– వైసీపీ ఎంపీకి చెందిన రాంకీ అంటే వణుకెందుకు?
– ఎసెన్షియా దుర్ఘటనలో 17 మంది మృతి
– సీఎం ఆదేశించినా ఫ్యాక్టరీస్ అధికారిపై చర్యలు కరవు
– ఒక్కసారి కూడా తనిఖీ చేయని నాటి ఫ్యాక్టరీ విభాగ అధికారి
– అయినా చర్యలు లేవు.. పైగా కీలక జోన్లో పోస్టింగ్
– కార్మికశాఖ పేషీలో చక్రం తిప్పుతున్న ఉల్లం‘ఘనులు’
– అటకెక్కిన వసుధామిశ్రా కమిటీ నివేదిక?
– వసుధామిశ్రా నివేదిక ఏం సిఫార్సు చేసింది?
– ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 60 రోజుల్లోనే నివేదిక
– నివేదిక వచ్చిన గంటలోనే పీసీబీ, ఫ్యాక్టరీ అధికారిపై చర్యలు
– ఎసెన్షియా ఘటనలో ఇప్పటికీ చర్యలకు దిక్కులేని వైనం
– రాంకీ, క్రెబ్స్, కెకెఆర్, సెయింట్ గొబైన్, సాయి శ్రేయాస్ కంపెనీలపై చర్యలేవీ?
– ఫార్మా దారుణాలపై ఎన్జీటీలో కేసు వేసిన సిఐటియు నేత
– అయినా ఇప్పటికీ ఫార్మా కంపెనీల్లో మార్పు రాని ధిక్కారం
– గన్నవరం సమీపంలోని పొలాల్లో విష వ్యర్ధాలు కుమ్మరించిన క్రెబ్స్, కెకెఆర్ కంపెనీలు
– ఎన్జీటికి ఫిర్యాదు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
– జనావాస ప్రాంతాల్లో విష పదార్ధాలు కుమ్మరిస్తున్న కంపెనీలు
– ఫార్మా కంపెనీలకు నోటీసులతో సరిపెట్టిన వైనం
– ఒక్కరిపైనా క్రిమినల్ కేసులు కట్టి అరెస్టు చేయని పిసిబి
– పేలుళ్లు, విషవాయువులతో బాల్చీ తన్నేస్తున్న బీదవర్గాలు
– డజన్లలో ప్రాణాలు పోతున్నా చర్యల కొరడా ఝళిపించని పీసీబీ
– మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత కొద్దిరోజులు హడావిడి
– మళ్లీ అధికారుల కథ ‘మామూలే’
– కొందరు పీసీబీ అధికారులకు కాసులు కురిపిస్తున్న ఫార్మా నేరాలు
– కళ్లుమూసుకున్న కార్మికశాఖ ఫ్యాక్టరీ విభాగం అధికారులు
– ఇంత జరుగుతున్నా తనిఖీలు చేయని మెంబర్ సెక్రటరీ
– పీసీబీ చట్టంలో మెంబర్ సెక్రటరీనే సర్వాధికారి
– అయినా అంటీముట్టని మెంబర్ సెక్రటరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
విశాఖ, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లోని ఫార్మా-సెజ్‌లలో ఫార్మా కంపెనీల నరమేధం నిర్నిరోధంగా కొనసాగుతోంది. ఫార్మా కంపెనీలు, కెమికల్ పరిశ్రమలు విడుదల చేసే విషవాయువులు.. వాటిలో జరుగుతున్న పేలుళ్లలో గత దశాబ్దకాలం నుంచి ఇప్పటికి వందలమంది కార్మికులు మృతి చెందితే, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకూ ప్రాణహాని తప్పని విషాదం. విష వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో సముద్రంలో కలపాల్సిన ఫార్మా కంపెనీలు.. వాటిని నేరుగా చెరువులు, పొలాల్లో కలిపేయడం ద్వారా పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు చర్యలు శూన్యం.
అసలు పీసీబీకి బాసుగా ఉన్న మెంబర్ సెక్రటరీ ఉన్నారా? లేరా అన్నదీ ఒక సందేహం. పీసీబీకి బాసు మెంబర్ సెక్రటరీనా? చైర్మనా అన్నది మరో సందేహం. కృష్ణాజిల్లా గన్నవరంలో కొద్ది నెలల క్రితం పొలాల్లో విష వ్యర్ధాలు కుమ్మరించిన క్రెబ్స్, కెకెఆర్ కంపెనీలపై ఇప్పటివరకూ చర్యల కొరడా ఝళిపించకపోగా.. విజయవాడకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే సౌజన్యంతో, రాయబేరాలు జరుగుతున్న వైచిత్రి.
ఇక అధికారుల తనిఖీలో అడ్డంగా పట్టుబడిన ‘రాంకీ’ ఫార్మాకు నోటీసులతో సరిపెట్టారే తప్ప, మిగిలిన కంపెనీల మాదిరిగా..ఎవరినీ అరెస్టు చే యలేదు. కంపెనీని సీజ్ చేయలేదు. ఇదో ‘ఫార్మా’నుబంధం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాంకీకి ఎదురులేదన్న దానికి ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. పీసీబీ ఇచ్చిన నోటీసుకు రాంకీ ఏమి వివరణ ఇచ్చిందన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
విశాఖను వదలకుండా అక్కడే తిష్టవేసిన పీసీబీ అధికారుల హవా.. పైవారితో వారికున్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఇక కార్మిక శాఖలోని ఫ్యాక్టరీ విభాగంలో, అక్కడి డిప్యూటీ చీఫ్ ఆ ప్రాంతంలో రారాజు. కంపెనీలు ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు. ఇలా రాస్తే రామాయణం.. చెబితే మహాభారతం.
రాజు కంటే మొండివాడు బలవంతుడయితే.. ఆ మొండివాడి కంటే జగ మొండి విశాఖ ఫార్మాకంపెనీలు. గాలి, నీరు, భూమిని చెరబట్టి.. వాటిని కలుషితం చేయడం ద్వారా, ప్రజల ప్రాణాలు తీస్తూ నిర్నిరోధంగా నరమేధం చేస్తున్న ఫార్మా-కెమికల్ కంపెనీలపై, చర్యల కొరడా ఝళిపించే మొనగాడే కరవవడం విచిత్రమే కాదు. విషాదం కూడా.
పర్యావరణ చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్న ఫార్మా-కెమికల్ కంపెనీలపై, పీసీబీ చర్యల కొరడా ఝళిపించడం లేదంటే.. వారిద్దరి ‘ఫెవికాల్’ బంధం ఎంత బలమైనది, ధృడమైనదో అర్ధం చేసుకోవడానికి మేధావి కానక్కర్లేదు. మెడపై తల ఉంటే చాలు. ఫార్మాసురుల అరాచకాలపై మీడియాలో వచ్చే కథనాలు, కార్మిక సంఘాల ఆందోళనలు, ప్రజల ఫిర్యాదులను కూడా లె క్కచేయడం లేదంటే.. ఫార్మా కంపెనీలకు, పీసీబీ-ప్రభుత్వంలోని పెద్ద తలలతో ఎంత అవినావభావ సంబంధాలున్నాయో అర్ధమవుతూనే ఉంది.
గత కొద్దినెలల క్రితం క్రెబ్స్ కంపెనీకి చెందిన విష వ్యర్ధాలను తీసుకున్న కెకెఆర్ అనే కంపెనీ, వాటిని సిమెంట్ కంపెనీలకు తరలించేబదులు.. దానిని గన్నవరం సమీపంలోని ఒక గ్రామంలోని పొల్లాల్లో పారబోసింది. ఫలితంగా అక్కడ ఎకరాల మేరకు భూమి విష తుల్యమయింది. దానిపై ఆగ్రహించిన పీసీబీ.. వారికి నోటీసులు ఇచ్చి నెలలవుతున్నప్పటికీ, ఇప్పటిదాకా ఎవరిపైనా చర్యలు లేవు.
పైగా నష్టనివారణ కోసం విజయవాడకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో రాయబారానికి తెరలేపి, భూమిని మళ్లీ యధావిధిగా మార్చేందుకు ఖర్చు కూడా తగ్గించే మయోపాయానికి దిగడమే ఆశ్చర్యం. భూమిని కలుషితం చేసిన ఆ కంపెనీలపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయకుండా, ఇంకా వారిచ్చే సంజాయిషీ కోసం ఓపికగా ఎదురుచూటడమే విచిత్రం. మరి ఇలాంటి వెసులుబాటు చిన్నా చితకా కంపెనీలకూ ఇస్తారా అన్నదే ప్రశ్న.
ఎసెన్షియా మారణహోమం నుంచి గుణపాఠం నేర్చుకోని పీసీబీ-ఫ్యాక్టరీ విభాగం
మీకు గుర్తుందా?.. 2024 ఆగస్టు 22న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్ ఫార్మా సిటీలో ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో చలించిన సీఎం చంద్రబాబు స్వయగా అక్కడికి వెళ్లి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. నష్టపరిహారం ప్రకటించి.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలన్నదానిపై, రిటైర్డ్ ఐఏఎస్ వసుధా మిశ్రాతో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనకు బాధ్యులైన అధికారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఆ తర్వాత చాలానెలలకు భేటీ అయిన వసుధా మిశ్రా మిటీ, తన నివేదికను సీఎస్‌కు సమర్పించారు. అందులో సిఫార్సు లేమిటి? ఘటనకు ఎవరిని బాధ్యులను చేశారన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అధికారిపై ఈగ కూడా వాలకుండా అప్పటి ఉన్నతాధికారి కాపాడంతోపాటు.. తర్వాత ఆదాయం వచ్చే జోన్‌కు బదిలీ చేయడం ఆశ్చర్యం.
నిజానికి కంపెనీలోని పైప్లైన్లు పాతబడిపోయాయి. లీకులు సరిచేసుకుని మార్చుకోమని, థర్డ్‌పార్టీ ఆడిట్ రిపోర్టు ఇచ్చింది. అయినా నాటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారి నిర్లక్ష్యం వహించారు. అసలు సదరు అధికారి ఒక్కసారి కూడా, ఆ కంపెనీలో తనిఖీలు చేయకపోవడమే ఆశ్చర్యం.
జగన్ జమానాలో ఏకంగా 12 మంది ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై, అదే హెలెవల్ కమిటీ సిఫార్సుల ప్రకారం.. నివేదిక వచ్చిన గంటలోనే పీసీబీ, అప్పటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్‌పై చర్యలు తీసుకున్నారు. గత దశాబ్దకాలంలో విశాఖ ఉమ్మడి జిల్లాలోని ప్యాక్టరీల్లో జరిగిన దుర్ఘటనలపై నాటి డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తీసుకున్న చర్యలేమిటన్నదానిపై, ఇప్పటివరకూ శాఖాపరమైన విచారణ కూడా లేకపోపోవడమే ఆశ్చర్యం.
రాంకీ… ఏ పాలకులు ఉన్నా రారాజే!
వైసీపీ ఎంపీకి చెందిన రాంకీ ఫార్మాపై ఇప్పటికి లెక్కలేనన్ని ఫిర్యాదులొచ్చినా.. దానిపై ఈగ కూడ వాలడం లేదంటే, ఆ కంపెనీ పలుకుబడి ఏమిటన్నది అర్ధమవుతూనే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైసీపీ ఎంపీకి చెందిన రాంకీకి, పీసీబీ సాగిలబడుతున్న వైనం పరిశీలిస్తే.. రాంకీపై చర్యల కొరడా ఝళిపించేందుకు, పీసీబీ చేతులు ఎలా వణికిపోతున్నాయో అర్ధమవుతూనే ఉంది.
అనకాపల్లి జిల్లా పరవాడ జెఎన్ ఫార్మాసిటీ డెవలపర్‌గా ఉన్న విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ (రాంకీ)కి చెందిన తాడికొండ ప్రాంతంలో ని రాంకీ ల్యాండ్ఫుల్ నిండిపోయింది. దానితో మరోచోట ఫార్మా ఘన వ్యర్థాలను నిల్వచేసినట్లు గుర్తించిన పీసీబీ, రాంకీకి నోటీసులు ఇచ్చింది. అయినా దానిపై ఇప్పటివరకూ చర్యలు శూన్యం.
తాడికొండలో మరో ల్యాండ్‌ఫిల్ కంచె నిర్మాణానికి 50 ఎకరాలు కేటాయించి, 2024 జనవరిలో ఆ మేరకు ఎమ్మార్వో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. ప్రజలు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్‌ఫిల్ నుంచి దుర్వాసన వస్తోంది. మళ్లీ కొత్త ల్యాండ్‌ఫిల్ వద్దంటూ తోట గ్రామస్తులు వ్యతిరేకించారు. నాటి నుంచి నేటి వరకూ ఉన్న ల్యాండ్‌ఫిల్ కేంద్రం నిండిపోతుందని తెలిసినా, రాంకీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు ఆక్రహం వ్యక్తం చేస్తున్నారు.
దానితో ఘన వ్యర్ధాల సేకరణ ప్రక్రియను రాంకీ నిలిపివేయడంతో ఫార్మాకంపెనీలకు దాని తరలింపు సమస్యగా మారింది. అయితే వాటిని నెల్లూరుకు తరలిస్తామంటున్న పీసీబీకి.. అందుకయ్యే రవాణా ఖర్చుపై ముందుచూపు లేకపోవడమే ఆశ్చర్యం. ఖర్చులు తడిసి మోపెడవుతాయని ఫార్మాకు వ్యర్ధాలు పంపిస్తున్న కంపెనీలు మొత్తుకుంటున్నాయి.
ఫార్మా సిటీ సమీపంలోని తానాం గ్రామం వద్ద, ఎకరానికి పైగా భూమి కొనుగోలు చేసి 2022లో చెరువు తవ్వించింది. అది గ్రీన్‌బెల్టు జోన్లో ఉన్నప్పటికీ, అక్కడ మొక్కలు పెంచకుండా రసాయన వ్యర్థ జలాల నిల్వకు, చెరువును తవ్వడంపై స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. దానితోపాటు చెరువు తవ్వకం పనులు ఆపాలని 2022లోనే తానాం పంచాయితీ గ్రామసభలో తీర్మానం చేశారు. అయితే అప్పటికే ఆ చెరువు నీళ్లు తాగిన మూగజీవాలు భారీ సంఖ్యలో మృతి చెందాయి. మరి ఆ విషాదానికి మూల్యం చె ల్లించేదెవరన్నదే ప్రశ్న. తప్పెవరిది? శిక్ష ఎవరికి? వీటికి సమాధానం ఇచ్చేదెవరు?
చెరువుల్లో వ్యర్థాలు- ప్రజల ప్రాణాలతో చెలగాటం
రాంకీ సంస్థకు పీసీబీ ఇటీవల ఒక నోటీసు ఇచ్చింది. ఎందుకంటే.. వర్షాకాలంలో ఫార్మాసిటీలో రసాయన వ్యర్థాలను, బయటకు విడిచిపెడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదులు చేశారు. సీఐటియు నేత గనిశెట్టి సత్యనారాయణ దానిపై స్థానికులతో కలసి ఆందోళన నిర్వహించారు. దీనివల్ల పరవాడ, భరణిక చెరువులు, గెడ్డలు కలుషితమవుతున్నాయని, చెరువుల్లో చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
గత మేలో రసాయన వ్యర్థ జలాలు బయటకు వదిలేసిన నేపథ్యంలో.. అవి భరణికం, మొల్లోడుగెడ్డలోకి చేరిన సందర్భంలో స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకోలు చేశారు. కలెక్టర్, పీసీబీకి ఫిర్యాదు చేశారు. రాంకీ ఎన్నిసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోకుండా, వారితో కుమ్మక్కవుతున్నారంటూ, పీసీబీ అధికారులపై ఆరోపణలు గుప్పించారు.
దీనితో రంగంలోకి దిగిన పీసీబీ.. గెడ్డలో నీటి నమోనాను ల్యాబ్‌కు పంపించగా, అందులో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి) అధికంగా ఉన్నట్లు గుర్తించి, రాంకీకి నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటిదాకా రాంకీపై చర్యలు తీసుకోలేదంటే.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీకి ఎంపీకి చెందిన రాంకీ ఫార్మా హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతూనే ఉంది.
తాడికొండలో నిబంధనలకు విరుద్ధంగా రాంకీ వ్యర్ధాల నిల్వ
రాంకీకి ముకుతాడు వేసే మొనగాడు లేనందున.. ఆ కంపెనీ ఇతర ప్రాంతాల్లో సైతం నిర్భయంగా, తన రసాయన వ్యర్థాలను నిల్వ చేస్తున్న బేఖాతరిజం అక్కడ దర్శనమిస్తోంది. తాడికొండలోని రాంకీ ల్యాండ్‌ఫిల్ నిండిపోవడంతో, సమీపంలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (సిడబ్ల్యుఎంపి) షెడ్లకు వెనుక భాగంలోని షెడ్లలో, నిబంధనలకు విరుద్ధంగా వందల టన్నుల ఘన వ్యర్ధాలను నిల్వచేయడంపై స్థానికులు, కార్మిక సంఘాలు విరుచుకుడ్డారు.
అది మీడియాలో రావడంతో దిగివచ్చిన పీసీబీ అధికారి ముకుందరావు, రాంకీ కంపెనీకి నోటీలు జారీ చేశారు. అయితే ప్రజాసమస్యకు సంబంధించిన ఇంత కీలకమైన అంశం వివాదమయిన నేపథ్యంలో.. రాంకీ ఇచ్చిన జవాబు ఏంటి? మళ్లీ దానిపై పీసీబీ రిమార్కు ఏమిటన్నది.. నోటీసులు ఇచ్చినట్లు చెప్పిన పీసీబీ అధికారి ముకుందరావు ఇప్పటిదాకా మీడియాకు వెల్లడించకపోవడం సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది.
నిజానికి ఈ అంశంపై స్థానికులు భయాందోళనతో ఉన్న నేపథ్యంలో.. తాము రాంకీకి ఇచ్చిన నోటీసు, దానికి రాంకీ ఇచ్చిన సమాధానాల వివరాలను పీసీబీ అధికారి ముకుందరావు మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించటం ద్వారా, స్థానికులకు ధైర్యం చెప్పాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఇప్పటివరకూ, ఆయన రాంకీ ఇచ్చిన జవాబును ప్రజలకు చెప్పకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని, సీఐటియు నేత గనిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు.
‘ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న పీసీబీ అధికారి జరుగుతున్న వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారు? అసలు రాంకీకి ఆ అధికారి ఏం ప్రశ్నలు వేశారు? ఎలాంటి సాంకేతికపరమైన ప్రశ్నలు వేశారు? ఎందుకంటే రాంకీ చర్యలకు సంబంధించిన కీలక ప్రశ్నలను పీసీబీ అడిగిందా? లేదా? వాటికి రాంకీ ఏం వివరణ ఇచ్చిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అయినా రాంకీ వివరణను మీడియా ద్వారా వెల్లడించకుండా, రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావడం లేద’’న్నారు.
మెంబర్ సెక్రటరి ఎక్కడ?
కాగా పీసీబీకి మెంబర్ సెక్రటరీ సర్వాధికారి. గతంలో పనిచేసిన మెంబర్ సెక్రటరీలు పీసీబీలో చురుకుగా వ్యవహరించేవారు. వెంటవెంటనే నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ప్రస్తుత మెంబర్ సెక్రటరీ చురుకుగా వ్యవహరించడం లేదని, అందుకు ఆయనకు మరో రెండు శాఖల బాధ్యత ఉండటంతో, పని ఒత్తిడి వల్ల మెంబర్ సెక్రటరీ పీసీబీపై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు.
పీసీబీ చట్టం-ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం… రోజువారీ వ్యవహారాల్లో సెక్రటరిదే బాధ్యత. అయితే నామినేటెడ్ పదవి అయిన చైర్మన్‌కు తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ, చర్యలు తీసుకునే అధికారం మాత్రం మెంబర్ సెక్రటరీదేనని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
చైర్మన్‌కు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్బోర్టు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడం, పీసీబీ స్టాండర్డ్స్ మీద సలహాలు ఇచ్చి, దానిని మార్చవచ్చు. కొత్తగా వచ్చే పద్ధతులపై రీసెర్చ్, శిక్షణ, పీసీబీపై ప్రజల్లో చైతన్యం పెంచే సద స్సుల ఏర్పాటు, గాలి, నీరు, భూమి, శ బ్ధకాలుష్యానికి సంబంధించి నియంత్రించే అంశాలపై బోర్డుకు సలహాలు ఇవ్వవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్స్ ఇవ్వవచ్చు. ఇదీ పీసీబీ చైర్మన్ పాత్ర.
ఇక మెంబర్ సెక్రటరీ ఎన్విరాన్మెంటల్ చట్టాలను పరిర క్షించడం, రోజువారీ వ్యవహారాలపై కసరత్తు, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంది. అంటే చర్యలు తీసుకునే అధికారం పూర్తిగా మెంబర్ సెక్రటరీదేనన్నమాట.
అయితే చైర్మన్ పి.కృష్ణయ్య పీసీబీ వ్యవహారాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కార్యాలయానికి వెళుతున్నారు. కానీ మెంబర్ సెక్రటరీ మాత్రం, తనకు మిగిలిన శాఖల బాధ్యత ఉండటంతో, ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నందున.. కీలకమైన పీసీబీ పూర్తిస్థాయి అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమించాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.