అమరావతి: రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్ లైన్లో అనుమతులు పొందడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన ganeshutsav.net వెబ్ సైట్ ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు ఆన్ లైన్లో తమ, తమ వివరాలను నమోదు చేసుకుని నిరభ్యంతర పత్రం పొందవచ్చని తెలిపారు.
మండప నిర్వాహకులు అనుమతులు కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ముఖ్యాధికారి మండపాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వినాయక ఉత్సవ మండపాలకు QR కోడ్ తో కూడినా నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేస్తారని డీజీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక ఉత్సవ మండపాలకు మాత్రమే ఈ అనుమతులు అవసరం అని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను సురక్షితంగా, ఆనందంగా జరపుకునేందుకు, మండప నిర్వాహకులు పూర్తి పారదర్శకంగా, సులభతరంగా పోలీసు శాఖ అనుమతులు పొందేందుకు ఈ ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు డీజీపీ తెలిపారు. నిర్వాహకులు ganeshutsav.net వెబ్ సైట్ ద్వారా అనుమతులు పొందవలసిందిగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు.