Suryaa.co.in

Editorial

పోలీసు దొంగ చెవులు

( మార్తి సుబ్రహ్మణ్యం)

గట్టిగా అరవకు. గోడలకు చెవులుంటాయ్… నీవి పాము చెవులురా నాయనా.. అనే మాటలు మన చిన్నప్పుడు వినేవాళ్లం. ఇప్పుడు పోలీసు దొంగ చెవుల పుణ్యాన అవి మన ఫోన్లకూ పాకుతున్నాయ్. ఇదొక దౌర్భాగ్యం! పోలీసులే దొంగల అవతారమెత్తి మన ఫోన్లకు వాళ్ల చెవులు ఆనించడం దొంగతనం కంటే పెద్ద నేరం. టెర్రరిస్టులో, వామపక్ష తీవ్రవాదులో, జీహాదీశక్తుల ఫోన్లపై చెవులు ఆనిస్తే ఎవరికెలాంటి అభ్యంతరాలుండవు. అసలు ట్యాపింగ్ పరికరాలు ఉన్నదే దానికోసం కాబట్టి!

కానీ ప్రతిపక్ష నాయకులు, సర్కారును ఎదిరించే శక్తుల ఫోన్లు వినే నీతిమాలిన, బుద్ధితక్కువ పనులను స్వయంగా పాలకులే ప్రోత్సహించడం అనైతికమే కాదు. కిరాతకం కూడా. అదే పని ఫోను ట్యాపింగ్ చేసే వారి.. చేయించే వారి పెళ్లాం బిడ్డల ఫోన్లపై చేయిస్తే?! సమాధానం ఉందా?
అసలిప్పుడు చిన్న బుడతడి నుంచి కట్టుకున్న భార్య ఫోన్లు భర్త ఓపెన్ చేసినా ఒప్పుకునే కాలం కాదు. అలాంటిది ప్రతిపక్ష నేతలు, గిట్టని వారి ఫోన్లు వినడం మనిషి పుట్టుక పుట్టిన వాడు చేసే పనికాదన్నది విజ్ఞుల వాదన. అలాంటి తప్పుడు పనులను భుజం తట్టి ప్రోత్సహించి, తమ కులం వారితో ఆ పని పురమాయించిన నాటి కేసీఆర్ సర్కారులో పనిచేసిన వారిని, పది అడుగుల నిలువ పాతరేసినా తప్పులేదన్నది జనం మాట.

పైగా మహా అయితే నలుగురైదుగురి ఫోన్లు విని ఉంటారని తేలిగ్గా మాట్లాడిన కేటీఆర్ అసలు చదువుకున్న వాడా? లేక కాపీకొట్టి పాసైన వాడా? ఇదేనా ఆయన సంస్కారం అన్నది యువకుల ప్రశ్న. ఆ పని ఇప్పటి సర్కారు ఆయన కుటుంబభ్యులపై చేస్తే.. అప్పుడూ ఇంతే తేలిగ్గా మాట్లాడతారా అన్నదే ప్రశ్న. ట్యాపింగ్‌ను స్వయంగా ఉత్తరకుమారుడే అంగీకరించినందున, తొలి కేసు ఆయనపైనే పెట్టాలన్నది కాంగ్రెస్ నేతల వాదన. పోనీ తాము ట్యాపింగ్ చేసిన ఆ నలుగురైదుగురెవరో, చిన్నదొర సెలవిస్తే బాగుండేది.

కేసీఆర్ కులానికి చెందిన వెలమ అధికారులను ఏరికోరి ఎంచుకుని, తనకు పడని విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన పాపం, ఇప్పుడు దొరలను వెంటాడుతోంది. ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలోనే తీర్చాలన్నట్లు.. ట్యాపింగ్ కేసులో అందరి బాగోతాలూ బట్టబయలవుతున్నాయి. ఇప్పటికే ఎస్‌ఐ స్థాయి నుంచి డీ సీపీ స్థాయి అధికారుల వరకూ జైళ్లకు వెళ్లారు. ఇక అమెరికాలో సేద దీరుతున్న పెద్ద దొర ప్రభాకర్‌రావు సారు దొరకాలి.

ప్రణీత్‌రావు అనే డీఎస్పీ సారథ్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌తో, ఆయన పై అధికారులు, ఆయనతో పనిచేసిన సిబ్బంది పెద్దవాళ్ల బ్లాక్‌మెయిల్‌తో బాగా గడించారన్నది ఆరోపణ. ఇక ట్యాపింగ్ సేవలతో కల్వకుంట్ల కుటుంబానికి శ్రమదానం చేసిన చిన్న దొరలకు.. ఇండియన్ పోలీసు మెడల్స్, పోలీసు సేవాపతకాలూ, యాగ్జిలరీ ప్రమోషన్లు ఎలా వచ్చాయన్న లెక్కలు కూడా తేల్చాల్సిందే.

ఇప్పటి సీఎం, నాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గరే ఆఫీసు తీసుకుని, ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసిన అధికారులను పట్టుకున్నారు బాగానే ఉంది. మరి వారిని ఆ పనికి పురమాయించిన నాటి మంత్రులను చెరపట్టరా? పైన ఉన్న ‘పెద్ద రావు’ల ఆదేశాలు లేకుండానే, పోలీసు‘రావు’లు ఆ పనిచేసేందుకు సాహసిస్తారా? అసలు మిలటరీ, సెంట్రల్ ఇంటలిజన్స్ వద్ద మాత్రమే ఉండాల్సిన ట్యాపింగ్ పరికరాలను.. బీఆర్‌ఎస్ ‘రావు’లు ఇజ్రాయల్ నుంచి అధికారికంగా తెప్పించారా? లేక ఏదైనా ఏజన్సీతో అనధికారికంగా తీసుకువచ్చారా? అందుకు కేంద్ర అనుమతి ఏమైనా తీసుకున్నారా?

ఆ డబ్బులు సర్కారు ఖాతా నుంచే వస్తే ఏ అకౌంటు కింద చెల్లించారు? అసలు ఇప్పుడు ఆ పరికరాలు సర్కారు వద్దే భద్రంగా ఉన్నాయా? ఫాంహౌసులో ఉన్నాయా? ట్యాపింగ్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్లను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అందించారా? అందుకు ఆయన ర్యాటిఫికేషన్ చేశారా అన్నవి మరికొన్ని ప్రశ్నలు. ఇస్తే ఆవిధంగా ఎన్ని ఫోన్ నెంబర్లకు అనుమతించారు? ఇవన్నీ ప్రశ్నలే.

ఇటీవల పీసీసీ కార్యద ర్శి బండి సుధాకర్ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో, ట్యాపింగ్ పరికరాలున్న ఫాంహౌసును సీజ్ చేయాలని కోరడం ఆసక్తికలిగించేదే. అంటే ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ట్యాపింగ్ టూల్స్, సాఫ్ట్‌వేర్ తదితరాలు కేసీఆర్ ఫాంహౌసులోనే ఉన్నాయన్నది కాంగ్రెస్ అనుమానమా? ఏమో!

ఈ వ్యవహారంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టు ఉల్లంఘన సుస్పష్టం. కాబట్టి కేంద్రం రంగంలోకి దిగుతుందా లేదో చూడాలి. కమలదళాలు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పే బదులు కేంద్రంలో తమ పర పతి వినియోగించి, ట్యాపింగ్ చేసిన వారి చెవులను రక్తం వచ్చేలా పిండించాలి. అది చేయకుండా చచ్చు పుచ్చు ఇచ్చకాల వల్ల ఉపయోగం లేదు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దొంగ పోలీసులు అరెస్టయిత తర్వాత, సోషల్‌మీడియాలో ఒక సందేశం చక్కర్లు కొడుతోంది.

‘‘ టెలిఫోన్ ట్యాపింగుకు పాల్పడిన కల్వకుంట పోలీసు ముఠాను అరెస్టు చేస్తున్నారు సరే. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా మారి, తప్పుడు-కిరాయి రాతలు, వందిమాగధ పొగడ్తలతో తెలంగాణ సమాజాన్ని తప్పు దోవపట్టించిన హైదరాబాద్ కిరాయి వార్త మీడియా, పత్రికా సంస్థల అధినేతలు-ఎడిటర్లను అరెస్టు చేసి బొక్కలో వేయరా?’’ ఇదీ ఆ సందేశం! చివరాఖరకు ఫోన్‌ట్యాపింగ్‌పై జనాగ్రహం మీడియా వైపు మళ్లిందన్నమాట.
ఎందుకంటే ఐ న్యూస్ అనే టీవీ చానెల్ ఆఫీసులోనే ట్యాపింగ్ పరికరాల సర్వర్ ఉంచిన నీతిమాలిన పని బయటకొచ్చింది. శ్రవణ్ అనే వెలమ దొర, కులాభిమానంతోనో, కాసులభిమానంతోనో చేసిన ఆ పని, మీడియాకు జనంలో ఉన్న గౌరవం-భయం పొగొట్టింది. పైగా సదరు శ్రవణ్‌కు ‘ఆరడగుల బుల్లెట్’ సమీప బంధువట.

సమాజానికి సుద్దులు చెప్పే మీడియా సంస్ధలు, ఇలా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ఇక వాటికి విలువ ఇచ్చేదెవరు? ఇప్పటికే మీడియా అంటే విలువ పోయింది. పైనున్న వాళ్లు బ్లాక్‌మెయిలర్లయితే.. కింద పనిచేసే జర్నలిస్టులు, అందరూ కాకపోయినా మెజారిటీ శాతం బ్లాక్‌మెయిలర్లు ఎందుకు కాకుండా పోతారు? బ్లాక్‌మెయిల్ చేయకపోతే కంపెనీల ఖజానా ఎలా నిండుతుంది? అన్నది సీనియర్ పాత్రికేయుల ఉవాచ.
* * *
హమ్మయ్య. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎట్టకేలకు వంద రోజుల తర్వాత మీడియాను కరుణించి ధన్యులను చేయబోతున్నారట. సూర్యాపేట పర్యటన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం, మీడియాకు కల్పించబోతున్నారట. సారు ఏం సెలవిస్తారో? ఎవరిపై ధర్మాగ్రహం ప్రదర్శిస్తారో? రేవంత్ వందరోజుల పాలనపై, ఎన్ని కేజీల కారాలు మిరియాలూ నూరతారో చూడాలి.

పరాజయ శతదినోత్సం తర్వాత ప్రజల్లోకి వస్తున్న పెద్దదొర, ఆ పనయిన తర్వాత మీడియా ముచ్చట ఉంటుందని ప్రకటించారు. నిజానికి కేసీఆర్ తన పదేళ్ల కాలంలో తనకు అవసరమైనప్పుడు తప్ప, ఎక్కువసార్లు ప్రెస్‌మీట్లు పెట్టిన సందర్భాలు లేవు. పెట్టినా ఆయన చెప్పింది విని రాసుకోవడమే తప్ప, ఎదురు ప్రశ్నలు వేస్తే సహించరు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను పదడుగులు పాతరేస్తానని సగౌరవంగా చెప్పిన శాంతమూర్తి ఆయన. ఇక మీడియా భట్రాజులు , ఆస్థాన కవులు ఎలాగూ ప్రశ్నలు వేయరు. చెప్పింది శ్రవణానందంగా వింటారన్నది, మనం మనుషులం అన్నంత నిజం.

బీఆర్‌ఎస్ ఓడిన తర్వాత.. తన పార్టీ ఎందుకు ఓడిందో ఇప్పటిదాకా కేసీఆర్ మీడియాకు చెప్పింది లేదు. అసలు గవర్నరును కలసి ఇవ్వాల్సిన రాజీనామానే, ఓఎస్డీ ద్వారా పంపిన ‘మహా ప్రజాస్వామ్యవాది’ అయిన కేసీఆర్.. పార్టీ ఓటమి గురించి మీడియా పేర ంటం పెడతార నుకోవడం అత్యాశ.

సూర్యాపేట పర్యటనలో మీడియాను కరుణించబోతున్న కేసీఆర్‌ను.. ఆయన జమానాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కిరాతకం గురించి, ఏ కలం వీరుడైనా ప్రశ్నిస్తారో లేదో.. అందుకు పెద్దసారు స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. దానితోపాటు తన పార్టీ నుంచి ఆకులు రాలినట్లు.. పార్టీ నేతలు ఎందుకు పక్కపార్టీలోకి ఎందుకు రాలిపోతున్నారు? అసలు పార్టీ మారడాన్ని పెద్ద సారు విమర్శిస్తారా? స్వాగతిస్తారా? అది నైతికమా? కాదా అన్నది చెబుతురా? లేక సుద్దులు చెప్పి పడిపోతున్న ప్రజాస్వామ్య విలువలపై లెక్చరిస్తారా? అన్నదే చూడాలి.

 

LEAVE A RESPONSE