ఎన్నికలకు వ్యూహకర్తలు అవసరమా? వాళ్లెవరు? ఏమి చేస్తారు? ప్రజల అభిప్రాయాన్ని మార్చగలరా?ప్రజల ఆలోచనలను హైజాక్ చేయగలరా ? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్.ఈ హాట్ టాపిక్ కు కేంద్రబిందువు పీ.కే.రాజకీయ నాయకులకన్నా గొప్ప వ్యూహకర్తలు ఎవరు ఉంటారు? ప్రజలనుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకన్నా ప్రజానాడిని ఎవరు పసిగట్టగలరు? కానీ ‘ప్రజానాడి’ని తాము పసిగట్టగలమనీ,తమ దగ్గర బోలెడు మాయోపాయాలున్నాయనీ ఎన్నికల ‘మేనేజర్లు’ అంటున్నారు.దశాబ్దం క్రితం వరకు రాజకీయేతర మేనేజర్లు/వ్యూహకర్తలు లేరు.
సోషల్ మీడియా విజృంభణతో పాటే ఈ ‘మేనేజర్ల విజృంభణ’ కూడా పెరిగిపోతున్నది. చంద్రబాబు, వైఎస్.రాజశేఖర రెడ్డి, జయలలిత వంటి నాయకులు ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగారు? 2014 నుంచి తెలంగాణలో కేసీఆర్ అప్రతిహత విజయాలను ఎట్లా సొంతం చేసుకోగలుగుతున్నారు?వీళ్ళ వెనుక ‘నాన్ పొలిటికల్ మేనేజర్లు’ పనిచేశారు? ప్రజల ఆకాంక్షలు ఏమిటో,తమ సాఫల్య-వైఫల్యాలు ఏమిటో నిరంతరం ప్రజల్లో ఉండే రాజకీయనాయకులకు మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం సీన్ మారిపోయింది.
ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లేందుకు ఎలక్షనీరింగ్ మేనేజర్ లు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడున్న సమస్యలు, ఎన్నికల సమీకరణాలు,ప్రజల మూడ్‌ను గుర్తించడంలో ఎన్నికల నిర్వాహకులు ముందుంటున్నారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారికి రాజకీయేతర ‘మేనేజర్ల’ అవసరం లేదన్న అభిప్రాయం ఒకటి ప్రబలంగా ఉన్నది.ప్రజల్ని ఆకట్టుకునే కళలో ఆరితేరిన వారికి వ్యూహకర్తలతో పని లేదన్న వాదన ఉన్నది. తాము గెలవలేమని భావించినప్పుడో,గెలుపై అనుమానాలున్నప్పుడో ఎన్నికల వ్యూహకర్తలను ఆశ్రయించక తప్పదని కొందరంటున్నారు.
2024 ఎన్నికలలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాం ఏర్పడితే తాను ‘కింగ్ మేకర్’ కావాలని ప్రశాంత్ కిశోర్ ఆకాంక్షిస్తూ ఉండవచ్చును. ఆయన కోరుకుంటే రాజ్యసభ సభ్యునిగా పశ్చిమ బెంగాల్,తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి సులభంగా ఎన్నిక కావచ్చు.కానీ అంతటితో ఆయన ‘అధికార కాంక్ష’ సమసిపోయేలా లేదు. ప్రశాంత్ కిశోర్ గొప్ప ఇంద్రజాలికుడేమి కాదు. ఆ మాటకొస్తే ఏ వ్యూహకర్త కూడా ఇంద్రజాలికుడు కాజాలడు.
”సొంత బలం లేకుంటే మమ్మల్ని ఎవరూ గెలిపించలేరు.ప్రశాంత్ కిశోర్ అయినా,మరెవరైనా సరే తీర్పును తారుమారు చేయలేరు.నవతరానికి తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ కాంట్రిబ్యూషన్ గురించి అవగాహన లేదు.కనుక సోషల్ మీడియా పరంగా, సాంకేతికంగా వేగంగా మారుతున్న సమాజంలోని పరిస్థితులను అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది.సామాజిక మార్పులను గమనంలోకి తీసుకోవలసి ఉన్నది.మా దగ్గర సరుకు లేకపోతే మీడియా గానీ, స్ట్రాటజిస్టులు కానీ ఎవరూ ఏమీ చేయలేరు”. అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగైదు రోజులుగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూ లలో కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
సూటిగా, సుత్తిలేకుండా, నిర్మొహమాటంగా,నిష్కర్షగా మాట్లాడడంలో కేటీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ”తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తే మేము ఇంటికి వెళతాం” అని కూడా కేటీఆర్ అంటున్నారు. ఇలా మాట్లాడడానికి,విషయాలు వివరించడానికి తగిన హోమ్ వర్కుతో పాటు సాహసమూ ఉండవలసిందే! గడచినా పదహారేళ్ళలో కేటీఆర్ చాలా పరిణతి సాధించినట్టు ఆయన మాటల ద్వారా తేటతెల్లమవు తున్నది.తండ్రి కేసిఆర్ భాషా ప్రావీణ్యం కూడా కేటిఆర్ కు పట్టుబడినది.
ప్రశాంత్ కిశోర్‌లాంటి ‘ఎన్నికల మేనేజర్’ల ప్రాబల్యం పెరుగుతుండటం భారత రాజకీయాల పతనానికి నిదర్శనంగానే కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.రాజకీయ పార్టీలలో మేనేజర్లుగా వ్యవహరించే వారికి సహజంగానే అధికారాలు పెరుగుతున్నవి.ఎలక్షన్ మేనేజర్లను నమ్ముకుని రాజకీయ నాయకులు చాలామంది క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూడటం లేదన్నా విమర్శలూ ఉన్నవి.ఎన్నికల్లో గెలుపే పరమావధి అనే ధోరణితో రాజకీయపార్టీలు పని చేస్తున్నందున దానికోసం ఆయా పార్టీలు ఎలాంటి ‘దిగజారుడు’ పనులకైనా వెనుకాడబోరన్న నింద చాలా కాలంగా ఉన్నదే.
ప్రశాంత్ కిశోర్ కానీ మరొక ‘వ్యవహకర్త’ కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తారు.ప్రతి చిన్న విషయాన్ని కూడా వారి బృందాలు తెలుసుకోగలుగుతారు. ప్రచారంలో నాయకులు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆ బృందమే నిర్ణయిస్తుంది.ఎన్నికల నినాదాలను,ప్రచార అస్త్రాలను ‘వ్యూహకర్త’ల బృందం ఖరారు చేస్తుంది. కాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది.2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సలహాదారుగా ఆయన పనిచేశారు.ఇప్పుడు కాంగ్రెస్ తరపున కేవలం వ్యూహకర్తగా కాకుండా నేరుగా ఆ పార్టీలో చేరి సలహాలు ఇచ్చే పాత్రను పోషించనున్నారు. ”ఇకపై ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెంట్ పాత్రను పోషించను” అని 2021మే 2 న ఒక టీవీ ఇంటర్వ్యూలో పీకే చెప్పారు.రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రశాంత్ కిశోర్ పక్కా ‘పెయిడ్ ప్రొఫెషనల్’. డబ్బులు తీసుకుని వ్యూహాలు అందిస్తారు.ఆయనకో పెద్ద ‘రీసెర్చ్ టీమ్’ ఉంది.ఆయన ఎప్పుడూ ఒకే పార్టీకి పని చేయరు.పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన సలహాలు ఇచ్చారు. అక్కడ మమతా బెనర్జీ ఘన విజయం సాధించడంతో ఆయన పేరు మరోసారి మారుమోగింది.ఆయన సలహాల వల్లే మమతా బెనర్జీకి అంతటి విజయం సాధ్యమైందని భావించడం కరెక్టు కాదు.మూడు దశాబ్దాలకు పైగా బెంగాల్ ను పాలించిన లెఫ్ట్ పార్టీలు తమ ఉనికి కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అక్కడ ” వాక్యూమ్ ‘ ఏర్పడింది. అందువల్ల మమతా బెనర్జీకి ప్రజాదరణ లభిస్తున్నది.
ప్రశాంత్ కిశోర్ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, వై.ఎస్.జగన్, ఎం.కె.స్టాలిన్‌లాంటి నాయకులకు ‘ప్రొఫెషనల్ పొలిటికల్ మేనేజర్’గా సలహాలు, సూచనలు అందించారు.ఆయన కాంగ్రెస్ లో చేరే ముహూర్తం దాదాపు ఖరారైనందున ఆయన అధిపతిగా ఉన్న ‘ఐ ప్యాక్ ‘తో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు.జగన్,నితీష్,స్టాలిన్,మమత వంటి వారు పీకే మంత్రబలం వల్ల గెలవలేదు.వాళ్ళు గెలవడం వెనుక అక్కడి ప్రత్యర్థుల బలహీనతలు తదితర అంశాలు కీలకంగా పనిచేశాయి.
గతంలో కాంగ్రెస్-సమాజ్‌వాది కూటమికి పీకే వ్యూహకర్తగా వ్యవహరించినా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది.పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురైనప్పటికీ మమతా బెనర్జీ సాధించిన ఘన విజయం ప్రశాంత్ కిశోర్ ప్రాధాన్యాన్ని పెంచింది.ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఎన్సీపీ నేత శరద్ పవార్‌తోపాటు, మరికొందరు కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు జరిపారు. 2024 ఎన్నికల్లో మోదీకి పోటీగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం చాలా కష్టమైన పని.కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు.
”కాంగ్రెస్ పార్టీ డ్రాయింగ్ రూమ్ పార్టీగా మారిపోయింది” అని ప్రణబ్ ముఖర్జీ గతంలో ఒకసారి తనకు చెప్పారని ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు గుర్తు చేస్తున్నారు.అది ముమ్మాటికీ నిజం.పార్టీ సామాన్యులకు దూరమైంది. సామాన్యులు పార్టీకి దూరమయ్యారు. దళితులు, బిసిలు,బహుజన వర్గాల ఓటు బ్యాంకులు ఒకప్పుడు కాంగ్రెస్ కు ‘కంచుకోట’గా ఉండేవి.కానీ కాంగ్రెస్ పార్టీ ‘పురాతన’ విధానాలతో ఆయా వర్గాలన్నీ బీజేపీ వైపునకు మళ్లినట్టు గడచిన పదేండ్ల ఫలితాలు,పరిణామాలు రుజువు చేస్తున్నవి.

ఎడిటర్, బంకర్‌న్యూస్