Suryaa.co.in

Editorial

కాంగ్రెస్‌కు జెల్ల కొట్టిన ప్రశాంత్‌కిశోర్!

– పార్టీలో చేరకుండానే జెండా ‘పీకే’శారు
– ఆయన ఆ పార్టీకి సలహాలు మాత్రం ఇస్తారట
– వెర్రిపుష్పమయిన మీడియా
– నిజమయిన ‘సూర్య’ విశ్లేషణ
(మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే అయింది. యాపారమా? రాజకీయమా అన్న త్రాసులో కూర్చున్న ప్రశాంత్ కిశోర్ అనే బీహార్ రాజకీయ ఎన్నికల బేహారీ.. చివరాఖరకు యాపారాన్నే ఎంచేసుకున్నాడు. తననే నమ్ముకున్న కాంగ్రెస్‌కు జెల్ల కొట్టాడు. కాంగ్రెస్‌లో చేరాలా? వద్దా? అన్న మీమాంస కాలంలో అనేక రాజకీయ పార్టీ కంపెనీల వద్ద తన గిరాకీని విజయవంతంగా పెంచుకుని, కాంగ్రెస్‌ను నిజంగానే హవులాను చేశాడు. అంతలావు కాంగ్రెస్ కూడా, పీకే మాయాజాలంలో ఇరుక్కుని అభాసుపాలయింది. రేవంత్‌రెడ్డయితే.. నేనూ, పీకే కలసి జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి, టీఆర్‌ఎస్‌ను ఓడించాలని పీకేతోనే చెప్పిస్తానని తొందరపడి ముందే కూసి, ఇప్పుడు నగుబాటుపాలయ్యారు. ఆవిధంగా పీకే పుట్టించిన ఐప్యాక్‌ను తన దొడ్లో కట్టేసుకోవాలనుకున్న కాంగ్రెస్ కల చెదిరింది.ఇదికూడా చదవండి.. యాపారమా? రాజకీయమా?

అంతా అనుకున్నట్టే.. పీకే తన వ్యాపారకోణంలోనే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడమే తరువాయి అన్నట్లు ఈ వారం రోజులు తెగ రచ్చ చేసిన మీడియాను, తనను పిలిచి పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ను ‘బీహార్ ఎన్నికల రాజకీయ బేహారీ’ జమిలిగా పిచ్చి పుష్పాలను చేశారు. పీకే వ్యవహారశైలి, ముందుజాగ్రత్తలకు సంబంధించి నిన్ననే ‘సూర్య’లో ‘‘యాపారమా? రాజకీయమా?’’ అన్న శీర్షికతో కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఆ కథనంలో చివరాఖరకు పీకే.. తన డీల్‌కు కాంగ్రెస్ ఒప్పుకోలేదు కాబట్టి.. తూచ్ నేను ఆ పార్టీలో చేరనని చావుకబురు చల్లగా చెప్పినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది!

అవును.. తాను కాంగ్రెస్‌లో చేరేది లేదని, సలహాదారుగా మాత్రమే కొనసాగుతానని పీకే చావుకబురు చల్లగా చెప్పారు. కాంగ్రెస్ అధికారప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా అదే ట్వీటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దతలలతో ఏర్పాటుచేసిన ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’లో చేరేదిలేదని, పార్టీ ఎన్నికల బాధ్యత మాత్రమే తీసుకుంటున్నట్లు స్వయంగా పీకే సెలవిచ్చారు. ‘పార్టీలో చేరాలని కాంగ్రెస్ నాయకత్వం కోరినా నేను తిరస్కరిస్తున్నా. కాంగ్రెస్ పునరుజ్జీవంలో తనకంటే నాయకత్వం ముఖ్యం’ అని పీకే సారు ట్వీటారు.

అయితే… సారు పార్టీలో చాలా పెద్ద పదవే కోరారని, దానితోపాటు, పార్టీ ప్లానింగ్‌లో స్వేచ్ఛ ఇవ్వాలన్న ఆయన డిమాండ్ల వల్లే, పీకే ఆఫర్‌ను తిరస్కరించారన్నది పార్టీలో మరో టాక్.

నేను ముందే చెప్పినట్లు.. ఎలాంటి లాభం లేకుండా, వందల కోట్ల సంపాదన వదులుకుని, చేతిలో ఉన్న ఐప్యాక్‌ను పూర్తిగా ‘చేతికి’ అప్పగించి, చేతి చమురు వదిలించుకుని, ఉత్తిగా చేతులు ఊపుకుంటూ వెళ్లి.. సోనియామాత కుటుంబానికి సేవచేయడానికి పీకే ఏమీ పిచ్చోడు కాదు. ఇదో సెల్ఫ్ ప్రమోషన్ స్కీమ్. తన మార్కెట్ మరింత పెంచుకునే తెలివి. అంతలావు కాంగ్రెస్సే పీకే కోసం పరితపిస్తుందన్న సంకేతాన్ని, మనం కూడా ఆయననే మార్కెటింగ్ మేనేజర్‌గా పెట్టుకోవాలన్న కొత్త ఆలోచనను.. మిగిలిన పార్టీలకు పంపడంలో, ఆయన విజయం సాధించారు. అంటే ఆ మేరకు తన మార్కెట్ బాగా పెంచుకున్నారన్నమాట.

ఇంతోటి వ్యూహం కూడా కనిపెట్టలేని మీడియా.. పీకే తెలివిని పసిగట్టలేక బొక్కబోర్లా పడటమే ఆశ్చర్యం. అసలు పీకే సారు కాంగ్రెస్‌లో చేరడమే తరువాయి అని, ఆయన హైదరాబాద్‌కు వచ్చించే తెరాసతో తెగ తెంపులు చేసుకునేందుకని, తన ఐప్యాక్ సేవలు మాత్రమే తప్ప, తాను సలహాలు అందించనని కేసీఆర్‌కు ఖరాఖండిగా చెప్పారనే కథనాలు వండివార్చి, చివరాఖరకు తెల్లముఖం వేసింది. ఇప్పుడసలు తాను కాంగ్రెస్‌లోనే చేరడం లేదని పీకే సారే చెప్పారాయె!

ఈ మధ్యకాలంలో మునుపటి మాదిరిగా, నలుగురు నాయకులతో మాట్లాడి, తమ కంటే సీనియర్లతో చర్చించి రాసే జర్నలిజం అటకెక్కింది. ఇప్పుడంతా వాట్సాప్ యూనివర్శిటీ జర్నలిజమే నడుస్తోంది. దానికితోడు ‘కట్ అండ్ పేస్ట్ రాయుళ’్ల సంఖ్య తామరతంపరగా పెరిగింది. ఈ కట్ అండ్ పేస్ట్ రాయుళ్లే, రోజూ సాయంత్రం టీవీ డిబేట్లలో కూడా దర్శనమిస్తున్నారు మరి! ఇప్పుడు ఇలాంటి ముఖాలే పేరుగొప్ప టీవీ చానళ్లకు పెద్దముత్తయిదువలు!

సరే.. మీడియా అంటే ఏదో తెలిసీ తెలియక, మిడిలిడి జ్ఞానంతో, లేక ‘అగ్నానం’తో.. గాల్లో బాణాలేసిందనుకుందాం. మరి అధిష్టానంతో రోజూ అంటకాగే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకేమయింది? రేవంత్‌రెడ్డి చాలా ఫాస్టు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాలా ఇంటలెక్చువల్. వీళ్లంతా ఢిల్లీ పార్టీతో టచ్‌లో ఉంటారు కాబట్టి అన్నీ ముందే తెలుస్తాయని కదా ప్రచారం? మరి అంతలావు తెలివిగలోళ్లు, పీకే తమ పార్టీకి ‘చేయి’స్తారని ఊహించకుండానే… ‘త్వరలోనే తెరాసను ఓడించమని పీకే ప్రెస్‌మీట్‌లో చెప్పబోతున్నారని’ ఎలా తొందరపడి ముందే కూశారన్నది ప్రశ్న. ఏదేమైనా అపరమేధావి, తిమ్మినిబమ్మినిచేసే మాయావి అయిన పీకేను దూరం చేసుకున్న కాంగి‘రేసు’ గుర్రాన్నిచూసి ఓ రెండు కన్నీటి చుక్కలు రాల్చాల్సిందే.

LEAVE A RESPONSE