– రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ నడిపేది బీజేపీ
– ప్రతీకార పాలనకు తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి
– సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాతే కేటీఆర్ పై కేసు నమోదు
– ప్రజల దృష్టి మళ్లించడానికే తెరమీదికి అల్లు అర్జున్ వ్యవహారం
– కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యాచరణ
-భూభారతితో భూ భద్రత ఉండదు
– మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ పార్టీ నడిపిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. “తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత గవర్నర్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. తదనంతరం ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ కేసు నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది”
సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయాలన్నది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర అని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ వంటి బలమైన నాయకులను దెబ్బకొట్టాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, కానీ వాటికి సాధ్యంకాదని తేల్చిచెప్పారు. కక్షసాధింపులో భాగంగానే కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసు నమోదు చేశాయని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందునే కేటీఆర్ ను టార్గెట్ చేశారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనకు తెరలేపారని, ప్రతిపక్షాలపై అటాక్ చేయటమే పనిగా సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే అల్లు అర్జున్ వ్యవహారాన్ని ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చిందని అన్నారు.
తెలంగాణలో 10 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. అందరి కోసం కాకుండా.. కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ప్రాధాన్యతలు పెద్ద వాళ్లపైనే ఉన్నాయని విమర్శించారు. మెఘా కృష్టా రెడ్డి వంటి వారి కంపెనీలకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్… పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు మాత్రం నిధులు విడుదల చేయడం లేదని ఎండగట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విషాహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెడుతున్నా కమ్యునిస్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు చీకటి చరిత్ర నేపథ్యంలో పదేళ్ల పాటు ఆ బ్యాంకును కేసీఆర్ తెలంగాణకు దూరంగా ఉంచారని పేర్కొన్నారు.
భూభారతితో భూభద్రత ఉండదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. భూభారతి చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేస్తున్నదని అన్నారు. భూభారతి తిరోగమన చర్యగా అభివర్ణించారు. ధరణిపై విషప్రచారం చేశారని, ప్రజలు తిరిగి ధరణి వ్యవస్థనే కావాలని ఉద్యమించే పరిస్థితి వస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఒక కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులను కూడా పూర్తిచేయని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ముఖ్యంగా కొద్దిపాటి నిధులు వెచ్చించి మూడు నాలుగు కిలోమీటర్ల మేర పనులు చేపడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటికే నీళ్లు అందేవని వివరించారు.
కానీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రావడంలేదని స్పష్టం చేశారు. పరిమిత నిధులు వెచ్చించడం ద్వారా పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం విస్మరించడం దారుణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పుష్కలంగా నిధులు వస్తున్నాయని ప్రభుత్వమే చెబుతుంది కానీ ఒక పైసా కూడా ప్రజలకు చేరడం లేదని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదని, తద్వారా ఒక మహిళకు ప్రభుత్వం రూ 30000 బాకీ పడిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పేరిట బస్సుల సంఖ్యను తగ్గించారని, తద్వారా మహిళలే కాకుండా విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
మరోవైపు, జగిత్యాల నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు అడగగా…. తను కేవలం జగిత్యాల కే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా వెళ్తానని, రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. అలాగే, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదని, కలిసే పని చేస్తాయని చెప్పారు.