•పెంచిన ఫించన్ల మేరకు రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది ఫించనుదారుల ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు
•గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉ.6 నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ చేయాలి
•ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయింపు, అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు పురమాయింపు
•29 వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పంపిణీకి సిద్దం కావాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
అమరావతి : ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా ఫించన్లను జూలై 1 ఫించనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నున్న 65,18,496 మంది ఫించనుదారులు అందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఫించన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏఫ్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబందించి పెరిగి ఫించను సొమ్ము నెలకు రూ.1,000/- ల చొప్పు మూడు మాసాల ఎరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7,000/-లను పంపిణీ చేయాలని ఆదేశించారు.
రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు ఫించను సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలో వలే ఎటు వంటి మార్పు లేకుండా యాధావిధిగా ఫించను సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
పెంచిన ఫించన్ల మేరకు జూలై 1 తేదీన రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది ఫించనుదారుల ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల ఫించనుదార్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రానికి బయట ఉండే 0.43 లక్షల ఫించను దారులు, బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డిబిటి పద్దతో పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన ఫించను సొమ్మును 29 వ తేదీ శనివారం నాడే సంబందిత బ్యాంకు బ్రాంచ్ ల నుండి డ్రా చేసుకుని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1 న ఉదయం 6.00 గంటల నుండి ఫించనుదార్ల ఇంటి వద్దే ఫించను సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాఫింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు.
సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఆర్బిఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే ఫించను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణిలో ప్రభుత్వానికి ఎటు వంటి మాట రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.