– సివిల్స్ ర్యాంకర్లకు శుభాకాంక్షలు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
వ్యవస్థలను మేనేజ్ చేస్తేనో, అను’కుల మీడియా రాతలు రాస్తేనో అధికారం రాదని, ప్రజల మనస్పులో స్థానం సంపాదించాలని, అప్పుడే ప్రజలు పట్టం కడతారని చంద్రబాబు గ్రహించాలని రాజ్యసభ సభ్యులు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి హితవు పలికారు.
ట్విట్టర్ వేదికగా పలు అంశాలు ఆయన వెల్లడించారు. నాలుగు పార్టీల పొత్తుతో కేవలం ఒక శాతం తేడాతో తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని గుర్తుచేసారు. 600 హామీలిచ్చి ప్రజలను మాయ చేసాడని, మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం నమ్మే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబు ఇంట్లో కూర్చొని కిచిడీ కేబినెట్ ఏర్పాటు చేసుకుని భ్రమల్లో బతకాల్సిందేనని ఏద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే ఆవగింజంత మెదడున్న లోకేష్ మిడిమిడి జ్ఞానంతో ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు.
యుపిఎస్సి సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారిలో 21 మంది తెలుగు వారు కావడం గర్వించదగ్గ విషయంగా ఆయన వ్యాఖ్యానించారు. టాప్ 1,2,3 స్థానాలు మహిళలకు దక్కడం నారీశక్తికి ప్రతీకగా కొనియాడాడు. టాప్ 25 ర్యాంకుల్లో నిలిచిన యశ్వంత్ రెడ్డి (15), పూసపాటి సాహిత్యల(24)లకు శుభాభినందనలు తెలియజేసారు.