– ‘గ్రామీణం’ సరే.. ‘కాలుష్యం’ పట్టదా?
– గ్రామీణాభివృద్ధి సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ దూకుడు
– సమస్యలపై శరవేగంగా స్పందిస్తున్న తీరు
– పవన్ చొరవతో పూర్తవుతున్న రోడ్లు
– మన్యంలో జెట్ వేగంతో రోడ్ల నిర్మాణాలు
– పొల్యూషన్ కంట్రోల్లో మాత్రం వైఫల్యం
– కాలుష్యం పెంచుతున్న కంపెనీలపై ఏదీ కొరడా?
– అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో యధేచ్చగా ఉల్లం‘ఘనులు’
– కంపెనీల కాలుష్యంతో చచ్చిపోతున్న చేపలు
– చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకువస్తున్న చేపలు, తాబేళ్లు
– సముద్రంలో 20 కిలోమీటర్ల లోపలకు వేటకు జాలర్లు
– గతంలో 5 కిలోమీటర్లలోనే దొరికిన చేపలు
– రాంకీ, హెటిరో, అరబిందో, దివీస్, ఎస్ఎంఎస్, ఏఈటీఎల్పై లెక్కలేనన్ని ఆరోపణలు
– వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ‘రాంకీ’కి నోటీసులిచ్చినా డోంట్‌కేర్
– ‘బయో మెడికల్ వేస్ట్’ దందాలో ఆ ‘డర్జీడజన్’పై చర్యలేవీ?
– ‘బయో మాఫియా’కు తలవంచుతున్న పవన్ శాఖ
– కొత్త యూనిట్లకు అనుమతిపై పర్యావరణ శాఖ మీనమేషాలు
– పవన్ శాఖను బయో మాఫియా మేనేజ్ చేస్తోందన్న అనుమానాలు
– పరవాడ జనాలను పరలోకానికి పంపుతున్న ఫ్లై యాష్, విష వాయువులు
– అడ్డూ అదుపు లేకుండా రోజూ వందల సంఖ్యలో లారీల రవాణా
– కార్మిక సంఘాలు లారీలను అడ్డుకుంటున్నా చర్యలు శూన్యం
– బయో-ఫ్లైయాష్ మాఫియాపై చర్యలకు హడలిపోతున్న పీసీబీ అధికారులు
– కంపెనీలతో పీసీబీ అధికారుల కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు
– కంపెనీలు వెళ్లిపోతాయన్న వాదనతో సర్కారు మౌనం
– ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యమా? పరిశ్రమలు ముఖ్యమా?
– వసుధా మిశ్రా కమిటీ రిపోర్టు ఏ ‘మాయె’?
– కన్నీటి ‘కాలుష్యం’
( మార్తి సుబ్రహ్యణ్యం)
పవన్ కల్యాణ్.. ఆయన ఉప ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వంలో నెంబర్ టూ. ఆయన మాట శిలాశాసనం. ఆయన మాట వేదవాక్కు. పేరుకు డిప్యూటీ సీఎం అయినా, సీఎం మాదిరిగా ఏ శాఖలోనయినా జోక్యం చేసుకుంటారు. ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న శాఖలేమీ అల్లాటప్పావి కాదు. గ్రామీణాభివృద్ధి-అటవీ-పర్యావరణ వంటి కీలక శాఖలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. అందులో గ్రామీణాభివృద్ది శాఖలో.. ఆయన చొరవతో రాష్ట్రంలో అనేక చోట్ల కొత్త రోడ్లు నిర్మాణమవుతున్నాయి. అన్నింటికంటే మించి.. రోడ్లకు నోచుకోని ‘మన్యం’ ఇప్పుడు రోడ్ల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.
ఇలా రాష్ట్రంలో రోడ్లను జెడ్ స్పీడుతో నిర్మిస్తున్న ఆ శాఖ మంత్రి కమ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రజల ఆరోగ్యం-ప్రాణాలతో ముడిపడిన పర్యావరణ శాఖ- కాలుష్య విభాగంలో జరుగుతున్న ఉల్లంఘనలు-అరాచకాలపై మాత్రం దృష్టి పెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పైగా రసాయన విష వ్యర్ధాలను జనం గొంతులో నింపేస్తు, వారిని కాటికి పంపుతున్న కెమికల్-ఫార్మా కంపెనీలపై కొరడా ఝళిపించకుండా మౌనంగా ఉన్న ఫలితంగా.. కెమికల్ కంపెనీల ఉల్లంఘనులు రెచ్చిపోవడం.. పర్యావరణ శాఖ మౌనం- కలసి వెరసి, పవన్ పరువు తీయడమేనన్న వ్యాఖ్యలు కూటమి కార్యకర్తల్లో వినిపిస్తోంది.
అనకాపల్లి జిల్లా పరవాడ, అచ్యుతాపురం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఫార్మా- కెమికల్ కంపెనీల దారుణాలు-ఉల్లంఘనలు రోజూ మీడియాలో వెలుగుచూస్తున్నా, సంబంధిత శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు పట్టకపోవడం విమర్శలకు కారణమవుతోంది. పరిశ్రమలపై చర్యల కొరడా ఝళిపిస్తే.. అవి పక్కరాష్ర్టాలకు వెళ్లిపోతే-ఆదాయం దెబ్బతింటుందన్న వాదన అర్ధరహితమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దానివల్ల ప్రభుత్వానికి.. ప్రజల ప్రాణాలు-ఆరోగ్యం కంటే ఆదాయం-పెట్టుబడులే ప్రధానమన్న తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు.
‘‘ కంపెనీలు ఉత్తి పుణ్యానికో, రాష్ట్రంపై ప్రేమతోనో పరిశ్రమలు పెట్టవు. వాటికి భారీగా ఇచ్చే రాయితీలు, కారు చౌకగా ఇచ్చే భూములు, ఇతర వెసులబాటును చూసే వస్తాయి తప్ప మనపై ప్రేమతోకాదు. అయినా ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మనమే పరిశ్రమలకు కారుచౌకగా భూములు, రాయతీలు ఇస్తున్నాం. అలాంటప్పుడు వాళ్లు ఎందుకు వెళతారు? ఎక్కడికి వెళతారు? ఇలాంటి వాదనలను పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ బలహీనతగా భావించి, ఇంకా నెత్తిన ఎక్కేందుకు కారణమవుతా’’ యని ఒక మాజీ మంత్రి విశ్లేషించారు. పైగాఈ వాదన-భావన, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భయపడుతోందన్న సంకేతాలకు కారణమవుతోందంటున్నారు.
ప్రధానంగా రాంకీ సంస్థ తన పరిసర ప్రాంతాల్లోని కాలువలు, చెరువులతోపాటు, నేరుగా సముద్రంలోకి విష రసాయన వ్యర్ధాలను విసర్జిస్తోందంటూ ఫొటో-వీడియోలు మీడియాలో వచ్చినా.. కార్మిక సంఘాలు కెమికల్ లారీలను పట్టుకుని ఫిర్యాదు చేసినా.. దానిపై చర్య తీసుకోవడం లేదంటే.. వైసీపీ ఎంపి కంపెనీతో ‘పైస్థాయిలో’ సర్దుకుపోతున్నారన్న, అనవసర అనుమానాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘‘ గత రెండేళ్లలో ఫార్మా పరిశ్రమలో 25 మంది చనిపోగా, 59 మంది అస్వస్థతకు గురయ్యారు. అయినా ప్రభుత్వం మేల్కొనడం లేదంటే నిద్ర నటిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం వేసిన వసుధా మిశ్రా ఏమైంది? యాజమాన్యాలు భద్రతా పాటించకపోవడం వల్ల కార్మికులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఫార్మా -కెమికల్ కంపెలతో ఈ ప్రభుత్వం-పీసీబీ ఉన్నతాధికారులు కుమ్మక్కయారన్నది నిర్వివాదం. మేం ఎన్నోసార్లు ట్యాంకర్లు పట్టుకుని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రాంకీ సంస్థ తన విష వ్యర్ధాలను ఏయే గెడ్డల్లో కలుపుతుందో స్వయంగా చూపించాం. అయినా చర్యలు తీసుకోలేదంటే పైస్థాయిలో వారితో కుమ్మక్కు అవుతున్నారని అర్ధమవుతుంద’’ని సీఐటీయు కార్యదర్శి, ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
పరవాడ ప్రాంతంలో ఫ్లైయాష్ లారీల సంఖ్య తామరతంపరగా పెరిగి, వచ్చలవిడిగా తిరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే. సీఐటీయు నాయకులు వాటిని లెక్కలేనన్ని సార్లు అడ్డుకుని, ధర్నాలు కూడా చేసిన సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. అయినా వాటిపై చర్యలు తీసుకునే దమ్ము కనిపిండం లేదు.
ఇక పట్టణ ప్రజలను రోగాల సుడిగుండంలో పడేస్తున్న ఆసుపత్రి వ్యర్ధాల విషయంలో.. ఇప్పటివరకూ ధైర్యంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారంటే, పర్యావరణ శాఖ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం 10-12 మంది బయో మెడికల్ ప్లాంట్ల మాఫియాకు, పర్యావరణ శాఖ భయపడి వణికిపోవడమే వింత . అసలు వాటిపై తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోనందుకే.. బయో మెడికల్ మాఫియా పవన్ శాఖను వెక్కిరిస్తోందంటున్నారు.
—————————-
ఆ ఆరు కంపెనీపై చర్యలేవీ?
కాలుష్యం వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలతో పరిహాసమాడుతున్న ఆ ఆరుగురు కంపెనీలపై చర్యల కొరడా ఝళిపించేందుకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యావరణ శాఖ భయం-మొహమాటంతో వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం వాటికి ప్రభుత్వంలో విపరీతమైన పలుకుబడి ఉండటమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా పరవాడలోని జవహర్లాల్ నెహ్రు ఫార్మాసిటీ రూపశిల్పి, వైసీపీ రాజ్యసభ సభ్యుడైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ తన కాలుష్య వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయకుండా, నేరుగా సముద్ర జలాల్లోకి విడిచిపెడుతోందంటూ, మీడియా- కార్మిక సంఘాలు జమిలిగా చేస్తున్న విమర్శలు-ఆందోళన సంబంధిత మంత్రి పవన్‌కల్యాణ్‌కు పట్టకపోవడమే ఆశ్చర్యం.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాంకీ కత్తికి ఎదురులేదంటే.. ఏ ఒక్క ప్రభుత్వమూ దానిపై చర్యల కొరడా ఝళిపించడంలో సర్కారు చేతులు వణికిపోతున్నాయంటే.. వారి బంధం ఎంత బలంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. దానికి కారణం ‘మామూలే’
ప్రధానంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అయినప్పటికీ, జగన్ పార్టీకి ఆర్ధికంగా దన్నుగా నిలుస్తారని ప్రపంచానికి తెలిసినప్పటికీ, ఆయన కంపెనీ అయిన రాంకీ నిర్భయంగా ఉల్లంఘనలకు పాల్పడుతుందంటే.. ఇన్ని ఆరోపణలొస్తున్నా విజిలెన్స్ విచారణకు ఆదేశించలేదంటే.. ఈ బంధం వెనుక కారణమేమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాగా నక్కపల్లిలో హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్.. శ్రీకాకుళం-కాకినాడలోని అరబిందో (లైఫస్), విశాఖ-తునిలోని దివీస్, విజయనగరంలోని ఎస్ఎంఎస్ , అచ్యుతాపురంలోని అచ్యుతాపురం ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లిమిటెడ్ (ఏఈటీఎల్) కంపెనీలు విడిచే కాలుష్య వ్యర్ధాలతో మనుషులు, జీవరాసుల జీవితాలు మృత్యువుపాలవుతున్నా పర్యావరణ శాఖ ఇప్పటివరకూ వాటిపై చర్యల కొరడా ఝళిపించలేదంటే.. బడా పారిశ్రామికవేత్తలకు పాలకులు ఏ స్థాయిలో సాగిలబడుతున్నాయో స్పష్టమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
——————————————–
‘పొల్యూషన్’పై నోరెత్తని ప్రజాప్రతినిధులు
ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ , వారిని ప్రతిరోజూ నరకానికి చేరువ చేస్తున్న కెమికల్- ఫార్మా ఇతర కంపెనీల దుశ్చర్య-మారణకాండపై ఇప్పటివరకూ ఒక్క ప్రజాప్రతినిధి కూడా అటు అసెంబ్లీలో గానీ-ఇటు పార్లమెంటులో గానీ గళం విప్పలేదంటే, ప్రజల ప్రాణాలపై వారికి ఎంత చిత్తశుద్ధి-అంకితభావం ఉందో స్పష్టమవుతుంది.
గత అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ క్రెబ్స్-కెకెఆర్ కెమికల్ కంపెనీ అకృత్యాలపై గళం విప్పారు. పీసీబీ చైర్మన్ కృష్ణయ్య ప్రజాప్రతినిధులను లెక్కచేయడం లేదని, మా ప్రభుత్వం ఉన్నందుకే మీకు చైర్మన్ పదవి వచ్చిందని గుర్తు పెట్టుకోవాలని ఘాటుగా మాట్లాడారు. కారణం.. గన్నవరం సమీపంలో ఆ కంపెనీలు తన వ్యర్ధాలను శుద్ధి చేసి నిర్మూలించకుండా పొలాల్లో విడిచిపెట్టడమే.
అయితే వాటిెపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సభ్యుడు బొండా తనను ప్రశ్నించడాన్ని ప్రతిష్ఠగా తీసుకున్నారు. ‘చర్యలు తీసుకోవాలంటే రాంకీ ఒక్కటే కాదు. చాలా ఉన్నాయి. కానీ అలా చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయి. దానివల్ల ఉపాథి అవకాశాలు పోతాయ’ని, పరిశ్రమల తరఫున వకాల్తా పుచ్చుకోవడం విమర్శలకు దారితీసింది. ఆ రకంగా ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమలే ముఖ్యమన్న సంకేతం ఇవ్వడంపై.. కార్మిక సంఘాలు-వామపక్ష పార్టీలు విరుచుకుపడిన విషయం తెలిసిందే.
అయితే తర్వాత ఆ రెండు కంపెనీలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత పెనాల్టీ వేశారు? వాటిని మళ్లీ తెరిచారా? లేదా? తెరిస్తే ఎందుకు తెరిచారు? వారు ఎంత పెనాల్టీ చెల్లించారు? ఏ కారణంతో రీ ఓ పెన్ చేశారన్న దానిపై ఎవరికీ సమాచారం లేదు. అది వేరే విషయం.
కెమికల్-ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్న విశాఖ-అనకాపల్లి-విజయనగరం-కాకినాడ జిల్లాల్లోని ఎంపీలు, ఆయా కంపెనీలు జనావాసాలు-సముద్రం-నదుల్లో విసర్జిస్తున్న కెమికల్ విష వ్యర్ధాలపై ప్రభుత్వానికి ఒక్క ప్రశ్న కూడా వేయలేదంటే.. ఈ ప్రజాప్రజానిధుల బాధ్యతారాహిత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. కారణం.. ఎన్నికల్లో వారి నుంచి భారీ స్థాయిలో విరాళాలు తీసుకోవడమేనని-ఆ మొహమాటంతోనే ప్రజా
ప్రతినిధులు మౌనంగా ఉన్నారన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో పరిశ్రమలు విడుదల చేసే విష కాలుష్య వ్యర్ధాలు సముద్రంలోకి విడిచిపెడుతున్న క్రమంలో.. అపురూపమైన తాబేళ్లు మృత్యువుపాలయి, ఒడ్డుకు కొట్టుకువస్తున్న దృశ్యాలు-కథనాలు మీడియాలో వస్తున్నా, పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యావరణ శాఖ పట్టించుకోవడం లేదంటే.. అది పవన్ పరువు తీయడమేనంటున్నారు.
—————————————-
బాబు బెయిల్ రద్దు చేయాలని ‘ఆళ్ల’ కోర్టు కెళ్లినా పట్టదా?
రాంకీ కంపెనీ యజమాని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడైన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అంతకుముందు ఎన్నికల్లో లోకేష్ పై గెలిచి, గత ఎన్నికల్లో ఓడిపోయారన్న విషయమూ తెలిసిందే. అన్న కంపెనీ అయిన రాంకీ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి, రెండు పద్ధతుల్లో నిర్మూలించాల్సిన కెమికల్స్ విష వ్యర్ధాలను కాలువలు, కొండలు, సముద్రంలో నేరుగా కలిపేస్తుందంటూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఫొటోలు-వీడియోలతో రోజూ మొత్తుకుంటున్నా రాంకీ సంస్థపై చర్యలు శూన్యం.
కానీ విచిత్ర ంగా అదే రాంకీ సంస్థ యజమాని ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సోదరుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం.. సీఎం చంద్రబాబునాయుడుకు గతంలో కోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తారు. సాధారణంగా అయితే.. ఈ విధంగా పాలకులను సవాలు చేసే వారిపై, రాజకీయ నాయకత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆయా కంపెనీల ఉల్లంఘనలపై విజిలెన్స్‌తో విచారణ చేయించి, వాటి సంగతి తేలుస్తుంది.
కానీ ఈ ‘మంచి ప్రభుత్వం’ అతి మంచితనం-‘ఇతర’ బలహీనతలు చూసి, విపక్షం రెచ్చిపోవడమే వింతగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘ఒకవైపు వైసీపీ ఎంపీ అయిన అన్న కంపెనీయేమో మా ప్రభుత్వం ఉన్నా భయం లే కుండా ఉల్లంఘనలకు పాల్పడుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన తమ్ముడేమో, ఏకంగా మా సీఎంగారికి ఇచ్చిన బెయిలునే రద్దు చేయమని కోర్టులోనే కేసు వేస్తారు. ఇది పిల్లి గుడ్డిదయితే ఎలుక ఏదో చూపించిదన్న సామెతను గుర్తు చేస్తోంది. దీనికి కారణం రకరకాల బలహీనతలు. రాజకీయ ప్రత్యర్ధిని నియంత్రించాలన్న రాజకీయ కోణం లేకపోవడమే’’నని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వమంటే వైసీపీ వ్యాపారస్తులకు లె క్కలేకుండా పోయిందనడానికి, ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలని టీడీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
—————–
‘బయో మెడికల్ మాఫియా’ అంటే భయమా?
కాగా రాష్ట్రంలోని ఆసుపత్రులు, ల్యాబ్, ఎక్స్‌రే, డిస్పెన్సరీ, బ్లడ్‌బ్యాంకుల నుంచి రోజూ టన్నుల కొద్దీ విడుదలయ్యే వ్యర్థాలు ప్రజల ప్రాణాలకు సవాలుగా మారాయి. ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చే కాటన్, ట్యాబెట్లు, గ్లవుజు, సిరెంజ్, ఆపరేషన్‌కు వినియోగించే , కత్తెర వంటి ప్రమాదకర పరికరాలను తీసుకువెళ్లే బయో మెడికల్ ప్లాంట్ల మాఫియా.. కొత్తవారిని ఈ రంగంలోకి రానీయకుండా అడ్డుపడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
రాష్ట్రంలో మరో 8 బయో మెడికల్ ప్లాంట్లు అవసరమని పీసీబీ మొత్తుకుంటున్నా, కొత్త వాటికి అనుమతి ఇవ్వకుండా.. కోర్టులో కేసులు-పీసీబీకి-సీపీసీసీబీకి ఫిర్యాదులు చేస్తూ, అడ్డుపడుతున్న బయో మెడికల్ మాఫియాకు పవన్ సారథ్యంలోని పర్యావరణ శాఖ భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
పదివేల బెడ్లకు ఒక బయో మెడికల్ ప్లాంట్లు పెట్టాలని నిబంధన ఉన్నప్పటికీ, దానిని పర్యావరణ శాఖ అమలుచేయకపోవడానికి కారణం.. బయో మెడికల్ ప్లాంట్లకు సంబంధించిన ‘డర్జీ డజన్ ’మాఫియా పర్యావరణ శాఖలోని ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెంబర్ సెక్రటరీ పనిచేస్తున్నట్లా? లేదా?
పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు) మెంబర్ సెక్రటరీ అసలు ఉన్నారా? లేదా? పనిచేస్తున్నారా? లేదా? అన్న సందేహం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న మెంబర్ సెక్రటరీకి మరో మూడు శాఖలు అదనంగా ఉండటంతో, ఆయన పీసీబీకి పూర్తి సమయం కేటాయించడం లేదు. అసలు ఇంత కీల మైన పీసీబీకి పూర్తి స్థాయి మెంబర్ సెక్రటరీని వేయాలన్న కనీస ఆలోచన-స్పృహ సంబంధిత మంత్రికి లేకపోవడమే ఆశ్చర్యం.
దానితో టీడీపీ తరఫున చైర్మన్‌గా నియమితులయిన పి.కృష్ణయ్య పీసీబీని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వం నియమించిన బోర్డు సభ్యులకు పీసీబీపై కనీస అవగాహన లేదు. మెంబర్ సెక్రటరీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో.. బోర్డులో నిర్ణయాలు తీసుకుని, ర్యాటిఫికేషన్ కోసం పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే అవి కూడా వివాదాస్పదమవుతున్నాయి.
ప్రధానంగా.. దాదాపు 20-25 ఏళ్ల నుంచి కేవలం 18, 24, 30 వేల రూపాయలతో వెట్టిచాకిరీ చేస్తున్న.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేయడం ఎక్కడా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కంపెనీలతో కుమ్మక్కయి, దండిగా సంపాదిస్తున్న వారిని వదిలేసి, చిరుద్యోగుపై ప్రతాపం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మెంబర్ సెక్రటరీ ఒక్క కంపెనీని కూడా తనిఖీ చేయలేదని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.