పరిశ్రమలకు వారానికి ఒకరోజు విద్యుత్తు కోత
జిల్లాలవారీగా వారంలో ఒక్కోరోజు కోత
తెలంగాణలో ఆర్నెల్లలోనే విద్యుత్తు వెలుగులు
ఎంత గరిష్ఠ డిమాండ్ వచ్చినా 24 గంటల సైప్లె
సింగిల్ ఇంజిన్ రాష్ట్రంలో డబుల్ గ్రోత్
గుజరాత్ డబుల్ ఇంజినా.. ట్రబుల్ ఇంజినా
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ఎద్దేవా
1998.. మార్చి.. గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 24 ఏండ్లు పూర్తయింది. 2001 అక్టోబర్‌లో ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రాష్ట్ర సీఎంగా పవర్లోకి వచ్చారు. 2014లో ప్రధాని అయ్యేదాకా సీఎం పదవిలోనే ఉన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు బీజేపీ నేతలు ఆ పదవిని అధిష్ఠించారు. మోదీ ఢిల్లీ గద్దెనెక్కినప్పటి నుంచి అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ రాజ్యమేలుతున్నది. ఇన్నేండ్ల పరిపాలన తర్వాత కూడా ఆ రాష్ట్రం కరెంటుకు కటకటలాడుతూనే ఉన్నది. వ్యవసాయానికి భారీగా కోతలు నడుస్తున్నాయి. గత శుక్రవారం నుంచి గుజరాత్లో రైతులు విద్యుత్తు కోసం ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం తాజాగా పరిశ్రమలకు ఏకంగా వారానికి ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. దాదాపు పాతికేండ్ల అధికార పర్వంలో విద్యుత్తు సమస్యను అధిగమించలేకపోయారు.
ఎనిమిదేండ్లలోనే కేసీఆర్
24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వగలిగినప్పుడు..
24 ఏండ్ల పరిపాలనలో
మోదీ గుజరాత్‌కు ఎందుకు ఇవ్వలేకపోయారు?
ఎవరిది సమర్థత?
ఎవరిది అసమర్థత?
ఎవరివి కోతలు?
ఎవరివి చేతలు?
ప్రగల్భాలకు.. కార్యసాధకుడికి ఉన్న తేడా ఇది..
గుజరాత్లో ట్రబుల్ ఇంజిన్
గుజరాత్ లాంటి డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తున్నదంటూ మోదీ, ఆయన అనుచరగణం గొప్పలు చెప్పుకోవడంలో తక్కువేం లేదు. కానీ గుజరాత్లో విద్యుత్తు పరిస్థితి మాత్రం నానాటికి తీసికట్టు.. నాగంభొట్లులా మారిందని తాజాగా జీయూవీఎన్‌ఎల్ డైరెక్టర్ ఉత్తర్వులు చెప్పకనే చెప్తున్నాయి. మంగళవారం నాటి ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, దీనిని క్షేత్రస్థాయిలో అమలుచేసేలా అధికారులను ఆదేశించాలని, సంబంధిత పరిశ్రమలకు కూడా దీనిని తెలియజేస్తూ.. కచ్చితంగా ఒకరోజు పవర్ హాలిడే పాటించేలా చూడాలని స్పష్టంచేశారు. ఇప్పటివరకు డబుల్ ఇంజిన్ అంటూ ఊదరగొట్టిన బీజేపీ నేతలకు.. గుజరాత్ ఓ ట్రబుల్ ఇంజిన్ అని తేలిపోయింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో.. అదీ అడుగకముందే నిధులు కుమ్మరిస్తున్నప్పటికీ సోకాల్డ్ గ్రోత్ ఎటు పోయిందో బీజేపీ నేతలు వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
కేసీఆర్.. సింగిల్ ఇంజిన్.. డబుల్ గ్రోత్..
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలంటే.. సింగిల్ ఇంజిన్ రాష్ట్రాలంటూ ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు.. తెలంగాణలో అప్రతిహతంగా అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నందుకు ఏం చెప్తారో వినాలి. తెలంగాణకు ఉన్న సింగిల్ ఇంజిన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే. తెలంగాణ వచ్చినప్పుడు విద్యుత్తు విషయంలో ఉన్న పరిస్థితిని, గడిచిన ఏడున్నరేండ్ల కాలంలో విద్యుత్తు విషయంలో సాధించిన ప్రగతిని చూస్తే.. కేవలం సింగిల్ ఇంజిన్‌తోనే డబుల్ గ్రోత్ సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందించి సత్తా చాటారు. 2018 జనవరి ఒకటి నుంచి దేశంలోనే ఎవరూ సాధించని విధంగా వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల పాటు పూర్తి ఉచితంగా, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 13,162 మెగావాట్లను గతేడాది మార్చి 26 న దాటేసి తెలంగాణ సత్తా చాటింది. ఆ రోజు 13,688 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. ఈ నెలలో గడిచిన నాలుగు రోజుల్లో మూడుసార్లు రికార్డులు బ్రేక్ అయ్యాయి. గతేడాది రికార్డును ఈ నెల 26 బ్రేక్ చేసి, 13,742 మెగావాట్లు నమోదయ్యింది. మంగళవారం 14,160 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవ్వడంతో దక్షిణ భారత దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.
కోతలపై రైతుల నిరసన
గుజరాత్లో అన్నదాతలను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి కనీసం 3 గంటలు కూడా కరెంటును సరఫరా చేయడంలేదు. దీంతో వేలాదిమంది రైతన్నలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదికొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొదలైన నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. వ్యవసాయానికి 8 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేస్తామన్న సర్కారు మాటతప్పిందని అన్నదాతలు మండిపడ్డారు. రైతులకు మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
డబుల్ ఇంజినా.. ట్రబుల్ ఇంజినా?: మంత్రి కేటీఆర్ ఎద్దేవా
గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. పవర్ ఫుల్ వ్యక్తులుగా చెప్పుకొనే వారి సొంత రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? అని వ్యంగ్యాత్మకంగా ప్రశ్నించారు. ఇది డబుల్ ఇంజినా? లేక ట్రబుల్ ఇంజినా? అని విమర్శించారు. గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటిస్తూ గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని షేర్ చేశారు.