Suryaa.co.in

Political News

పల్లె రాజకీయ పగలు .. అభివృద్ధికి అడ్డుగోడలు

– పచ్చని పల్లెల్లో రాజకీయ చిచ్చు
– రాజకీయ క్రీడలో, పార్టీల మాయలో తమ ఐకమత్యాన్ని, అస్థిత్వాన్ని కోల్పోతున్న కొన్ని పల్లెలు
– పల్లెల్లో పెరుగుతున్న పగలు, ప్రతీకారాలు అభివృద్ధికి ఆటంకాలు

ఒకప్పుడు పల్లె జీవితం అనేది ఎంతో అందంగా, ఆనందంగా పరస్పర సహకారంతో, స్నేహబంధాలకు నిలయంగా వుండేది. గడిచిన తరాల్లో గ్రామాల్లో ప్రజలు భేదాభిప్రాయాలకంటే బంధాలకు, స్నేహాలకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు. కానీ రాను రాను కొన్ని పల్లెల్లో రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువై వారి స్వార్ధం కోసం పల్లె ప్రజలను కులాలుగా, వర్గాలుగా విడగొట్టి వారిలో వారికే పగలు, ప్రతీకారాలు వచ్చేలా చేసి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడేలా చేస్తున్నారు,పల్లె గడ్డపై రాజకీయ చిచ్చు నెమ్మదిగా వ్యాపించి, ఐక్యతను చీల్చే విషంలా మారి మనుషుల మధ్య విద్వేషాన్ని పెంచుతున్నాయి

పచ్చని పల్లెల్లో రాజకీయ మంటలు
ప్రతి ఎన్నికలతో పాటె పల్లెల్లో విభేదాలు , పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. వర్గాలుగా విడిపోయిన ప్రజలు చిన్నచిన్న విషయాల్లోను గొడవపడుతున్నారు. చివరికి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని పరిస్థితికి వచ్చారు ఒకే ఊరిలో రెండు వర్గాలు, రెండు ధ్వజాలు. ఒకే ఉత్సవానికి వేర్వేరు వేదికలు ఉండడం… మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా, శత్రువులుగా ఉన్నవారిని మిత్రులుగా మారడం కొన్నిసార్లు బంధువులను కూడా బద్ద శత్రువులుగా మారుస్తున్నాయి ఈ పల్లె రాజకీయాలు

ఐక్యత బదులు విభజన
చాలా చోట్ల ఊరి పంచాయతీ సమావేశాలు అభివృద్ధి చర్చల కోసం కాకుండా పరస్పర ఆరోపణలకు అడ్డాగా మారాయి. పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగే సమావేశాల్లో అభివృద్ధి ప్రణాళికల గురించి కన్నా, పార్టీల గొడవలు, కార్యకర్తల కొట్లాటలు,ఎవరు ఎ పార్టీకి చెందినవారో అన్న విషయయాలె ప్రధానాంశాలు అవుతున్నాయి, పల్లెలో , పార్టీకో పెద్ద రాజకీయ నాయకుడు , అతని కింద చిన్న నాయకులు వారి పంతమే నెగ్గాలనే ఆలోచనలు వీటన్నిటి ఫలితంగా గ్రామ అభివృద్ధి పనులు నిలిచిపోయి, రాజకీయ కక్ష్యలు పెరిగిపోతున్నాయి

*ప్రభుత్వ పథకాల దుర్వినియోగం
ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందించే అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలు… ప్రజలందరికీ చేరాల్సిన దానికి బదులు వర్గ రాజకీయాలకు బలైపోతున్నాయి. నిత్యావసర సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కొందరికి మాత్రమే పరిమితమవుతున్నాయి. అసలైన అర్హులైన అవసరమైన వారికి రాకుండా ఈ వర్గ రాజకీయాలు అడ్డుకుంటున్నాయి. చాలా మంది వృద్ధులు, మహిళలు, పేదలు ఈ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు
అలాగే గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది

గ్రామీణ యువతలో నిరాశ
ఒకప్పుడు గ్రామాభివృద్ధికి కలలు కన్న యువత రాజకీయ అసహనంతో అట్టుడుకుతున్నారు. వారి హృదయాల్లో నూతన ఆశలు మొలకెత్తాల్సిన సమయంలో, అవి నిరాశ మబ్బుల్లో మరుగునపడుతున్నాయి. “ఊరంతా కలిసికట్టుగా ఎదగాలి” అనే కలలు, “మా వర్గమే గెలవాలి” అనే కాంక్షలొ కనుమరుగైపోతున్నాయి

గెలుపు అంటే ఏమిటి?
ఒక పార్టీ గెలిచి మరొకటి పార్టీ ఓడినప్పుడు గ్రామం గెలవదు. గ్రామం గెలవడం అంటే ప్రతి ఇంట్లో వెలుగు నిండడం. ప్రతి కుటుంబంలో సంపద పెరగడం. గ్రామంలో పిల్లలకు మెరుగైన విద్య, వైద్య సేవలు అందడం. వృద్ధులకు గౌరవం లభించడం. ప్రభుత్వ పథకాలు బలహీన వర్గాల వారికి అందడం,గెలుపు అంటే సామూహిక అభివృద్ధి.

ఆలోచనా విధానం మారాలి
రాజకీయలు చేయడం, పార్టీలకు మద్దతుగా నిలవడం తప్పుకాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటరు ఎన్నికల ద్వారానే తన భవిష్యత్తు ను నిర్ణయించే నాయకున్ని ఎన్నుకునే హక్కు వుంది, కాని అది గ్రామ స్థాయిలో వ్యక్తిగత పగలు, ప్రతీకారాలకు సాధనంగా మారుతుంది, అందుకే గ్రామాల్లో ప్రజలు విచక్షణతో మెలగాలి, పెద్ద పెద్ద నాయకులు అంతా బాగానే ఉంటారు కాని గ్రామాల్లో సామాన్య కార్యకర్తలు మాత్రం కక్ష్యలతో జీవిస్తుంటారు.

ఇలా పగలు పెంచుకుంటూ పోతే మనుషులు మాత్రమే కాదు, పల్లె కూడా నాశనమవుతుంది. వర్గ, కుల బలహీనతల్ని వదిలి, గ్రామాన్ని బ్రతికించుకోవాలి, అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి, రాజకీయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాక, గ్రామ సమష్టి శ్రేయస్సు కోసం చేయాలి.
తాత్కాలికమైన వాటి కోసం బంధాలను, స్నేహలను దూరం చేసుకోవడం చాలా తప్పు. రాజకీయం ఎప్పుడూ అభివృద్ధికై వుండాలి కానీ, వినాశనానికి కాదు.

గ్రామాభివృద్ధె నిజమైన గెలుపు
ఈ రాజకీయ పగలను పక్కనపెట్టి, మళ్ళీ పల్లె సౌభ్రాతృత్వాన్ని, సహకారాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. మన పల్లెను మళ్ళీ పచ్చగా, సస్యశ్యామలంగా మార్చడం ఎంతైన అవసరం,అభివృద్ధి మార్గంలో అందరూ కలిసికట్టుగా సాగితే. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన విజయం.

– జి. అజయ్ కుమార్
కాలమిస్ట్

LEAVE A RESPONSE