Suryaa.co.in

Andhra Pradesh

మా చెరువు కనిపించడం లేదు సారూ..

-వంద ఎకరాల చెరువు మాయం
-ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు
-ఎమ్మెల్యే చెవిరెడ్డి సుందరీకరణ పేరుతో ఆ చెరువులో కోట్లు తగలేశారు
-48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక
-ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న రీతిలో నిరసన
-అవాక్కయిన పోలీసులు
-తిరుపతిలో విచిత్రమైన కేసు

మనుషులు మాయమవుతుండటం చూశాం. నగలు మాయమవుతుండం చూశాం. ఇళ్లలో పెంపుడు జంతువులు మాయవవుతుండటం చూశాం. మొన్నామధ్య మంత్రి కాకాణి నియోజకవర్గంలో ఏకంగా కోర్టులో పత్రాలే మాయమవడం చూశాం. కానీ ఏకంగా ఒక వందెకరాల చెరువు.. అది కూడా 180 ఎకరాల ఆయకట్టుతో పచ్చటిపొలాల మధ్య కనిపించే సువిశాల చెరువు మాయమవడం మీరెప్పుడైనా విన్నారా? కన్నారా? లేదు కదా?.. కానీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోకవర్గంలో, అచ్చంగా వందెకరాల చెరువును కాకులు ఎత్తుకెళ్లాయట. డజన్ల సంఖ్యలో వచ్చిన మొసళ్లు మింగేశాయట.

సహజంగా కనిపించకుండా పోయిన వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కాబట్టి.. ఆ సుధాయాదవ్ అనే అమాయకుడు కూడా.. ఉద్యోగం కావాలని స్వాతిముత్యం సినిమాలో సోమయాజులు చుట్టూ కమలహాసన్ తిరిగినట్లు… ‘‘మా చెరువు కనిపించడం లేదు. కొంచెం కనిపెట్టి మాకు ఇప్పించండి’’ అని అభ్యర్ధించారట.

దానితో బిత్తరపోయి, జుట్టుపీక్కున్న పోలీసులు ‘ఒరే సామి.. ఇది మా పనికాదు. పోయి ఆర్డీఓను కలువు. అయినా చెరువు కనిపించకపోవడమేమిట్రా సామి’ అని సర్దిచెప్పి పంపేశారట. ఇంతకూ కనిపించని ఆ వందెకరాల చెరువు కథేమిటి?.. అసలు లేని చెరువు సుందరీకరణ పేరుతో, అదే చెరువులో కోట్లు తగలేయడమేమిటి? ఎవరీ సుధా యాదవ్? ఆయన బాధేమిటో ఓసారి చూద్దాం రండి!

తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదైంది. తమ చెరువు కనిపించడం లేదని, తప్పిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చెరువును వెతికిపెట్టాలంటూ ఎమ్మార్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

తిరుపతిలో ఇదొక వెరైటీ మిస్సింగ్ కేసు.. పోలీసులే ఈ ఫిర్యాదు చూసి షాక్ అయ్యారు. సాధారణంగా పిల్లలు తప్పిపోయారనో లేదా ఇంట్లో వాళ్లు కనిపించలేదంటూనో పోలీస్ స్టేషన్‌‌కు ఫిర్యాదులు రావటం చూస్తుంటాం. తప్పిపోయిన తమవారిని వెతికిపెట్టాలంటూ వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుంటారు. కానీ.. తిరుపతి జిల్లా ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ఘటన జరిగింది.

చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన చెరువు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మా చెరువు కనిపించడం లేదు.. ప్లీజ్ వెతికిపెట్టండి సార్.. అంటూ పోలీసులను ఆశ్రయించాడు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు వంద ఎకరాల చెరువు కనిపించకుండా పోయిందనీ.. వెతికి పెట్టాలంటూ ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు చెరువు ఎక్కడున్నావ్.. చెరువు మిస్సింగ్ అంటూ ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో చెరువు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మార్ పల్లి పోలీసులు షాక్ అయ్యారు. ఇలాంటి భూమికి సంబంధించి విషయాలు రెవెన్యూ అధికారుల వద్ద తేల్చుకోవాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు సుందరీకరణ పేరుతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) నిధులు ఆ చెరువులో పోశారని సుధాయాదవ్ ఆరోపించారు.

గతంలో పేరూరు చెరువు, స్వర్ణముఖి నుంచి కాలువలు ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని అన్నారు. తుమ్మల గుంట చెరువు కారణంగా ఆ చుట్టుపక్కల సుమారు180 ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా, గ్రామాలు పుష్కలంగా ఉండేవన్నారు. అయితే ప్రస్తుతం చెరువులోకి నీళ్లు వచ్చే మార్గం లేకుండా పోయిందని సుధాయాదవ్ విమర్శించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు.

వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతిని ముంచెత్తుతోందన్న సుధాయాదవ్.. తుమ్మలగుంట చెరువు విషయంలో ఇటీవలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించిందని చెప్పారు.ఈ నేపథ్యంలోనే కనిపించకుండా పోయిన తుమ్మల గుంట చెరువును వెతికిపెట్టమని పోలీసులను, ఆర్డీవోను కోరినట్లు సుధాయాదవ్ చెప్పారు. తమ ఫిర్యాదుపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE