Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు ఇక అధికారం కలే

– జాకీలతో లేపినా, నేల మీద దేకినా అంతే..
– అందుకే సానుభూతి కోసం డ్రామాలు
– పాత సినిమాల్లో మాదిరిగా బాబు కుట్రలు
– మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ

బాబు నోట పూటకో మాట:
2024 ఎన్నికల్లో తనను గెలిపించకపోతే, అవే తనకు చివరి ఎన్నికలని ఇటీవల చంద్రబాబు అనడంతో, ఖంగుతిన్న ఎల్లో మీడియా ప్రతినిధులు రామోజీరావు, రాధాకృష్ణ.. ఇదేందయ్యా ఇలా చెబుతున్నావు. ఒక పక్కన నిన్ను జాకీలు పెట్టి లేపుదామని మేము అనుకుంటుంటే నువ్వేమో నాకివే చివరి ఎన్నికలంటున్నావు. అలా కాదు. ప్రజలకే ఇవి చివరి ఎన్నికలని చెప్పు.. అని సలహా ఇచ్చి ఉంటారేమో. అందుకే నిన్న చంద్రబాబు మాట మార్చారు. దీంతో బాబు నోట పూటకో మాట ఏమిటా అని జనం అనుకుంటున్నారు.

వారిద్దరిదే బాదుడే బాదుడు:
చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంపై అదే పనిగా ఊదరగొడుతున్న రామోజీరావుతో పాటు, ఆ కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు.. నిజానికి ఆ ఇద్దరే ప్రజలను బాదుతున్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్, రామోజీరావుకు చెందిన ప్రియా ఫుడ్స్‌లోనే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన ప్రజలు ఛీకొడుతున్నా, వారు మాత్రం గ్రహించడం లేదు. ఇక డూప్లికేటు స్వాములు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. వాళ్లు ఇంటికొస్తే ఒక రేటు. వారి కాళ్లు కడిగితే ఒక రేటు ఉంటుంది. నిజానికి చంద్రబాబు మాటలు కూడా అచ్చం అలాగే ఉన్నాయి. ప్రజలు ఓటేయాలి. తాను అధికారంలోకి రావాలి. ఒకవేళ బాబు అధికారంలోకి రాకపోతే, ప్రజలకు అవే చివరి ఎన్నికలట. ఈ బెదిరింపులు వినే ఖర్మ ప్రజలకు ఏం పట్టింది?.

ధరల్లో ఎందుకా వ్యత్యాసం?:
కందిపప్పు రేటు విజయవాడలో ఒకలా ఉంటే, హైదరాబాద్‌లో నీ హెరిటేజ్‌ స్టోర్‌లో అంత ధర ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.100 ఉంటే, హెరిటేజ్‌లో రూ.50లే ఉండాలి కదా? కానీ రూ.120 ఉంది. అలాగే నిన్ను చంకనెత్తుకుని భజన చేస్తూ.. నీ పైత్యాన్ని రోజూ ప్రజలపై రుద్దే ఈనాడు, ఈటీవీ రామోజీరావు వంట నూనెలను ఎంతకు అమ్ముతున్నారు?. ప్రియా నూనె కాకినాడలో ఉన్న ధరే హైదరాబాద్‌లో కూడా ఉండాలి కదా?. అలాటే ప్రియా పచ్చళ్ల ధరల్లో కూడా ఎందుకా వ్యత్యాసం?. ఆంధ్రాలో లీటర్‌ పాల ధర ఎంత? అదే వరంగల్‌లో హెరిటేజ్‌ పాలు ఏ రేటుకు అమ్ముతున్నారు?. ఇవన్నీ బాబుకు, ఎల్లో మీడియాకు తెలియవా?.

నాడు మల్లెల బాబ్జీతో.. నేడు..:
తనను, తన కుమారుడిని చంపడానికి ఎవరో ప్లాన్‌ చేస్తున్నారంటూ చెబుతున్న చంద్రబాబు, సానుభూతి రాజకీయం చేస్తున్నారు. నిజానికా ఆయనలో ఇప్పటికే రాజకీయంగా చేవ చచ్చిపోయింది. ఇంకా ఆయనను చంపాల్సిన ఖర్మ ఎవరికి ఉంది?. ‘చంద్రబాబూ.. ఇవి కాంతారావు, ఎస్వీఆర్, రాజనాల సినిమాల్లో సీన్లు నడిచే రోజులు కావు. నీ పాతతరం కుట్రల్ని జనం ఏనాడో చదివి పక్కన బెట్టారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు జనాల్లో ఆయన క్రేజ్‌ తగ్గిపోతుందని మల్లెల బాబ్జీ అనే వ్యక్తికి డబ్బు ఎర చూíపి, ఆయనతో రామారావుపై కత్తి విసిరించావు. పాపం.. అమాయకుడైన ఎన్టీఆర్‌ నిజంగా తనను మర్డర్‌ చేయడానికే బాబ్జీ వచ్చాడని అనుకున్నారు. కానీ బాబ్జీ మరణ వాంగూల్మంతో అదంతా చంద్రబాబు డ్రామా అని తేలింది.

బాబుకు ఎన్టీఆర్‌ శాపం:
చంద్రబాబుకు అసలు సిగ్గుందా?. తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నాడా?. కుట్రలు, కుతంత్రాలు అంతగా తెలియని ఎన్టీఆర్‌ను అవే కుట్రలతో అధికారం నుంచి పడదోసిన చంద్రబాబుకు.. స్వయంగా ఎన్టీ రామారావు పెద్ద శాపం పెట్టాడని.. అందుకే ఆయనకు మరోసారి సీఎంగారి చేతిలో ఘోర ఓటమి తప్పదని అంతా అనుకుంటున్నారు. నాడు అధికారం కోల్పోయిన ఎన్టీఆర్, మానసికంగా ఎంత కుంగిపోయారో.. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు పరిస్థితి కూడా అంతే అని ప్రజలు భావిస్తున్నారు. 2024 తర్వాత రాజకీయంగా, మానసికంగా కుక్కచావు చావబోతున్న బాబును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది?. బఠాని గింజంత తెలివితేటలున్న వ్యక్తి కూడా చంద్రబాబును చంపాలని అనుకోడు. నిజానికి ఆ అవసరం కూడా ఎవరికీ లేదు.

బాబు, పవన్‌ నోట అబద్ధాల మాటలు:
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌కు ఎంతసేపూ అవే సానుభూతి పలుకులు, డ్రామాలు, కుట్రలు తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. తాను అధికారంలోకి వస్తే, సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానంటున్న చంద్రబాబు, కొన్నాళ్ల క్రితం రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, మరో శ్రీలంకలా మారుతోందని దుయ్యబట్టారు. ఆయనకు దత్తపుత్రుడు కూడా జత కట్టాడు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అయినా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే, సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానని చెబుతున్న, చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా?

చెప్పుకోవడానికి ఒక్కటైనా చేశారా?:
40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు సీఎం అని తరుచూ మాట్లాడే చంద్రబాబు.. తన బ్రాండ్‌ ఇదీ అని కనీసం ఒక్కటైనా చెప్పకోగలరా? అది లేదు కాబట్టే, ప్రభుత్వంపై పిచ్చి విమర్శలు చేస్తూ, ఏదేదో మాట్లాడుతున్నారు. 2004 ఎన్నికల ముందు ఉచిత కరెంట్‌ ఎవరి వల్లా సాధ్యం కాదన్న బాబు, అలా ఇస్తే, విద్యుత్‌ తీగలు బట్టలు ఆరేయడానికే పనికొస్తాయని చెప్పారు. కానీ దివంగత మహానేత వైయస్సార్, రైతులకు ఉచిత విద్యుత్‌ హామీ నెరవేర్చి శెభాష్‌ అనిపించుకున్న తర్వాత. ఆ ఎన్నికల్లో బాబు మళ్లీ మాట మార్చారు. అదీ చంద్రబాబు రాజకీయ జీవితం. తనది చాలా హేయమైన రాజకీయ చరిత్ర అని చంద్రబాబుకు స్వయంగా తెలుసు.

దమ్మున్న నేత వైయస్‌ జగన్‌:
కేవలం 2 పేజీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించి, మూడేళ్లలో వాటిలో 97 శాతం అమలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌.. దమ్మున్న నేత. అదే చంద్రబాబును చూస్తే, 600కు పైగా హామీలిచ్చి, వాటిని నెరవేర్చలేక, చివరికి మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన దౌర్భాగ్య చరిత్ర. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు, దాన్ని కూడా ఎగ్గొడితే, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వారికి అండగా నిలబడ్డారు. నాలుగు విడతల్లో వారి రుణాలు మొత్తం చెల్లిస్తున్నారు. అలాగే బాబు హయాంలో విద్యా రంగం 18వ స్థానంలో ఉంటే.. ఈరోజు మనం 2వ స్థానంలో ఉన్నాం. నాయిబ్రాహ్మణులపైకి తెగబడి మాట్లాడిన హీనమైన చరిత్ర చంద్రబాబుది. వారందర్నీ అక్కున చేర్చుకుని పదవులిచ్చిన ఘనత సీఎంది.
మత్స్యకారులను ఎస్సీల జాబితాలో చేరుస్తానని విశాఖలో మాట ఇచ్చి, వారిని ఆశ పెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత అదే నోటితో వారి తోలు తీస్తానని బెదిరించారు. అదే సీఎం వారిని గుర్తించి, తగిన పదవులు ఇచ్చారు. బీసీలకు రూ.10వేల కోట్లు ఖర్చు పెడతానని చంద్రబాబు మోసం చేస్తే.. ఈరోజు ఇప్పటికే, రూ.30వేల నుంచి రూ.40వేల కోట్లు జగన్‌ ఖర్చు చేశారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు మొండిచేయి చూపితే, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. 1.75 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన సీఎం, యువతకు మేలు చేశారు.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. మంత్రివర్గంలో మొత్తం 25 మంది ఉంటే, వారిలో 17 మంది బీసీ,ఎస్సీ, ఎస్టీలు ఉన్నారంటే, ఆ వర్గాల వారికి సీఎంగారు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారనేది తెలుస్తుంది.

పోలవరం ప్రాజెక్టును చూసే అర్హత నీకెక్కడిది బాబూ?:
పోలవరం వెళ్లి నేలమీద కూర్చొని ప్రాజెక్టును నేను చూస్తా.. నేను చూస్తా అంటూ చిన్నపిల్లాడు చాక్లెట్‌ కోసం మారాం చేసినట్లు రాత్రిపూట చంద్రబాబు హైడ్రామా చేశాడు. అసలు, పోలవరం డ్యామ్‌కు వెళ్లే అర్హత చంద్రబాబుకు ఉందా? ప్రతి సోమవారం పోలవరం అంటూ.. ఊదరగొట్టిన బాబు గురువారం వెళితే బెడిసికొట్టింది కాబోలు..ఆనాడు టీడీపీ హయాంలో పోలవరం డ్యామ్‌ కట్టడం దేవుడికెరుగ.. జయము జయము చంద్రన్న అనే భజనే ఎక్కువగా వినిపించేది. కడియం ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావుపాపం.. పోలవరం కట్టాలంటూ బాబు చుట్టూ చాలా కష్టపడి తిరిగారు. ఆ వయసులో సైకిల్‌ తొక్కుకుంటూ హైదరాబాద్‌ దాకా వెళ్లి పోలవరం గురించి చెబితే.. బాబు పట్టించుకోకపోతే ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. జల ప్రాజెక్టుల దార్శనికుడు, మహానేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పోలవరం పునాదులు వేస్తే.. నువ్వు 2014 నుంచి 2017దాకా పోలవరం ఎందుకు వెళ్లలేదు బాబూ? గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా? కమీషన్ల కోసం కక్కుర్తిపడి కేంద్రం దగ్గర నుంచి పోలవరం తెచ్చుకున్నది వాస్తవం కాదా బాబూ? 2017 ఆఖరు నుంచి 2019 దాకా పోలవరంలో బాబు అనేక ప్రారంభోత్సవాలంటూ.. అనేక రాళ్లు వేశాడు. నేల నుంచి కేవలం ఐదారు అడుగుల ఎత్తు లేపి ఊరుకున్నాడు.

అందుకే బాబుకు పోలవరం వెళ్లే నైతిక అర్హత లేదు. అసలు రాత్రిపూట అక్కడకు వెళ్లి ఏం చేస్తారు..? పగలు వెళ్లొచ్చుకదా..? ఆ సమయంలో రక్షణ ఉండదనే కదా బాబును పోలీసులు నిలిపింది. ఆరోజు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌ను బయటకు వెళ్లనీయకపోవడానికి రక్షణ కోసం అన్నారు కదా? డ్యామ్‌ సందర్శన పేరిట ఆర్టీసీకి రూ.70కోట్లు బాకీ పెట్టాడు. బాబు తన 14ఏళ్ల పరిపాలన నిజంగా గొప్పదైతే.. ఈ మూడున్నరేళ్ల జగన్‌ పరిపాలననే కొనసాగిస్తానని చెప్పుకుంటున్న దిక్కుమాలిన రాజకీయ పరిస్థితి బాబుకు అవసరమా..? అధికారంలో ఉంటే ఉత్తకొడుకు, దత్తకొడుకు, ఎమ్మెల్యేల సంక్షేమమే బాబుకు గుర్తుకొస్తుంది. అధికారం ఊడిపోతే ప్రజాసంక్షేమం గుర్తుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లోమీడియా.. మా ప్రభుత్వం మీద ఎంతగా విషప్రచారం చేసినా.. వాళ్ల సర్కస్లు, వాళ్ల తప్పులు చూసి జనం జాలిపడాల్సిందే. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే నైతిక అర్హత బాబుకు లేదు.

జనం జగన్ ని వదులుకోరు..
ప్రజల్లో స్పందన చూసి పవన్‌ మొన్న ఇప్పటంలో జగన్‌ పరిపాలన కొనసాగిస్తానంటాడు.
‘అయ్యా.. పవన్, మీరు జగన్‌ పరిపాలన కొనసాగిస్తానంటే.. జనం నమ్మి ఆయన్ను వదులుకునేంత పిచ్చోళ్లు కాదు కదా!. ఆ మాత్రం జ్ఞానం లేదా?’ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE