Suryaa.co.in

Andhra Pradesh

మీకు చేతకాకపోగా.. సన్నాయి నొక్కులా..!?

– 40 ఇయర్స్ ఇండస్ట్రీ, కింగ్ మేకర్ అనుకునే బాబు ఎందుకు చేయలేకపోయాడు?
– చేతకాని పవన్ కల్యాణ్ కు కోతలెక్కువ
– పరిపాలనా సౌలభ్యం కోసమే మరో 13 జిల్లాలు
– ప్రజల ఆకాంక్షల మేరకు నడిచే ప్రజా ప్రభుత్వం ఇది
– అమరావతి రాజధానిని నిర్ణయించేటప్పుడు అఖిలపక్షాన్ని పిలవాలని కమ్యూనిస్టులు ఎందుకు అడగలేదు
– సీపీఐని క్యాపిటలిస్టుల పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేశారు
– సీపీఐ(చంద్రబాబు) అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో
రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని)
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

ఇచ్చిన మాట ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు
ప్రజల సౌకర్యార్థం, పరిపాలనా సౌలభ్యం కోసం… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తూ.. 25 అని చెప్పి ఈరోజు 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. పాత జిల్లా కేంద్రాలను యథాతథంగా ఉంచుతూ, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ 13 నూతన జిల్లాలకు కలెక్టర్లతో పాటు జాయింట్‌ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ, నూతనంగా ఏర్పాటు అయిన ప్రతి జిల్లాకు ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించి, ఇవాళ్టి నుంచి వారి విధులు నిర్వర్తించేలా, ప్రజల సమస్యలు పరిష్కారమే వారి బాధ్యతగా… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిఅధికార యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదగా ఆవిష్కృతం అయిన నూతన జిల్లాలు… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు అనేది 1808లో మొట్టమొదట కడప జిల్లా ఏర్పాటు అయింది. 1859లో కృష్ణాజిల్లా, 1882 అనంతపురం జిల్లా, 1925లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, 1936లో విశాఖపట్నం జిల్లా ఏర్పాటు అయింది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో శ్రీకాకుళం జిల్లా, 1953లో నెల్లూరు, కర్నూలు జిల్లాలు, 1970లో ప్రకాశం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటు అయింది. అప్పట్లో ఉన్న జనాభా ఎంత? 2022 వచ్చేసరికి జనాభా ఎంత పెరిగింది? అప్పట్లో, 1979లో 13 జిల్లాలు ఏర్పాటు అయితే దాదాపుగా 43 సంవత్సరాలుగా ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు అవలేదు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఏమైంది..?
40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటూ చంద్రబాబు నాయుడు మాటమాటకి కోతలు కోస్తారు. అ‍క్కడతో ఆగకుండా ‘నేనే కింగ్‌ మేకర్‌ను, దేశంలో ఫలానా వారిని ప్రధానమంత్రిని చేశాను, ఫలానా వ్యక్తి అనామకుడిగా ఉంటే ఎవరూ గుర్తించకుండా ఉంటే, నేనే గుర్తించి రాష్ట్రపతిని చేశాను. హైదరాబాద్‌ నేనే కట్టాను. హూద్‌హుద్‌ తుపాన్‌ను కూడా నేను కంట్రోల్‌ చేశాను. నేను పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించడం వల్లే తుఫాన్‌ను కట్టడి చేశాను. లేకుంటే ఈ రాష్ట్రం కొట్టుకుపోయేది’ అని వినేవారు ఉంటే చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడు. తనకున్న అనుభవం మీ ఊళ్లో మర్రి చెట్టుకు, వేప చెట్టుకు కూడా లేవని బాబు ప్రగల్భాలు పలికేవాడు. మరి మీ అనుభవం ఏమైంది చంద్రబాబు?.

చంద్రబాబు, చివరికి ఏ స్థితికి దిగజారిందంటే నాలుగు పదుల వయసు ఉన్న నవ యువకుడు ముఖ్యమంత్రి అయితే … ఆ ముఖ్యమంత్రి దగ్గర 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన, 40 ఏళ్ల రాజకీయం నడిపిన కింగ్‌మేకర్‌, విజన్‌ 2020 అని కథలు చెప్పిన వ్యక్తి… కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలంటూ అభ్యర్థించే స్థాయిలో జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన చేయడం, పరిపాలనలో విప్లవాత్మకమైన ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం అనేది పవన్‌ కల్యాణ్‌కు, సీపీఐ నారాయణ, రామకృష్ణలకు ఎందుకు కనిపించడం లేదనేది అర్థం కావడం లేదు.

ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరు ఒక్కసారైనా ఆలోచించాలి కదా? జనాభా పెరిగిపోతోంది. 1979కే 13 జిల్లాలు ఏర్పడితే 43 ఏళ్లలో ఇంత జనాభా పెరిగితే ప్రజా సౌలభ్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం యోచన చేయాలి కదా?

చేతకాక సన్నాయి నొక్కులా..?
తాను చేయాల్సింది చేయకపోగా, చేతకాక, తాను ఆడమన్నట్టు అల్లా ఆడేవారిని, పాడమన్నట్టు అల్లా పాడేవారిని కొంతమందిని చుట్టూ పెట్టుకుని సన్నాయి నొక్కులు నొక్కిస్తున్నాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టిన వెంటనే పవన్‌ కల్యాణ్‌ను తెరమీదకు వదిలాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం, పవన్‌ లుంగీ – పంచె కట్టుకుని మాటమాటకు కలిసేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు.

పవన్ కల్యాణ్ మాట్లాడితే.. ‘నాకు అధికారం లేదు, ఒక ఎమ్మెల్యే లేడు అయినా నేను సమస్యలను పరిష్కారం చేసేస్తున్నానంటూ’ ఆరు నెలలకు ఒకసారి కలుగులో నుంచి బయకు వచ్చి చెబుతాడు. ఈరోజు కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు సలహా మేరకు ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని పవన్ కల్యాణ్ ఒక ప్రకటన చేశాడు.

ఏటపాక ఏ జిల్లాలోనిది? అల్లూరి సీతారామరాజు జిల్లాలోనిదికాదా? కుక్కునూరు ఏ జిల్లాలోనిది? కుక్కునూరుకు ఏలూరు జిల్లా కేంద్రం అయితే, పాడేరు వెళ్లాలంటారు?. ఇది చూస్తుంటే సమస్యల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా రాతలు, మాటలా?.
జిల్లాల నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నాడు? ఏమైనా అధ్యయనం చేశాడా? ప్రభుత్వాన్ని ఏమైనా కలిశాడా?

సూచనలు ఏమైనా చేశాడా? సినిమా షూటింగ్‌ల్లో ఆయన ఉంటాడు. చంద్రబాబు దగ్గర నుంచి ఒక ఫ్యాక్స్‌, వాట్సాప్‌, మెయిల్‌ వెళుతుంది. దాన్ని జనసేన లెటర్‌ హెడ్‌ మీద అచ్చేసి, ఒక సంతకం గీకేసి మీడియాకు పంపించడం పవన్ కు రివాజుగా మారింది. ఇదేగా మీరు చేస్తున్నది?

ఇంకెంతకాలం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు? నిన్ను నమ్మి పార్టీ జెండా మోస్తున్నవారు, నువ్వు ముఖ్యమంత్రివి కావాలని గొంతెత్తి నీ అభిమానులు అరుస్తుంటే.. మంగళగిరి మీ పార్టీ మీటింగ్‌లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పి, జగన్‌ని అర్జెంట్‌గా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని చెప్పింది వాస్తవం కాదా?

జగన్‌ మోహన్‌ రెడ్డి కి వ్యతిరేకంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి స్కీమ్‌ పెట్టాను మీరు వస్తే రండి అని బీజేపీ వారికి కూడా వార్నింగ్‌ ఇవ్వడం తప్పితే మీరేం చెప్పారు. మీ కార్యకర్తల డిమాండ్లను పరిష్కరించండి ముందు పవన్‌ కల్యాణ్. వాళ్ల తాపత్రయాన్ని గుర్తించి 175 సీట్లలో పోటీ చేయండి. ముందుగా, మీరు ఆ బాధ్యత తీసుకుంటే ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు, మిమ్మల్ని నమ్ముకుని జెండా మోసేవాళ్లకు బాగుంటుంది.

స్వామి భక్తితో బాబు ఏం చెబితే అది చేస్తున్న పవన్
చంద్రబాబు ఏం చెబితే పవన్ కల్యాణ్ అది చేస్తాడు. ‘పవన్‌ నాయుడు దున్నపోతు ఈనింది కట్టేవయ్యా అంటే గబగబా కట్టేయడానికి వెళతాడు’ చంద్రబాబు దున్నపోతు ఈనిందంటాడేంటి? గేదె కదా ఈనేది? దూడను కట్టేయడమేంటి అనే కనీస ఆలోచన కూడా లేకుండా, స్వామి భక్తితో గబగబా పలుపు పట్టుకుని దూడను కట్టేయడానికి వెళ్లే పనోడు పవన్‌ కల్యాణ్‌.

పైగా, జిల్లాల బాధ్యత జనసేన తీసుకుంటుందని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా పచ్చి మోసం, దగా ఉంటుందా? వేసవికాలంలో, మిట్టమధ్యాహ్నం కూడా దగా చేయడానికి పవన్‌ కల్యాణ్‌ బరి తెగించేశారు? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్‌ చాలా బాధ్యతలు తీసేసుకున్నాడు కదా? ఆ బాధ్యతలు అన్ని ఏమయ్యాయి?

అమరావతి రాజధాని కోసం బలవంతంగా భూములు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తుంటే.. వాళ్లదగ్గరకు నమ్మకంగా వెళ్లిన పవన్‌ కల్యాణ్‌, ‘చంద్రబాబును అడుగు ముందుకు వేయనివ్వను, మీ భూములు బలవంతంగా లాక్కుంటే నడిబజారులో నిలబెట్టి రోడ్డు మీదకు వస్తానని’ చెప్పాడు. పాపం అమయాక జనం నిజమే అని నమ్మారు. ఏం చేశారు.

ఆ తర్వాత లుంగీ కట్టుకుని మరీ హెలికాప్టర్‌లో వచ్చిన పవన్‌ కల్యాణ్ …చంద్రబాబును కలిసి ఆయన చెప్పినట్లు అల్లా తలూపి… చంద్రబాబు అంత బాగా చేస్తుంటే, వీళ్లంతా ఎందురు ధర్నాలు చేస్తున్నారని మంగళగిరి రైతాంగంపై… మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? ఇదేనా మీరు వాళ్లకు ఇచ్చిన ఉత్తమ సలహా.

దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారి దగ్గరకు వెళ్లారు. మీ అరుపులకు, మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఇది నిజామా, అబద్ధమా అని మీ మొఖం వంక వెర్రి చూపులు చూశాడు. చివరికి దివీస్‌ విషయంలో పవన్ కల్యాణ్ ఏం ముగింపు ఇచ్చారంటే ఏమీ లేదు. ఉద్దానం వెళ్లి వచ్చారు కదా? ఏమయ్యాయి ఆ బాధ్యతలు అన్నీ?. పవన్‌ మళ్లీ కొత్తగా ఈ బాధ్యత తీసుకుంటారట..!.

జనసేన కార్యాలయానికి చేరితే ఏంటి? పవన్‌ కల్యాణ్‌ చెవులకు చేరితే ఏంటి? తెలుగుదేశం పార్టీ గోడలకు చేరితే ఏంటి? ఏదైనా ఒకటే కదా? ప్రత్యక్ష కార్యాచరణ, సమస్య పరిష్కారం కోసం ఏమీ ఉండదు కదా? పత్రికా ప్రకటనల పేరుతో ఇలాంటి కాగితం ఒకటి రాసి, రేటింగ్‌ ఉంటుంది కదా? టీవీల్లో బ్రేకింగ్స్, స్క్రోలింగ్స్ కోసం, చంద్రబాబు అంటే పడిచచ్చిపోయేవాళ్లు రాసిచ్చింది తప్ప?

జిల్లాలను మార్చేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇవ్వరు పవన్‌ కల్యాణ్‌ ..మోదీకి, చంద్రబాబుకు ఓటేయండి వీళ్లను నేను ప్రశ్నిస్తాను. డొక్క చించి డోలు కడతాను అని మాట్లాడి అయిదేళ్లు పాటు 2014 నుంచి 2019 వరకూ ప్రభుత్వాన్ని మీరు చెప్పినవాళ్ళే నడిపారు కదా? మరి అప్పడు ప్రజల ఆకాంక్షలు, కోరికలు ఎందుకు నెరవేర్చలేదు? ఏటపాక, కుక్కునూరు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఏలేరుపాలెం ప్రజల గురించి ఏరోజు అయినా మాట్లాడారా? అప్పుడు వాళ్లకు జిల్లా కావాలని మీకు అనిపించలేదా?. వారి బాధలు మీకు పట్టలేదా..?

ఇది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలా ఎవరి ఊతకర్రల మీద లేదు. పవన్‌ కల్యాణ్‌ పల్లకి మోసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకునే ప్రజా ప్రభుత్వం ఇది. మీ సలహాలు తీసుకునే అవసరం లేకుండానే, కచ్చితంగా పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మా ముఖ్యమంత్రిగారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. మీకు లా ఏ రోటి దగ్గర ఆ మాటలు మాట్లాడే వ్యక్తి కాదు మా ముఖ్యమంత్రిగా.

ప్రజలకు ఏది అవసరమో దాని కోసం కచ్చితంగా అవసరం అయితే నాలుగు మెట్లు దిగి అయినా.. తాను తగ్గి ప్రజల యొక్క అభిప్రాయాన్ని భుజానికి ఎత్తుకుని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయి. నువ్వు మోసిన చంద్రబాబు ప్రభుత్వంలా అహంకార పూరితమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదిది.
ఓటు వేయించుకున్న తర్వాత, చంద్రబాబును కలవడానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను తోలు తీస్తామని, మత్స్యకారులను ఒళ్లు బలిసిందా అని, కాపులు రిజర్వేషన్ల కోసం దీక్షలు చేస్తే పోలీసులతో లాఠీలు, తుపాకులతో ఏమనిషి భరించరాని స్థితిలో అసభ్య పదజాలంతో బూతులు తిట్టి, ఇదేం న్యాయం అని అడిగిన మనిషిపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా… మీరు మోసిన ప్రభుత్వం కాదా… దీన్ని పవన్‌ ఒకసారి మననం చేసుకుంటే మంచిది.

సీపీఐ(చంద్రబాబు)అని మార్చుకోండి
గుండెల నిండా నిలువెత్తు చంద్రబాబు నాయుడు బొమ్మను నింపుకున్న సీపీఐని గొడుగులా వాడుకుంటున్న రామకృష్ణ,నారాయణగార్లు కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏవేవో విమర్శలు చేస్తున్నారు. అఖిలపక్షాన్ని ఆహ్వానించలేదట. రామకృష్ణగారు 2014 నుంచి 2019 వరకూ ఒక్కరోజు అయినా చంద్రబాబును శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అఖిలపక్ష కమిటీ వేయమని అడిగారా? రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్ణయం అనేది పెద్ద నిర్ణయం కదా? దానిపై అఖిలపక్షం వేయమని కానీ, ఎందుకు వేయలేదని కానీ చంద్రబాబును ఎప్పుడైనా ప్రశ్నించారా?

ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మాటిచ్చారు. తెస్తామని చంద్రబాబు మాటిచ్చారు? ఇద్దరు కలసి అధికారాన్ని అనుభవించారు. హోదాపై అఖిలపక్షాన్ని వేయమని ఒక్కరోజు అయినా చంద్రబాబును ప్రశ్నించారా? హోదా అక్కర్లేదు – ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు భూజాన ఎత్తుకున్నప్పుసలహా ఇవ్వడం, ఆయన వెంటనే మోదీకి వ్యతిరేకంగా బయల్దేరినప్పుడు అఖిలపక్షాన్ని వేయాలని అడిగేందుకు నోరు రాలేదా రామకృష్ణగారూ?. చంద్రబాబును అడిగేందుకు మీకు ఎప్పుడూ నోరు రాదు. అప్పుడేమో నోరు కుట్టేసుకున్నారా? ఇప్పుడు మాత్రం మాట్లాడతారా…?. కొత్త జిల్లాల ఏర్పాటులో జగన్‌ మోహన్‌ రెడ్డిప్రజల వినతులు, విజ్ఞాపనలు పరిగణనలోకి తీసుకోనిది ఎక్కడో చెప్పండి?

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వీళ్లు ఎర్రజెండాను ఏ స్థితికి తీసుకువెళ్లిపోయారు అంటే, చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరోజు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేయలేదు. పేదల కోసం, వారి ఆకలి కోసం, గూడు కోసం, ఇంత నీడ కోసం పోరాటాలు చేసిన భారత కమ్యూనిస్ట్‌ పార్టీని, గొప్పగా బతికిన ఎర్రజెండాను పసుపు రంగులో ముంచి ఎలా లేపారనేది మీకు సోయ, స్పహ లేకుండానే జరిగాయా?

జగన్ మోహన్ రెడ్డి 31లక్షలమంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తే చప్పట్లు కొట్టాల్సిన వాళ్ల నోళ్లకు తాళాలు పడ్డాయి. 15 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాల కోసం ఒక లక్షా 80వేలు డబ్బులు ఇస్తే దాని గురించి మీకు మాట్లాడేందుకు ఒక్క మాట కూడా రాలేదు. కమ్యూనిస్ట్‌ పార్టీ అంటే, ఎర్రజెండా వాళ్లు అంటే పేదల కోసం పోరాటం చేసే వ్యక్తులు, పార్టీలు నాడు అయితే… ఈ నారాయణ, రామకృష్ణ జోడీ చివరకు కమ్యూనిస్ట్‌ పార్టీని క్యాపిటలిస్ట్‌ల పార్టీగా మార్చిపారేశారు.

కమ్యూనిస్ట్‌ పార్టీ మీద భక్తి, గౌరవ భావం ఉంటే వీళ్లిద్దరూ బయటకు వెళ్లిపోయి సీపీఐ- చంద్రబాబు అని పార్టీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాకానీ గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీని చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు కోసం ఇలా దిగజార్చడం శోచనీయం. ఇవాళ జరుగుతున్న తంతు చూస్తుంటే కమ్యూనిస్ట్‌ పార్టీ యోధుల ఆత్మ క్షోభిస్తుంది.

40 ఏళ్ళ అనుభవం చేయలేనిది.. మూడేళ్ళలో చేశారు
రాష్ట్ర ప్రజానీకం అంతా పండుగ చేసుకునే రోజు ఇది. ఎవరూ అడగకుండానే తన పాదయాత్ర సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల బాధలను గమనించి కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న పరిస్థితిని మార్చేలా, జిల్లా ప్రజలందరికీ సత్వర న్యాయం చేసేలా కొత్త జిల్లాల ఏర్పాటు ఉందని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదు. చంద్రబాబుకు వంత పాడుతు ఇవాళ అంతా సన్నాయి నొక్కులు నొక్కుతున్న పవన్ కల్యాణ్ కు ఎందుకు మంచి కనిపించదు?

40 ఏళ్ళ అనుభవం చేయలేనిది, మూడేళ్ల అనుభవంలో జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇలాంటి చారిత్రక నిర్ణయం తీసుకోవడం అంటే అది చరిత్రే కదా? ఎంత దార్శినికత ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు. చంద్రబాబు ఎటూ ఒక మంచిమాట చెప్పలేరు. కనీసం ప్రజలకు మంచిపని చేసినప్పుడు దాన్ని మెచ్చుకుంటే, ప్రజలు హర్షిస్తారని హితవు పలుకుతున్నాం. మచిలీపట్నంవాసిగా మా ఆవేదన. పేరుకే జిల్లా కేంద్రం అయినా బ్రిటీష్‌ పాలకులు ఉ‍న్నప్పుడు మా ఊరెంతో ఘనం. వారం వారం సోమవారం మాత్రమే మా జిల్లా అని తూర్పు కృష్ణావాసుల ఆవేదనను జగన్‌ మోహన్‌ రెడ్డి తొలగిస్తూ రాష్ట్ర ప్రజలందరి ఆవేదనను తొలగించారు.

జిల్లాల ఏర్పాటు పేరుతో జిల్లా కలెక్టర్‌ అంటే హోదా కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా ముఖ్యమంత్రి తన మాటగా చెప్పారు. రాష్ట్ర ప్రజలందరి తరపున కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

LEAVE A RESPONSE