Suryaa.co.in

Telangana

పిచ్చి ప్రేలాపనలు మాని చేప పిల్లల పంపిణీ పై దృష్టి సారించండి

– మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ పిట్టల రవీందర్

హైదరాబాద్: కొత్తగా పదవిలోకి వచ్చిన ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నరు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మీద దృష్టి పెట్టడం మానేసి అవాకులు, చెవాకులు పేలుతున్నారు. హరీశ్ రావు, తలసాని మీద వ్యాఖ్యలు చేస్తే వార్తల్లో నిలవచ్చనే ఉద్దేశ్యంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న హరీశ్ రావు మీద వ్యాఖ్యలు చేసే స్థాయి నీది కాదన్న విషయం గుర్తించు. చేపల పంపిణీని ఆలస్యం చేసి, చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని నిందలు వేస్తున్నారు.

కుంటి సాకులు వెతుకుతున్న మీ పాలన విధానంపై మత్స్యకార కుటుంబాలు దుమ్మెత్తి పోస్తున్నా చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటు. 60ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ మత్స్యరంగం దారుణ వివక్షకు గురైతే, కేసీఆర్ గారు పదేళ్ల పాలనలో మత్సరంగాన్ని అభివృద్ధికి దేశానికి ఆదర్శంగా నిలిపారు.

తెలంగాణ మత్స్య సంపద విలువ 2014-15లో 2,60,010 టన్నులు కాగా, 2023-24లో 4,39,513 టన్నులు. తెలంగాణ మత్స్యకారుల ఆదాయం నాడు రూ. 2,431 కోట్లు కాగా, 2023-24 నాటికి రూ. 6,514 కోట్లు.

ఇవి మేము చెబుతున్న లెక్కులు కాదు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ -2024 నివేదికలోని పేజీ నెంబర్ 45లో పేర్కొన్న లెక్కలు. ఇది బీఆర్ఎస్ ఘనత, ఇది కేసీఆర్ సాధించిన విజయం. చెరిపేస్తే చెరిగిపోని సత్యాలు ఇవి. మత్స్య రంగం పై ఆధారపడి జీవిస్తున్న సోదరులకు అనుభవంలో ఉన్న వాస్తవం.

చేపల ఉత్పత్తిని పెంచి నీలి విప్లవానికి నాంది పలికారు కేసీఆర్ . కానీ, పది నెలల్లోనే ఆ ఖ్యాతికి మకిలి పట్టించే ప్రయత్నం చేశారు. మత్స్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చి మత్స్య రంగంపై ఆధార పడ్డ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నూతన రిజర్వాయర్ల నిర్మాణం, బ్యాక్ వాటర్ పెంపు జరగగా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించారు.

రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేసారు. 33 కొత్త జిల్లాల వారీగా మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. 25గా ఉన్న సొసైటీలను అడ్డుగా ఉన్న నిబంధనలు తొలగించి 6,500కు పెంచారు. సభ్యుల సంఖ్యను నాలుగు లక్షలకు పెంచారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మత్స్య రంగానికి గ్రహణం పట్టింది. కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. పది నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఈ రంగానికి స్మశాన వైరాగ్యం పీడిస్తున్నది. ఎన్నికల హామీలు అమలు చేయరు. బిఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పథకాలను కొనసాగించరు, కానీ ఇష్టం ఉన్నట్లు నోరుపారుసుకుంటరు.

ప్రజా పాలన అంటూ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారు. హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద అడ్డగోలుగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.పిచ్చి ప్రేలాపనలు మాని చేప పిల్లల పంపిణీ పై దృష్టి సారించాలని, లేదంటే మత్స్య కుటుంబాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నా.

LEAVE A RESPONSE