– ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహాలు
– డీపీఆర్ రూపకల్పనలో అధికారులు నిమగ్నం
– దాదాపు 1,086 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదన
ప్రకాశం: జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో దిల్లీ నుంచి ప్రత్యేక బృందం కొత్తపట్నంలో పర్యటించారు. ప్రతిపాదిత నమూనాలో కొద్దిపాటి మార్పులను చేపట్టి విమానాశ్రయ ఏర్పాటు సాధ్యమేనని వారు సానుకూలతను వ్యక్తం చేశారు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని (ఏపీఏడీసీఎల్) ప్రకటన వెలువరించింది. డీపీఆర్ రూపకల్పన పూర్తయితే భూసేకరణ దిశగా అడుగులు పడనున్నాయి.
1,086 ఎకరాల సేకరణకు ప్రతిపాదన
విమానాశ్రయం మొదటి దశ నిర్మాణం కోసం 657 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ శాఖాధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో సుమారు 551 ఎకరాలు వాన్‌పిక్‌కు సంబంధించిన భూమి కాగా, 103 ఎకరాలు పట్టా భూమి, 12 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. మొదటి విడత భూ భూసేకరణకు సుమారుగా రూ.102 కోట్ల పరిహారం అవసరం కానుందని అధికారులు లెక్కలు తేల్చారు. అందుకు అనుగుణంగా భూ వివరాలను సబ్‌డివిజన్ వారీగా పరిహారాన్ని ఎంతెంత ఇవ్వాలనేది ప్రభుత్వానికి నివేదించారు. జనవరిలో కొత్తపట్నం మండలం అల్లూరుకు వచ్చిన కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులను ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి విమానాశ్రయం ఆవశ్యకతను వివరించారు.
విమానాశ్రయానికి ప్రతిపాదించిన ప్రాంతానికి సంబంధించి మ్యాపును పరిశీలించిన కమిటీ సభ్యులు కొన్ని మార్పులను సూచించారు. ఈ మేరకు విమానాశ్రయం ఏర్పాటు సానుకూలమేనన్న అభిప్రాయాన్ని కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు భూ సేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి మొత్తం 1,086 ఎకరాలు అవసరమని తేల్చారు. కొత్తపట్నం మండలంలోని గ్రామాల వారీగా ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉందనేది గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ భూమి ఎంత? పట్టా భూమి ఎన్ని ఎకరాలు, మొదలైన తదితర వివరాలను నమోదు చేశారు.
డీపీఆర్ వస్తే వేగంగా పనులు
ఏపీఏడీసీఎల్ ప్రకటన శుభపరిణామని జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. డీపీఆర్ పూర్తయితే తదుపరి భూసేకరణ దిశగా అడుగులు పడతాయని గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు భూ సేకరణకు ప్రకటన ఇస్తామని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకాధికారిని నియమిస్తాం. గ్రామాల వారీగా వివరాలను ఇప్పటికే సేకరించాం. పరిహారం ఎంతనేది అంచనా వేస్తామని వివరించారు.
ఒంగోలు ఎయిర్‌పోర్టుకు అనుకూలం
వాణిజ్య పరంగా ప్రకాశం జిల్లాకు గుర్తింపు ఉంది. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్, పొగాకు వంటి అంతర్జాతీయ వ్యాపారాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధిని పొందేవారి సంఖ్య గణనీయంగా ఉంది. సమీపంలో రామయ్యపట్నం పోర్టు నిర్మాణం జరగడం, దీనికి తోడు సముద్ర తీరం కూడా అతి సమీపంలో ఉండటం వంటి మొదలైన కారణాల వల్ల ఒంగోలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అన్ని విధాలా అనుకూలమని ప్రజాప్రతినిధులు పట్టుమీద ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలను కలిసి విన్నపాలను అందించారు