(మార్తి సుబ్రహ్మణ్యం)
వర్ధమాన నటుడు సిద్దూ జొన్నలగడ్డ వరద బాధితుల సహాయం కోసం 30 లక్షలు ఇచ్చారు.
విష్వక్‌సేన్, వెంకట్ అట్లూరి 10 లక్షలు, అనన్య నాగళ్ల రెండున్నర లక్షలు ప్రకటించారు.
– వీరంతా చిన్న నటులు. లోబడ్జెట్ సినిమాల నటీనటులు.
ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు కోట్లు ఇచ్చారు.
బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్,అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలకూ కోటి రూపాయలు ప్రకటించారు.
చిరంజీవి రెండు రాష్ట్రాలకూ కోటి రూపాయలు ఇచ్చారు.
అసలు తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని సోనూ సూద్ రెండు కోట్ల విరాళం ప్రకటించారు.
వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షలు రూపాయలు ప్రకటించారు.
– వీరిలో అశ్వనీదత్‌ను మినహాయిస్తే, మిగిలినవారంతా 20 నుంచి 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే బడా స్టార్లు.
సీన్ కట్ చేస్తే..
పేదల ప్రతినిధి అయిన వైకాపా అధినేత జగన్ కూడా.. భారీ వర్షాలకు నష్టపోయిన బాధితుల సహాయం కోసం.. కోటి రూపాయల ‘పెద్ద మొత్తాన్ని’ పెద్ద మనసుతో విరాళంగా ప్రకటించారు. ఇది నిఖిల ప్రపంచం నివ్వెరపోయే వార్తనే. ఎందుకంటే వైసీపీ ఈ దేశంలోనే అతి పేద పార్టీలో ఒకటి. దానికంటే ముందువరసలో బీఆర్‌ఎస్ ఉంది. ఇటీవల ప్రకటించిన రాజకీయ పార్టీల ఆస్తుల్లో ఆ రెండు పార్టీల బ్యాంకు నగదు కేవలం 400 కోట్ల నుంచి నుంచి వెయ్యి కోట్లు మాత్రమేనట!
అయినా సరే.. తమ పేదరికాన్ని లెక్కచేయకుండా జగన్ వరద బాధితులకు కోటి రూపాయల పెద్ద మొత్తం ఇవ్వడం గొప్ప విషయమే కదా? కోటిరూపాయలంటే తమాషా కాదు. 100 లక్ష లు కలిపితే ఒక కోటి. 10వేల వెయ్యి రూపాయల నోట్లు కలిపితే ఒక కోటి. వంద రూపాయల నోట్లు ఒక లక్ష ఇస్తే ఒక కోటి.
ఇక జగన్ ఇంత పేదరికంలో కూడా, కోటి రూపాయలు ప్రకటించటం హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటిదాకా పార్టీపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కుడిచేతితో కూడా రూపాయి విరాళం విదిల్చిన చరిత్ర లేదు. అందుకే ఆ హాశ్చర్యం! మరి ‘అహనా పెళ్లంట’ సినిమాలో, కోట శ్రీనివాసరావు లెక్క ‘గుప్తదానాలు’ చేస్తారేమో ఆ ‘జగన్నా’ధుడికెరుక.
సిమెంట్ ఫ్యాక్టరీ, మైనింగ్, పవర్ ప్రాజెక్టు, మీడియా ఇంకా లెక్కలేనన్ని కంపెనీలకు యజమాని అయిన జగనన్న.. అంత పేదరికం గడుపుతూ కూడా కోటి రూపాయలు ప్రకటించడాన్ని, బాధితుల గుండెలు తట్టుకోలేకోపోతున్నారట. అసలు చాలామంది బెజవాడ బాధితులు ఆ వార్త విని స్పృహకోల్పోయారన్నది ఒక టాక్. జగనన్నది ఇంత పెద్ద విశాల హృదయమని తెలియక, ఆయనకు ఓటు వేయలేకపోయామేనని నీళ్లలో తీరికూర్చుని విచారిస్తున్నారట. అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో, ఎలా పంచాలో, ఎన్ని హెలికాఫ్టర్లు, ఎన్ని పడవలు, ఎన్ని డ్రోన్లు తెప్పించాలో తెలియక తల పట్టుకుందట.
నిజానికి జగనన్న పార్టీ పెట్టినప్పటినుంచి, ఇంత పెద్ద సాహసం చేసిన దాఖలాలు లేవు. అందుకే ఇలాంటి కొత్త అలవాటు చూసి జగనేయులు సైతం హాశ్చర్యపోతున్నారట. వ్యాపారస్తుడైన ‘అన్నయ్య సంగతి’ బాగా తెలిసిన వైకాపేయులు కూడా, జగన్‌సారు చేసిన సాహసం విని ఓసారి తమ చేతిని తామే గిల్లుకుంటున్నారట.
పోనీలెద్దురూ.. తినడానికి సైతం లేక నానా కష్టాలు పడుతూ, స్పెషల్‌ఫ్లైట్లలో వెళ్లిన అన్నియ్య దంపతులు ఇప్పుడు ఆర్డినరీ క్లాసులో జర్నీ చేస్తున్నారు. పదికిలోమీటర్ల దూరానికే హెలికాఫ్టర్‌లో తిరిగిన అన్నియ్య , ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. బెంగళూరు మంత్రి నివాస్, హైదరాబాద్ లోటస్‌పాండ్, తాడేపల్లి ప్యాలెస్‌కు కరెంటు బిల్లులు, వాటరు బిల్లులూ, చివరాఖరకు ఇల్లు ఊడ్చే స్వీపర్లకూ జీతాలివ్వలేని దుస్థితి. ఏ రోజు బియ్యం ఆరోజు తెచ్చుకునే దయనీయ పరిస్థితిలో ఉన్న జగనన్న నుంచి కోటిరూపాయలకు మించి ఆశించడం అత్యాశనే కాదు.దురాశన్నర!
ఆ టీడీపీ మహిళా నేత అన్నాబత్తుని జయలక్ష్మి.. ఏకంగా ‘లక్షకోట్లు సంపాదించిన జగన్ జనం కోసం ఓ వందకోట్లు ఇవ్వలేరా’? అని ప్రశ్నిస్తే, విని తట్టుకునేంత గట్టి గుండె మా పులివెందులబిడ్డడిది కాదన్నది వైకాపేయుల విప్పిన రహస్యం.
మరి సిద్దూ జొన్నలగడ్డ, విష్వక్‌సేన్, వెంకట్ అట్లూరి 10 లక్షలు, అనన్య నాగళ్ల రెండున్నర లక్షలు ప్రకటించారు. వాళ్లంతా చోటా మోటా యాక్టర్లు కదా అని లా పాయింటు తీసేవాళ్లూ లేకపోలేదు. అయితే.. ‘ మన దగర్గఉన్నాయని ఇచ్చేస్తారా ఏందప్పా? ‘లెక్క’ చూసుకోవద్దా? ‘దుడ్డు’ ఉన్నాయికదాని దొడ్డ మనసుతో ఇస్తూ పోతే, మనది రాజకీయ పార్టీనా? మదర్‌థెరిసా మిషనా ఏంది సామీ’ అన్నది ఓ పులివెందుల బిడ్డ చెప్పిన ‘లెక్క’సూత్రం.
కాసేపు అదే నిజమనుకుంటే.. మరికొన్ని దశాబ్దాల నుంచి చంద్రబాబునాయుడు టీడీపీ- ఎన్టీఆర్ ట్రస్టు నుంచి కోట్లాదిరూపాయలు బాధితులకు విరాళంగా ఇస్తున్నారు కదా? ఉమ్మడి రాష్ట్రంలో వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు- టీడీపీ నుంచి నిత్యావసర వస్తువులు, వంటసామాన్లను వందల లారీలలో పంపించారు కదా? బాధితులకు కోట్ల రూపాయల ఆర్ధిక సాయం ఇస్తున్నారు కదా? పేద పిల్లలను ఎన్టీఆర్ స్కూల్-కాలేజీలో ఉచితంగానే చదివిస్తున్నారు కదా?
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు ఫ్రీగానే వైద్యచికిత్స చేస్తున్నారు కదా? రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్‌బ్యాంకులు పెట్టి రక్తదానం చేస్తున్నారు కదా? విపత్తు సమయాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు-ఎంపీలు తమ నెలజీతం ఇస్తున్నారు కదా? మంగళగిరిలో మహిళల స్వయంసహాయక బృందాలకు కుట్టుమిషన్లు, చేనేత మరమగ్గాలు ఉచితంగానే ఇస్తున్నారు కదా? మరి మన జగనన్న కూడా ఆ పనులు ఎందుకు చేయరు? సంపాదించిన డబ్బును అలా సమాజ హితం కోసం కొంత ఖర్చు చేయవచ్చు కదా?
అలా చేస్తే మన పేరూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా అన్నది, వైకాపా జగనేయుల వాదన లాంటి సందేహస్తుల సూచన. అది విని, పులివెందుల పులిబిడ్డలు వారివైపు అమాయకంగా ఓ లుక్కేసి.. ‘మొన్న ఐదేళ్లు జగనన్న సంపాదించిన పేరు చాలన్నా. అది వెయ్యేళ్ల చరిత్రపెట్టు. అది చాలక ఇంకా దుడ్డు పంచుకుంటా పోతామా ఏందప్పా’ అన్నది అంతఃపుర ఆన్సరట!
కాబట్టి.. ప్లీజ్.. కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని మా అన్నియ్యను చులకనగా చూడకండి. పిసినారి అని ట్రోల్ చేయకండి. ఎంతిచ్చామన్న ‘లెక్క’ కాదు. అసలిచ్చామా? లేదా అన్నదే పాయింటు. ‘మాకూ మంచిరోజులొస్తాయ్. అప్పుడు మేమూ ఇంకో రెండు కోట్లు ఇస్తంలే’నన్నా అన్నది జగనేయుల జవాబు.