్ట్రపతి పాలన రావాల్సిన తరుణం ఆసన్నమైంది
– ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు
– ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే డ్రగ్స్ అరికట్టండి
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తాం… ఖబడ్దార్..
– చంద్రబాబునాయుడు
రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక, అప్రజాస్వామిక పాలనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష ప్రారభించారు. “ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైకాపా మూక దాడిని నేతలందరూ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోందని, ప్రజాస్వామ్యం నశించిందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని మండిపడ్డారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ టెర్రరిజమే అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
సమాజంలో ప్రభుత్వం సృష్టిస్తున్న సమస్యల్ని ప్రజలకు తెలియజేసేందుకు, సమస్య పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు అనేక విధాలుగా పోరాటం చేస్తాం. కానీ నేడు దాడి జరిగిన చోటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్నాం. 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న కార్యాలయం ఇది. తెలుగు ప్రజలకు పవిత్రమైన దేవాలయం. అలాంటి దేవాలయం మీద, కార్యకర్తల మనోభావాల మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. దేశ చరిత్రలో, నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులు చూడలేదు. టీడీపీని తుదిముట్టించాలి, భయబ్రాంతులను గురి చేయాలని దాడికి తెగబడ్డారు. ప్రజల పక్షానా ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా భయపడాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నారు. ఈ దాడులపైన పెద్ద కుట్రే జరిగింది.
వైసీపీ మూక దాడికి వచ్చినప్పుడు మేము వర్చువల్ మీటింగ్ లో ఉన్నాం. అప్పుడే 4.30 గంటలకు పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని సమాచారం వచ్చింది. పట్టాభి భార్యను, 8 ఏళ్ల చిన్న అమ్మాయిని కాపాడాలని ఆలోచించే లోపే ఇళ్లు మొత్తం ధ్వంసం చేశారు. వెంటనే డీసీపీ, డీజీపీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ అప్పుడే.. డీజీపీ కార్యాలయం పక్కన, సీకే కన్వెన్షన్ నుండి 150 మంది పార్టీ కార్యాలయానికి బయలు దేరారని సమాచారం అందింది. వెంటనే 5.03 నిమిషాలకు డీజీపీకి ఫోన్ చేశాను. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. నేను ఫోన్ చేస్తే పనులున్నాయని డీజీపీ ఫోన్ తీయలేదు. పక్కన వుండే అర్బన్ ఎస్పీకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. సీఐకి, డీఎస్పీకి మా కార్యాలయ సిబ్బంది ఫోన్ చేస్తే ఏం జరగుతుంది, మీకెలా తెలుసంటూ సమస్యకు పరిష్కారం చూపకుండా సాగదీసే విధంగా మాట్లాడారు. నేను వెంటనే గవర్నర్ కు ఫోన్ చేశాను.
విశాఖ పార్టీ ఆఫీసుపై దాడి చేశారు, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంపై దాడి చేశారు. కడపలో అమీర్ బాబు ఇంటిపై, లింగారెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఇంచార్జి సుధీర్ రెడ్డి రేణిగుంట్లలో వుంటే ఆయన కారు పగలగొట్టారు.. ఇవన్నీ గవర్నర్ కు చెప్పాను. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.. టీడీపీ నేతలను, కార్యాకర్తలను చంపాలని చూస్తున్నారు, గవర్నర్ గా మీకు అధికారం వుంది, వాటిని అరికట్టండని చెప్పాం. కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశాను. వంద మీటర్ల దూరంలో మా పార్టీ కార్యాలయానికి డీజీపీ ఆఫీస్ వుంది. బెటాలియన్ వుంది. పక్కన సీఎం ఇళ్లు వుంది. కానీ టీడీపీ కార్యాయలంపై దాడి జరిగింది. పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి ఈ దాడి చేశారు. కేంద్ర మంత్రిగా మీరు జోక్యం చేసుకోండి, దేశంలో ఈ రాష్ట్రం భాగం, బాద్యత తీసుకోండని చెప్పాను. తక్షణమే చర్యలు తీసుకుంటాం.. లేఖ పంపండని చెప్పారు. దాడి ఘటనలు చూస్తుంటే మనసంతా ఈ ఆఫీసుపైనే వుంది.
70 లక్షల మంది కార్యాకర్తలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలయం ఈ పార్టీ కార్యాలయం. ఈ దాడి మనపై కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి. ఏదైనా పర్వాలేదు.. తాడోపేడో తేల్చుకోవాలని వెంటనే కార్యాలయానికి వచ్చాను. వైసీపీ గూండాలు నేరుగా ఈ డీజీపీ ఆఫీస్ ముందు నుండే వచ్చారు. టీడీపీ కార్యాలయంలోని సిబ్బందిని సుత్తెలతో విచక్షణా రహితంగా కొట్టారు. తాగి వచ్చి వీరంగం సృష్టించి, కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. తర్వాత తీక్షణంగా పోలీసులు వచ్చి వాళ్లను సాగనంపారు. మీకు సిగ్గనిపించలేదా డీజీపీ, పోలీసులు.? మమ్మల్ని మేము కాపాడుకోవాలి. వైసీపీకి సవాల్ విసురుతున్నా.. మమ్మల్ని మేము కాపాడుకోగలం.. పోలీసులకు చేతగాకపోతే స్టేషన్లు మూసేసుకుని వెళ్లండి.
నేను ముఖ్యమంత్రిగా చేశా, 22 ఏళ్లు టీడీపీ అధికారంలో వుంది, సామాన్య ప్రజలు, ప్రతిపక్షం ఎవరికి ఆపద వచ్చినా కాపాడిన ఏకైక పార్టీ టీడీపీ. జగన్ రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేశారు, డీజీపీ రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేసి పదవి స్వీకరించారు. ఇంత విధ్వంసం జరిగితే మీరు ఏం చేశారు.? ఇప్పటి వరకు నా మంచి తనాన్ని చూశారు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్. జగన్ ను హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అలాంటప్పుడు 356 పెడతారు. టీడీపీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కావాలని అడగలేదు. ఒక పార్టీ కార్యాలయంపైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థపైన పద్దతి ప్రకారం చేశారు. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయి,356 పెట్టి రాష్ట్రాన్ని కాపాడాలని కోరాను. ఎన్ని గట్స్ వుండాలి డీజీపీకి.? కార్యాలయానికి ఎవరో సీఐ వచ్చి అనుమానస్పదంగా తిరిగితే పట్టుకుని మీడియా ముందు మనవాళ్లు పెట్టారు. పోలీసులకు అప్పజెప్పిన తర్వాత అతనెల్లి మన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టారు. మా అనుమతి లేకుండా మీ అధికారి మా ఆఫీసుకు ఎందుకు వచ్చారు. మహావ్యవస్థకు ఈ డీజీపీ నాంది పలికారు..శబాష్. ఎన్ని చేస్తారో చేయండి చూస్తాం. పట్టాభి వాడిని బాష తప్పైతే సీఎం భాష ఏంటి.? మీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి.? ప్రజల్ని అడుగుదామా.? విలువలతో కూడిన రాజకీయం చేశాము. మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా తిడుతూ దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రలో రెండున్నరేళ్లుగా సహజవనరులు ఏకపక్షంగా పోయాయి. మైనింగ్ హస్తగతం చేసుకున్నారు. లిక్కర్ చూస్తే నాసిరకం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. తాగితే చనిపోతున్నారు. సొంత బ్రాండ్లు తయారు చేసి కమీషన్లకోసం అమ్ముతున్నారు. జగనే షాపులు పెట్టుకుని జగనే అమ్ముకుంటున్నారు.
ఇసుక ఎక్కడా దొరకడం లేదు. పేదల రక్తాన్ని తాగుతున్నారు. పన్నులు విపరీతంగా పెంచారు. రైతులకు గిట్టుబాటు దర లేదు. కరెంటు చార్జీలు పెంచారు. రాష్ట్రం ఏమైపోతుందోనని భయం వేస్తోంది. జగన్ చేసే తప్పులు, రాష్ట్రం అదోగతి పాలు చేసేలా వుంది. ఎక్కడ చూసిన నాసిరకం లిక్కర్. మరోవైపు వాళ్లే నాటుసారా తయారు చేస్తున్నారు. అవి తాగి జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగింది. రూ.25వేల ఎకరాల్లో గంజాయి పండించి వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలం ఏపీ. పక్క రాష్ట్ర సీపీ ఏపీ నుండి గంజాయి వస్తుందని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తామని కేసీఆర్ అన్నారు. జగన్ ఒక్క మీటింగ్ అయినా పెట్టారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడితే నర్సీపట్నం నుండి వచ్చి నోటీసులు వచ్చారు. పేపర్లలో సమాచారం వస్తుంది, క్షేత్ర స్థాయి నుండి సమాచారం వస్తుంది. వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం.
ప్రజాస్వామ్యాన్ని కాపడటానికి మనం ప్రయత్నిస్తే మనకు నోటీసులు ఇస్తున్నారు. పలానా దిక్కున చంపారు అంటే మీకు సమాచారం వుందా అని అడుగుతున్నారు..మేము మీకు సాక్ష్యాలు ఇవ్వాలా.? ముంద్రా పోర్టులో హెరాయిన్ 3 వేల కేజీలు దొరికింది. దాని చిరునామాలు విజయవాడలో అని వచ్చింది. దానిపై మాకు సంబంధంలేదని సీపీ మాట్లాడుతున్నారు. సత్యనారాయణ పురం మీరు వెళ్లారా..జీఎస్టీ ఎందుకు కడుతున్నారు. కేసులు పెడతామని డీజీపీ అన్నారు..మీకేసుకులకు మేము భయపడం.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి 1984 లో ఎన్టీఆర్ ను సీఎంగా బర్తరఫ్ చేస్తే ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకు వచ్చి పోరాడి 30 రోజుల్లో ఎన్టీఆర్ ను మళ్లీ సీఎం ను చేసుకున్న చరిత్ర ఈ తెలుగుజాతిది. ఈ డీజీపీ నాకు నీతులు, కథలు నేర్పిస్తాడా.? అధికారం వస్తే అహంభావంతో ఊగిపోతారా.? ఈ రాష్ట్రంలో డ్రగ్స్ లేవా.? డ్రగ్స్ పై అందరినీ సంప్రదించి అరికట్టాలని మాట్లాడటం లేదు. గంజాయి తాగావ వారి జీవితంలో మామూలు మనుషులు కాలేదు. దీనిపై టీడీపీ పోరాడితే మా నోర్లు మూయడానికి మా కార్యాలయంపై దాడి చేస్తారా.? సీఎం, డీజీపీని హెచ్చరిస్తున్నా..మీరు చేసింది చాలా తప్పు. అది సరిచేసుకోలేనంతంగా వుంది. మీకు ఎలాంటిచిత్తశుద్ధి వున్నా డ్రగ్స్ అరికట్టండి.
మాపై కాదు మీ ప్రతాపం.. హెరాయిన్, డ్రగ్స్, గంజాయి వాడే వారి మీద మీ ఉక్కు పాదం మోపండి. పోరాడేవాళ్లను అణచాలని చూస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదమే. వీళ్ల చేసిన అరాచకంపై పోరాడటానికి సమావేశం. కార్యాలయంపై దాడి చేస్తే కార్యాలయానికి రావడానికి భయపడతారని, నాయకులను అరెస్ట్ చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు. వైసీపీ ఎంపీ రఘురామను కొట్టి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. కోర్టుల మీద పోస్టులు పెట్టి కామెంట్లు చేశారు. మాస్కు అడిగిన దళిత డాక్టర్ ను చేతులు విరిచి చంపారు. ఇది టీడీపీ వైసీపీకి మద్య జరిగే యుద్ధం కాదు. ప్రజల సమస్యల మీద పోరాటం చేసే వ్యవస్థ మీద జరిగిన దాడి. టీడీపీ, వైసీపీకి ఆస్తులు, దాయాదలు సమస్యలు లేవు. ఈ రోజు మేము చేసిన పోరాటం మాకోసం కాదు. డ్రగ్స్ వల్ల జాతి నిర్వీర్యం అయిపోతుంది.
రూ.1.72 లక్షల కోట్లు తాలిబన్లకు వెళ్లింది. సంఘ విద్రోహశక్తులకు డబ్బులు వెళ్తున్నాయి. రోడ్లు వేయలేదు. పన్నలు పెంచారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది. అప్పులు పాలైంది. పిల్లల భవిష్యత్ కోసం బతికుతున్నారు. వారి భవిష్యత్ పాడైపోతోంది. అదే నా ఆవేదన. డ్రగ్స్ వ్యాపారం చేసిన వాళ్లను పట్టుకోమంటే మాపై కేసులు పెడుతున్నారు. భావి తరాల భవిష్యత్, ప్రజల భవిష్యత్ కోసం మీరు ఆలోచిస్తే వెంటనే మీరు చేయాల్సింది..డ్రగ్స్ ను నివారించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం..రాష్ట్రాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ ను తెస్తే అది ఏపీకే పరిమితం కావడం లేదు. హైదరాబాద్, యూపీ, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలకు తరలి వెల్లింది. డ్రగ్స్ నియంత్రించే వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. జగన్ విభిన్నమైన వ్యక్తి. అలాంటి వాళ్లను సరిచేసే శక్తి టీడీపీకి వుంది. వైసీపీ నాయకులు పదవులు, పోలీసులు పోస్టింగుల కోసం ఆశించవద్దు. మీ పిల్లల భవిష్యత్ పాడైపోతోంది.
సమాజం సర్వనాశనం అయ్యాక పదువులు ఉంటే ఎంత లేకుంటే ఎంత.? ఉంటే ఇంకో రెండేళ్లు వుంటారు. ఇంత వరకు నా మంచితనాన్ని, మా పార్టీ మంచి తనాన్ని చూశారు. భవిష్యత్ లో మీరు చేసే చెడు పనులకు మీకు శిక్ష పడేవరకు వదిలిపెట్టను. చట్టం చుట్టం కావడానికి వీళ్లేదు. పెట్టేది తప్పుడు కేసులు, మావారినే జైలుకు పంపుతున్నారు. ఏదో కుట్ర జరగుతుందని వైసీపీ వాళ్లే అంటున్నారు. కులాల మద్య వైసీపీ వాల్లే చిచ్చుపిడుతున్నారు. ఎప్పుడైనా దేవాలయాలు, చర్చీలు, మసీదుల మీద దాడులు జరిగాయా.? ప్రజలు అప్రమత్తంగా వుండి మనల్ని మనం కాపాడుకోవాలి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం.
కార్యకర్తలు చూపిన తెగువకు శిరస వంచి నమస్కరిస్తున్నారు. ఈ రోజు పోలీస్ సంస్మరణ దినోత్సవం. ఈ మంచి రోజు ఈ కార్యక్రమం పెట్టాం. పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని మనం చిత్తశుద్ధిగా నిర్వహించాం. వారి త్యాగాలను ఒకసారి నెమరువేసుకున్నాం. నాడు సమాజం కోసం పోరాడారు. యుద్దాల్లో సంఘవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పటి పోలీసులను చూస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వ్యవస్థను నేను ఏమీ అనను. రాజ్యాంగం గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యక్తి మంచి వాడు కాకపోతే దాని ఫలితం మారుతుందని అంబేద్కర్ చెప్పారు. ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.
అదే పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారు. తీవ్రవాద, ముఠానాయకులు, మత విద్వేశ శక్తులు, సంఘవిద్రోహ శక్తులపైన పోలీసులు పోరాడారు. కానీ ఇప్పుడు సమాజ హితం కోసం పోరాడే వారిపై అక్రమంగా చర్యలు తీసుకుంటున్నారు. అధికారం శాశ్వతం కాదు..త్యాగాలు శాశ్వతం. చట్టాలు గౌరవిస్తే శాశ్వతంగా మంచి పేరు వుంటుంది. డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన రావాలి. స్టేట్ టెర్రరిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం.ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా. ఎవరి హద్దులో వారు వుండేలా పోరాటం చేయాలి. అందరికీ అండగా వుంటా. అందరం కలిసి ముందుకువెళ్దాం. ఇది ఏపీ సమస్య కాదు..దేశ సమస్య.
పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి:
ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో నిరంకుశ పాలన, అమానవీయ దాడులు, అప్రజాస్వామిక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు దీక్ష చేపట్టాం. పార్టీ దేవాలయం, టీడీపీ ప్రధాన కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారు. ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకూడదా. పోలీసు రాజ్యం నడుస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో పాలన సాగడం లేదు. చంద్రబాబు గారి గురించి మంత్రులు ఎన్ని బూతులు మాట్లాడారో జగన్ రెడ్డికి తెలియదా? సజ్జల డైరెక్షన్ లో మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబును బూతులు తిడుతున్నారు. ఈ రోజు వైసీపీకి చట్టం గుర్తొచ్చిందా. డీజీపీ పీఆర్వోను కాపాడితే 307 కేసులు పెడతారా?
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే:
ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా జగన్ రెడ్డి పాలన ఉంది. ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసు వ్యవస్థ వైసీపీ అనుబంధ సంఘంగా పనిచేస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మరో ఆప్ఘన్ లా ఏపీ మారింది. వైసీపీ పాలనలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. ఏపీని హెరాయిన్, డ్రగ్స్ అడ్డాగా మార్చారు. జగన్ రెడ్డికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడే మాటలు బూతులు కాదా డీజీపీ . కొడాలి నాని మాటలు డీజీపీకి వినిపించడం లేదా? చంద్రబాబు, లోకేష్ గురించి వైసీపీ నేతలు మాట్లాడే బూతులు డీజీపీకి కనిపించడం లేదా? ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగితే కనిపించలేదా? ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధ మైనప్పుడు, ప్రతిపక్ష పదవి రాజ్యాంగబద్ధం కాదా? కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలి. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో చంద్రబాబు గారు దీక్ష చేయడం సాహసోపేతం. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలి.
ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి:
ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు, జగన్ రెడ్డి ఆటవిక పాలనపై చంద్రబాబు గారి పోరు ప్రజల కోసమే. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండకూడదా? చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంపై ఎప్పుడైనా దాడులు జరిగాయా? ప్రజల మెప్పు పొందడం చేతగాక జగన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే. అధికారం శాశ్వతం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. జగన్ రెడ్డికి ఓటేసిన వారు పశ్చాత్తాప పడుతున్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అంతా నాశనం చేస్తున్నారు. కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. చంద్రబాబు గారు ఉంటే ఏపీ నెం.1 స్థానంలో ఉండేది. జగన్ అలివి కాని హామీలు ఇచ్చారు. టీడీపీ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను రద్దు చేశారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. డీజీపీ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పోలీసుల పనితీరు సిగ్గుపడే విధంగా ఉంది. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. హెరాయిన్, గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా ఏపీ మారింది. ఏపీలో ఉన్న చవకబారు మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా లేవు
జి.వి. ఆంజనేయులు, నర్సరావు పేట పార్లమెంట్ అధ్యక్షులు:
డాక్టర్లు వద్దన్నా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు 36 గంటలు దీక్ష చేయడం అసాధారణం, అసామాన్యం. జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని భష్టు పట్టించారు. ప్రణాళికబద్ధంగా వైసీపీ ప్రభుత్వం దాడులు చేయించడం దుర్మార్గం కాదా? రక్తం కారుతూ ఉంటే చూస్తూ ఆనందించే శాడిస్టు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. జగయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకును తెలంగాణా పోలీసలు రెడ్ హ్యడెండ్ గా పట్టుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్ముతున్నవారు జగన్ రెడ్డి అనుచరులు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారికి భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లిస్తాం. మా ఓర్పును చేతగానితనంగా తీసుకోవద్దు. ఓర్పు. సహనాన్ని మాకు చంద్రబాబు నాయుడు నేర్పారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గొడవలు ప్రోత్సహించడం సమంజసమా? దాడులు చేసేది వైసీపీ వాళ్లే…కేసులు పెట్టించేది వైసీపీ వాళ్లే. డిజిపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారి పాలనలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే నం.1. చంద్రబాబును ఉరి తీయాలని అన్నప్పుడు చంద్రబాబు మమల్ని జగన్ లా దాడి చేయమని ప్రోత్సహించలేదు. డిజిపిని రిటైరైనా చట్టంతో ఊచలు లెక్కపెట్టిస్తాం….. దాడులు సంస్కృతికి తెరపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలుగుదేశం తలచుకుంటే వైసీపీ గూండాలను రాష్ట్రం వదిలి పారిపోయేదాక తరిమికొడుతాం.
ప్రొ. జోస్నా తిరునగరి , తెలుగు మహిళ:
రాజకీయాలలో ఒక విజన్ తో పనిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. వైసీపీకి తెలిసిన రాజకీయం కేవలం రౌడీయిజం మాత్రమే. వైసీపీ నాయకులు ప్రస్ట్రేషన్ లో ఉన్నారు. నేను తెలంగాణ బిడ్డగా చెబుతున్నా…. ఒక బట్టేబాస్ వైసీపీ మంత్రికి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. తెలుగుదేశం సంస్కారవంతమైన పార్టీ. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సంస్కారం నేర్పారు. చంద్రబాబు కనుసైగ చేస్తే….తెలుగుదేశం కార్యకర్తల దమ్మేంటే చూపిస్తాం. టిడిపిపై దాడులు చేయడం పుల్ స్టాప్ పెట్టండి….లేకపోతే నిన్నటిది ఒక లెక్క….నేటి నుంచి మరోలెక్క. పగిలిన అద్దాల సాక్షిగా తెలుగుదేశం పోరాటాన్ని ఎవరూ ఆపలేరు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి :
వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు నిరసనగా నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. యావత్ దేశంలో ప్రజలు పాలన ఏం జరుగుతుందో చూస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా పాలన ఏం జరుగుతుంది, వైసీపీ చెబుతున్న మాయమాటలు, ప్రచారం అభివృద్ధి కోసమా, గాంధారీ పుత్రాల్లా దోచుకోవడానికి చేస్తున్నారా అని అర్ధం కావడం లేదు. ఎవరికి అభివృద్ధి చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజావేదిక పడగొట్టినప్పటి నుంచి నేడు పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి వరకు ఎవరికి ఉపయోగపడే పనులు చేశారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి పన్నులు కట్టించి పాలన చేస్తున్నారు. జగన్ రెడ్డి మంచి నటుడని ప్రజలకు అర్ధమయ్యింది. ప్రజలు నిరసన తెలియజేశారని ఆయనకు బీపీ వచ్చిందా?
రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతుంది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుకున్న ఈ రాష్ట్రానిదే అంటున్నారు. పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి మన రాష్ట్రంలో గంజాయిదారులను పట్టుకుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ప్రశ్నించిన వారికి పోలీసులతో ఒత్తిడి తెస్తున్నారు. మల్లెపూల గురించి తెలిసిన విధంగా పాలన తెలియదని ప్రజలకు అర్ధమయ్యింది. నిన్న నారా లోకేష్ పై డీజీపీ కేసు ఏ విధంగా పెట్టారు. పార్టీ ఆఫీసు ధ్వంసంలో పట్టుబడిన సీఐ కంప్లైంట్ ఇచ్చారు. అందులో 6.00 గంటలకు లోకేష్ విమానంలో ఉంటే ఇక్కడే ఉన్నారని కేసు కట్టడం సిగ్గుచేటు. మాస్కులు అడిగిన డా. సుధాకర్ ను హత్య చేశారు. జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇది. అమరావతిని కాపాడుకునే నిరాహారదీక్ష చేస్తున్న దళిత రైతులను ఎందుకు జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. రాష్ట్రం రాజధాని ఏంటి అని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలను నెట్టివేశారు. రాజధాని అమరావతి పేరు వినడానికి కూడా జగన్ రెడ్డికి ఇష్టం లేదంటే నువ్వేం ముఖ్యమంత్రివి? వ్యవస్థలపైనే నమ్మకం లేని ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి నడుపుతున్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే డీజీపీ వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?
కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే డీజీపీ కళ్లుండి కబోదుల్లా చూడలేకపోయారు. నువ్వు కాపాడవని మాకు తెలుసు. రెండు అద్ధాలు పగులగొడితే తెలుగుదేశం పార్టీ భయపడదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపించింది రిలయన్స్ అని ఆనాడు చెప్పి నేడు వాళ్లకే పదవులు కట్టబెట్టారు. మీ బాబాయ్ ను చంపించింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించి నేడు అధికారంలోకి ఏం సాధించావు? ఎవరో నేటికి పట్టుకోలేకపోయారు? ఆయన హత్య వెనక ఉంది మీరు కాదా? అని ప్రశ్నిస్తున్నా? కోర్టులు ఎన్ని సార్లు తప్పుపట్టినా నేటికి రంగులు తిసెయ్యలేదు. ప్రజా ధనంతో బులుగు మీడియా, భారతీ సిమెంట్స్ ను పెంచి పోషించుకుంటున్నారు. ఆయనకు కోర్టులంటే లెక్కలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు న్యాయం చేస్తే జగన్ రెడ్డి రైతులను సర్వనాశనం చేస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గృహాలను కట్టిస్తే జగన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు ఎందుకు కట్టలేదు? ఇళ్ల పట్టాలతో చరిత్ర హీనుడిగా జగన్ రెడ్డి మిగిలిపోతారు. ఇవ్వన్ని ప్రశ్నిస్తున్నారని ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం రబ్బరు బంతి లాంటిది. నువ్వు ఎంత కొడితే అంత పైకి లేచి ఉవ్వెత్తున జగన్ రెడ్డిని కబళించివేస్తుంది. రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారు, మా చివరి రక్తపు బొట్టు వరకు చంద్రబాబు నాయుడుకు అండగా నిలుస్తాం.
గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్సీ
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని స్వర్గీయ ఎన్టీఆర్ మాటతో దేవాలయంలా కొలుస్తున్న కార్యాలయాన్ని వైసీపీ గూండాలు పగులకొట్టిన దానికి వ్యతిరేకంగా దీక్ష చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దొంగలకు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు. లక్షలాది మంది కార్యకర్తలున్నా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెబితే వైసీపీ పార్టీ ఉంటుందా? చంద్రబాబు నాయుడు కన్నెరజేస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? కోడి కత్తితో పొడిచిన శ్రీను నేడు వైసీపీ పార్టీలో పదవి అనుభవిస్తున్నారు. ఇదంతా డ్రామా అని ప్రజలు నమ్ముతున్నారు. కోడి కత్తి సంఘటనలో ఈ పోలీసుల మీద నాకు నమ్మకం లేదన్నారు నేడు అదే పోలీసులతో ప్రతిపక్షాలపై దాడి చేయిస్తున్నారు. ఒక మతిభ్రమించిన వ్యక్తి పాలన మనం ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైన కొడుకును కని మాకు ఎందుకు కట్టబెట్టావని కొంత మంది వైఎస్ అభిమానులు ఆయన విగ్రహాల ముందు మొరపెట్టుకున్నారు. మంత్రులు, సలహాదారులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏది మాట్లాడినా తప్పనట్లుగా వైసీపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటు. ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తున్నారు.
మోర్లా వెంకట్ రావు, మాజీ సర్పంచ్ నెల్లూరు జిల్లా –ప్రపంచ దేశాలకు సూచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం దుర్మార్గం.
నజీరుద్దీన్ – ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల ఎంప్లాయ్
ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రం, 2000 సంవత్సరంలో ప్రారంభమైన అర్భన్ సెంటర్లు, మెడికల్ ఎంప్లాయిస్ అందరం కలిసి మద్దతు తెలపడానికి వచ్చాం. అర్బన్ సెంటర్లల్లో చంద్రబాబు నాయుడు హయాంలో 260 ముఖ్యమంత్రి హెల్త్ సెంటర్లు ప్రారంభించి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనులు చేసిన మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. 2,500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చంద్రబాబు నాయుడు మాకు భోజనం పెడితే జగన్ రెడ్డి మా నోటి కాడ ముద్ద లాక్కన్నారు. కులం, మతం చూడమన్నారు కాని నేడు మైనార్టీ, ఎస్సీలను ఉద్యోగాలను తొలగించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత మమ్మల్ని పర్మినెంట్ ఎంప్లాయిస్ చేయాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE