– ఆత్మరక్షణలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
– వాలంటీర్లతో పెన్షన్లు వద్దన్న ఎన్నికల సంఘం
– టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడం లేదంటూ వైసీపీ ప్రచారం
– గ్రామ, వార్డు ఆఫీసుల వద్దే పెన్షన్లు ఇవ్వాలని సెర్ప్ ఆదేశం
– సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి కుట్రపై విమర్శలు
– వృద్ధుల్లో విమర్శలకే సెర్ప్ ఆదేశాలని టీడీపీ ఆగ్రహం
– అంగన్వాడీ సమ్మెలో సచివాలయ సిబ్బంది, వార్డు కార్యదర్శులతో ప్రత్యామ్నాయం
– ఇప్పుడు వాలంటీర్ల స్థానంలో ప్రత్యామ్నాయం లేదంటున్న మంత్రి బొత్స
– టీడీపీ వల్లే పెన్షన్లు ఆగాయన్న కుట్ర వెనుక సెర్ప్ మురళీధర్‌రెడ్డి?
– జగన్ ఆలోచనలు మురళీరెడ్డి అమలుచేస్తారా?
– ఇప్పటికే మురళీధర్‌రెడ్డిపై అనే ఆరోపణలు
– ఇళ్లకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలని సీఈసీకి బాబు లేఖ
– మా పార్టీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిర్యాదు
– వైసీపీ వ్యూహానికి టీడీపీ ప్రతి వ్యూహం
– ఫలించిన టీడీపీ ఒత్తిడి
– వృద్ధులు, దివ్యాంగులు, రోగులకు ఇళ్లకే వెళ్లి పించన్లు ఇవ్వాలని సర్కారు ఆదేశం
– బెడిసికొట్టిన వైసీపీ వ్యూహం
– తలపట్టుకున్న జగన్ సలహాబృందం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ అనేక మలుపు తిరిగి, వైసీపీకే బెడిసికొడుతున్న పరిస్థితి. టీడీపీ ఫిర్యాదు వల్లే పించన్లను ఇంటికి వచ్చి ఇవ్వడం లేదంటూ వైసీపీ చేసిన ప్రచారం ఒకటి, రెండు రోజుల పనిచేసినా.. టీడీపీ ప్రతివ్యూహంతో, ఇప్పుడు వైసీపీ పూర్తిగా డీలా పడాల్సివచ్చింది. దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి పించన్లు ఇవ్వాలని.. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ సాయంత్రం జారీ చేసిన ఆదేశాలతో వైసీపీ షాక్ తినాల్సి వచ్చింది. పెన్షనర్లు ఎండలోపడి.. గ్రామ-వార్డు కార్యాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకునే క్రమంలో, వారంతా టీడీపీని తిట్టుకోవాలన్న సెర్ప్ ఈసీఓ మురళీధర్‌రెడ్డి ద్వారా, వైసీపీ పన్నిన వ్యూహం తాజా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో బెడిసికొట్టినట్టయింది.
పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను, రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నించింది. చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లనే.. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని, వైసీపీ విపక్షంపై మాటల దాడి చేసింది.
అటు వాలంటీర్ల ద్వారా.. ‘‘తాము చంద్రబాబు ఫిర్యాదు వల్లనే మీ ఇళ్లకు వచ్చి పించన్లు ఇవ్వలేకపోతున్నామని, మళ్లీ మన పార్టీనే అధికారంలోకి వస్తుందని అప్పుడు మేమే మళ్లీ మీకు ఇళ్లకు వచ్చి పించన్లు ఇస్తామ’’న్న ఫోన్ వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. దాని ద్వారా టీడీపీపై పించనర్లలో, ద్వేషం పెంచాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపించింది. అది కొద్దిమేర ఫలించింది కూడా.
అయితే వైసీపీ వ్యూహానికి ప్రతివ్యూహం పన్నిన టీడీపీ.. పించనర్లకు రెవిన్యూ, గ్రామ, వార్డు సిబ్బంది ద్వారా ఇళ్లకే వెళ్లి డబ్బులివ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈసీకి లేఖ రాశారు. ‘మీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ మాపై దుష్ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ గ్రామ- వార్డు- రెవిన్యూ సిబ్బంది ద్వారా ఇళ్లకే వెళ్లి పించన్లు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. పించన్లు ఇళ్లకు వెళ్లి ఇవ్వకుండా సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారు. దాని ద్వారా వైసీపీకి సానుభూతి పెంచి, టీడీపీపై పెన్షనర్లలో వ్యతిరేకత పెంచాలన్నది వారి ప్రయత్నం. కాబట్టి పెన్షనర్లకు నేరుగా ఇళ్లకే వెళ్లి డబ్బులు పంచాలని సీఎస్‌ను కూడా కోరా. కలెక్టర్ల సమావేశంలో అందరు కలెక్టర్లు దానికి అంగీకరించారని’’ తన లేఖలో పేర్కొన్నారు.
దానితో సాయంత్రానికల్లా ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో వచ్చిన ఆదేశాలు వైసీపీని ఖంగుతినించాయి. వారి ఆశలు గల్లంతు చేశాయి. వృద్ధులు, రోగులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పించన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం వైసీపీ వ్యూహబృందాన్ని బిత్తరపోయేలా చేసింది. అంతకుముందు సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి, అధికార పార్టీకి మేలుచేసేలా ఇచ్చిన ఉత్తర్వు వివాదానికి గురయింది. గ్రామ-వార్డు కార్యాలయాలకు వెళ్లి పించన్లు తీసుకోవాలన్న మురళీధర్‌రెడ్డి ఆదేశాలతో, పించనర్లు గంపగుత్తగా తమవైపు మొగ్గుతారని వైసీపీ అంచనా వేసింది. కానీ సాయంత్రానికి కథ మారడంతో వైసీపీ ఖంగుతినాల్సి వచ్చింది.
నిజానికి మురళీధర్‌రెడ్డిపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. విశాఖలో పనిచేసినప్పుడు ఆయనపై టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. సీఎంఓలో ధనుంజయరెడ్డి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల అంగన్వాడీలు సమ్మె చేసిన సమయంలో వారికి ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బంది, వార్డు కార్యదర్శులతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. పించన్ల పంపిణీని మాత్రం రాజకీయం చేయడం విమర్శలకు గురైంది.
‘ప్రత్యామ్నాయం లేకుండా వెంటనే ఎలా పంపిణీ చేస్తాం? నెలరోజులైనా పట్టవచ్చని’ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు పించనర్లలో ఆగ్రహం తెప్పించింది. అంగన్వాడీలపై కోపంతో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించిన జగన్ ప్రభుత్వం, పించన్ల విషయంలో ఎందుకు ప్రత్యామ్నాయం చూడలేదన్న ప్రశ్నలు పెన్షనర్ల సంఘం నుంచి ఎదురయ్యాయి.