Suryaa.co.in

Andhra Pradesh

అగ్రరాజ్యం అమెరికా దేశంలో మెరిసిన పెడన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

– పట్టణానికి వన్నెతెచ్చిన చిన్నారులు ప్రతిభకు ముగ్ధులై వారికి మంత్రి జోగి రమేష్ ఆశీస్సులు

అమెరికా అగ్రరాజ్యం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరం సాక్షిగా పెడన పట్టణం పేరు మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది.ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద కలంకారీ పరిశ్రమ కలిగిన పట్టణంగా పెడన బాసిల్లుతుండగా.. ఇప్పుడు సరస్వతీదేవి బిడ్డలు తమ జ్ఞాన సంపత్తితో విద్యాపరంగా కూడా పెడన పట్టణాన్ని ప్రపంచ బాహుల్యం చేశారు.

వివరాల్లోకి వెళితే.. పెడన పట్టణానికి చెందిన వైసీపీ నాయకురాలు నల్ల నాగలక్ష్మి కుమారుడు నల్ల మోహన దుర్గ మణికంఠ మరియు పెడన పట్టణం 9వ వార్డుకు చెందిన వరుదు రమేష్ కుమారుడు వినయ్ కుమార్ స్థానికంగా ఉన్న బట్ట జ్ఞానకోటయ్య ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నారు.

గత విద్యా సంవత్సరంలో భారత దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పాలిథిన్ వినియోగం ఏటా ఆరున్నర కోట్లకు చేరటం , దీని వాడకం వల్ల రాబోయే రోజుల్లో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదకర పరిస్థితి ఉందని గ్రహించిన బట్ట జ్ఞాన కోటయ్య ప్రధానోపాధ్యాయులు ఎమ్ ఉష సహకారంతో ఉపాధ్యాయురాలు కే లక్ష్మీదేవి సౌజన్యంతో, ఈ ఇరువురు విద్యార్ధులు పర్యావరణహితమైన పూల కుండీలు తయారీలో శిక్షణ పొందారు.

వేరుశనగపప్పు, వేపాకులు పౌడర్, కొబ్బరి పీచు మరియు మెంతులు గుజ్జుతో తయారయ్యే ఈ పూల కుండీలు ఎండా వాన నుంచి తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా మంచి కలంకారీ రంగులను ఉపయోగించి వినియోగదారులు ఆకట్టుకునేలా తయారు చేశారు.

ఈ సందర్భంగా వీరి ప్రతిభను గుర్తించిన అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఏర్పాటు గత మే నెల 13 నుంచి 19వ తారీకు వరకు చేసిన రీ జెనరిన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ 2023వ సంవత్సరానికి గాను ఆ ఇద్దరు చిన్నారులను ఆహ్వానించి సస్టైనబుల్ మెటీరియల్స్ అండ్ డిజైన్ అంశాన వీరిని పతకాలతో సన్మానించి అవార్డులు అందజేశారు.

దేశం మొత్తం మీద మొత్తం 23 పాఠశాలలు ఈ సైన్స్ ఫెయిర్ కి హాజరు కాగా ప్రభుత్వ పాఠశాల ఒక్క బట్ట జ్ఞానకోటయ్య ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉండటం ఇక్కడ గమనార్హం.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ ఆ చిన్నారులను అభినందించి వారికి ఆశీస్సులు అందజేసి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే ఏర్పాటు చేస్తామని వారి తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి చైర్మన్ మహమ్మద్ ఖాజా కౌన్సిలర్లు బళ్ల గంగయ్య, పిచ్చుక సతీష్ ,సుబ్రహ్మణ్యం, టౌన్ పార్టీ అధ్యక్షుడు బండారు మల్లి సచివాలయ కన్వీనర్ మతిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE