Suryaa.co.in

Andhra Pradesh

పవన్ కల్యాణ్ అన్నింట్లోనూ లేట్ కామరే..

– పక్షం రోజులకొకసారి పవన్ కల్యాణ్ వీకెండ్ ప్రజా సేవ
– కులతత్వం చచ్చిపోయిందని పవన్ ఏడుపా..!?
– బాబు కళ్ళల్లో ఆనందం చూడటానికే పవన్ కల్యాణ్ ప్రవచనాలు
– టీడీపీ కౌరవ ప్రభుత్వంలో దుర్యోధనుడు బాబు అయితే.. పవన్ దుశ్శాసనుడా..?
– పవన్ కల్యాణ్ మార్చే రంగుల ముందు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
– పవన్ ను అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వనిది గాజువాక, భీమవరం ప్రజలే
– పవన్ పార్టీ పెట్టింది జగన్ ని ప్రశ్నించడానికే అనే ట్యాగ్ లైన్ పెట్టుకోవాల్సింది
– చిలుక జోస్య ప్రావీణ్యంలో పవన్ కల్యాణ్ సెలబ్రిటీ.. నయా వివేకానందుడులా ఫోజు
– కోనసీమకే అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలి అని మాట్లాడింది పవన్ కల్యాణ్ కాదా..?
– చంద్రబాబు అండ్ కో విష కూటమిని దించి.. ప్రజా పాలన వచ్చి మూడేళ్ళు అయింది
– జనాన్నే జగన్ నమ్ముకుంటారు.. బాబు, పవన్ ప్రవచనాలను జనం నమ్మరు
– విలువలు, విశ్వసనీయతకు నిలువుటద్దంగా జగన్  పరిపాలన
– జోరున వర్షంలో, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్లీనరీకి హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిపేర్ని నాని

పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

ప్లీనరీని దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకూ ధన్యవాదాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు రెండురోజుల పాటు దిగ్విజయంగా జరిగాయి. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు కారణభూతులైన వైయస్సార్‌ కుటుంబసభ్యులైన ప్రతి కార్యకర్తకు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తల అందరి కృషి, అంకిత భావంతో చేసిన యజ్ఞం ఫలితంగా ఏర్పడ్డ ప్రభుత్వం గడిచిన మూడేళ్లులో ఎంత విజయవంతంగా పరిపాలన సాగించింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన, ఇచ్చిన హామీల్లో 95శాతం అమలు చేయడమే కాకుండా చెప్పని మాట, ఇవ్వని హామీలను కూడా విద్యా, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దాంతో రాష్ట్రంలో శరవేగంగా మార్పులు కార్యరూపం దాల్చడమేకాకుండా, భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు ఏపీ వైపు తలతిప్పి చేసేలా చేస్తున్న కార్యక్రమాలు, రాబోయే రెండేళ్లలో ప్రజలకు ఏమీ చేయబోతుంది, ఎలా ఉండబోతుందనేది పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ విశిదీకరించడం జరిగింది. అలాగే రెండు రోజుల ప్లీనరీలో వైయస్సార్‌ సీపీ జెండాను భుజాన ఎత్తుకుని, జగన్‌ ప్రతిమాటను ప్రతి ఇంటికి చేరవేసి.. వారి మనస్సుల్లో సంపూర్ణ విశ్వాసం నెలకొల్పిన ప్రతి కార్యకర్త కు కూడా ధన్యవాదాలు. కార్యకర్తల అంకితభావం, ప్రేమను చూసిన జగన్‌ మోహన్‌ రెడ్డి మరింత భావోద్వేగంతో మాట్లాడిన ప్రతి అంశాన్ని ఆసాంతం వినడమే కాకుండా సభనుంచి జగన్‌ నిష్క్రమించే వరకూ సభా ప్రాంగణంతో వేచి ఉన్నారు. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసి, ఆ మధురానుభూతితో ఇంటికి వెళ్లిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కృతజ్ఞతలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.

– వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం పారదర్శతతో సాగిస్తున్న నీతివంతమైన పాలనను, ఏ విషయంలోనూ తప్పుబట్టలేని స్థితిలో మా రాజకీయ వ్యతిరేకులు ఉన్నారు. పార్టీ విధానాలను, ఆలోచనా సరళిని తప్పుబట్టలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. విశ్వసనీయతకు, విలువలకు నిలువుట్టద్దంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన ఉంటున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తృప్తిగా ఆనందపడే విషయం. గడిచిన వారం రోజుల పాటుగా జోరు వానను కూడా లెక్క చేయకుండా, ప్లీనరీ సమావేశాల ఏర్పాటుకు కష్టపడి పనిచేసిన పార్టీకి చెందినవారితో పాటు ప్రతి కార్యకర్త, నాయకుడికి, ప్రతి వ్యక్తికి అభినందనలు తెలుపుతున్నాం. అక్కడక్కడ పోలీసుల ఆంక్షలు ఉన్నా వారి విధుల్లో భాగమే అని వాటిని మనసులోకి తీసుకోకుండా సర్దుకుని ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ప్రతి ఘటనను రాష్ట్ర ప్రజానీకానికి అందించిన పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞతలు. ప్రత్యేకించి చెప్పాలంటే.. పోలీసు శాఖ వారిని ముందుగా అభినందించాలి. వర్షం పడుతున్నా ముఖ్యమంత్రికి భద్రత కల్పించే విషయంలో అహోరాత్రులు పనిచేశారు. అక్కడక్కడ కొద్దిమంది మాటలకు, వారి కఠిన పదాలకు, వారి దూషణలను చిరునవ్వుతో స్వీకరించి ఉద్యోగ నిర్వహణను గొప్పగా నిర్వర్తించిన ప్రతి పోలీస్‌ సోదరుడికి, అధికారులకు మా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాం.

పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ

మా ప్లీనరీ సమావేశాలపై నిన్న విజయవాడలో ఒకాయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఈ మధ్య కొత్తగా నెలలో రెండు ఆదివారాలు పాటు వీకెండ్‌ ప్రజా సేవ చేస్తున్నారు. గత ఎన్నికల ముందు సినిమాలను వదిలేసి ప్రజలకు అంకితం చేశానని డబ్బాలు కొట్టారు. ప్రతి ఏడాది వందకోట్లు రాబడిని వదులుకుని మీ కోసం సేవ చేయడానికి వచ్చాననే డబ్బా మాటలు విన్నాం. ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి, సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నాను అని అంటున్నారు. వీకెండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ అట. అది కూడా పక్షం రోజులకు ఒకసారి… సెలవు రోజు ప్రజాసేవ. ఇటువంటి ప్రజాసేవ బహుశా ఎవరూ చేయరేమో.. ఆయన చేసే ప్రజాసేవలోనూ పద్ధతులు భలేగా ఉన్నాయి. వారి భాష, పద్ధతిలో ప్రజలకు జీవితాన్ని అంకితం చేయడం అంటే ఇదేనేమో.

– ఇవాళ పక్షం పక్షం సెలవురోజున ప్రజాసేవ. ఇలాంటి వింత పోకడలు ఉన్న రాజకీయ నాయకులు ఉండటాన్ని చరిత్రలో రాయాల్సిందే. రామోజీరావు ప్లీనరీకి జనం వచ్చిన ఫోటోలు అయితే వేయలేదు కానీ ‘కుర్చీలు ఖాళీ చేయండి ప్రజలు వస్తున్నారంటూ…’పవన్‌ ట్వీట్‌పై వార్తను వదిలారు. తన దినచర్యతో పాటు షూటింగ్‌లకు కూడా ఆలస్యంగా వెళతాడనుకుంటే, చివరికి రాజకీయానికి కూడా ఆలస్యం అయిపోయాడు పవన్ కల్యాణ్. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌  స్టేట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మూడేళ్ల క్రితమే దాన్ని మనసుకు తీసుకున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, భారతీయ జనతా పార్టీ … ముగ్గురు కలిసి విష కూటమితో ఏర్పాటు అయిన ప్రభుత్వాన్ని పడదోయించి, ఖాళీ అయిన ఆ కుర్చీల్లో ప్రజలు కూర్చున్నారన్న సంగతి వీళ్లకు ఇప్పుడు తెలిసింది.

చంద్రబాబును ఖాళీ చేయించారు కదా..

ఈరోజు రాష్ట్ర అధికార పీఠం మీద ప్రజలు కూర్చున్నారన్న విషయం మూడేళ్ల తర్వాత వాళ్లకు తెలిసింది. చంద్రబాబు ఖాళీ చేసి చాన్నాళ్లు అయింది. ప్రజలు ఆ కుర్చీలను అధిరోహించి కూడా మూడేళ్లు అయింది. అలాంటిది ఆయన ఇప్పుడు ఆలస్యంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. అసెంబ్లీ గేటు ముట్టుకోన్విరంట అని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడు. ఆయనను అసెంబ్లీ గేటు దాటనివ్వంది ఎవరు? భీమవరం, గాజువాక ప్రజలు. మాకేమీ సంబంధం. ఈ విషయంలో జగన్‌ మోహన్‌ రెడ్డికి ఏం సంబంధం? ఎవరి మీద బాధ ఎవరిమీద వ్యక్తం చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా జగన్‌ మోహన్‌ రెడ్డినే మీకు కనిపిస్తారా? ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానన్న మీరు, కేవలం జగన్‌ ని ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్లు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని, స్టేట్‌మెంట్‌ ఇస్తే బాగుండేదేమో.

– పవన్ కల్యాణ్… ప్రముఖ, ప్రఖ్యాత చిలుకజోష్య ప్రావీణ్యులు. ‘2019లో జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కాడు… కాలేడు. ఇది పవన్‌ కల్యాణ్‌ శాసనం’అని పవన చిలుక జ్యోసం చెప్పింది. ప్రజాస్వామ్యంలో మా జగన్‌ మోహన్‌ రెడ్డి వందకు వందశాతం ఎప్పుడూ ప్రజలను నమ్ముకుంటారు. మీలా విమానాల కంపెనీల వారినో, చంద్రబాబు నాయుడునో, మోదీనో, కేసీఆర్‌ నో నమ్ముకోరు. జగన్‌ కి జనమే దేవుళ్లు. భగవంతుడు, ప్రజలు ఆశీర్వదిస్తేనే మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి జగన్‌.

– పవన్‌ కల్యాణ్‌ ప్రవచనాలకు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా సరిపోరు. పవన్‌ రాజకీయ ప్రవచన కారుడు. సాధారణంగా ప్రవచనం చెప్పేవాళ్లకు నిన్నేమి చెప్పాం, మొన్నేమి చెప్పామనేది గుర్తుంటుంది. పాపం రాజకీయ ప్రవచనకారుడికి మాత్రం ఏదీ గుర్తుండదు.. ఎప్పుడిది అప్పుడే. పొంతన లేని మాటలు చెబుతుంతే ప్రజలు నవ్వుకుంటారనే ఇంగితం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన జనంలోకి వచ్చే పరిస్థితులు వీకెండ్స్ మాత్రమే కాబట్టి. ​కారు అద్దం తీయడం, చేయి ఊపడం, వెళ్లిపోవడం అదే ప్రజలను కలవడం అంటే.

కోనసీమకే అంబేడ్కర్ పేరు ఎందుకు అన్నది పవన్ కల్యాణ్ కాదా..?

కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెడితే సంతోషించేవాడిలో తానే ముందుంటాను అని ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. మరి కోనసీమ జిల్లాకే అంబేద్కర్‌ పేరు ఎందుకు పెట్టాలి – కడప జిల్లాకు ఎందుకు పెట్టకూడదంటూ ప్రవచనాలు చేసిందెవరు? జగన్‌ మోహన్‌ రెడ్డి దమ్ముగా తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తున్నానంటూ ఒక్క మాట మాట్లాడావా?. పవన్ కల్యాణ్.. ఏరోజు డబ్బా కొట్టుడు ఆరోజే. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌  బాధలో ఉంటే మీరు సెటైర్లు, సినిమా డైలాగులు వేశారు. ఆరోజు సంస్కారం లోపించి ప్రవర్తించి ఇవాళ అత్యంత సంస్కారులుగా ప్రవచనాలు చెబుతుంటే ఎవరి చెవిలో పూలుపెడతారు.

దెందులూరు స్వామీజీకి ఓటు వేయమన్నారా..?

రేణిగుంటలో అనిత అనే మహిళకు అన్యాయం జరిగిందని, వైయస్సార్‌ సీపీ నాయకుల దాష్టీకం అంటూ విమర్శలు చేశారు. నిన్న సాయంత్రానికే స్టోరీ వేరేగా ఉంది. తిట్లు, డ్రామాలు సినిమాల్లో బాగుంటాయి. తెర మీద చేస్తే అడిగేవాడు ఉండదు కాబట్టి. ఎంతసేపు జగన్‌ మోహన్‌ రెడ్డి మీద విషం చిమ్మటమే మీ పని. పెద్ద పోటుగాడు అని రౌడీయిజాన్ని సహించలేడట. అనంతపురం వెళ్లి మీరు కాఫీ తాగి వచ్చిన వాళ్ళు ఎవరు?. ఈ రాష్ట్రంలో వారు ఎంతమందిని చంపేశారు. బాగా మర్డర్లు చేశారని శాలువ కప్పడానికి వెళ్లారా? కప్పించుకోవడానికి వెళ్లారా? 2014లో దెందులూరులో ఎవరికి ఓటు అడిగారు? దెందులూరు స్వామిజీకి ఓటు వేయమని అడిగారా? మీ సొల్లు కబుర్లు రాష్ట్ర ప్రజలంతా వినేసి, ఇంటికెళ్లి భగవద్గీతలా రాసుకోవాలి మరి అన్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఇసుక వ్యాపారం కోసం ఆ దెందులూరు స్వామిజీ ఓ మహిళా అధికారిణి జుట్టుపట్టుకుని దాష్టీకం చేస్తే నోరు విప్పారా?. సత్తెనపల్లి మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల కోసం వైయస్సార్‌ సీపీ ఎంపీటీసీలు బస్సులో వెళుతుంటే దారికాచి, దాడిచేసి, కిరాతకంగా ఈడ్చుకువెళితే అప్పుడు మీ నోరు ఏమైంది? 2014 నుంచి 2019 వరకూ మీరు తిరిగిందంతా రౌడీలతోనే కదా? మరి ఇప్పుడేమైనా మారు మనసు పొందారా? మతం లేదని చెబుతూనే… మాటలతో పాటు మతం కూడా మారుతుంటారు కదా?

– పవన్ కల్యాణ్.. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నావు కదా? ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారంటున్నావు. ఏ సినిమా మీద దెబ్బ కొట్టారు. రాష్ట్ర ప్రజలు నీ సినిమా మీద దెబ్బ కొట్టారు. నీ సినిమాకు కలెక్షన్లు లేక దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారా మీరు?

కులతత్వం చచ్చిపోయిందని ఏడుపా..?

రాష్ట్రంలో కులతత్వం చచ్చిపోయిందని మన ప్రవచనకారుడు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ బాధపడిపోతున్నాడు. పవన్‌ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మాట్లాడిన మాటలను నెమరు వేసుకుంటే ఆయన మీద ఆయనకే అసహ్యం వేస్తుంది. మీకు ఊసరవెల్లి అనే పేరు సరిగ్గా సరిపోదేమో. మీ ముందు ఊసరవెల్లి కూడా చిన్నదే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయినప్పుడు 11 రోజుల పాటు ముద్ద దిగలేదన్నాడు. అది ప్రాంతీయ తత్వం కాదా? కాపు ఉద్యమం నేపథ్యంలో తుని ఘటన జరగగానే కాపులు రిజర్వేషన్లు అడగటం ఏంటని, కులరహిత సమాజం రావాలని అన్నారా లేదా?

– నయా వివేకానందుడులా పవన్‌ కల్యాణ్‌ మాటలు ఉన్నాయి. బీజేపీలా ముస్లింలను అభివృద్ధిలో అణగారేలా చేయనంటూ ప్రసంగాలు చేశారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్‌? మంచి మంచి ప్రవచనాలు, సూక్తి ముక్తావళిలు చెప్పే మీరు ఇప్పుడు బీజేపీ చంకలోనే ఉన్నారు కదా. జగన్‌ కి వ్యతిరేకంగా టీడీపీ కింద అందరూ పనిచేయాలని చెబుతున్నారు. ఆయనకు రాజకీయం కావాలి. అది చంద్రబాబుకు ఉపయోగపడే రాజకీయం అవ్వాలి. అప్పుడు మాత్రం కులాలు, ​​కాపులు, రిజర్వేషన్లు కావాలి.

– కాపు రిజర్వేషన్లపై జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. చంద్రబాబులా మోసం చేయలేనని, రిజర్వేషన్‌ ఇవ్వడం అనేది తన చేతిలో లేదని, అయితే వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు సంవత్సరానికి రూ. 2వేల కోట్లు చొప్పున అయిదేళ్లకు రూ. 10వేల కోట్లు అందచేస్తామని, కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని జగన్  చెప్పారు. మరి పవన్‌ మాటలు ఎలా ఉన్నాయి. పూటకో మాట మాట్లాడుతూ ఊరసవెల్లిలాగా రంగులు మార్చుతూ, అసత్యానికి మారుపేరు అయిన చంద్రబాబు నాయుడు సిగ్గుపడేలా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడు. పవన్ మాటలుచూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది.

బాబు కళ్ళల్లో ఆనందం కోసం..

వాలంటీర్‌ వ్యవస్థ మీద కూడా విమర్శలా? టీడీపీ పాలనలో పక్షపాత ధోరణితో ప్రభుత్వ వ్యవస్థను కాలరాసినవారితో భాగ్యస్వాములు కాలేదా? ఆరోజు చెప్పని ప్రవచనాలు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. అవినీతి రహితంగా ప్రభుత్వంగా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఆ వ్యవస్థ మీద విషం చిమ్మడం సిగ్గుచేటు. చంద్రబాబు చెబితే తప్ప మీకు అంతరాత్మ ఉంటే మాట్లాడగలరా? చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం, ఆయన ముఖస్తుతి కోసం, పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి ఓటు వేయాలని తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానన్న కౌరవుల్లో చంద్రబాబు దుర్యోధనుడి అయితే నువ్వు దుశ్శాసనుడివే కదా?

– కౌరవులు, పాండవులు అనేది అధికారంతో కాదు, లక్షణాన్ని బట్టి వస్తుంది. కౌరవుల దుష్ట పాలనలో కర్ణుడు భాగం అయ్యాడు కాబట్టే అతడిని ఎవరూ మెచ్చుకోరు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం మారుమూల ఉన్న సచివాలయం మొదలు పెట్టి.. చీఫ్‌ సెక్రటరీ ఉన్న సచివాలయం వరకూ కూడా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఇది జగన్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమం. ప్రభుత్వం నడిపే వ్యవస్థలో రోజువారీ సమస్యలు ఉంటాయి కాబట్టే వాటి పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం నడుపుతున్నారు. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించి, సమీక్ష జరిపి దానికి పరిష్కార మార్గాన్ని చూపుతున్నారు.

– పవన్‌ కల్యాణ్‌ మీరు చెప్పే మాటలకు అర్థం ఉండాలంటే ఎవరి దగ్గర అయితే షూటింగ్‌లకు అడ్వాన్స్‌ తీసుకున్నారో వారి షూటింగ్‌లుకు హాజరు అయితే బాగుంటుంది. అంతేకానీ దొంగ ప్రవచనాలు కట్టిపెట్టి అంతరాత్మ ప్రభోదానుసారం ఇప్పటికైనా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఆ తర్వాత చంద్రబాబు సేవలో తరిస్తే బాగుంటుంది. ప్రజల మనసులకు దగ్గరగా పరిపాలన అందిస్తున్నటువంటి జగన్‌ మోహన్‌ రెడ్డి కోసం 2024లో కూడా ప్రజలు మా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ప్లీనరీ సమావేశాల్లో తేటతెల్లం అయింది. ఎల్లో మీడియా నోటితో కూడా ప్లీనరీ దిగ్విజయం అయిందని చెప్పించిన పార్టీ ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నా.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
– సత్య కుమార్.. అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. వీళ్ళంతా ఆటలో అరటి పండ్లు. ఇలాంటివాళ్ళు కేరళ, తమిళనాడు, ఆంధ్రాలో చాలా మంది ఉంటారు.
– మీ అందరి సమక్షంలో చెబుతున్నాను, ఆటలో అరటి పండులారా వినండి… దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ మోహన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి, షెడ్యూల్ జాతులకు సంబంధించి ఒక మహిళా మూర్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెడుతున్నాం.. మీరు బలపరచాలని అడిగింది వాస్తవం. అలానే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జగన్ కి ఫోన్ చేసి రాష్ట్రపతి అభ్యర్థిని బలపరచండి అని అడిగిన మాట యథార్థం.
– ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి.. ముర్ము నామినేషన్ ను బలపరచడానికి స్వయంగా సంతకం ట్టడానికి రమ్మని ఆహ్వానం పంపిన మాట వాస్తవం కాదా..?. అదేరోజు కేబినెట్ మీటింగ్ ఉండటం వల్ల తాను రాలేనని అంటే, తన ప్రతినిధులుగా ఎవరినైనా పంపండి అని చెబితే, పార్టీ ప్రతినిధులుగా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డిని నామినేషన్ కార్యక్రమానికి జగన్ పంపారు. పార్లమెంటరీ ఎఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి .. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా. ?. నామినేషన్ కార్యక్రమానికి కేవలం 20 మందికి మాత్రమే అవకాశం ఉంటే.. 20వ పేరుగా విజయసాయిరెడ్డిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళింది వాస్తవం కాదా..?
– ఆటలో అరటి పండు లాంటి వాళ్ళు అవాకులు, చెవాకులు పేలితే.. మీకే శృంగ భంగం అవుతుంది. మీకు దమ్ముంటే.. రేపు మా ఓట్లని అడగటానికి రాష్ట్రానికి వస్తున్న ముర్ముని రాకుండా ఆపండి. మేము అంటరానివాళ్ళమే అయితే, ఇక్కడకు వస్తున్న ఆమెను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా.. ?
– మైకు దొరికింది కదా అని ఏది పడితే అలా మాట్లాడితే.. మీడియా ముందు మీరు జోకర్లుగా మిగిలిపోతారు.
– జగన్ మోహన్ రెడ్డిని జీవిత కాల అధ్యక్షులుగా ఎన్నిక చేసుకోవడం అనేది మా పార్టీ ప్రతినిధులు చేసిన తీర్మానం. విమర్శలు చేస్తున్నవారు, చేతనైతే అడ్డుకోండి.

LEAVE A RESPONSE