-పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణకు ముంపు
-భద్రాచలం, పర్ణశాలలు కూడా ముగిపోతాయి
-తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్
ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో ఏకంగా లక్ష ఎకరాల మేర పొలాలు మునకకు గురవుతాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల ఎకరాల్లో పంటలతో పాటు భద్రాచలం, పర్ణశాల నీటిలో మునిగిపోతాయని ఆ శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలవరం బ్యాక్ వాటర్ కారణంగానే ఈ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని రజత్ కుమార్ తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల కలిగే నష్టంపై అధ్యయనం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు నివేదించామని ఆయన తెలిపారు. అయితే ఈ అధ్యయనంపై ఇప్పటిదాకా కేంద్రం నుంచి స్పందన రాలేదని కూడా రజత్ కుమార్ చెప్పారు. పోలవరం వల్లే భద్రాచలం మునిగిపోయిందని తెలంగాణకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం, వాటిపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో రజత్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.