Suryaa.co.in

Telangana

రేవంత్.. నువ్వు మనిషివైతే..మాట మీద నిలబడితే.. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించు

– చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికీ చేయలేదు
– మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన నీ సోదరుడు తిరుపతి రెడ్డిని కూడా అరెస్టు చేయించు.
– హన్మకొండలో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు

హన్మకొండ :  కాంగ్రెస్ వాళ్లు అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చిండ్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అంటడు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదంటడు, రుణమాఫీ చేయలేదంటడు. మేం రైతులకు ఇవన్నీ ఇవ్వకపోతే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా భట్టి గారూ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు.

బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసిందని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన్రు. అసెంబ్లీలో నేను లెక్కలతో సహా అప్పజెప్పిన. బీఆర్ఎస్ చేసింది కేవలం 4 లక్షల 17 వేల కోట్లే అని, మీరు 7 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్తే లీగల్ గా చర్యలు తీసుకుంటమని చెప్పిన. సర్వ శిక్ష అభియాన్ 1523 ఉద్యోగాలు మేమే ఇచ్చినం, మీ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటం.

చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పటికీ చేయలేదు ఈ ముఖ్యమంత్రి.

అందుకే మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి, ప్రజల ముందు వారి నిజస్వరూపాన్ని బయట పెట్టాలె. కేసీఆర్ చేసిన పనులన్నీ మీకు అర్ధమవుతున్నయి. అందుకే నిజం నిలకడ మీద తెలుస్తది అన్నరు. ఇవాళ ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, ప్రజా ప్రభుత్వంలో 7వ గ్యారంటీ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదా? పాలసీ మ్యాటర్ అడిగితే హౌస్ అరెస్టు, కేసులు పెడుతున్నరు.

సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసినవు సరే, మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన నీ సోదరుడు తిరుపతి రెడ్డిని కూడా అరెస్టు చేయించు. ఎందుకు అరెస్టు చేయించడం లేదు? చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? 54 మంది హాస్టల్ విద్యార్థులు మరణిస్తే.. ఇది ప్రజా పాలనా? లగ చర్ల రైతులకు బేడీలు వేస్తే.. ఇది ప్రజా పాలనా? సీఎం రేవంత్ రెడ్డీ, నువ్వు మనిషివైతే, మాట మీద నిలబడితే, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించు.

LEAVE A RESPONSE