Suryaa.co.in

Devotional

సత్యశోధన చేయకుండా ఆధ్యాత్మికతతో జీవించే వ్యక్తులు అంతర్ముఖులు కాలేరు

బోధించడానికి వీలుకానిది..
‘పద్మం’ మనకు గొప్ప సంకేతంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. అది ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. కానీ దానికి నీటితో సంబంధం ఉండదు. తామరాకు ఎప్పుడూ నీళ్లలోనే ఉంటుంది. కానీ దానిని బయటకు తీస్తే పైన నీటి స్పర్శ కూడా కన్పించదు. వీటన్నిటి సంకేతాలు ఏమిటంటే.. మనం ప్రపంచంలో ఉంటూనే దాని స్పర్శ తగలకుండా జీవించాలి. లోకంలోని అన్ని విషయాలనూ సాక్షీభూతులుగా గమనిస్తూ ఉండాలి తప్ప ఆ ప్రభావాన్ని మోసుకొని తిరగకూడదు. అలా ప్రతి కల వెంటా తిరిగేవారు ఎప్పటికీ అంతర్ముఖులు కాలేరు.

దీనికి సంబంధించి ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది.
శ్వేతకేతు అనే విద్యార్థి తన తండ్రి వద్దకు వెళ్లి.. అన్ని విద్యలు నేర్చుకొన్నానని చెప్తాడు.అప్పుడా తండ్రి.. ‘దేన్ని తెలుసుకొంటే ఇంకేమీ తెలుసుకోవలసిన అవసరం ఉండదో, దేన్ని గ్రహిస్తే బాధలన్నీ మాయమవుతాయో, ఏది బోధించడానికి వీలుకాదో దాన్ని తెలుసుకో!’ అని మళ్లీ గురువు దగ్గరకు పంపిస్తాడు.
‘ఇది నీకు నేర్పించాలంటే నీవు మన ఆశ్రమంలోని నాలుగు వందల పశువులు వెయ్యి అయ్యాక తిరిగి రా’’ అంటూ గురువు శ్వేతకేతును అరణ్యానికి పంపిస్తాడు.
అదెంత పని అని బయల్దేరిన శ్వేతకేతు తన జ్ఞానాన్ని పశువుల ముందు ప్రదర్శించాలనుకొంటే అవి అతణ్ణి లక్ష్య పెట్టవు.
పక్షులు, మృగాలు, రాళ్లు, రప్పలూ, నదీనదాలూ, ప్రవాహాలు ఏవీ అతని జ్ఞానాన్ని లక్ష్యపెట్టవు.
దీంతో అతని గర్వమంతా మంచులా కరిగిపోయి అంతర్ముఖుడై అంతరంగంలోకి పయనిస్తాడు.
ఎప్పుడు తిరిగి ఆశ్రమానికి వెళ్లాలో మరచిపోతాడు.
కొన్నాళ్లకు పశువులు వేయి అయ్యాయి.
వాటిలో ఓపిక నశించి, అతను తిరిగి తీసుకెళ్లడం లేదని గ్రహించి.. ఆశ్రమానికి వెళ్లాలని శ్వేతకేతుకు గుర్తు చేశాయి.
నిగర్విగా, అంతర్ముఖుడుగా శ్వేతకేతు పశువుల వెంట నడుస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు.
గురువు ఆహ్వానించడానికి వస్తే 9‘‘వేయినొక్క పశువులు వస్తున్నాయి చూడండి’’ అంటూ మిగతా శిష్యులకు చూపించాడు.
దీంతో.. ‘‘మీ నాన్న ఏది నేర్చుకోమన్నాడో అది నీకు తెలిసిపోయింది’’ అన్నాడు గురువు.
బాహ్య ప్రపంచపు పొరల్లోబడి సత్యశోధన చేయకుండా పైపై ఆడంబరపు ఆధ్యాత్మికతతో జీవించే వ్యక్తులు అంతర్ముఖులు కాలేరు.
వారి ఆత్మకు చైతన్యం, ఆధ్యాత్మిక తత్వం కలగాలంటే మనసు పొరల్ని దాటి లోతైన అవలోకనం చేయాల్సిందే.

– ఆర్కే

LEAVE A RESPONSE