Suryaa.co.in

Andhra Pradesh

ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా నేడు లేదు

– విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం
-ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం
-బోగస్‌ ఓట్ల సంస్కృతికి అధికార వైసీపీ మళ్లీ తెరతీసింది
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు
-టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎపిటిఎఫ్‌, పిడిఎఫ్‌లకు మొదటి- రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలని కోరుతున్నా
-ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌కు ఓటు వేయాలని కోరుతున్నా
– ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ

రాష్ట్రంలో జరుగుతున్న టీచర్‌-గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఏపిటిఎఫ్‌, పిడిఎఫ్‌ అభ్యర్ధులకు తొలి-రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలు, విద్యావంతులపైనే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించడం ద్వారా, ఉద్యోగులు-నిరుద్యోగులు-మేధావులు ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఆమేరకు ఆయన ప్రజలకు బహిరంగలేఖ రాశారు.

చంద్రబాబునాయుడు లేఖ ఇదీ.

తేది : 11-03-2023

ఎమ్మెల్సీ ఎన్నికలపై బహిరంగ లేఖ

ప్రియమైన రాష్ట్ర ప్రజలకు !
మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న జరగనున్న పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికను కూడా ఒక ప్రహసనంగా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనుసన్నల్లో అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతంగా మారిన పరిణామాలపై ప్రజలకు, ఓటర్లకు వాస్తవాలు తెలియజేందుకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

అధికారం అంటే ఒక ఉన్నతమైన బాధ్యత. ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసేందుకు లభించిన అవకాశం అని భావించే పార్టీ టీడీపీ. ప్రజల అవసరాలు, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాలన చేసిన పార్టీ తెలుగుదేశం. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించి యువత భవితకు బాటలు వేశాం. 6లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారికి అండగా నిలిచాం. అయితే నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. యువత భవిష్యత్‌ అంధకారం అయ్యింది.

నేడు ఈ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ గురించి, డీయస్సీ గురించి ఎలా మోసం చేసిందో కూడా చూశాం.
ఇక ప్రభుత్వంలో భాగం అయిన ఉద్యోగులకు ఎప్పుడూ తగిన ప్రాధాన్యం ఇచ్చాం. విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం. వారికి తగు గౌరవం ఇచ్చాం.

ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా… కనీసం ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా నేడు లేదు. టీచర్లను లిక్కర్‌ షాపుల వద్ద పెట్టి ఎలా అవమానించారో కూడా రాష్ట్రం మొత్తం చూసింది. ఈ అన్ని అంశాలను యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, టీచర్లు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను.

రాష్ట్రంలో రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అక్రమాలు మనం చూశాం. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయకుండా హింసకు పాల్పడిరది. అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును హరించింది. ఎన్నికల్లో అక్రమాలు అనే విధానానికి అలవాటుపడిన ఈ ప్రభుత్వం… ఇప్పుడు ఆదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు తెరతీసింది. అడ్డదారులతో పట్టభద్రుల, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోంది. దీనిపై ప్రజలు, ఓటర్లు చైతన్యంతో వ్యవహరించి కుట్రపూరిత వైసిపికి బుద్ది చెప్పాలని కోరుతున్నాను.

భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో అమూల్యమైనది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎలా వేశారో… ఏ స్థాయి అక్రమాలు చేశారో నాడు చూశాం. అయినా సిగ్గు లేని ఈ వైసీపీ నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ అదే దారిలో వెళుతోంది. బోగస్‌ ఓట్ల సంస్కృతికి అధికార వైసీపీ మళ్లీ తెరతీసింది. తిరుపతిలో ఇల్లు కూడా లేని ఖాళీ స్థలాల్లో ఓట్లు నమోదు చేశారు. ఇతర ప్రాంతాల వారిని తెచ్చి స్థానికులుగా చూపెట్టి దొంగ ఓట్లు నమోదు చేశారు. పలుచోట్ల ఒకే ఇంటి అడ్రస్‌తో వందల సంఖ్యలో బోగస్‌ ఓట్లు నమోదు చేశారు. ఏడవ తరగతి, టెన్త్‌, ఇంటర్‌ చదివిన వారిని, నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు.

చివరికి వైసీపీ పార్టీ కార్యాలయం అడ్రస్‌ పెట్టి కూడా 38 బోగస్‌ ఓట్లు సృష్టించారు. తిరుపతిలో పలువురు ఓటర్లను ఫోన్‌లో సంప్రదించగా తాము పట్టభద్రులు కాదని, అసలు ఓట్లు ఉన్నట్లు తమకే తెలియదని వారే చెప్పారు. ఆ ఫోన్‌ రికార్డులు కూడా బయటపడ్డాయి. ఇలా ఒక్క చోట అని కాదు… అనేక ప్రాంతాల్లో విద్యార్హతలు లేని వ్యక్తులను, కార్మికులను తప్పుడు డాక్యుమెంట్లతో ఓటర్లుగా నమోదు చేశారు. రాజకీయ పక్షాల పరిశీలనలో బూత్‌ల వారీగా ఈ బోగస్‌ ఓట్ల బండారం బయటపడిరది.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోని ఒక్క తిరుపతి నగరంలోనే 7 వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇక ఉత్తరాంధ్రలో 5 వేలకు పైగా బోగస్‌ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు బయట పడిన సంఖ్య మాత్రమే. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఓటర్ల జాబితాలో 20-30 శాతం వరకు దొంగ ఓట్లు ఉంటాయని పరిశీలనలో తేలింది. బోగస్‌ ఓట్ల బాగోతంపై ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ, ఇతర రాజకీయ పక్షాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు పంపి చర్యలు తీసుకోవాలని కోరడం కూడా జరిగింది.

దొంగ సర్టిఫికెట్ల ఆధారంగా పట్టభద్ర ఓటరు హక్కు పొందటం తీవ్ర నేరం. దీనికి పాల్పడినవారు శిక్షార్హులవుతారు. అట్టి వారిని పోలింగ్‌ సమయంలోనూ, ఆ తరువాత కూడా గుర్తించి శిక్షించే వీలుంది. అందువలన అధికార పార్టీ ప్రోత్సాహంతో దొంగ ఓటు హక్కు పొందినవారు పోలింగ్‌ తేదీన ఓటు వేయడానికి బూతుల వద్దకు వెళ్లవద్దని కోరుతున్నాను.

ఇక ఈ బోగస్‌ ఓట్లతో పాటు కానుకలు ఇచ్చి వైసీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తోంది. ఓటర్లకు పెద్ద ఎత్తున వెండి నాణేలు పంచుతున్నట్లు తేలింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కల్తీ లిక్కర్‌ స్కాంలో అరెస్టై… నేడు బెయిల్‌పై ఉన్న వ్యక్తిని వైసీపీ పోటీలో పెట్టి అతనికి ఓట్లు వేసి గెలిపించమని అధికార పార్టీ గ్రాడ్యుయేట్లను కోరడాన్ని ప్రజలు గమనించాలి. టీచర్లు, గ్రాడ్యుయేట్లను గుర్తించి వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చి ప్రలోభపెట్టే స్థాయికి అధికార పార్టీ దిగజారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందుకే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మేము పిడిఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చాం. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసిన తరువాత… రెండో ప్రాధాన్య ఓటు పీడిఎఫ్‌ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, మా మద్దతుదారులను కోరుతున్నాం. ఇదే సందర్భంలో పిడిఎఫ్‌ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు మాకు వేయాలని కోరుతున్నాం.

ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేనందునవల్ల టీడీపీ సానుభూతిపరులు ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌కు ఓటు వేయాలని కోరుతున్నాను. తూర్పు రాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎపిటిఎఫ్‌, పిడిఎఫ్‌లకు మొదటి మరియు రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలని కోరుతున్నా. ఓట్లు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోను గెలవడానికి వీలు లేదు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉంది. దీన్ని ఓటర్లు అంతా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాము.

పతనం అంచులో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యంతో ఓటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

తెలుగుదేశం పార్టీ నుంచి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావు గారిని, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌ గారిని, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి గారిని, తెలుగుదేశం బలపరుస్తున్న వారిని మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ
(నారా చంద్రబాబునాయుడు)

 

LEAVE A RESPONSE