Suryaa.co.in

Andhra Pradesh

చరిత్రలో నిలిచిపోయేలా ప్రజాగళం సభ

– ప్రత్తిపాటి పుల్లారావు

ప్రజాగళం సభ చరిత్రలో పది కాలాలపాటు నిలిచిపోతుందని అన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఆ స్థాయికి తగిన రీతిలోనే సభ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కూటమి తరఫున ఇంత భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమం, ప్రధానమంత్రి తరలివస్తున్న సందర్భానికి చిలకలూరిపేట వేదిక కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు.

ప్రజాగళం సభతో పాటు చిలకలూరిపేట ఆతిథ్యం అందరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోవడం ఖాయమన్నారు. ఆదివారం బొప్పూడి వద్ద జరగనున్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు ఆలపాటి రాజా, బీద రవిచంద్ర, దామచర్ల సత్య, కిలారు రాజేష్, తదితరులతో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. సభా వేదిక, ప్రాంగణంలోని ఏర్పాట్లు, హెలిప్యాడ్లను బృందంతో కలిసి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ ఉన్నతాధికారులతో చర్చించారు. శనివారం రాత్రి బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వారిలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, కిలారు రాజేష్, మాజీ ఎమ్మెల్సీ రాజు, బీద రవిచంద్ర, దామచర్ల సత్య, ఉండి ఎమ్మెల్యే రామరాజు తదితరులున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు 10 లక్షలమందికిపైగా మూడు పార్టీల శ్రేణులు తరలివస్తాయని అన్నారు. అందుకు తగినట్లుగా లక్షమందికిపైగా కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశామని చెప్పారు. బహిరంగ సభకు వచ్చే అందరికీ ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలా సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. అల్పాహారం నుంచి మంచినీళ్లు, మజ్జిగ, భోజనాల వరకు సకల ఏర్పాటు చేశామని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE