– ఏపీలోనూ తెలంగాణ తరహా ట్యాపింగ్ గత్తర
– తెలంగాణలో నాడు వెలమ అధికారులతో ఫోన్ ట్యాపింగ్
– ఏపీలో రెడ్డి సామాజికవర్గ అధికారులతో ట్యాపింగ్ ఆరోపణలు
– బాబు, లోకేష్, పవన్, పురందేశ్వరి, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు
– లోకేష్ ఐఫోన్‌కు ట్యాపింగ్-హ్యాకింగ్ మెసేజ్‌తో బయటపడ్డ వైనం
– డీజీపీ, ఏడీజీ సహా అడిషనల్ ఎస్పీలపై కూటమి ఫిర్యాదు
– వారి పేర్లతో సహా ఈసీకి ఫిర్యాదు
– మంత్రుల ఫోన్లపైనా నిఘా ఉంచారన్న ఆరోపణలు
– తెలంగాణ దారిలో ఏపీలోనూ ‘పోలీసు దొంగచెవుల’ దుమారం
– సీరియస్‌గా తీసుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం
– ముఖేష్ పనితీరుపై ఎన్డీఏ అసంతృప్తి
– ట్యాపింగ్ కేసులో వేటు పడేదెవరికో ?
ఇప్పటివరకూ తెలంగాణకే పరిమితమైన పోలీసు ‘దొంగచెవుల’ పంచాయితీ ఇప్పుడు ఆంధ్రాకూ పాకింది. తెలంగాణలో నాటి విపక్షనేత రేవంత్ సహా, సొంత పార్టీ వారిపైనే కేసీఆర్ సర్కారు ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలు, అడ్డంగా దొరికిపోయిన పోలీసు అధికారుల అరెస్టుతో బట్టబయలయింది. అందులో బీఆర్‌ఎస్ సుప్రీం సహా ఒక ఎమ్మెల్సీ ఇద్దరు మాజీ మంత్రులున్నారన్న వార్త గత్తర సృష్టిస్తోంది. ఇప్పుడు సేమ్ టు సేమ్.. ఏపీలోనూ అలాంటి ట్యాపింగ్ గత్తరకు తెరలేచింది. తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఫోన్ ట్యాపింగ్‌ను తన వెలమ వర్గానికి చెందిన అధికారులతో చేయిస్తే.. ఏపీలో జగన్ సర్కారు.. తన రెడ్డి వర్గ అధికారులతో ట్యాపింగ్ చేయించిందన్నది ఎన్డీఏ ఆరోపణ.
విపక్ష నేత చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన దళపతి పవన్, టీడీపీ యువనేత లోకేష్ ఫోన్లు ట్యాపింగ్, హ్యాకింగుకు గురవుతున్నాయంటూ కూటమి వేసిన పొలికేక.. ఆంధ్రా రాజకీయాలను కొత్తమలుపు తిప్పే ప్రమాదం కనిపిస్తోంది. లోకేష్‌కు యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన మెసేజ్ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఫలితంగా ఈసీకి చేరిన ఈ గత్తరకు, ఎంతమంది బలవుతారన్నదే ఇప్పుడు పోలీసువర్గాల్లో కనిపిస్తున్న ఆందోళన.
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం మొదలయి, అది చివరకు ఎన్నికల సంఘం గుమ్మమెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ యువనేత లోకేష్ ఫోన్లను జగన్ సర్కారు ట్యాపింగ్ చేస్తుందని, ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమయింది. లోకేష్ వాడుతున్న యాపిల్ ఐ ఫోన్‌కు.. మీ ఫోను ట్యాపింగ్-హ్యాకింగు అవుతోందంటూ వచ్చిన సందేశమే ఈ గత్తరకు కారణం. ఆ మేరకు ఎన్డీఏ పక్షాన ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అందరి దృష్టి అటు మళ్లింది.
ఇటీవల తెలంగాణలో కూడా ఇంటలిజన్స్ చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్‌రావు ఆదేశాలతో.. రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలో విపక్ష నేతలు, సొంత పార్టీ నేతలు, సినిమా తారల ఫోన్లపై కేసీఆర్ హయాంలో జరిపిన ఫోన్ ట్యాపింగ్ రచ్చ అవుతోంది. వెలమ వర్గానికి చెందిన అధికారులనే, ఫోన్ ట్యాపింగ్‌కు ఎంపిక చేసుకున్న తీరు విమర్శలకు గురవుతోంది. త్వరలో బీఆర్‌ఎస్ చీఫ్, ఇద్దరు మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్సీకి నోటీసులు కూడా పంపే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే రాధాకిషన్‌రావు సహా.. డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కానిస్టేబుల్ అరెస్టయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ రచ్చ ఆంధ్రాకూ విస్తరించింది. తమ ఫోన్లను ఇన్చార్జి డీజీపీ, ఏడీజీతోపాటు అడిషనల్ ఎస్పీలు ట్యాపింగ్ చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఇటీవల బదిలీ అయిన ఐజీ కొల్లి రఘురామిరెడ్డి కూడా ఉన్నారంటూ ఎన్డీఏ కూటమి తొలుత ఈసీకి ఫిర్యాదు చేసింది. అందులో వారి పేర్లు కూడా ప్రస్తావించింది. వారిని తక్షణం తప్పించాలని కోరింది. అది సర్దుమణి, ఈసీ దానిపై దృష్టి సారించకముందే.. కొత్తగా లోకేష్‌కు వచ్చిన సందేశం ఎన్డీఏ కూటమిని అప్రమత్తం చేసింది.
దానిని ఆయుధంగా సంధించిన కూటమి.. ఇప్పుడు డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, ఈ ట్యాపింగ్‌కు సహకరిస్తున్న అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలను తప్పించాలని, ఈసీపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్‌కుమార్ మీనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని భావిస్తున్న కూటమి.. ఎంపి కనకమేడల ద్వారా, ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది.
తాము వివిధ జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐ, డీఎస్పీ, జాయింట్ కలెక్టర్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, మీనా స్పందించడం లేదన్నది ఎన్డీఏ కూటమి అసంతృప్తి. ప్రధానంగా బీజేపీ ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు లోకేష్ ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి ఐ ఫోన్ నుంచి వచ్చిన సందేశం, కూటమికి వజ్రాయుధంలా మారింది. దీనితో కేంద్ర ఎన్నికల సంఘం, నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఐఏఎస్-ఐపిఎస్‌లపై తీసుకున్న చర్యలు కూడా, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతోనే జరిగాయని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు.
కాగా తెలంగాణలో కేసీఆర్ సర్కారు తమ ప్రత్యర్ధులపై ఏవిధంగా ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని, తన సొంత సామాజికవర్గమైన వెలమ అధికారులతో చేయించిందో.. ఏపీలో కూడా జగన్ సర్కారు, తన రెడ్డి సామాజికవర్గ అధికారులను ఫోన్ ట్యాపింగ్‌కు వాడుతోందన్నది కూటమి ఆరోపణ. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, ఏడీజీ సీతారామాంజనేయులు, డీఎస్పీలయిన నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి సహకారంతోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది. వీరిలో సీతారామాంజనేయులు ఒక్కరే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు కాగా, మిగిలినవారంతా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం ప్రస్తావనార్హం.
నిజానికి తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని మొట్టమొదట బయటపెట్టింది వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కావడం విశేషం. కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా.. తన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాధ్ ఫోన్లపై ట్యాపింగ్ చేశారని వర్లరామయ్య ఆరోపించడం చూస్తే.. జగన్ చివరకు సొంత మంత్రులను కూడా నమ్మడం లేదని, ప్రజలకు అర్ధమవుయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.