– అధికారుల అత్యుత్సాహంతో ప్రజాధనం ఆవిరి
– డిజిటల్ కార్పొరేషన్లో లక్షల జీతాలు అవసరమా?
– కూటమి ఇమేజీకి అధికారుల డామేజీ
( నారాయణ)
అమరావతి: గత జగన్ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు, దుబారానే మళ్లీ కూటమి సర్కారులోనూ కొనసాగిస్తున్న అధికారుల అత్యుత్సాహంతో కూటమి ఇమేజీకి భారీ డామేజీ!
జగన్ జమానాలో ప్రజాధనాన్ని.. వైకాపా కార్యకర్తలకు పప్పు బెల్లాల్లా పంచిన డిజిటల్ కార్పొరేషన్ విధానంపై, నాడు కూటమి నిప్పులు చెరిగింది. ఎవడబ్బసొమ్మని పంచిపెడుతున్నారంటూ శివమెత్తింది. ఎవరెవరికి అప్పనంగా జీతాలిస్తున్నారో ఆ జాబితాను బయటపెట్టింది.దానితో సమాధానం చెప్పలేక వైకాపా నీళ్లు నమిలింది. ఎందుకంటే నాటు కూటమి ఆరోపణలు నిజం కాబట్టి!
మరి ఇప్పుడూ మళ్లీ అదే పని చేస్తున్న అధికారుల అత్యుత్సాహం.. కూటమి ప్రతిష్ఠను పెంచుతుందా? దించుతుందా? అసలు మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ఇవ్వని జీతాలు డిజిటల్ కార్పొరేషన్ ఇవ్వాల్సిన పనేమిటి? ఆ కార్పొషన్ చేసే ప్రచారంతో ప్రభుత్వానికి-ప్రజలకూ వచ్చే లాభమేమిటి?
అసలే కూటమి ప్రభుత్వం రూపాయి రూపాయి లెక్కగట్టి అడులేస్తోంది. ఆచితూచి నిధులు విడుదల చేస్తోంది. కాంట్రాక్టులకు డబ్బులివ్వనంత ఆర్ధిక కష్టంలో ఉంది. కానీ పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్లకు-వైసీపీ నేతల కంపెనీలకు ఆర్ధికశాఖ విశాల హృదయంతో పెండింగ్ బిల్లులు ఇస్తూనే ఉందనుకోండి. అది వేరే కథ.
రుణాలు, గ్రాంట్ల కోసం చంద్రబాబునాయుడు-పవన్-లోకేష్ కాళ్లకుబలపాలు కట్టుకుని ఢిల్లీ టు అమరావతి ప్రదక్షిణలు.. పెట్టుబడుల కోసం చెరొకవైపు విదేశీ యాత్రలు చేస్తుంటే.. డిజిటల్ కార్పొరేషన్లో లక్షలు, వేల రూపాయల జీతాలతో కొలువులు అవసరమా? తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమంటే ఇదేనా?
ఒకప్పుడు “ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్” ( ఏపిడిసి ) అంటే ప్రజల సేవలను డిజిటల్‌గా మార్చడానికా? లేక పార్టీ సోషల్ మీడియా టీమ్‌కు ప్రభుత్వ జీతాలు ఇచ్చి పోషించడానికా? అనే పెద్ద చర్చ, వివాదం జరిగింది.
గత వైసీపీ ప్రభుత్వంపై ఇదే ఆరోపణలు, ఇదే విమర్శలు, ఇదే కోపం. రూ.500 కోట్ల స్కామ్ అంటూ టిడిపి నేతలు ఆరోపించారు. ఏపిడిసి లో 129 మంది ఉద్యోగులంతా వైసీపీ సోషల్ మీడియా వర్కర్లే అంటూ గట్టిగా విమర్శించారు.
ఇప్పుడు ప్రభుత్వం మారింది టిడిపి ,జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఏపిడిసి కథ మాత్రం అలాగే ఉంది!
తాజాగా, 2025 డిసెంబర్ 17న జారీ చేసిన ఆర్డర్ (G.O.Rt.No.2376) ప్రకారం, 27 కాంట్రాక్ట్ పోస్టులు, 58 అవుట్సోర్సింగ్ పోస్టులను మరో ఏడాది (కాంట్రాక్ట్‌కు 1 ఏడాది, అవుట్సోర్సింగ్కు 2 ఏళ్లు) పొడిగించారు. ఇందులో సోషల్ మీడియా మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, సెక్యూరిటీ కన్సల్టెంట్లు, డిజిటల్ డైరెక్టర్లు వంటి పోస్టులు ఉన్నాయి.
జీతాలు చూస్తే ఆశ్చర్యం:
– డిజిటల్ డైరెక్టర్లు (3 మంది): ఒక్కొక్కరికి రూ.1,75,000
– చీఫ్ జనరల్ మేనేజర్: రూ.80,000
– సోషల్ మీడియా అనలిస్ట్‌లు (30 మంది): ఒక్కొక్కరికి రూ.30,000
– కంటెంట్ డెవలపర్లు (12 మంది): ఒక్కొక్కరికి రూ.75,000
మొత్తం నెలవారీ ఖర్చు (అంచనా): కాంట్రాక్ట్ పోస్టులకు సుమారు రూ.25 లక్షలు, అవుట్సోర్సింగ్కు రూ.23 లక్షలు మొత్తం రూ.48 లక్షలకు పైగా! సంవత్సరానికి కోట్లలో!
ప్రైవేట్ డిజిటల్ కంపెనీల్లో కూడా ఇంత జీతాలు ఇవ్వరు. కానీ ఇక్కడ ప్రభుత్వ డబ్బుతో రాజకీయ ఉపాధి పథకం లాగా నడుస్తోంది. ఇంతకీ వీళ్లు ఏమి చేస్తారు?
ప్రభుత్వం మారినా, వ్యవస్థ మారలేదు. ఇది మార్పు కాదు, కొనసాగింపు!

