Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల్లో ‘ఆరే’యబోతున్న మాజీ సీఎంల కొడుకులు

– ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు
– ఎమ్మెల్యే బరిలో కోట్ల, నందమూరి, నాదెండ్ల, నేదురుమల్లి, వైఎస్, నారా వారసులు
(అన్వేష్)

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విచిత్రం చోటుచేసుకోబోతోంది. ఉమ్మడి -విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఆరుగురు.. రేపటి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు, కేంద్రమాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి డోన్ నుంచి, నందమూరి తారకరామారావు తనయుడు బాలకృష్ణ హిందూపురం నుంచి, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేయనున్నారు. ఇక జనసేన అభ్యర్ధిగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తనయుడు, మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయనున్నారు.

మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, ప్రస్తుత సీఎం జగన్ పులివెందుల నుంచి; మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. వీరిలో ఎంతమంది మాజీ సీఎం తనయులు అసెంబ్లీలో కాలుపెడతారో చూడాలి. వీరిలో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి తొలిసారి అసెంబ్లీ బరిలో నిలబడుతున్నారు. కోట్ల సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసి, కేంద్రరైల్వే మంత్రిగా కూడా పనిచేశారు.

LEAVE A RESPONSE