Suryaa.co.in

Telangana

స్వరాష్ట్రంలో “ప్రాణహిత” ఓ అనాధ…..!

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. గోదావరికి అతి పెద్ద ఉపనదిగా.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న ప్రాణహిత నది మా తల్లి పుష్కరాలకు నోచుకోకుండా ఓ అనాధగా.. దీనంగా కాలం వెళ్ళదీస్తోంది.

ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ లో నిర్వహించే కుంభమేళా కన్నా.. అధిక ప్రాశస్తం ఉన్న ఈ పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం..మంచిర్యాల జిల్లా లోని అర్జున గుట్ట, వేమన పల్లి ,దేవులవాడ తో పాటు, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో తుమ్మిడిహట్టి,మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ వద్ద ఈనెల 12వ తారీకు నుంచి 24 దాకా పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఒక్క కాళేశ్వరానికి మాత్రమే రోజుకు రెండు లక్షల భక్తులు వస్తారని అంచనా ఉన్నా ఏర్పాట్లు మాత్రం సున్నా.

సొంత రాష్ట్రం తెలంగాణలో ప్రాణహిత నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. కానీ పుష్కరాల గురించి నామమాత్రపు ప్రచారం కూడా చేయలేదు.. కనీస అవసరాలు తీర్చేందుకు కూడా ఏర్పాట్లు చేయకుండా ప్రాణహిత నదిని అనాధలా వదిలేసింది తెలంగాణ ప్రభుత్వం. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనానికి తాగునీరు.. మరుగుదొడ్లు.. స్నానపు గదులు.. మహిళలు బట్టలు మార్చుకునే వ్యవస్థ లేకపోవడం.. రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం ప్రమాద సూచికల తో పాటు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేక చేతులెత్తేసింది కేసీఆర్ ప్రభుత్వం.

పుష్కర స్నానాల వద్ద గజ ఈతగాళ్లు, బోట్లును ఏర్పాటు చేయలేదు.కనీసం ఘాట్ నిర్మాణానికి కూడా ఒక్క పైసా వెచ్చించ కపోవడం పుష్కరాల పై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధినీ తెలియజేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేశారు.. అవమానాలకు గురి చేశారంటూ అర్జున గుట్ట వద్ద 2010లో జరిగిన పుష్కరాల్లో ఇప్పటి సీఎం కేసీఆర్ అప్పుడు స్వయంగా పాల్గొని, అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు.

“వచ్చే పుష్కరాలను తెలంగాణ స్వ రాష్ట్రంలో వైభవంగా నిర్వహించుకుందాము” అని నాడు ప్రకటించిన కేసీఆర్… నేడు ప్రాణహిత పుష్కరాల గురించి మాట మాత్రం మాట్లాడక పోవడం శోచనీయం. 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుష్కరాల ఏర్పాట్ల నిమిత్తం పదికోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా నేడు సొంత రాష్ట్రం 100 కోట్లు కేటాయించిన తక్కువే.! నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి విడుదల చేయకపోవడం హిందువులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమను గుర్తు చేస్తుంది.

నది ప్రవహించే భూపాలపల్లి కలెక్టర్ 49 లక్షలు, మంచిర్యాల కలెక్టర్ 70 లక్షలు వెచ్చించి, తూతూమంత్రంగా పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవాలకు సీఎం కేసీఆర్ వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ సీఎం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దౌర్భాగ్యం. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో అటువైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పుష్కర ప్రారంభోత్సవాలకు రావాలని ఉన్నా భద్రత దృష్ట్యా హాజరు కాలేకపోయారు. అదేవిధంగా తమిళనాడు సీఎం సతీమణి దుర్గా స్టాలిన్ రావాల్సి ఉన్నా రాలేదు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం పుష్కర ఏర్పాట్ల కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి మహారాష్ట్ర రాష్ట్ర పండుగగా గుర్తించి ఉద్ధవ్ ప్రభుత్వం ఘనంగా పుష్కరాలు నిర్వహిస్తోంది. విఐపి గాట్లు కూడా ఏర్పాటు చేసింది.

త్రివేణి సంగమ క్షేత్రం కాళేశ్వరం
గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదుల కలయిక త్రివేణి సంగమం.
కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ప్రయాగ లోని గంగా, యమున నదులు కలిసే చోటు కంటే.. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం పవిత్రమైనదని చరిత్ర. ఇక్కడ స్నానమాచరిస్తే ప్రయాగ కన్నా కోట్ల రెట్లు పుణ్యం వస్తుందని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానం తర్వాత కాలేశ్వరం సందర్శిస్తే పాపాలు తొలగిపోయి.. గండాలు దూరం అవుతాయని నమ్మకం. గోదావరి నదికి ప్రాణహిత అతిపెద్ద ఉపనది.

మండే ఎండలు …నిప్పుల కొలిమి దాటుకుంటూ దర్శనం..!
అసలే మండుతున్న ఎండాకాలం. సూర్యుడు నిప్పులు కక్కుతున్న ఈ సందర్భంలో లక్షలాదిగా వస్తున్న భక్తులకు కనీసం నిలబడేందుకు చలువ పందిళ్ళు కూడా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం. నదిలో స్నానాలు చేసి దేవాలయాలు దర్శించడం సంప్రదాయం. అయితే సంప్రదాయం ప్రకారం నది నుంచి దేవాలయానికి రావాలంటే దాదాపు కిలోమీటర్ పైగా నడవాలి. కాళ్ళకు చెప్పులు లేవు.. కింద ఇసుక ప్రాంతం కావడంతో కాళ్లు మలమలమాడిపోతోన్నాయి. కనీసం తడకలు ఏర్పాటు కూడా చేయలేదు. దీంతో “భక్తులు అటు తలపై భానుడి భగభగ.. ఇటు కాళ్ళకింద నిప్పుల కొలిమి”తో అవస్థలు పడుతూ దర్శనాలకు వెళ్తున్నారు.

తాగునీటి వసతి కూడా లేదు. వృద్ధులు, మహిళలకు స్నానాలు ఆచరించేందుకు కుళాయిలు ఏర్పాటు లేదు. అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేకపోవడంతో తినుబండారాలు, వాటర్ బాటిల్స్ రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక ,తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్గడ్, రాష్ట్రాల నుంచి సుదూర ప్రయాణం చేసి వచ్చిన భక్తులతో స్థానిక వ్యాపారులు మోసాలకు దిగుతున్నారు. దండిగా దోపిడీ చేస్తున్నారు. హోటల్లు, లాడ్జిలో ఎన్నడూ లేనంత రేట్లు పెంచేశారు. కేవలం రాత్రి వేళ బస చేసేందుకే మూడు నుంచి 4,500 వసూలు చేస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని భక్తుల విశ్వాసాన్ని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచారు. అడిగేవారు లేకపోవడం.. అధికారుల పర్యవేక్షణ కరువవడంతో భక్తులను నిండా ముంచుతున్నారు.

వేమన పల్లి ఘాట్ లలో స్నానాలు చేసి దేవాలయానికి రెండు కిలోమీటర్లు ఇసుకలో నడవాల్సి ఉంది. స్థానికులు ఎడ్లబండ్లు ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరికి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు.కొన్ని చోట్ల బురద పేరుకుపోయింది. పిండ ప్రదానం చేసిన ఆస్తికలు.. నిమజ్జనం కోసం వినియోగించిన కుండలు.. దుస్తులను తొలగించలేదు. మహాదేవ్ పూర్ నుంచి కాళేశ్వరం వరకు 20 కిలోమీటర్ల రోడ్డు కోతకు గురై ఉంది. మలుపులు.. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి ఘాట్ కు మట్టి రోడ్డు మాత్రమే ఉంది. అర్జున గుట్ట , దేవుల వాడ వద్ద మరుగుదొడ్లు కూడా లేవు.

ఫ్యాన్లు కూడా తిరగని కాళేశ్వరం ఆలయం
కాళేశ్వరానికి దర్శనం కోసం వచ్చే భక్తులను పోలీసులు అడ్డుకొని తిరిగి పంపుతున్నారు. కాళేశ్వరం వద్ద కిలోమీటర్ దూరంలో వాహనాలు పార్కింగ్ చేసి ఎండలో నడుచుకుంటూ రావాల్సిందే. ఈ మార్గంలో కనీసం పైన తడకలు గాని , లేక కింద ఫుట్ మ్యాట్ లు కానీ ఏర్పాటు చేయలేదు. ఇక చేసేది లేక మండుటెండల్లో స్నానాలకు వెళ్తున్నారు భక్తులు.
అసలే వేసవి కావడం… కనీసం తాగునీరు అందించేందుకు వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కాళేశ్వరం ఆలయంలోని శ్రీ కాళేశ్వర, ముక్తేశ్వర స్వాములను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. అయితే ప్రాంగణంలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్యూలైన్లో తాగునీటి వసతు కూడా చేయలేదు. దీంతో భక్తులు దాహంతో అల్లాడిపోతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు షెడ్లు, షవర్స్, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తామని..అందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట కూడా నిలబెట్టుకోలేదు.

ఆర్భాటాలకేనా ప్రపంచ ప్రఖ్యాత కాలేశ్వరం ప్రాజెక్టు…?
ప్రాణహిత నీటితో ప్రపంచంలోనే కాళేశ్వరం వద్ద అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. పుష్కరాలకు పైసా కూడా ఇవ్వకపోవడం దారుణం. పుష్కరాల ఏర్పాట్లు ముందే ఊహించిన అధికార యంత్రాంగం ఐదు నెలల ముందే , గత డిసెంబర్ లోనే అన్ని విభాగాల అధికారులు సమావేశమయ్యారు. పుష్కరాల నిమిత్తం చేసే ఏర్పాట్లు, అయ్యే ఖర్చు 23 కోట్ల రూపాయలు అవుతుందని నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపారు. అయితే “ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని.. నివేదిక తిరిగి పంపండి” అని ఉన్నతాధికారులు ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో చివరకు 5 కోట్ల కు కుదించి ప్రతిపాదనలు మళ్లీ పంపారు. అయినా ప్రభుత్వం ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో హిందూ పండుగలు పై ముఖ్యమంత్రికి ఉన్న భక్తిశ్రద్ధలను గుర్తుచేస్తుంది.

నిర్లక్ష్యంగా ట్రాఫిక్ యంత్రాంగం
పోలీసులు నామమాత్రంగా విధులు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ లో గంటల తరబడి ఎండలకు నిరీక్షించి చాల్సి వస్తోంది. ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.
హిందూయేతర మతస్తులైన పోలీసు అధికారులు కావాలనే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ఇసుక లారీలకు అదే దారిలో అనుమతి ఇవ్వడంతో భారీగా ట్రాఫిక్ జాం అవుతూ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జానీ నరసింహులు అనే ఇన్స్పెక్టర్ కాళేశ్వరం వద్ద దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అడిగిన వారిపై లాఠీలతో విరుచుకుపడుతున్నా డు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా భక్తుల పైన కేసులు పెడతానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. త్రివేణి సంగంలో కాలేశ్వరం లో స్థానాలు చేద్దామనుకున్నా అధికారులు అడ్డుకుంటున్నారు. అర్జున గుట్ట , సిరోంచ కు తరలిస్తున్నారు. అర్జున గుట్ట సిరోంచ లలో దేవాలయాలు లేనందున కాళేశ్వరం వెళితే వెళ్తున్న భక్తులను పోలీసులు అడ్డుకొని తిరిగి పంపుతున్నారు. దర్శనానికి వెళ్లకుండా చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద రెట్టింపు ధరలతో బెల్టుషాపులు జోరుగా సాగుతున్నాయి.

వైద్య సౌకర్యాలు లేక వ్యక్తి దుర్మరణం..!
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జున గుట్ట ఘాట్ వద్ద ఓ వ్యక్తి పుణ్య స్నానం చేస్తుండగా నదిలోనే మరణించడం బాధాకరం. విశాఖపట్నం జిల్లాకు చెందిన సోమేశ్ (39) మృతిచెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. భక్తుల ఆరోగ్య సమస్యల కోసం వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఇంతటి దయనీయస్థితిలో పుష్కరాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు చెప్పక తప్పదు.! అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాకపోయినా ఆయన చిత్రపటానికి త్రివేణి సంగంలో స్నానాలు చేయించడం గమనార్హం.

balaswamy
– పగుడాకుల బాలస్వామి ప్రచార సహ ప్రముక్ విశ్వహిందూ పరిషత్( VHP) 9912975753,9182674010

 

LEAVE A RESPONSE