రాజుగారి… జగన్ క్యాబినెట్

-కొత్త మంత్రులను సిఫార్సు చేసిన రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వినడానికి కొంచెం ఆశ్చర్యమనిపించినా ఇది నిజంగా నిఝం. అసలు జగనన్నంటే కారాలు మిరియాలూ నూరే రఘురామకృష్ణంరాజేమిటి? జగనన్న క్యాబినెట్ లో ఎవరిని తీసుకోవాలని సిఫార్సు చేయడమేమిటి? అసలు తమకు మంత్రి పదవులు కావాలని జగనన్న ఎదుటకెళ్లి చెప్పుకునే ధైర్యం లేక, సీనియర్లే చొక్కా లాగూలు తడిపేసుకుని ఆయనకు కనబడకుండా తిరుగుతుంటే.. మధ్యలో ఈ రాజుగారు ఏమోయ్ జగన్.. ఫలానా వాళ్లకు మంత్రి పదవులిచ్చేసేయని సిఫార్సు చేయడమేమిటి? అదేదో తన సొంత క్యాబినెట్ మాదిరిగా ! అన్నదే కదా అందరి సందేహం.

యస్. ఎంతలేదన్నా.. ఎంత తిట్టుకున్నా.. ఇంకెంత తనని సీఐడీతో కొట్టించినా.. తనపై డజన్ల కొద్దీ కేసులు పెట్టించి, ఆంధ్రాకు రానీయకుండా చేసినా.. రాజుగారికి ఇంకా జగనన్న మీద ప్రేమ చావనట్లుంది. ఎంత చెడ్డా సొంత పార్టీ కదా? ఆ మాత్రం ప్రేమానురాగాలు, పార్టీ పేగుబంధం ఎక్కడికి పోతుంది చెప్పండి?

అందుకే రాజు గారు ఆ ప్రేమతో ఎవరికి మంత్రి పదవులిస్తే పార్టీ భారతి సిమెంట్ మాదిరిగా పటిష్టంగా ఉంటుందో బహుశా ఒక లిస్టు చెప్పి ఉంటారు. అయినా.. పెద్ద పెద్ద
సీనియర్లే ‘ఇవన్నీ మాకెందుకు? మమ్మల్ని అడిగి జగనన్న నిర్ణయాలు తీసుకుంటారా ఏమిటి? మరీ అత్యాశ కాకపోతే’..అని నవరంధ్రాలూ మూసుకుని, మౌనంగా ఉంటే.. రాజు గారు ఆమాత్రం సాహసం చేసినందుకు వైసీపేయులు ఆయనకు రుణపడి ఉండాల్సిందే. ఆరకంగా పిల్లిమెడలో రాజుగారు గంటయితే కొట్టారు. ఇక అది మోగడమే తరువాయి!

రానున్న కొత్త క్యాబినెట్లో సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని
సీతారాం, రోజారెడ్డి, బొత్స అప్పలనర్సయ్య, అంబటి రాంబాబు, మహీధర్ రెడ్డి, చెవిరెడ్డి, గ్రంధి శ్రీనివాస్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, పీడిక రాజన్నదొర,గొల్ల బాబూరావు, తోట త్రిమూర్తులు, పొన్నాడ సతీష్ కుమార్, కొలుసు పార్థసారథి, రవీంద్రనాథ్ రెడ్డి, నవాజ్ బాషా,జొన్నలగడ్డ పద్మావతి, డొక్కా మాణిక్యవరప్రసాద్, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు, మర్రి రాజశేఖర్, విడదల రజని, రెడ్డి శాంతితోపాటు సకలశాఖల మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవులివ్వాలని రాజు సీఎంకు సలహా ఇస్తున్నారు. ఇందులో ప్రతిరోజూ తనను విమర్శించేవారు కొంతమంది ఉన్నప్పటికీ, వారికీ ఆయన మంత్రి పదవులివ్వాలని సిఫార్సు చేయడమే ఆశ్చర్యం.

చెప్పాను.. అయితే తప్పేంటి?
ఎంపీ రాజు తన తాజా ప్రెస్ మీట్లో కొత్త మంత్రులను సిఫార్సు చేసిన వైనంపై ఆశ్చర్యం వేసి, అసలు మీకు పార్టీతో సంబంధం లేనప్పుడు మీరెలా సిఫార్సు చేస్తారని ప్రశ్నిస్తే… ‘అవును. చెప్పాను. తప్పేంటి? నేను ఇంకా పార్టీ సభ్యుడినే. నన్నేమీ బహిష్కరించలేదు. అలాంటప్పుడు పార్టీ మంచిచెడ్డలు చూడటం నా విధి. నేను చెప్పిన వాళ్లంతా మంత్రి పదవులకు అర్హులే. అఫ్ కోర్స్. వాళ్లలో నన్ను తిట్టేవాళ్లున్నా నేను పట్టించుకోను. అది వాళ్ల విజ్ఞత. పోనీ నన్ను తిట్టేవారికి పదవులిస్తే నాకూ సంతోషం. నావల్ల వారికి పదవులొచ్చాయని నేనూ ఆనందిస్తా. అదేమీ లేకుండా వారిని కరివేపాకులా వాడుకుని వదిలేయటం మంచిదికాదన్నని ఆ సూచన. ఆనం రామనారాయణరెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన, అంబటి రాంబాబు, బొత్స అప్పలనర్సయ్య, రవీంద్రనాథ్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రోజా, మల్లాది విష్ణు, నవాజ్ బాషా, దాడిశెట్టి రాజా, డొక్కా, పీడిక రాజన్నదొర, తోట త్రిమూర్తులు వీళ్లంతా పార్టీకి సేవలు చేస్తున్నవాళ్లు. వీరిలో దాదాపు అంతా సీనియర్లే. వాళ్లకు మంత్రి పదవులివ్వాలని సూచించడం తప్పెలా అవుతుంది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా పార్టీపై నాకు ఆ మాత్రం కూడా ప్రేమ, హక్కు ఉండకూడదా’ అని రాజు ప్రశ్నించారు.

కొత్త మంత్రుల్లో అవసరమైతే రెడ్లను రెండు పదవులకు పరిమితం చేసి, కాపులు-బీసీలు-దళితులకు ఎక్కువమందికి ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన సూచించారు. ఎలాంటి పదవులు లేకుండా సలకశాఖ మంత్రి అన్న అప్రతిష్టకు గురవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డికి సమాచార శాఖ మంత్రి ఇస్తే, పార్టీపై నిందలు తగ్గుతాయనే నేను ఆయన పేరు సిఫార్సు చేశానన్నారు.

రాజుకు వారిపైనే ప్రేమెందుకో..?
క్యాబినెట్ పై ఆశలు పెట్టుకునే వారు చాలామంది ఉండగా.. ఎంపీ రాజు కేవలం వాళ్ల పేర్లే ప్రస్తావించడం ఆశ్చర్యం. అందులో తనను విమర్శించే సజ్జల రామకృష్ణారెడ్డి, గ్రంధి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ప్రసాదరాజు లాంటి వాళ్లు కూడా ఉండటం ఇంకో ఆశ్చర్యం. సరే ఆనం, ధర్మాన, తమ్మినేని, రవీంద్రనాథ్ రెడ్డి, అంబటి, పీడిక రాజన్నదొరకు మంత్రి పదవులివ్వకుండా అన్యాయం జరిగిందన్న భావన పార్టీలో అందరికీ ఉంది. అది వేరే విషయం .

అయితే కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో చాలామంది రఘురామకృష్ణంరాజుతో టచ్ లో
ఉంటున్నారన్న చర్చ చాలాకాలం నుంచి వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. కీలకమైన విషయాలు ఎప్పటికప్పుడు ఆయన చేరడం, వెంటనే ఆయన దానిపై ప్రెస్ మీట్ పెట్టడం కనిపిస్తూనే ఉంది.

Leave a Reply