హ్యాపీ బర్త్ డే రాజా సాహెబ్
అశోకుడంటే
అలనాటి అశోకుడే..
ఆ చక్రవర్తి బాటసారుల
నీడ కోసం మొక్కలు నాటితే
ఈ మహనీయుడు
విద్యా విత్తనాలు వెదజల్లినాడు..
అంతేనా..
నీతికి చిరునామా..
నిజాయితీకి నిలువుటద్దం..
దేశంలో వర్తమాన
రాజకీయ యవనికపై
చెక్కుచెదరని ముద్ర..
నిబద్ధతనే పుస్తకంపై
చెరిగిపోని సంతకం..
అహంకారం తలకెక్కని
విజయాల పరంపర..
ఓటమినీ హుందాగా
స్వీకరించిన గొప్పతనం..
ఎంత ఎదిగినా
ఒదిగి ఉండే మహనీయత..!
విజయనగరం ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానాన్ని 1978లో ప్రారంభించి వరుసగా ఆరు విజయాలు సాధించి మంత్రిగా ఎన్నో శాఖలను నిర్వహించి ఇంచుమించు సీఎం నంబర్ టూ అనిపించుకున్న
అశోక్ గజపతి రాజు
ఏ దశలోనూ అహంకారం తలకెక్కించుకోలేదు.
రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే అశోక్ పదవులను
పెద్ద కిరీటాలుగా భావించలేదు. ఎప్పుడైనా గాని ఆయన వల్ల పదవులకు వన్నె వచ్చింది తప్ప వాటి వల్ల ఆయనకు కీర్తి వచ్చిందనడం తగదేమో. దేశంలోనే అత్యంత నిజాయితీపరుడుగా
పేరు గాంచిన అశోక్ తొలి రోజుల్లో ఎన్టీఆర్,తర్వాత చంద్రబాబు నాయుడుకు ప్రీతిపాత్రమైన వ్యక్తిగా వెలిగారు. మొన్న మోడీ సైతం అశోక్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి తన మంత్రివర్గంలో కీలకమైన పౌర విమానయాన శాఖను కేటాయించి పెద్ద పీట వేశారు. అంతే గాక టిడిపి కి,బిజెపికి చెడిపోయిన సందర్భంలో సైతం మోడీ అశోక్ ను తమతో ఉండి పోవాల్సిందిగా
కోరారనే వార్తలు
ఆయన నిబద్ధతకు
మరో రుజువు..
పివిజి రాజు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన అశోక్ గజపతిరాజు తదనంతర కాలంలో పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ వ్యక్తిగత ప్రతిష్ఠను ఏర్పరచుకున్నారు. ఈ రోజు వరకు ఆ గౌరవాన్ని, ఆ కీర్తిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.ఏ దశలోనూ నిగ్రహం కొల్పోక పోవడం రాజుకు గల మరో ప్రత్యేక లక్షణం.ఆయనకు గల అపప్రద ఒక్కటే..ప్రజలకు అందుబాటులో ఉండరని..నిజమే
ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారు కోరిన పనులు
అవి మంచివైనా గానీ, చెడ్డవైనాగానే చేసే విధానాలను అవలంబిస్తూ వారి నోళ్లలో నానుతున్నారు. మరి అశోక్ గజపతిరాజు మొదటి నుంచి ఆ వైఖరికి ప్రాధాన్య ఇవ్వలేదు.ఎవరు ఏ పని అడిగినా
చట్టం తన పని తాను చేస్తుంది
అంటూ దాట వేయడం
ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఈ ధోరణి పార్టీ వారికి సైతం కొంత మింగుడుపడనిదిగా తయారైంది. ఆ కారణంగానే ఆయన చాటుగా సొంత పార్టీ మనుషులు సైతం ఆయన వైఖరి పట్ల విమర్శలు చేసుకోవడం పరిపాటి అయిపోయింది.అయినా గాని అశోక్ వీటికి ఏ దశలోనూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. నిజాయితీకి మారుపేరైన తన వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన పనిచేశారు తప్ప ఏ దశలోనూ
ఏ విషయంలోనూ
రాజీ పడలేదు.
అశోక్ గజపతిరాజు అవలంబించిన ఈ వైఖరి కారణంగానే మొదట్లో ఆయన వెంట తిరిగిన అత్యంత నమ్మకస్తులు సైతం ఓ దశలో ఆయనను విడిచి వెళ్ళిపోయారు .ఇలా కొందరు ముఖ్య నేతలు ఆయనకు దూరం కావడంతో 2004 ఎన్నికల్లో ఆయన తొలిసారిగా పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. ఆ తర్వాత కొంతవరకు తన వైఖరిని మార్చుకుని ప్రజల మధ్యకు వచ్చి 2009 ఎన్నికల్లో గెలిచి మళ్లీ 2014 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడుగా గెలిచి కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషిస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన తర్వాత మరోసారి ఆయనకు ప్రజలకు దూరం మొదలైంది. ఈ దశలోనే 2019 ఎన్నికలు వచ్చాయి.ఈసారి మరింత పెద్ద పరాజయమే.ఆయనే గాక అరంగేట్రం చేసిన కుమార్తె అదితికి కూడా ఓటమి పాలయ్యారు..
అయినా రాజు రాజే..
ఏనుగు ఎప్పటికీ ఖరీదే అన్నట్టు అశోక్ గౌరవానికి భంగం ఏర్పడ లేదు.
విజయనగరం ప్రజలు ఎప్పుడూ అశోక్ గురించి గొప్పగానే చెప్పుకుంటారు.రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆయన నీతి నిజాయితీల చరిత్రను అబ్బురంగా చెప్పుకుంటారు.
వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ఓ మనిషికి ఇంతకంటే గౌరవం ఏముంటుంది..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286