Suryaa.co.in

Features

పేదోడికి అక్షరభిక్ష…పెద్దోడికి అక్షరలక్ష

పేదోడు వేస్తే వేలిముద్ర…
నాలుగు అక్షరం
ముక్కలొస్తే సంతకం…
అదే పెద్దోడు పెడితే దస్తకత్తు…
సెలిబ్రిటీదైతే ఆటోగ్రాఫ్…
స్వీట్ మెమొరీ…
నాలుగక్షరాలు గెలికితే సిగ్నేచర్…
అవే గీతలైతే కేరికేచర్…
ఈ రెండూ చెప్పేస్తాయట
నీ నేచర్…
నీ ఫీచర్ మరియు ఫ్యూచర్…
ఈవేలిముద్రలు…సంతకాల గోలేంటనా…
డెబ్భై సంవత్సరాల
స్వతంత్ర భారతంలో
ఏం సాధించాం మనం
ఏముంది ఘనం
ఇప్పటికీ నిరక్షరాస్యులు
కోకొల్లలుకలలన్నీ కల్లలు…
చదువులు చట్టబండలు
నేతల ప్రకటనలు కలకండలు…
కోట్లు ఖర్చు పెడుతున్నా
కడుపు పండని భారతి
నిధులన్నీ మన నేతలకు
బంగారు పళ్ళెంలో
పట్టిన హారతి…
అక్షరాస్యత అంటే
ఆఆఇఈ లేనా
కోడిగుడ్డుపై పీకుతున్న ఈకలేనా…
సంపూర్ణ అక్షరాస్యత
ఓ పగటికలేనా…!?
వేదం చదివిన దేశంలో
ఖేదమే మిగిలె…
సంస్కృతం నేర్వాలనే
ఇంగితం మచ్చుకైనా లేకపోయె
సంస్కృతమంటే అదనపు మార్కులు తెచ్చే
సెకెండ్ లాంగ్వేజ్…
పిల్లలకు అందుతున్న
రాంగ్ మెసేజ్…
చదువులు రాకనే
ఎన్నో మోసాలు…
తప్పుడు దస్త్రాలు
ఏటీఎం లలో దగాలు…
ఆనక దిగాలు…
ఆన్ లైన్ దోపిడీలు
బంగారం మెరుగు లూటీలు…
పోర్జరీ సంతకాలు
నకిలీ పాస్ పుస్తకాలు
దళారీల వంచనలు
మోసగాళ్ళకు
అధికార లాంచనాలు…
గిరిపుత్రుల బ్రతుకులైతే
మరీ దుర్భరం…
అడుగడుగునా మృత్యుకుహరం…
అక్కడ బడులు మొక్కుబడులు
కోట్లకొలది పెట్టుబడులు…
దగాకోర్ల రాబడులు…
సౌకర్యాలు స్వల్పం
కైంకర్యాలు అనల్పం…!
ప్రకటనలు బహుచిత్రం
మారని బ్రతుకు చిత్రం…
భరతజాతి ముఖచిత్రం
ఆశలన్నీ చిద్రం…
సరే…
నాలుగక్షరాలే చదువు కాదు…
అలాగని మాస్టర్స్ డిగ్రీ మాత్రమే సంస్కారం ఇవ్వదు…
కాకపోతే చదువుల పేరిట జరుగుతున్న వృథాలు…
కార్పొరేట్ దగాలు…
ఎంసెట్లు…ఆసెట్లు…ఎడ్సెట్లు…రాంకులు…పిల్లలపై ఒత్తిడులు…
వేదభూమిలో ప్రతిఒక్కరిదీ
వేదనా భూమికే…!?

– పివిఆర్ భారుప్రసాద్‌రాజు

LEAVE A RESPONSE