కలమే కలకలమై..
సంచలనమే కులమై..
పత్రికతో అక్రమార్కులకు
చిత్రీ పట్టి..
భయానికి సెలవిచ్చి..
ఒత్తిళ్లకు లొంగక..
తన పొత్తిళ్ళలో
ఎన్నో సంచలనాల
సంకలనాలను
నింపి..పెన్నుతో ఒంపిన
పింగళి దశరథరామ్..
ఎన్నోసార్లు చావుతప్పినా
కన్నులొట్టపోక
పెన్నును గన్నుగా మలచి
హత్యకు వెరవని
నిత్య వార్తాహాళికుడు..
‘కల’యుగ వైతాళికుడు..
ఈ పింగళి వెంకయ్య మనవడు..
వెరపు ఎరుగని మానవుడు..
అక్రమార్కుల పాలి దానవుడు..!
ఎన్ కౌంటర్..
అదేమి మ్యాటర్..
చదివిస్తూ బార్ బార్..
భాష మొరటైనా..
కాలేదు వెగటు..
ఎప్పుడు పేలుతుందో బాంబు
అనడానికి లేదు..
ప్రతి సంచికా
ఓ బాంబుల ఫ్యాక్టరీ..
అయితే ఎప్పుడు ఎవరి గురించో స్టోరీ..
మొత్తంగా పత్రికే హిస్టరీ..
చివరకు ఆయన
మరణమే మిస్టరీ..!
నాయకుల అరాచకాలు..
గుండాల కీచకాలు..
ఎమర్జన్సీ ఘాతుకాలు..
అసెంబ్లీ నాటకాలు..
రాజకీయుల కులగోత్రాలు..
అక్రమార్కుల కుతంత్రాలు..
మొత్తానికి చిత్రాలు
ఎన్ కౌంటర్ బట్టబయలు
చేసిన బాగోతాలు..!
ఇందిరమ్మ నుంచి
ఎన్టీఆర్ వరకు..
మంత్రి మొదలు
గ్రామాల్లో ప్రతి కంత్రి..
నాయకుల బాజాభజంత్రి..
అక్రమాలు..పరాక్రమాలు..
ఆక్రమణలు..అతిక్రమణలు..
ప్రతి న్యూసెన్సూ న్యూసే..
ఆ పత్రికలో ఏమొచ్చినా
అది పెద్ద ఊసే..!
భాష అభ్యంతరకరమే..
రాసే విధానం నిర్భయంతరకరమే..
ఆయనకు నిరభ్యంతరకరమే..
నిండా కూరిన కారమే..
తెలిసింది రాయడమే..
బరువు మోయడమే..
బాబాల గుట్టుమట్లు..
క్షుద్రపూజల గట్టురట్లు..
నాయకుల ఫేవరెట్లు..
ఫేవర్ల రేట్లు..
ఇవన్నీ రాస్తే పెరిగిపోదా
సర్క్యులేషన్ వేల రెట్లు..!
అప్పుడు తప్పవు కదా
శత్రువుల వేట్లు!!
పాలకుల ఆ’దేశ’..’మంట’..
ఖాకీలు జీహుజూరంట..
పక్కా రెక్కీ..
ఎక్కీతొక్కీ..
చచ్చేవరకు చంపారట..
రాక్షసకేళి పాళీ విరిచింది..
భయం ఎరుగని కలం
అంతకు ముందు వరకు
రాసి రంపాన పెట్టి
గర్వంగా నేలకొరిగింది..!
ఎర్రటి సిరాతో
తెలుగు గడ్డను
తడిపేస్తూ..
ఊపిరి విడిచే వరకు
అక్రమాలను కడిగేస్తూ..!!
ఈఎస్కే