ఏఐసీసీ స్ఫూర్తితో తెలంగాణలో చింతన్ శిబిర్

• జూన్ 1, 2న కీసర బాలవికాస్ లో కార్యక్రమం
• 6 గ్రూపులు ఏర్పాటు చేసి లోతైన అధ్యయనం
• కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం
• మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి

రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ లో పార్టీ పక్షాన ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ముందుకు వెళ్ళడానికి మేడ్చల్ జిల్లా కీసర బాలవికాస్ లో చింతన్ శిభిర్ నిర్వహిస్తున్నామని, జూన్ 1, 2 తేదీల్లో జరగబోయే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలు హాజరుకానున్నారని సిఎల్పీ నేత బట్టి విక్రమార్క వెల్లడించారు. గాంధీభవన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 ఎన్నికలతో పాటు తెలంగాణ సమాజ అభివృద్ధికి చింతన్ శిబిర్ ఏర్పాటు నిర్వహిస్తున్నామని, ఇందులో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు.

రాజస్థాన్ చింతన్ శిబిర్ లో జాతీయ స్థాయిలో తీసుకున్న అంశాలను, రాష్ట్ర స్థాయి సమస్యలపై వచ్చిన అంశాలను క్రోడీకరించి రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉదయపూర్ చింతన్ శిబిర్ లో 6 గ్రూపులను ప్రకటించారని, ఆ కమిటీలో లోతుగా చర్చించిన అంశాలను సీడబ్ల్యూసీలో చర్చించి కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయాలు తీసుకువచ్చారని, రాష్ట్ర పార్టీ కూడా ఏఐసీసీని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ముందుకు వెళ్లడానికి వివిధ అంశాలపై లోతుగా చర్చించి నివేదిక ఇవ్వడానికి ఆరు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఆర్థికం, రాజకీయం, ఆర్గనైజేషన్, వ్యవసాయం, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రూపులు ప్రకటించి వీటికి సీనియర్ నాయకులను కన్వీనర్ గా నియామకం చేస్తామని తెలిపారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పీఏసీలో చర్చించి అనుమతి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పాలసీగా ప్రకటన చేస్తామన్నారు. ఈ శిబిర్ లో మొదటి రోజు ఆర్థిక, మిగులు బడ్జెట్, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ప్రణాళికలపై చర్చించనున్నట్టు, ఆర్గనైజేషన్, పార్టీ బలోపేతంపై కూడా సమాలోచనలు ఉంటాయని అన్నారు. రాజకీయపరమైన సైద్ధాంతిక నిర్మాణం, సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటం, వ్యవసాయ పరమైన అంశాలు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం వ్యవసాయ బలోపేతం, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్, జిడిపి, జిఎస్ డిపి, యూత్, విమెన్ ఎంపవర్మేంట్ అన్నిస్థాయిలో సమాన అమలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై లోతుగా చర్చ జరుగుతుందని చెప్పారు.

ఈ 6 అంశాలపై ఇచ్చిన నివేదికతో రెండవరోజు డిక్లరేషన్ ప్రకటన ఉంటుందన్నారు. ఎఐసిసి తీసుకున్న నిర్ణయాలను వాటిని కింది స్థాయిలో తీసుకెళ్ళాల్సిన అంశాలపై చర్చ ఉంటుందని, అధిష్టానం నిర్ణయాలను పిసిసి వ్యతిరేకించడానికి లేదని, వాటిని అమలు చేయడమే కర్తవ్యమని వెల్లడించారు. ఈ శిబిరానికి ఎఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జి మానిక్కం ఠాగూర్ తో పాటు ఇతర ఎఐసిసి సెక్రటరీలు పాల్గొంటారని పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు “మల్లారెడ్డి సాధారణ వ్యక్తి కాదు. రాష్ట్ర మంత్రి. నా మీద దాడి జరిగింది అన్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతుందా? అర్థరహితంగా తెలివి లేని మాటలు మాట్లాడొద్దు” అని భట్టి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ ఉపాధ్యక్షులు జి. నీరంజన్, సంగిశెట్టి జగదీష్, రాచమల్ల సిద్దేశ్వర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply