Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తు గ్యారంటీని విశ్వసిస్తున్న ప్రజలు

  • ప్రజల్లోకి ఆయన్ని వెళ్లకుండా అడ్డుకునేందుకే బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఋషికొండపై రెండు లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణానికి 433 కోట్ల ఖర్చు

  • ప్రతి చదరపు అడుగుకు 23 వేల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం

  • గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలకు వెచ్చించిన ఖర్చు కంటే నాలుగు వందల శాతం అదనంగా ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

  • నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజ

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గ్యారెంటీ కి తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న భరోసాను వారు విశ్వసిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆయన మళ్లీ ప్రజల్లోకి వెళ్లి భవిష్యత్తు గ్యారెంటీ గురించి వివరిస్తే, ప్రజలు విశ్వసించి ఓటేస్తారని భయం ప్రభుత్వ పెద్దలకు పట్టుకుంది. అందుకే, చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు.

బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాక్షి రాతలు, రాష్ట్ర ప్రభుత్వ సదాహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బేల మాటలు… రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బోడి మాటలు వింటే చాలు ఈ విషయం అర్థమవుతుందన్నారు.

చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న ఒకటే… బయట ఉన్నా ఒకటే నని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనగా, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం హాస్యాస్పదంగా ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి దగ్గరుండి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు బెయిల్ పై ఉండడానికి అర్హత లేదని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు బెయిల్ తీర్పులో ప్రస్తావించారు.

దీనితో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియా ప్రతినిధుల ముందు జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం విజృంభించారు. ఒకపక్క తెలుగులో మరొక వైపు ఇంగ్లీషులో చెడుగుడు ఆడుకున్నారని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు . అవసరమైతే సీఆర్పీసీని మార్చాలని సూచించిన సుధాకర్ రెడ్డి, అంతటితో ఆగకుండా న్యాయస్థానంపై, న్యాయమూర్తి పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి వెంటనే నాలుక కరుచుకొని, న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేయొద్దని సర్దిద్దుకున్నారు. తీర్పుపై ఏమైనా మాట్లాడవచ్చునని సుధాకర్ రెడ్డి సెలవిచ్చారు.

తాను కొన్ని స్టేట్మెంట్లు ఇస్తే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి, తీసుకోలేదని ఫైర్ అయ్యారంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. సుధాకర్ రెడ్డి ఏకపాత్రాభినయంతో జగన్మోహన్ రెడ్డి ఊరట చెంది ఉంటారు. కానీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించే అవకాశాలు లేవన్నారు. ఈ విషయాన్ని తాను కామన్ సెన్స్ తో చెబుతున్నానని, నీకెలా తెలుసు… జడ్జి బల్ల కింద దూరి విన్నావా అంటూ మిల్లెట్ రెడ్డి తొకడ ప్రశ్నలు వేయవద్దన్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ శుక్రవారం నాడు లిస్ట్ అవ్వవచ్చు… కాకపోవచ్చుని తెలిపారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్ క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధనను పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిందని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, రిమాండ్ రిపోర్ట్ క్వాష్ చేయమని అడిగారు. అయితే ఈ నెల 23వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసును విచారిస్తున్న నేపథ్యంలో ఆ కేసు వాదనలను కూడా విని తీర్పు ఇస్తామని న్యాయస్థానం వెల్లడించింది. 23వ తేదీని తుది రోజు గా పేర్కొనడంతో, చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర తన కుమారుడి వివాహ నేపథ్యంలో కేసును 30వ తేదీకి వాయిదా వేయాలని కోరారు.

ఈ కేసును విన్న బెంచ్ స్ప్లిట్ అయింది. మళ్లీ ఈ బెంచ్ ఉండకపోవచ్చు. అయినా ప్రధాన న్యాయమూర్తి మాత్రం యధావిధిగా కొనసాగుతారు. బహుశా గురువారంనాడు బెంచ్ కూర్చుని తీర్పు వెల్లడించే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రేపు కనుక తీర్పు వెళ్ళడయితే, ఈ కేసు కు అవినీతి నిరోధక చట్టం లోని 17A నిబంధన వర్తిస్తుందని తీర్పు వెలువడే అవకాశం ఉంది. అప్పుడు గవర్నర్ అనుమతి తీసుకున్న పిదపే కేసులు పెట్టాలని ఆదేశాలు అందనున్నాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ చెల్లదు.

ఇక కోర్టులో లిస్ట్ అవసరమే రాదు. ఒక్కసారి అవినీతి నిరోధక చట్టంలో 17A నిబంధన వర్తిస్తుందని తీర్పు వెలువడిన తరువాత చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు అవసరం కూడా ఉండదు. ఒక్క అంగళ్లు కేసు మినహా, మిగతా అన్ని కేసులకు అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుంది. అప్పుడు ఈ కేసులన్నీ ఊష్ కాకి అనే అర్థం వస్తుంది. ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. వృద్ధులకు 200 రూపాయల నుంచి పింఛన్లు చంద్రబాబు నాయుడు, 2000 రూపాయల పెంచి
ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో నష్టం వాటిల్లిందని కేసు పెడతారా?, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇవ్వడం వల్ల, ఇప్పుడు నేను కూడా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాల్సి వస్తుందని కేసులు పెడతారా? పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు పై కేసులు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్లు సిద్ధం చేసి, ఫిర్యాదుదారులైన రెండక్షరాల నాయకుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిందని రఘురామకృష్ణంరాజు అపహస్యం చేశారు . న్యాయ వ్యవస్థను అవమానపరచే విధంగా మాట్లాడిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పై బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలి. గతంలో న్యాయస్థానంలో అతిగా వ్యవహరించిన సుధాకర్ రెడ్డిని న్యాయమూర్తి మందలించారు. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. సుధాకర్ రెడ్డి కి నోటీసులు జారీ చేయకపోయినప్పటికీ, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి
ఆర్థిక నేరాభియోగ కేసులలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదలై, అనేక షరతులను ఉల్లంఘించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆర్థిక నేరాభియోగ కేసులలో తనతో పాటు, సహా నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవులను కట్టబెట్టారు. మరొకరికి మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్న లక్ష్మీ అనే ఐఏఎస్ అధికారిని క్యాట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రానికి తీసుకొని వచ్చి కీలక బాధ్యతలను అప్పగించారు. తస్మదీయులకు లబ్ధిని చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు సబబు అని నేను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను.

శుక్రవారం నాడు కోర్టు నెంబర్ 8లో ఐటెం నెంబర్ 32 గా లిస్ట్ అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించినందుకే, నాపై తప్పుడు కేసులు నమోదు చేసి… లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత హైకోర్టులో అప్పిల్ చేసినప్పటికీ, వాదనలను విని తీర్పును రిజర్వు చేసి, ఏడాది కాలం తర్వాత పిటీషన్ కొట్టి వేశారు. తీర్పు ఇవ్వడానికి సంవత్సరం ఆలస్యం కావడంతో, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి నాకు మరింత సమయం పట్టింది. ఆలస్యాన్ని మన్నించాలని కోరుతూ, పిటిషన్ లోని కంటెంట్ ను గుర్తించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ కోర్టులో లిస్ట్ కాక ముందే రద్దయ్యే అవకాశం ఉందన్నారు.

భవిష్యత్తు గ్యారెంటీ హామీపై సైబర్ కేసు పెట్టాలన్న సజ్జల
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గ్యారెంటీకి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఇస్తున్న భరోసాపై సైబర్ కేసును నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్కొక్క కుటుంబానికి జరిగిన లబ్ధిని వివరిస్తున్నప్పుడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే మెరుగైన లబ్ధిని చేకూరుస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకు భరోసా ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల 35 వేల రూపాయల లబ్ధి జరిగితే, రానున్న రోజుల్లో 2 లక్షల 60 వేల రూపాయల లబ్ధి చేకూరుస్తామని చెప్పడంలో తప్పేముందన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో సేవా మిత్ర పేరిట ఓట్లను తొలగించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఓట్లను తీసివేసి ఉంటే, వైకాపాకు అంత మెజారిటీ ఎలా వచ్చి ఉండేదని ప్రశ్నించారు. వాళ్లు ఓట్లను తీయలేదు, కానీ మనము తీసేస్తున్నామని రఘురామ కృష్ణం రాజు అన్నారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియపై, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓటర్ల తొలగింపు పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా, ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారినే ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు.

క్రీడా ప్రాంగణాల పేరు మార్చనున్న జగనన్న
రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలన్నింటికీ జగన్మోహన్ రెడ్డి తన పేరిట జగనన్న క్రీడా ప్రాంగణాలుగా నామకరణ చేయనున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ చదివారు కాబట్టి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా నామకరణ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ క్రీడల్లో ప్రావీణ్యుడో తెలుసుకుందామని ప్రయత్నించగా, ఆయన క్రికెట్లో ఒక్క బ్యాటింగ్ మాత్రమే చేసేవారని జగన్మోహన్ రెడ్డి చిన్ననాటి సన్నిహితులు తెలిపారు

ఏమాత్రం క్రీడా స్ఫూర్తి లేని జగన్మోహన్ రెడ్డి పేరు క్రీడా ప్రాంగణాలకు ఎందుకు పెట్టాలో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు అయితే తన పేరు, లేదంటే తన తండ్రి పేరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశారు. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లకు, పార్కులకు, మెడికల్ కాలేజీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టగా, ప్రభుత్వ పథకాలకు, క్రీడా ప్రాంగణాలకు జగనన్న పేరు పెట్టారన్నారు. ఇక రాష్ట్రానికి పేరు మార్చడం ఒక్కటే తక్కువన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ పేరును జగన్ ప్రదేశ్ గా నామకరణ చేయాలంటూ ఎద్దేవా చేశారు.

లేకపోతే తమిళనాడు కూడా కలిసి వచ్చే విధంగా జగన్ నాడు అని పేరు పెట్టాలంటూ అపహాస్యం చేశారు. ఇక తిరుపతి పేరును కూడా మార్చి జగన్నాధపురం గా పెట్టాలని, మెట్ల దారిలో అవసరమైతే ఆయన విగ్రహాన్ని పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఇవన్నీ అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, వరుస సంఘటనలను పరిశీలిస్తే జరగబోయేది ఇదేనని అర్థమవుతుందన్నారు.

ఋషికొండపై ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని అద్దెకు ఇస్తే వడ్డీ కూడా రాదు
ఋషికొండ పైన రెండు లక్షల చదరపు అడుగులలో 433 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని అద్దెకు ఇస్తే, దానికి వడ్డీ కూడా రాదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో 433 కోట్ల రూపాయలతో నిర్మించిన భవన సముదాయ ఒక్కొక్క చదరపు అడుగుకు 23 వేల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం ప్రజలను ఎంతగా మోసం చేస్తుందో సాక్షిపత్రిక చెప్పిన లాజిక్ తో అర్థమవుతుంది.

నేను చెప్పిన వివరాలను ఖండించగలిగే మొనగాడు ఉంటే ముందుకు రావాలంటూ రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు. సాక్షి డిబేట్లోనైనా వర్చువల్ గా పాల్గొనడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ఋషికొండపై గతంలో 60 నుంచి 70 వేల చదరపు అడుగులలో నిర్మాణాలు ఉండగా, జగన్మోహన్ రెడ్డి ఆ నిర్మాణాలను పడగొట్టి రెండు లక్షల చదరపు అడుగులలో బ్రహ్మాండమైన ప్రణాళికతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. ప్రపంచ పటంలో విశాఖపట్నం పేరు నిలిపేందుకే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లుగా చెప్పుకొచ్చారు.

గతంలో చదరపు అడుగు రెండు వేల రూపాయలతో నిర్మించగా, జగన్మోహన్ రెడ్డి చదరపు అడుగు నిర్మాణానికి 23 వేల రూపాయలు ఖర్చు చేశారు. పది రెట్లు అధిక ఖర్చు చేయగా, ఒక రెట్టు ఆదాయం మాత్రమే లభించే అవకాశం ఉంది . గతంలో చంద్రబాబు నాయుడు ప్రఖ్యాత నిర్మాణ కంపెనీల సారధ్యంలో ఎన్నో సౌకర్యాలతో చదరపు అడుగు 6 వేల రూపాయలకు నిర్మించగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి అదనంగా నాలుగు వందల శాతం ఖర్చు చేశారన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం ఋషికొండపై భవన సముదాయాన్ని నిర్మించినట్లు చెబుతున్నప్పటికీ, ఎవరైనా 4 బెడ్ రూములు, విశాలమైన హల్, విసిటింగ్ రూము ఎందుకు నిర్మిస్తారని ప్రశ్నించారు.

టూరిజం శాఖ నిర్మించిన ఈ ఇంటిని ఒకవేళ ఎవరైనా అద్దెకు తీసుకుని నెలకు 20 లక్షల ఇచ్చినప్పటికీ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే లభిస్తుంది. 433 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనానికి వడ్డీ కూడా రావడం లేదు. ఒకవేళ 20 కాదు 40 లక్షల రూపాయల అద్దె లభించినప్పటికీ ఏడాదికి ఆదాయం 4 కోట్లు మాత్రమేనని, అప్పుడు నిర్మించిన ఖర్చులో రెండు శాతం వడ్డీ మాత్రమే లభిస్తోందన్నారు. విశాఖపట్నం ను రాజధాని చేద్దామని నిర్ణయించిన ముఖ్యమంత్రి, తాను ఎక్కడ ఉండాలో నిర్ణయించి, వసతి సౌకర్యం కల్పించడానికి ఒక కమిటీని వేశారు.

ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని ముఖ్యమంత్రి నివాస సముదాయంగా కేటాయించేందుకు టూరిజం శాఖ కార్పొరేషన్ కమిషనర్ కన్నబాబు అంగీకరించడం, ఆగమేఘాలమీద దాన్ని ముఖ్యమంత్రి నివాస యోగ్యమైన భవనంగా కమిటీ గుర్తించడం చకాచకా జరిగిపోయాయి. ముఖ్యమంత్రి ఏమైనా టూరిస్టా?, ముఖ్యమంత్రి ఆ భవనంలో నివసించడం నిబంధనలకు విరుద్ధం . అయినా అనుమతి ఇస్తారా?, ముఖ్యమంత్రి నివాసానికి, విశాఖపట్నం రాజధానిగా ఏర్పాటు చేయడానికి సంబంధం ఏమిటి??. రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి నివాస భవనమేనా? విశాఖపట్నంలో ఇంకా ఇతరులు నివసించడం లేదా? ముఖ్యమంత్రి ఏమైనా ఇతర గ్రహాల వచ్చారా? లేకపోతే తనకు తానే భగవంతుడిని అనుకుంటున్నారా? ఆయన కూడా ఒక మానవ మాతృడేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఇరిగేషన్ శాఖ గెస్ట్ హౌస్ 6 కోట్ల రూపాయల పెట్టి మరమ్మతు చేయించారని సాక్షి దినపత్రిక కవరింగ్ వార్త కథనాన్ని ప్రచురించింది. ఆరు కోట్లు వెచ్చించి మరమ్మత్తులు చేస్తే వచ్చిన నష్టం ఏముంది?, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ గెస్ట్ హౌస్ కాస్త గవర్నర్ బంగ్లా గా మారింది. చంద్రబాబు నాయుడు పై సాక్షి దినపత్రిక చేసిన అభియోగాలన్నింటి ఖర్చు 20 కోట్ల రూపాయలు దాటలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు ఆఫీసు కోసమే 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ ఫైల్ చేయడం కోసం 6 కోట్ల రూపాయలు తాత్కాలికంగా విడుదల చేసినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని ఆర్టిఏ ద్వారా ఔత్సాహికులు తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్, హైకోర్టులలో 97 నుంచి 98 శాతం కేసులను ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పు రానున్న నేపథ్యంలో, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆగమేఘాల మీద ఆశ్రయించాల్సిన అవసరం ఏముందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల 8 నెలల కాలంలో న్యాయవాదుల కోసం ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేసిందో చెప్పాలని కోరుతూ వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి ఒక లేఖ రాస్తే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు సూచించారు.

LEAVE A RESPONSE