(కెఎబాబు)
మన దేశంలో వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను వేగంగా విస్తరించడానికి, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) మోడల్ ఒక విప్లవాత్మక పరిష్కారంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బలాన్ని మేళవించి, డాక్టర్ల కొరతను తీర్చడానికి ఇది ఒక సమగ్ర పరిష్కారాన్ని అందిస్తోంది.
ఈ విధానం విద్యార్థులకు, రోగులకు ఎందుకు ప్రయోజనకరం?
ఒక కొత్త వైద్య కళాశాల, 750 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి ₹600–800 కోట్ల భారీ వ్యయం అవుతుంది. పీపీపీ మోడల్ ఈ పెట్టుబడి, నిర్వహణ భారాన్ని ప్రైవేట్ భాగస్వామికి బదిలీ చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వం తన నిధులను ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించడానికి వీలు కలుగుతుంది.
సమర్థవంతమైన పాలన లేని పరిస్థితులలో ప్రభుత్వ ఆసుపత్రులలో సవాళ్లు ఎదురవుతాయి. గతంలో గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు కొరికి ప్రాణం పోవడం, విజయవాడ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం వంటి భద్రతాపరమైన లోపాలు, ఆక్సిజన్ లేక, కరెంట్ లేక ప్రాణాలు కోల్పోవడం, మాస్క్ అడిగిన వైద్యుడిని హింసించిన ఉదంతాలు మీడియాలో చూశాం.
పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలు నిధులు సమీకరించి, నిర్మాణ పనులను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయగలవు. ఇది డాక్టర్-జనాభా నిష్పత్తిని మెరుగుపరచడంతో పాటు, కళాశాలలు సకాలంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలను పాటించడానికి సహాయపడుతుంది.
విదేశీ విద్య సమస్యలకు పరిష్కారం: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, బంగ్లాదేశ్‌లో తిరుగుబాట్లు, కరోనా వంటి సంక్షోభాల సమయంలో విదేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వారికి స్వదేశంలో తగినన్ని సీట్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
మన దేశంలో సెల్ఫ్-ఫైనాన్స్ కోటా ఫీజుల కన్నా తక్కువ ఫీజులకు వస్తున్నాయని విదేశాలకు వెళ్లే విద్యార్థులు తరచుగా సమస్యలు ఎదుర్కొంటారు. తిరిగి వచ్చాక, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) పరీక్ష పాస్ కావడంలోనూ, లైసెన్స్ పొందడంలోనూ జాప్యం ఎదురవుతుంది. పీపీపీ మోడల్ ద్వారా మన దేశంలోనే సీట్లు పెంచడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం.
అమెరికాలోని తెలుగు వారు కూడా మన దేశంలో వైద్య విద్య నాణ్యతను ప్రశంసిస్తూ, ఎన్ఆర్ఐ కోటాలో ఇక్కడి కళాశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తుంటారు. భవిష్యత్తులో మెడికల్ టూరిజం కింద ఈ పీపీపీ ఆసుపత్రులు విదేశాల నుండి కూడా రోగులను తక్కువ ఖర్చులతో ఆకర్షించే అవకాశం ఉంది. దీనివల్ల మన డబ్బులు విదేశాలకు వెళ్లవు.
ప్రధాన ప్రయోజనాలు: ప్రభుత్వ, ప్రైవేట్, పీపీపీ మధ్య తేడాలు
ఈ మూడు నమూనాలను పరిశీలిస్తే, పీపీపీ ఒక సమతుల్య మార్గాన్ని అందిస్తుంది.
బోధనా ఫీజు:
ప్రభుత్వ కళాశాల: ఫీజు చాలా తక్కువగా ఉంటుంది (దాదాపు ₹40,000–₹1 లక్ష/సంవత్సరం). నీట్లో మంచి ర్యాంకు వస్తేనే ఈ సీటు వస్తుంది.
ప్రైవేట్ కళాశాల: చాలా ఎక్కువగా ఉంటుంది (₹10–25 లక్షలు/సంవత్సరం). ఇందులో కూడా ప్రభుత్వ కోటా సీట్లు ఉంటాయి, కానీ ప్రభుత్వ కళాశాలలో సీటు వచ్చే ర్యాంకు కన్నా మంచి ర్యాంకు రావాలి.
పీపీపీ కళాశాల: ఇందులో కూడా ప్రభుత్వ మెరిట్ కోటా సీట్లు ఉంటాయి. ప్రభుత్వ ఫీజులకే అందుబాటులో ఉంటాయి. యాజమాన్య కోటా ఫీజులు ప్రైవేట్ కళాశాలల కన్నా తక్కువగా, మధ్యస్థంగా, నియంత్రించబడి ఉంటాయి.
క్లినికల్ ఎక్స్పోజర్ (రోగుల సంఖ్య):
ప్రభుత్వ కళాశాల: రోగుల సంఖ్య అధికంగా ఉంటుంది.
ప్రైవేట్ కళాశాల: కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో రోగుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు.
పీపీపీ కళాశాల: జిల్లా ఆసుపత్రికి అనుసంధానం కావడం వల్ల, రోగుల సంఖ్య అధికంగా, స్థిరంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు స్థానిక వైద్యులతో పోటీపడాల్సి రావడం వల్ల, రోగులను ఆకర్షించడానికి మెరుగైన పద్ధతులను అవలంబిస్తాయి.
ఫ్యాకల్టీ:
ప్రభుత్వ కళాశాల: జీతాల పరిమితుల వల్ల నిపుణుల నియామకం ఆలస్యం అవుతుంటుంది. కొన్ని ప్రాంతాలకు నిపుణులు రాకపోవచ్చు.
ప్రైవేట్ కళాశాల: మంచి జీతాలు ఇస్తూ నిపుణులను ఆకర్షిస్తాయి.
పీపీపీ కళాశాల: ప్రైవేట్ భాగస్వామి మంచి జీతాలను ఆఫర్ చేయడం ద్వారా నిపుణులను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది, అయితే రాష్ట్ర పర్యవేక్షణ కూడా ఉంటుంది.
రోగులకు కలిగే ప్రయోజనాలు:
అందుబాటు, నాణ్యమైన వైద్యం: పీపీపీ ఆసుపత్రుల్లో రోగులు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను సబ్సిడీ ధరల్లో పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కింద ఉచితంగా కూడా వైద్యం పొందవచ్చు.
మౌలిక సదుపాయాలు: ప్రైవేట్ భాగస్వామి ఆసుపత్రిని ఆధునిక సాంకేతికత, సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేస్తారు.
మన సమాజంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం నామోషీగా భావిస్తారు. బంధువులు చిన్న చూపు చూస్తారని, అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పిస్తుంటారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా బెడ్లు దొరకక, లక్షల్లో ఖర్చు చేసిన వారూ ఉన్నారు.
పీపీపీ మోడల్‌పై రాజకీయ విశ్లేషణ, చారిత్రక వాస్తవాలు
మంత్రి మండలిలో ఆమోదం పొందగానే, దీనిపై అవగాహన లేకుండా, “రాష్ట్రంలో వైద్యాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారని” ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. ప్రచారం కోసం ఎన్ని ఆర్భాటాలు చేసినా, వాస్తవరూపం దాల్చకపోతే ప్రజలు గమనిస్తారు.
వైద్య కళాశాలలు – చారిత్రక వాస్తవాలు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత చంద్రబాబు 27 మెడికల్ కాలేజీలతో 5015 మెడికల్ సీట్లు తెచ్చారు. రాజశేఖర్ రెడ్డి 8 కాలేజీలు తెచ్చి 1245 సీట్లు తెచ్చారు. జగన్ రెడ్డి 5 తెచ్చి 950 సీట్లు తెచ్చారు.
ప్రచారం కోసం 17 కాలేజీలకు శంకుస్థాపన చేసేసి, వాస్తవరూపం దాల్చక, ఎన్నికల్లో చెంపకు ఒకటి లెక్కన చెరో చెంపకు జగన్ వాయించుకోవడం తెలిసిందే.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటాను అమలు చేసింది జగన్ ప్రభుత్వం.
మన రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తెచ్చింది రామారావు. అయితే, ఆయన పేరు బదులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం వివాదాస్పదమైంది.
ఉమ్మడి ఆంధ్రాలో రామారావు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)*ను ఆధునీకరించి, విస్తరించారు. అలాగే, గాంధీ ఆసుపత్రి ఆధునీకరణకు ఆయన శంకుస్థాపన చేస్తే, పనులు పూర్తి చేసి చంద్రబాబు ప్రారంభించారు.
కర్ణాటక, తమిళనాడులో తెలుగు మైనారిటీ మెడికల్ కాలేజీలు వున్నాయి. అత్యధికంగా కర్ణాటకలో 5 వున్నాయి. అందులో మన తెలుగు వారికి బి కేటగిరీ (సెల్ఫ్ ఫైనాన్స్) క్రింద సీట్లు కేటాయిస్తారు. అక్కడ స్థానికంగా వుండే తెలుగు విద్యార్థులతో ఆ కోటా ఎప్పుడూ పూరతైపోతాయి అంటే ఎంత డిమాండ్ వుంటుందో చూసుకోండి. ఆ రాష్ట్రంలో అడ్డుపడి వుంటే మన తెలుగువారు ఏటా అంత మంది వైద్యులు అయ్యేవారా?
ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రేమను ఒలకబోస్తూనే, ప్రైవేట్ వారికి కూడా ఇచ్చే ఆరోగ్యశ్రీ మీద గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులు పీపీపీ మీద విమర్శలు చేయడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, వైద్య రంగంలో అవసరమైన మార్పులను తీసుకురావడానికి పీపీపీ ఒక సాహసోపేతమైన, ఆచరణాత్మకమైన అడుగు అని చెప్పవచ్చు.