* ఆకుకూరల సాగు కి రోబోల తోడ్పాటు
* మానవ రహిత వ్యవసాయ లక్ష్యసాధనలో తొలి అడుగు
– ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య
హైదరాబాద్: పిజెటిఏయు పరిధిలోని అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈరోజు 15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు గుర్తింపు పత్రాలని ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అందజేశారు. ఈ సంస్థలు పిజెటిఏయు అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ లో విజయవంతంగా సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నాయి. అగ్రి హబ్ తరఫున ఇప్పటికి సుమారు 150 అంకుర సంస్థలకు నాబార్డ్ సహాయంతో తోడ్పాటు నందించామని జానయ్య వివరించారు.
ఇందులో భాగంగా కూరగాయల సాగులో మానవ ప్రమేయం తగ్గించి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించిన రోబో ని అల్దాస్ జానయ్య ఈ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు చేయూతనందించే కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారాన్ని ఆరుగురికి అందజేశారు. అంతేకాకుండా మరో రెండు అంకుర సంస్థలకు ఒక్కొక్క దానికి 40 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం పిజెటిఏయు అగ్రి హబ్ ద్వారా అందజేశారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ గా రూపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని అల్థాస్ జానయ్య అన్నారు. ఆ వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. దేశ సంపద మూలాలు ఈనాటికీ గ్రామీణ భారతంలో, వ్యవసాయ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నందున ఈ రంగాలకి పెద్దపీట వేసి వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నాబార్డ్ డీజీఎం దీప్తి, వుయ్ హబ్ ప్రతినిధి సీత, పిజెటిఏయు రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ సీహెచ్ విద్యాసాగర్, ఏజీ హబ్ ఎండి జి. వెంకటేశ్వర్లు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.