– దానికి ఆజ్యం పోసిన అర్జున్ అనుభవరాహిత్యం
– హీరోయిజం ప్రదర్శించబోయి తెరపైకి వచ్చిన విలనిజం
– పోలీసుల అహం దెబ్బతీసిన పుష్ప
– అర్జున్‌కు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల అండ
– తాజాగా అల్లు ఇంటిపై కొడంగల్ కాంగ్రెస్ యువనేతల దాడి
– దానితో అనుమానాలన్నీ ‘కొడంగల్’ వైపే
– అర్జున్‌ను అసెంబ్లీలో ఆడేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
– ఆ తర్వాత అల్లు ప్రెస్‌మీట్‌లో పరోక్ష ఎదురుదాడితో ముదిరిన వైనం
– అర్జున్‌కు తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా అని ప్రశ్నించిన ఏసీపీ
– ఏసీపీ వ్యాఖ్యలపై ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం
– దిద్దుబాటుకు దిగి ఆ ఏసీపీని సస్పెండ్ చేసిన సర్కారు
– ఆ వెంటనే దాడిని ఖండిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
– ఎన్టీఆర్ ఘాట్ స్థానంలో అసెంబ్లీ కట్టాలన్న కోమటిరెడ్డి వ్యాఖ్య
– బీఆర్‌ఎస్ నగర ఎమ్మెల్యేల ఆగ్రహం
– సెటిలర్ల ఆగ్రహంతో ఆ వ్యాఖ్యల ఉపసంహరణ
– రేవంత్ అస్త్రాలు సంధిస్తున్నారా? ఇస్తున్నారా అని కాంగ్రెస్ నేతల అయోమయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
సినిమా హీరోలకు అనంతమైన అహం ఉంటుంది. వారంతా తమకు తాము దైవాంశసంభూతులమన్న భ్రమల్లో ఉంటారు. తమకు చట్టాలు వ ర్తించవ ని, తమదో ప్రత్యేక ప్రపంచం అని మిడిసిపడుతుంటారు. చట్టాలు సామాన్యులకే తప్ప, తమకు వర్తించవన్న భ్రమల్లో ఊరేగుతుంటారు. చుట్టూ బౌన్సర్లను కాపలాపెట్టుకుని భయంతో బతికే ధృవ‘తార’లు వాళ్లు. దానికి కారణం ప్రజలు, ప్రభుత్వాలేనన్నది నిష్ఠుర నిజం.
ఎందుక ంటే.. వారికి ఇప్పటివరకూ చట్టం చేతులు చాలా పెద్దవి. అవి ఎవరికయినా ఒకటేనని రుచిచూపడంలో విఫలమయ్యారు కాబట్టి. ఆ పని ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసి చూపించారు. దేశంలో బోలెడంత ఇమేజ్ ఉన్న యంగ్ మెగాస్టార్ అల్లు అర్జున్‌ను, కొన్ని గంటలయినా జైలులో ఉంచిన తర్వాత గానీ.. ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్న విషయం బోధపడలేదు. అసలు సమస్య వచ్చిపడిందంతా ఈ ‘ఇగో’తేనే! లేకపోతే తన రాష్ట్రానికి సీఎం ఎవరో తెలియనంత అహంకారంతో, ఒక సెలబ్రిటీ ఉన్నారంటే.. సినిమా ప్రపంచం ఎంత మిడిసిపడుతుందో అర్ధమవుతుంది.
పోనీ వారికి సమాజం పోకడ గురించి ఎవరైనా చెబుతారా అంటే అదీ లేదు. సినిమా హీరోలు నిర్వహించే ప్రెస్‌మీట్లకు హాజరయ్యే సినిమా రిపోర్టయినా, వారికి లోకంపోకడ గురించి చెబుతారా అంటే అదీ లేదు. అక్కడ కూడా భజనే. సినిమా రిపోర్టర్లలో 80 శాతం సినిమా పీఆర్వోలే కాబట్టి, హీరోలకు చెప్పే ధైర్యం చేయరు. ఫలితంగా హీరోలు బయటకు వచ్చిన సందర్భాల్లో పొలిటికల్ రిపోర్టర్లను కూడా.. తాము చెప్పినట్లు వినే సినిమా రిపోర్టర్లే అని భ్రమపడుతుంటారు.
అయితే రాజకీయపార్టీలు పెట్టిన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ ఆ భ్రమల నుంచి తొందరగానే బయటపడ్డారు. చివరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత, ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్లకు సినిమా రిపోర్టర్లు కూడా ఎక్కువగా వచ్చేవారు. ఆ సందర్భంగా ఆయనను ‘అన్నయ్య’ అని సంబోధించడం, ఆయనకు టిప్స్ ఇచ్చే అనుకూల ప్రశ్నలు వేయడం.. పక్కనే ఉండే పొలిటికల్ రిపోర్టర్లకు చిరాకుగా ఉండేది. పవన్ జనసేన పెట్టిన చాలా ఏళ్ల వరకూ.. ఆయన నిర్వహించే ప్రెస్‌మీట్లలో జర్నలిస్టుల కంటే జనసైనికులే ఎక్కువమంది ఉండేవారు. పవన్ మాట్లాడినప్పుడల్లా పవన్‌కు జేజేలు పలకడం జర్నలిస్టులకు చిరాకేసింది. ఆ తర్వాత పద్ధతి మారిందనుకోండి. అది వేరే విషయం.
అలాగని సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన ఒక మహిళ, చావుబతుకులతో పోరాడుతున్న ఆమె కొడుకు దుస్థితికి, అల్లు అర్జున్ నేరుగా కారణమని చెప్పలేం. కానీ థియేటర్ వద్ద నెలకొన్న క్రౌడ్ దృష్ట్యా .. అక్కడి నుంచి వెళ్లిపొమ్మని పోలీసులు చెప్పినా వెళ్లకపోవడం, వచ్చిపోయే ముందు ఓపెన్‌టాప్‌పైకి ఎక్కి జనాలకు ముద్దులు పెట్టి.. ఆ దారుణానికి ప్రత్యక్ష కారకుడయింది మాత్రం అర్జునే అన్నది నిర్వివాదం. అందులో రెండో ముచ్చటే లేదు. అందుకు పోలీసులు విడుదల చేసిన వీడియోలే సాక్ష్యం.
అసలు ఆరోజు అర్జున్ థియేటర్‌కు రాకపోతే నిండు ప్రాణాలు దక్కేవి కదా? తాను ఇరవైఏళ్ల నుంచి వస్తున్నా ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నది అల్లు వాదనలో నిజం లేకపోలేదు. కానీ అప్పుడు ఆయనకు ఇప్పటి ఇమేజ్ లేదు. అర్జున్ పుష్ప సినిమా హిట్ తర్వాత, దేశంలోని పదిమంది టాప్ హీరోల జాబితాలో చేరిపోయారు. కాబట్టి జనంలో క్రేజ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అందువల్ల పబ్లిక్‌మూడ్‌ను గమనించి, పోలీసుల సూచనలు గౌరవించాల్సిన బాధ్యత అల్లుదే. ఎందుకంటే ఆయన ముందు పౌరుడు. ఆ తర్వాతనే హీరో కాబట్టి! ఈ దేశంలో హీరోలు, రాజకీయనాయకులు, లాయర్లు, జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు- మినహాయింపులు ఇంకా లేనందున, అవి వచ్చేవరకూ చట్టాన్ని గౌరవించాల్సిందే.
ఆ మాటకొస్తే హీరోలు, రాజకీయ నేతలను చూసేందుకు వచ్చేవారి ప్రాణాలు పోవడం అర్జున్‌తోనే మొదలుకాలేదు. అంతకుముందు అనేకమంది హీరోలు, పార్టీలు, ప్రభుత్వం నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి బాల్చీతన్నేసిన అభాగ్యులు బోలెడు. పార్టీల సభలకు తిరిగి వెళుతూ మధ్యలో ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాలు అనేకం.
చిరంజీవి ప్రజారాజ్యం ప్రకటించిన తిరుపతి సభలో జరిగిన తొక్కిసలాటలో.. అక్కడికి వెళ్లిన నా లాంటి జర్నలిస్టులు, వేదిక కింద దూరి బయటపడి ప్రాణాలు దక్కించుకున్న ఘటనలు అనేకం. అందాకా ఎందుకు? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఇవ్వకపోవడానికి సోనియానే కారణమంటూ, అనేకమంది సూసైడ్ నోట్ పెట్టి మరీ చనిపోవడాన్ని విస్మరించకూడదు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీ వంటి కార్పొరేట్ కాలేజీల్లో యాజమాన్య వేధింపులకు తాళలేక చనిపోతున్నామంటూ, లేఖ రాసి మరీ అనేకమంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అందాకా ఎందుకు? తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో సాయిరెడ్డి అనే వృద్ధ మాజీ సర్పంచ్, సీఎం సోదరులు తన ఇంటికి దారిలేకుండా గోడ కట్టినందుకు మనస్తాపానికి గురయి ఆత్మహత్య చేసుకున్నారు. అందులో సీఎం సోదరుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి ఆ ప్రకారంగా చట్టం తన పని తాను చేసుకుని పోతే.. ఆ చావులకు కారకులైన అందరిమీద చర్యలు తీసుకోవడమే న్యాయం కదా? మరి ఏదీ ఆ న్యాయం? బహుశా అర్జున్ కోసం వాదించే ఖరీదైన లాయర్ల ధీమా కూడా అదే కావచ్చు.
సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే.. ఇందులో అరాజకీయం ఉన్నట్లు అనుమానాలు తలెత్తక తప్పవు. సభలో అర్జున్ వైఖరిని తూర్పారపట్టిన సీఎం రేవంత్.. మొత్తం సినిమా పరిశ్రమనే హెచ్చరించినట్లు అర్ధమవుతుంది. అంతకుముందు పదేళ్లపాటు కేటీఆర్ చుట్టూ ప్రదక్షణలు చేసిన సినిమా పెద్దలు, రేవంత్‌ను పెద్దగా ఖాతరుచేయడం లేదన్న చర్చ.. సోషల్‌మీడియాలో విస్తృతంగా, విశృంఖలంగా జరిగింది.
అందుకే కేటీఆర్‌కు సన్నిహితుడైన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలకూల్చారన్నది ఒక వాదన. ఇప్పుడు పుష్ప ఫంక్షన్‌లో అర్జున్ తన పేరు మర్చిపోవడాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న రేవంత్.. సంధ్య థియేటర్‌లో దొరికిన అర్జున్‌ను దొరకపుచ్చుకుని, జైలు పంపించడం ద్వారా.. తెలంగాణ సీఎం పేరును జీవితాంతం తెలుసుకునేలా చేశారన్నది సోషల్‌మీడియాలో వెల్లువెత్తిన వ్యాఖ్యల సారాంశం. నిజం నారాయణుడికెరుక?
అదే సమయంలో అర్జున్ వ్యవహారశైలి, జైలు నుంచి విడుదల తర్వాత ఆయన ఇంట్లో జరిగిన సంబరాలతోపాటు.. అర్జున్‌ను పరామర్శించిన పెద్దలు, చావుతో పోరాడుతున్న చిన్నారిని ఎందుకు పరామర్శించరు? అతడిది ప్రాణం కాదా? పేదవారి ప్రాణాలకు 25 లక్షల ఖరీదు కడతారా? అంటూ సోషల్‌మీడియా రేవంత్‌కు దన్నుగా నిలబడి చెలరే గడం చూసిందే.
అర్జున్ అరెస్టు తర్వాత ఉప్పు-నిప్పుగా ఉండే బీజేపీ-బీజేపీ.. ఒకేతాటిపై- ఒకేస్వరంలో రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పడమే విచిత్రం. అసలు ఈ అంశంలో రాజకీయ పార్టీలకు ఏం సంబంధమో అర్ధం కాదు. రెండు పార్టీలూ పోటీలుపడి మరీ ‘అల్లు’కు పోవడం ఇంకా విచిత్రం. పోనీ అర్జున్‌కు చిరంజీవి- పవన్ లింకు ఉందనుకుంటే.. అసలు వాళ్లిద్దరు ఇప్పటివరకూ అర్జున్ అరెస్టును ఖండించిందే లేదు. దీన్నిబట్టి.. అర్జున్ మున్నూరుకాపు కాబట్టి, తెలంగాణలో వారిని మెప్పించేందుకు బీజేపీ-బీఆర్‌ఎస్ పోటీ రాజకీయాలు చేస్తున్నాయన్న అనుమానాలను కొట్టివేయలేం.
అర్జున్ అరెస్టు విషయంలో మున్నూరు కాపు వర్గానికి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, అత్యుత్సాహం ప్రదర్శించడం బహుశా అందుకే కావచ్చన్నది కొందరి వాదన. బహుశా ఈ కారణంతోనే ఆంధ్రాలో అటు జగన్ కూడా, కాపుల కోసం అర్జున్ అరెస్టును ఖండించి ఉండవచ్చేమో అన్నది మరికొందరి అనుమానం. అటు రేవంత్ కూడా తన భార్యకు బంధువైనప్పటికీ.. అర్జున్‌కు బీజేపీ-బీఆర్‌ఎస్ దన్నుగా నిలబడటం కూడా నచ్చకపోయి ఉండవచ్చు.
తాజాగా అర్జున్ ఎపిసోడ్‌లో, ప్రాంతీయ విద్వేషాలు ప్రారంభం కావడం ఆందోళనకరం. విష్ణుమూర్తి అనే ఓ ఏసీపీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. అర్జున్ ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉందా? తెలంగాణలో ఉందా? ఓవరాక్షన్ చేస్తే తొక్కినారతీస్తాం. మా తెలంగాణ పౌరులు మంచివారు కాబట్టే వదిలేశారంటూ చేసిన వ్యాఖ్యలపై, హైదరాబాద్‌లోని సీమాంధ్రులు భగ్గుమన్నారు. అసలు ఆంధ్రావారిని వ్యతిరే కించే బీఆర్‌ఎస్ పార్టీనే, అర్జున్‌కు మద్దతునిస్తుంటే.. గత ఎన్నికల్లో రేవంతుపై అభిమానంతో కాంగ్రెస్‌ను గెలిపించిన సెటిలర్లు, ప్రభుత్వంలోని ఒక పోలీసు అధికారి ఆవిధంగా బహిరంగ హెచ్చరికలు జారీ చేయడాన్ని ెజీర్ణించుకోలేకపోతున్నారు.
టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారన్న అభిమానంతోనే, గత ఎన్నికల్లో సెటిలర్లు కాంగ్రెస్‌కు జైకొట్టారు. దానికితోడు జగన్‌కు కేసీఆర్ మద్దతునిస్తున్నారన్న ఆగ్రహం కూడా వారి నిర్ణయానికి మరో కారణం. అర్జున్‌కు ఆధార్ కార్డు తెలంగాణలో ఉందా? ఆంధ్రాలో ఉందా అని ప్రశ్నించడం ద్వారా, ప్రాంతీయ విద్వేషాలకు బీజం వేసే ప్రయత్నమేనన్నది సెటిలర్ల ఆగ్రహం. ఎవరి ప్రోత్సాహం లేకుండా ఒక పోలీసు అధికారి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఎలా మాట్లాడగలుగుతారన్న సందేహం ఎవరికైనా రావడం సహజం.
దానితో దిద్దుబాటుకు దిగిన రేవంత్ సర్కారు.. ఆవిధంగా మాట్లాడిన ఏసీపీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సంధ్య ధియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసు సిబ్బంది, స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ స్వయంగా ట్వీట్ చేయడం ప్రస్తావనార్హం.
అంతకు కొన్ని గంటలముందు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి కూడా, తెలంగాణలో శాంతిభద్రతలను ప్రశ్నార్ధకం చేసింది. వీవీఐపీలు నివసించే ప్రాంతాల్లోనే మనుషులకు రక్షణ లేదని తేల్చిన ఆ ఘటన, పోలీసుల సమర్థకు సహజంగా సవాలు విసిరింది. అల్లు అర్జున్‌ను హెచ్చరిస్తూ ఇప్పటికే పలువురు బహిరంగంగా మాట్లాడుతున్న నేపథ్యంలో, ఆయన ఇంటివద్ద ఉండాల్సిన పోలీసులు.. ఘటన జరిగిన తర్వాత.. అనేక పూలకుండీలు పగిలిన తర్వాత రంగప్రవేశం చేసి, ఆందోళన కారులను కారెక్కించుకుని వెళ్లిపోవడమే విచిత్రం.
అయితే..అర్జున్ ఇంటిపై దాడి చేసిన యువకిశోరాలకు, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన.. కొడంగల్ నియోజకవర్గ యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ నాయకత్వం వహించారన్న సోషల్‌మీడియా వార్తలే దిగ్భ్రాంతికరం. ఆయన వికారాబాద్ నుంచి 2019లో కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేశారు. దానితో ఈ ఘటనతో రేవంత్ ప్రమేయం లేకపోయినా.. ఆ దాడి వెనుక రేవంత్ ఉన్నారన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చడం సహజం.
తమ నేత రేవంత్ అసెంబీలో చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా అర్జున్, ఆయన తండ్రి అరవింద్ ఖండించడాన్ని తట్టుకోలేని కొడంగల్ యువకిశోరాలు, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో.. కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, అర్జున్ ఇంటిపై దాడి చేసి ఉండవచ్చు. మరి దానిని నిఘా దళాలు ముందుగా కనిపెట్టకపోవడమే ఆశ్చర్యం. అయితే.. ఒక సీఎంకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదా? మాట్లాడితే వారిపై దాడులు చేసేంత అప్రజాస్వామ్యపాలనలో ఉన్నామన్న సోషల్‌మీడియా సైనికుల ప్రశ్నలు ప్రజల్లోకి వెళ్లి, చర్చకు తెరలేపడం ప్రమాదకర సంకేతాలే.
ఇదేదో తన కొంప కొల్లేరు చేసేదిలా ఉందన్న ముందుచూపుతో.. ఆ దాడిని ఖండిస్తూ, రేవంత్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఘటనపై స్పందించడం అంటే, ఆయనలో ఆందోళన మొదలయిందన్న సంకేతం ఆ ట్వీట్ స్పష్టం చేస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.
అయినప్పటికీ, అర్జున్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన రెడ్డి శ్రీనివాస్.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయన గతంలో వికారాబాద్ కాంగ్రెస్ జడ్పీటీసీగా పనిచేశారన్న వార్త, అప్పటికే సోషల్‌మీడియాలో గాలికంటే వేగంగా జనంలోకి వెళ్లింది. దానికి సంబంధించిన ఫొటోలు, పత్రికా ప్రకటనలు సోషల్‌మీడియాలో వైరల్ అవడం రేవంత్‌కు వ్యక్తిగతంగా ఇబ్బందికరమే. అంటే ఇక రేపటినుంచి ఈ దాడి వెనక రేవంత్ లేదా ఆయన సోదరులున్నారన్న ఆరోపణల వర్షం మొదలుకావచ్చన్నమాట. రాజధాని నగరంలోనే శాంతిభద్రతలకు దిక్కులేదన్న సంకేతాలు వెళితే.. పోయేది సర్కారు పరువే.
మొన్నటికి మొన్న.. సచివాలయం పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఘాట్ స్థానంలో అసెంబ్లీ నిర్మించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటన, సెటిలర్ల ఆగ్రహానికి దారితీసింది. దానిపై హైదరాబాద్‌లోని సెటిలర్ల సంఘాలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డాయి. బీఆర్‌ఎస్ నగర ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, కృష్ణారావు, వివేకానంద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఎన్టీఆర్ ఘాట్‌పై చేయి వేయాలని హెచ్చరించారు.
అసలు పదేళ్లు కేసీఆర్ సర్కారే దాని జోలికి పోని క్రమంలో, కాంగ్రెస్ అంత ధైర్యం ఎలా చేస్తుందన్న విస్మయం వ్యక్తమయింది. దానితో దిద్దుబాటుకు దిగిన కోమటిరెడ్డి.. తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని మాటమార్చాల్సి వచ్చింది. తాను సచివాలయం పక్కనే అసెంబ్లీ ఉంటే బాగుంటుందని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చుకున్నారు. అయితే దీనిపై రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం ప్రస్తావనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో.. అసలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యర్ధులపై అస్త్రాలు సంధిస్తున్నారా? వారికి తానే అస్త్రాలు అందిస్తున్నారా? అన్న అయోమయం కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.