Suryaa.co.in

Editorial

వైసీపీ బెట్టింగులకు పొన్నవోలు ‘ఏడుపు’ దెబ్బ!

 – పొన్నవోలు ఏడుపుతో బెడిసికొట్టిన వైసీపీ బెట్టింగులు
– జగన్ కు సొంత వాళ్లే అన్యాయం చేస్తున్నారంటూ వెక్కి వెక్కి ఏడ్చిన పొన్నవోలు సుధాకర్రెడ్డి
– ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదంటూ కన్నీరు
– ఆ ఏడుపుతో బెట్టింగులకు భయపడుతున్న వైసీపీ నేతలు
– ఇప్పటికే బెట్టింగులు కాయవద్దంటూ కొమ్మినేని పిలుపు టౌన్లలో డౌనయిపోయిన వైసీపీ బెట్టింగులు
– ఏపీయేతర ప్రాంతాల్లో మాత్రం రెడ్ల బెట్టింగులు
– గతంలో కమ్మవారిని నిండా ముంచిన లగడపాటి సర్వే
– లగడపాటి సర్వే నమ్మి వందల కోట్లు నష్టపోయిన కమ్మవర్గం
– ఈసారి అదే దారిలో నష్టపోనున్న ఏపీయేతర రెడ్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైనాట్ 175?.. వైనాట్ కుప్పం.. సింహం సింగిల్గా వస్తుంది.. నినాదాలతో మొన్నటివరకూ అదరగొట్టిన వైసీపీ నేతలు, ఇప్పుడు తమ పార్టీ ఖాయంగా గెలుస్తుందని అంతే ధీమాతో బెట్టింగులు కట్టేందుకు భయపడుతున్నారు. దీనికి కారణం.. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఏడుపు.. ఎవరూ బెట్టింగులు కాయవద్దని, వైసీపీ అధికార చానెల్లో తీరికూర్చుని జాతినుద్దేశించి ప్రసంగించే, కొమ్మనేని శ్రీనివాసరావు పిలుపు! జగనన్నకు అత్యంత సన్నిహితులైన ఈ ఇద్దరికే, సొంత పార్టీ గెలుపుపై అసలు నమ్మకం లేనప్పుడు.. ఇక మనం బెట్టింగులు కట్టి చేతిచమురు వదిలించుకోవడం ఎందుకన్న ముందుచూపుతో, వైసీపీయులు బెట్టింగులకు భయపడిపోతున్న పరిస్థితి.

అసెంబ్లీ ఎన్నికల్లో సహజంగా వైసీపీ మపక్షాన బెట్టింగులు ఎక్కువగా జరుగుతుంటాయి. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా, వైసీపీ తరఫున వందల కోట్లలోనే పందాలు జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ కంటే వైసీపీ పక్షానే బెట్టింగులు ఎక్కువ జరిగాయి. ఏపీ మూలాలున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సింగపూర్, అమెరికాలో నివసించే రెడ్లు బెట్టింగుల్లో పోటీపడ్డారు.

అయితే ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గ్రామీణ-పట్టణ – నగరాల్లో బెట్టింగులు ఒక్కోరకంగా ఉంటాయి. గ్రామాల్లో ఎకరాలపై పందేలు జరుగుతుంటాయి. గోదావరి జిల్లాల్లో అయితే రొయ్య-చేపల చెరువులతో బెట్టింగులు కాస్తుంటారు. నగరాల్లో ప్లాట్లు-ఫ్లాట్లు, బిల్డింగులతో బెట్టింగులు కట్టే సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. వ్యాపార వర్గాలు – పెద్ద రైతుల నుంచి, ఒకస్థాయి ధనవంతుల వరకూ ఈ తరహా బెట్టింగులు కాస్తుంటారు. ఇక మధ్య-ఎగువ తరగతి వర్గాలు.. మందుపార్టీలు, తిరుపతి దర్శనాల ఖర్చు బెట్టింగులతో తమ ముచ్చట తీర్చుకుంటారు.

ఇప్పటివరకూ స్థానికంగా టీడీపీ నేతలతో, పోటాపోటీగా బెట్టింగులు కాసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాకు బెట్టింగులు వద్దని పారిపోతున్న వైచిత్రి. గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు తమ పార్టీ గెలుస్తుందని లక్ష రూపాయల పందెం కడితే.. తాము 5 లక్షలు ఇస్తామని టీడీపీ కార్యకర్తలు ముందుకొస్తున్నారు. అయితే మాకొద్దీ బెట్టింగులంటూ, వైసీపీ నేతలు పారిపోతున్న వైచిత్రి. అంటే లక్షకు ఐదులక్షలు ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇస్తున్నా పారిపోతున్న పరిస్థితి అన్నమాట.

దీనికి కారణం ఇటీవల జగన్ వీరాభిమాని అయిన, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఏడుస్తూ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ కావడమే. ఇటీవల లండన్ వెళ్లిన ఆయన, అక్కడి జగన్ అభిమానులు-రెడ్ల యువకిశోరాలతో భేటీ అయ్యారట.

ఆ సందర్భంగా పొన్నవోలు మాట్లాడుతూ.. “సో.. ఒక్క జగనన్న కోసం కాదు. జనం కోసం. మీ కోసం. ఒక మంచి పనిచేస్తున్నాడయ్యా. ఆయనెంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఆయన ఎంత ప్రమాదంలో ఉన్నాడో కూడా నాకు తెలుసు. అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి, ఎవరు మనోడో తెలియదు. ఎవరు పరాయోడో తెలియదు. ఇప్పటికే ఆయనను లెక్కచేయడం లేదు. ఏమైతే అది అవుద్ది. కానీ మనం జగనన్నను కాపాడుకోవాలి. ఆయన మనలను పలకరించాడా లేదా అన్నది కాదు. వీలుపడని పరిస్థితిలో ఉన్నాడాయన. దయచేసి అర్ధం చేసుకోండి. నాకు మీ ప్రతి ఒక్కరి ఫీలింగ్ తెలుసు. రండి మీరంతా ఒక్కరోజు రండి. అందరం కలసి పార్టీ చేసుకుందాం. నేను కలిపిస్తా” అని అక్కడి వారికి హామీ ఇచ్చారు. అంటే జగనన్న ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వరని, ఎవరినీ కలవరన్న విషయాన్ని పొన్నవోలు ఏడుపు ధృవీకరించినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అసలు పొన్నవోలు ప్రసంగమే, ఏడుపుతో ప్రారంభమైంది. ఆయన గుక్కపెట్టి భోరున ఏడవకపోయినా, వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని పోన్నవోలు ఏడుపు చెప్పకనే చెబుతోంది మరి! జగనన్న కష్టపడుతున్నాడు. ఎవరు మనోడో ఎవరు పరాయోడో తెలియదంటూ కన్నీటిపర్యంతమయితే, పక్కన ఉన్న మరో రెడ్డి గారు ఆయన టిస్యూ పేపర్ ఇస్తే, కళ్లు తుడుచుకున్న దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంటే జగనన్నను మనమే కాపాడుకోవాలన్న పొన్నవోలు మాటలు బట్టి, ఇక పార్టీని ఎవరూ కాపాడలేరన్నది

స్పష్టమయింది. దానితో వైసీపీ పరిస్థితిని ఊహించిన ఆ పార్టీ నేతలు, బెట్టింగులు కట్టడం మానేశారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక నిన్నటి వరకూ జగనన్న సర్కారులో నామినేటెడ్ చైర్మన్ పదవి అనుభవించి, మళ్లీ వైసీపీ అధికార మీడియాలోకి వెళ్లిన కొమ్మినేని శ్రీనివాసరావు తన చర్చా వేదికలో.. ఎవరూ బెట్టింగులు కట్టవద్దని, వైసీపీ శ్రేణులకు పిలుపునివ్వటం కూడా వైసీపీ నేతలను అప్రమత్తం చేసింది. సహజంగా గెలిచే పార్టీలో అంత నిరుత్సాహం కనిపించదు. దానికితోడు, స్థానిక వైసీపీ అభ్యర్థులు కూడా, తమ నేతలకు బెట్టింగులు కాయవద్దని హెచ్చరిస్తున్నారట. అంటే దీన్నిబట్టి.. వారి గెలుపుపై వారికే నమ్మకం లేదనేది స్పష్టమవుతూనే ఉందన్నది, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్య.

ప్రధానంగా పొన్నవోలు ఏడుపే వైసీపీ బెట్టింగులు బెడిసికొట్టేలా చేసిందని, వైసీపీ వర్గాలే మండిపడుతున్నాయి. పొన్నవోలు ఏడుపు మాటలు విన్న ఎవరికైనా.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని అర్ధమవుతుంది కాబట్టి, ధైర్యం చేసి ఎవరు పందాలు కాస్తారని ప్రశ్నిస్తున్నారు. జగనన్నే ప్రమాదంలో ఉన్నారని అంతలావు పొన్నవోలు చెప్పిన తర్వాత కూడా, పార్టీ తరఫున ఏ ధైర్యంతో పందాలు కట్టి డబ్బులెందుకు పోగొట్టుకుంటారని, స్వయంగా వైసీపీ నేతలే ఎదరు ప్రశ్నిస్తున్నారు.

కార్యకర్తలంతా చూసే పార్టీ చానెల్లో.. కొమ్మినేని అంతటి రాజకీయ విశ్లేషకుడే బెట్టింగులు కట్టవద్దని చెప్పారంటే.. పార్టీ అధికారంలోకి రాదన్న ఆయన ఆందోళన, కార్యకర్తలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉందని వైసీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

“ఇంకొద్దిరోజుల్లో కౌంటింగ్ ఉంది. దానికి కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మేం వారిలో అత్మస్థైర్యం నింపేందుకు జగనన్నకు 157 సీట్లు వస్తాయని ధైర్యం చెబుతున్నాం. కానీ అటు పొన్నవోలు ఏడుపు వీడియో, బెట్టింగులు కట్టవద్దన్న కొమ్మినేని పిలుపుతో మా క్యాడర్ ధైర్యం పూర్తిగా జారిపోయింది. ఇవన్నీ మా పార్టీ గెలవదన్న సంకేతాలే కదా? అసలు ఇలాంటి సమయంలో అలాంటి పిరికిమాటలు మాట్లాడితే, రేపు కార్యకర్తలు ఏ ధైర్యంతో కౌంటింగ్కు వస్తారు” అని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

అప్పుడు కమ్మ.. ఇప్పుడు రెడ్లకు నష్టం!
అయితే ఇతర రాష్ట్రాల్లో నివసించే వారి పరిస్థితి భిన్నంగా ఉందట. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై-విదేశాల్లో ఉండే రెడ్లు మాత్రం, కులాభిమానంతో వైసీపీ పక్షాన భారీ స్థాయిలో పందాలు కాస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఉండేవారు పందాలకు భయపడి పారిపోతుంటే, బయట రాష్ట్రాల్లో ఉన్న వారు మాత్రం బెట్టింగులు కాస్తుండటం ఆశ్చర్యం. వీరిలో రెడ్లే ఎక్కువగా ఉండటం మరో విశేషం.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఒక మీడియా ప్రోత్సాహంతో తెగ హడావిడి చేశారు. మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని లగడపాటి స్పష్టం చేశారు. ఆ మేరకు సర్వే విడుదల చేశారు. అంతకుముందు ఆయన సర్వేలు నిజం కావడంతో, పందెంరాయుళ్లు ఆయనపై నమ్మకంతో వందలకోట్ల పందాలు కాసి, నష్టపోయారు. ఆ నష్టపోయిన వారిలో కమ్మ వర్గానికి చెందిన వారే అధికం. ఏపీతోపాటు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు నుంచి విదేశాల్లో నివసించే కమ్మ ధనికులంతా టీడీపీ వైపు బెట్టింగు కాసి, నెత్తిన చెంగేసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు మళ్లీ సరిగ్గా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కాకపోతే ఈసారి కమ్మ బదులు.. రెడ్లు మునిగిపోయేందుకు, సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి గతానికి భిన్నంగా.. ఏపీలో నివసించే రెడ్లు మాత్రం, వైసీపీ ఓటమి గ్రహించి పందేలకు దూరంగా ఉండగా, ఏపీయేతర ప్రాంతాల్లో నివసించే రెడ్లు మాత్రం.. భారీ బెట్టింగులు కాసి, చేతులు కాల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు, పందెంరాయుళ్లలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. సట్టాబజార్ అనే బెట్టింగ్ సైట్లో వైసీపీ తరఫున, ఈ తరహా పందాలు కాస్తున్న వారిలో రెడ్లే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

దానికి కారణం తాజాగా వైసీపీ సోషల్మీడియా సైన్యం.. జగనన్న ప్రమాణస్వీకారం 9న విశాఖలో ఫిక్సవడంతో, అందరూ విశాఖకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారట. దానితో విశాఖలో అన్ని హోటళ్లూ బుక్కయిపోయాయట. రైళ్లు, విమానాలు, బస్సులూ ఫుల్లయిపోయాయంటూ కొత్త ప్రచారానికి తెరలేపటం కూడా, ఈ బెట్టింగులకు ఒక కారణమట.

గతంలో లగడపాటి కూడా సొంత సామాజికవర్గ చానెళ్లలో ఇలాగే ఊదరగొట్టి, కమ్మ వర్గాన్ని నిండాముంచిన వైనాన్ని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. అంటే ఆ లెక్కన ఇప్పుడు, కమ్మ వర్గ స్థానాన్ని రెడ్లు భర్తీ చేస్తున్నారన్నమాట.

LEAVE A RESPONSE