* కోమటిరెడ్డి నిష్క్రమణ తెలిసినా అనవసర బుజ్జగింపులు
* ఆరోపణలు చేస్తున్నా ఆగని బుజ్జగింపులపై నేతల ఆశ్చర్యం
* అమిత్‌షాను కలసిన తర్వాత కూడా మేల్కొనని కాంగ్రెస్ హైకమాండ్
* అగ్రనేతల బుజ్జగింపు ధోరణిపై కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి
* రేవంత్‌రెడ్డిపై కోపంతోనే ఇన్నాళ్లూ కోమటిరెడ్డిని ఉంచేలా చూశారా?
* అంతోటిదానికి అగ్రనేతలకు ఢిల్లీ పిలుపెందుకంటున్న సీనియర్లు
* సొంత జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుకుబడి ఉత్తిదేనా?
* జాతీయ పార్టీ కాంగ్రెస్ దుస్థితిపై రాజకీయ వర్గాల జాలి
( మార్తి సుబ్రహ్మణ్యం)
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో అత్యంత దయనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే, పరాయి పార్టీ అగ్రనేత వద్దకు వెళ్లి మంతనాలు సాగించినా కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వలేని దుస్థితి. ఆ ఎమ్మెల్యే గడప దాటతారని తెలిసినా.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ, దానిని కూడా ముందస్తుగా గ్రహించలేని దయనీయం. పైగా… పార్టీ మారవద్దని ఢిల్లీ నుంచి బుజ్జగింపులు. ఆయన మనసు మార్చేందుకు దూతల రాయబారాలు. వలసను అడ్డుకునేందుకు అగ్రనేతలకు ఢిల్లీ పిలుపు. ఇన్ని ప్రయత్నాలు చేసినా.. చివరాఖరకు సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు జెల్ల కొట్టేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియాముఖంగానే చెప్పేశారు. కనీసం అప్పుడయినా పార్టీ నుంచి బహిష్కరించలేని నిష్క్రియాపర్వం. ఇదీ.. తెలంగాణలో ‘హస్త’వ్యస్ధంగా మారిన కాంగ్రెస్ దుస్థితి.
కాంగ్రెస్ నాయకత్వం తప్ప.. అందరూ ఊహించినట్టే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీ నుంచి నిష్క్రమిస్తూ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టన్నుల కొద్దీ ఆరోపణలు కుమ్మరించారు. పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ కింద తాను పనిచేయలేనని అసలు విషయం చెప్పారు. పార్టీకి బోలెడు సాయం చేసిన తనను అవమానించారంటూ పాతగోడును కొత్తగా వినిపించారు. అటు రేవంత్‌రెడ్డి కూడా.. కోమటిరెడ్డికి పార్టీ చేసిన సాయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పార్టీ, తిరిగి ఎమ్మెల్యే అవకాశం కూడా ఇచ్చిందని బదులిచ్చారు. బీజేపీ విదిలించే ఎంగిలిమెతుకులు, కాంట్రాక్టుల కోసం పార్టీ మారారంటూ ఆరోపించారు. దీనితో కోమటిరెడ్డి నిష్క్రమణ ఎపిసోడ్ కాస్తా, కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్‌రెడ్డిగా మారింది.
అయితే.. కోమటిరెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించేందుకు ఏడాది నుంచే మానసికంగా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని, సుదీర్ఘ రాజకీయానుభవం గల కాంగ్రెస్ కనిపెట్టలేకపోవడమే ఆశ్చర్యం. రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వడం ఇష్టం లేని అనేకమంది సీనియర్లలో కోమటిరెట్టి ఒకరు. కాకపోతే జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి ఒకరిద్దరు మాత్రమే మనసులో మాట బయటపెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం తన అసంతృప్తిని ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చాలాకాలం నుంచి.. అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నేతలతో రాయబారాలు చేస్తున్నారన్న మాట నల్లగొండ జిల్లా రాజకీయ ప్రముఖులకు తెలిసిందే.
ఆయన అమిత్‌షాతో భేటీ కాకముందే, నల్లగొండ జిల్లా బీజేపీ నేతలతో మంతనాలు సాగించారు. పార్టీలోకి వస్తానని చెప్పి, మళ్లీ ఆ విషయాన్ని వాయిదా వేసినట్లు నల్లగొండ బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఆ తర్వాత తెరాస అగ్రనేతలతోనూ మంతనాలు సాగించినట్లు అప్పట్లోనే చర్చ జరిగింది. ఏ పార్టీలో చేరితే రాజకీయంగా లాభమని తేల్చుకునే గందరగోళం తర్వాతనే, కోమటిరెడ్డి చివరకు బీజేపీని ఎంచుకున్నట్లు కనిపిస్తోందన్నది రాజకీయ పరిశీలకులు విశ్లేషణ.
ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వం దానిని తెలుసుకోకపోవడంపై, పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి పార్టీని వీడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలంగాణ సీనియర్లకు చాలామందికి తెలిసినా.. వారు కూడా కాంగ్రెస్ హైమాండ్‌కు చెప్పకపోవడం, పార్టీ ఇన్చార్జి మాణిక్ ఠాకూర్ కూడా కోమటిరెడ్డిని పార్టీలో ఉంచేలా చూడటంలో విఫలమడంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి నిష్క్రమణ ఖాయమని తెలిసిన తర్వాత, రాహుల్ నుంచి దిగ్విజయ్‌సింగ్ వరకూ ఆదరాబాదరాగా ఆయనను ఢిల్లీకి పిలించుకునే ప్రయత్నం చేయడమే వింతగా ఉందన్నది సీనియర్ల వ్యాఖ్య.
రాష్ట్రం విడిపోయిన తర్వాత సుదీర్ఘకాలం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేసి రికార్డు సృష్టించిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి.. తన నల్లగొండ జిల్లా పార్టీపై పట్టు, పలుకుబడి లేదన్న వాస్తవాన్ని కోమటిరెడ్డి రాజీనామా వ్యవహారం బట్టబయలు చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనకు హైకమాండ్‌లో ఉన్న పలుకుబడిని వినియోగించి, కోమటిరెడ్డిని.. రాహుల్ వద్దకు ఎప్పుడో తీసుకువెళ్లాల్సి ఉందని నల్లగొండ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం సమన్వయ కమిటీలో కూడా కోమటిరెడ్డి అసంతృప్తి వ్యవహారం ప్రస్తావించలేదని గుర్తు చేస్తున్నారు. కానీ, ఉత్తమ్ ఆ పనిచేయకుండా కోమటి రెడ్డి నిష్క్రమించేంత వరకూ వేచిచూశారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు నియోజకవర్గాల్లో రెండు కాళ్లు పెట్టి, మరొకరికి అవకాశం ఇవ్వకుండా పెత్తనం సాగిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన జిల్లాలో ఒక ఎమ్మెల్యే పార్టీ నుంచి నిష్క్రమిస్తుంటే, కనీసం ఆపలేకపోయారన్న వ్యాఖ్యలు నల్లగొండ జిల్లా నేతల నుంచి వినిపిస్తున్నాయి.
అయితే.. కోమటిరెడ్డి నిష్క్రమిస్తున్నారన్న విషయం తెలిసిన సీనియర్లు, ఆయన ప్రయత్నాన్ని విరమించుకునేలా చూడటంలో, కావాలనే జాప్యం చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. కోమటిరెడ్డి నిష్క్రమణకు రేవంత్‌రెడ్డే కారణమని చూపించేందుకే, సీనియర్లు ఆ పనిచేయలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు రేవంత్‌పై కోపంతోనే కోమటిరెడ్డిని ఇన్నాళ్లు పార్టీలో ఉంచేలా చేశారన్నది మరికొందరు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు.. కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి కలిసినప్పుడే, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో నాయకత్వం విఫలమయిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కోమటిరెడ్డి ఇవ్వాళ కాకపోతే రేపయినా పార్టీ నుంచి వెళ్లిపోతారని అందరికీ తెలుసు. ఆ మేరకు మునుగోడులో ఆయనకు అప్పటినుంచే ప్రత్యామ్నాయం చూసేది ఉండె. మా వాళ్లు అదీ చేయలే. పార్టీ నుంచి వెళ్లి పోదామని డిసైడయిన ఆయనను వారం రోజులు బుజ్జగించుడేంది? దిగ్విజయ్‌సింగ్ ఫోను చేసుడేంది? పార్టీ నుంచి గెలిచినా ఎంతోమంది టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు జరిగిన నష్టం ముందు, కోమటిరెడ్డి వెళ్లిపోతే జరిగే నష్టం ఏమిటో మాకు అర్ధం కావడం లేదు. కోమటిరెడ్డి వెళ్లిపోతాడని తెలిసినా మా వాళ్లు ప్రయత్నించారు. కానీ ఇయ్యాలేమయింది? రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. బుజ్జగించిన నేతల ఇజ్జత్ పోలా? పోనీ ఇయ్యాల కోమటిరెడ్డి పీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేశారు. కనీసం ఇప్పుడైనా మేల్కొని ఆయనను బహిష్కరించాలన్న సోయ మా వాళ్లలో కనిపించలేదు. రాజీనామా చేయక ముందే బహిష్కరిస్తే, కోమటిరెడ్డి రాజీనామాకు పెద్ద విలువండదన్న రాజకీయ ఎత్తుగడ కూడా మావాళ్లకు లేకపాయె’ అని ఓ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.