యాపారమా? రాజకీయమా?

153

– ఐ-పాక్‌ను ‘పీకే’స్తారా?
– ఇదీ ‘సెల్ఫ్ మార్కెటింగ్’ ఎత్తుగడేనా?
– తెరాసతో తెరచాటు బంధంపై తర్జనభర్జన
– కాంగ్రెస్ కడు విషాద కథ
( మార్తి సుబ్రహ్మణ్యం)

డజనుమందికి జన్మనిచ్చిన సుబ్బలక్ష్మికి సంతాన పరీక్ష పెట్టినట్లుంది కాంగ్రెస్ విషాద కథ. ఒక్కో రాష్ట్రాన్నీ బీజేపీ ఊడ్చేస్తుంటే.. ఆ అపజయ దు:ఖంలో ఉన్న కాంగిరేసు కష్టాలను కడతేర్చి, అధికార వియోగంలో ఉన్న ఆ పార్టీ నుదుట అధికార బాసికం కట్టేందుకు, బీహార్ నుంచి వచ్చిన బాహుబలిని తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే అతగాడికేం బాధ్యత ఇవ్వాలని తేల్చేందుకు, పెద్దతలలతో ఓ కమిటీ వేసిన సోనియామాత అండ్ కోను చూస్తే, ఎంత కఠినాత్ముడికయినా కన్నీరు ఆగదు. ఇంతకూ దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగిరేసును.. కష్టాల నుంచి కడతేర్చేందుకు వచ్చిన, ఆ బీహార్ బాహుబలి పేరు ప్రశాంత్‌కిశోరయితే.. అతగాడి నుంచి చేతులు కట్టుకుని పాఠాలు నేర్చుకునే విషాదస్థాయి కాంగిరేసుది!

పీకే.. ప్రశాంత్ కిశోర్ అనే మాయలమరాఠీ, తన మంత్రదండంతో.. ‘బీజేపీ ముక్తభారత్’ అనే అశ్వమేధయాగంలో భాగంగా, కాంగిరేసు నుదుట అధికారబాసికం కట్టించే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. మంచిదే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగిరేసుది ప్రాంతీయపార్టీలను దేబిరించి, అవి ఇచ్చినన్ని సీట్లు తీసుకుని నవరంధ్రాలూ మూసుకోవలసిన దిక్కుమాలిన పరిస్థితి. పార్టీ రథాన్ని ఎవరు లాగాలన్న దానిపై కుటుంబసభ్యులకే క్లారిటీ లేదు. వందిమాగధులు మాత్రం.. రాహులబ్బాయినే పట్టాభిషిక్తుని చేయాలని
prashant-kishor-rahul ఒకటే లొల్లి. పాపం ఆ బాబేమో నాకొద్దు మొర్రో.. నేనేదో పరాయి దేశాలకు వెళ్లి, మసాజులు చేయించుకుని, నా మానాన నేను బతుకుతున్నానంటాడు. మాత- పుత్ర కాకపోతే, కనీసం పుత్రిక ప్రియాంకనయినా పెట్టాలని వారి వాదన. ఈ క్లిష్ట పరిస్థితిలో పార్టీని రక్షించేందుకు.. ఆపద్బాంధుడిలా వచ్చిన బీహారీబాబు పీకేను చేర్చుకోవాలా? వ ద్దా అన్న తర్జనభర్జనలో పడటం మరో వింత. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ ఉన్న క రువుకాలంలో, పీకేలాంటి మాయావి రావడమే ఎక్కువ. మళ్లీ దానికోసం కమిటీలు, కాకరకాయలూ.

సరే. ఈ గోల పక్కనపెడితే.. అసలు పీకే నిజంగా కాంగ్రెస్‌లో చేరతారా? లేక ఆ పేరుతో కాంగ్రెస్‌ను హవులాను చేసి, ఆ పేరుతో తన మార్కెట్ మరింత పెంచుకునే కొత్త ఎత్తుగడా? అందులో భాగంగా తన లక్ష్యం నెరవేరిన తర్వాత, కాంగ్రెస్ తన డీల్‌కు ఒప్పుకోలేదు కాబట్టి, తూచ్ నేను కాంగ్రెస్‌లో చేరనని చావుకబురు చల్లగా చెబుతారా అన్నది చాలామంది డౌటనుమానం. మిగిలిన సర్వే సంస్థలు ఇలాంటి సందేహాలే వ్యక్తం చేస్తున్నాయి కూడా. గతంలో ఓసారి కాంగ్రెస్‌లో చేరి వె ళ్లిపోయిన పీకే, మళ్లీ అలాంటి ఝలక్ ఇవ్వరన్న గ్యారంటీ లేదన్నది పరిశీలకుల ఉవాచ.

ఎందుకంటే అతగాడు పుట్టించిన ఐ-ప్యాక్ అనే ఎన్నికల సర్వే కంపెనీకి, చాలా రాజకీయపార్టీలు వర్కు ఆర్డర్లు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. ఈమధ్య జరిగిన బెంగాల్ ఎన్నికల్లో, మనోడి ప్లాన్లు పారడంతో పీకేకు గిరాకీ ఇంకా పెరిగింది. ఆయన ఓ పార్టీకి పనిచేసేందుకు ఒప్పందం చేసుకుంటే, దానికి వందల కోట్లు చెల్లించాలి. కానీ.. కేసీఆర్‌కు మాత్రం ఉచితంగా, ఎర్ర యాగాణీ తీసుకోకుండానే సర్వేలు చేసిపెడుతున్నారట. ఇది స్వయంగా కేసీఆరే చెప్పిన ముచ్చట. అది వేరే విషయం.

అంటే ఆ ప్రకారంగా పీకేది పక్కా యాపారం. మరి అన్ని వందల కోట్ల యాపారాన్ని వదిలిపెట్టి, కాంగ్రెస్ అనే గంగలో మునగడానికి పీకే ఏమైనా పిచ్చోడా అన్నది మరికొందరి అనుమానం. అలాగ ని కాంగ్రెస్, పీకే నష్టపోతున్న డబ్బునేమైనా చెల్లిస్తుందా అంటే.. అసలు ఆపార్టీకే ఠికానా లేదట. అధికారంలో ఉన్నప్పుడే సోనియామాత ఆపరేషను ఖర్చును, రాజీవ్ చిత్రపటం అమ్మడం ద్వారా ఓ ప్రైవేటు బ్యాంకును బాదాల్సివచ్చిందట.

మరి పక్కా వ్యాపారి పీకేకు కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఏం లాభం? పోనీ తన సలహాలు పాటించే కాంగ్రెస్, అధికారంలోకి వస్తుందనే గ్యారంటీ ఉందా అంటే అదీ లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాతయినా, అతగాడికి పెద్దపీట వేస్తారన్న నమ్మకం ఉంటుందా అంటే అదీలేదు. కాంగ్రెస్ పెద్దతలలు కండిషన్లు పెట్టినట్లు.. పీకే తాను పుట్టించిన ఐ-ప్యాక్‌ను గిట్టించి, దానిని మొత్తం పార్టీ కోసమే ధారాదత్తం చేశారే అనుకుందాం. మరి అన్ని కోట్ల రూపాయల ఖర్చును పీకే నిస్వార్ధంగా భరించేంత సీను కూడా ఉండదు. ఎందుకంటే అది యాపారమే కాబట్టి! ఓవైపు తనకు రెండు, మూడొంద ల కోట్లు ఆఫర్లిస్తున్న పార్టీలను కాదని.. తన చేతిచమురు వదిలించుకుని, కాంగ్రెస్‌కు సేవ చేయాల్సిన అవసరం పీకేకు ఏమొచ్చింది? అన్నది బుద్ధిజీవుల సందేహం.

ఒకవేళ అయితే.. గియితే.. తాను చేయించిన సర్వేల్లో అభ్యర్ధులను కూడా తానే తేల్చి, వారి నుంచి టికెటుకు ఇంత అని వసూలుచేసుకునే వెసులుబాటు ఉంటుందే మో చూడాలి. గత కొంతకాలం నుంచి ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలతో బీఓటీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు.. పీకే కూడా కాంగ్రెస్‌తో అలాంటి టికెట్ల బిజినెస్ డీల్ కుదుర్చుకుంటారేమో? ఎవరికెరుక!

ఇప్పుడు పీకేకు మహాకష్టం వచ్చిపడినట్లుంది. తెలంగాణలో అధికార తెరాసకు కాంగ్రెస్ సవాల్ విసురుతోంది. ఒకవైపు రేవంత్, ఇంకోవైపు భట్టి కమ్మేస్తున్నారు. రేవంత్ పగ్గాలందుకున్న తర్వాత పార్టీ జోరు పెరిగింది. బీజేపీదంతా మీడియా హడివిడే తప్ప, జనంలో కాంగ్రెస్‌కే బలం ఉందన్నది కాంగీయుల అంచనా. మరి పీకేనేమో తెరాసను ఎన్నికల వైతరణి దాటించేందుకు, తన ఐప్యాక్ ద్వారా ఎప్పుడో డీల్ కుదుర్చుకున్నారు. అఫ్‌కోర్స్.. కేసీఆర్ చెప్పినట్లు పుణ్యానికే అనుకోండి.

ఇటు చూస్తే మళ్లీ అదే పీకే కాంగ్రెస్‌తో డీల్ చేస్తున్నారు. మళ్లీ అదే పీకే ప్రగతిభవన్ టు ఫాంహౌసు చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. అసలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న పీకే, హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలవడం ఏమిటి? ఎలాగూ కేసీఆర్ చెప్పినట్లు ఫ్రీగానే సర్వేలు చేస్తున్నట్టయితే, మళ్లీ ఫ్లైటు చార్జిలు పెట్టుకుని కేసీఆర్‌ను వచ్చి ఎందుకు కలిసినట్లు? కొంపదీసి రెండు పార్టీల మధ్య సంధి కుదర్చడానికేమైనా వచ్చారా? ఈ తికమక ఏమిటన్నది రెండు పార్టీల్లో పెద్ద చర్చ. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాలో జగనన్న పార్టీతో డీల్ కొనసాగిస్తున్న పీకే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారట. ఆ మేరకు వైకాపాతో పొత్తు కుదురిస్తానని కాంగ్రెస్ పెద్దలకు భరోసా ఇచ్చార న్నది మరో ప్రచారం.

కాబట్టి, తెలంగాణలో కూడా తెరాసతో ‘చేయి’పట్టుకుని నడిపిస్తారేమోనన్నది అనుమానం. ఆ ప్రకారంగా..
Prashant-Kishor-KCR తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయించి, ఒప్పందం ప్రకారం కేటీఆర్‌ను సీఎంను చేసి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉండేలా చూస్తారన్నది మరో కథనం. అయితే ఇలాంటి వాటిని ఒప్పుకునేందుకు.. అక్కడ ఉన్నది ఏమీ తెలియని సోనియాగాంధీ కాదు, కేసీఆర్ అని గుర్తుంచుకోవాలి. ఏదేమయినా ఇవన్నీ ఇప్పటికి ఊహాగానాలే.

అయితే… పీకే కాంగ్రెసుకే పనిచేస్తారని, కానీ ఆయన పుట్టించిన ఐ-ప్యాక్ మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం, తెరాసకు పనిచేస్తుందన్నది లీకుల ద్వారా అర్ధమవుతున్న ముచ్చట. అదేంటి? సుబ్బలక్ష్మికి తాళి కట్టి చెంచులక్ష్మితో సంసారం చేస్తారా? ఇదేం విడ్డూరమన్నది పాపం పిచ్చి కార్యకర్తల అమాయకపు ప్రశ్న. కానీ.. పీకే తన సర్వేల బిజినెసు యాపారాన్ని మూసుకుని, పూర్తి పాలేరు మాదిరిగా తనకే పనిచేయాలని కాంగ్రెసు కండిషను పెట్టిందని మరో లీకు కథనం. అటు రేవంతుడు కూడా.. తెరాసతో తలాక్ చెప్పేందుకే, పీకే హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలిశారంటున్నాడు. పైగా తాను-పీకే కలసి ప్రెస్‌మీట్ పెట్టి తెరాసను ఓడించమని పిలుపునిచ్చే రోజు కూడా ఎంతో దూరం లేదంటున్నాడు. పీకే పెదవి విరిస్తేనే ఈ దాగుడుమూతలకు తెరపడేది. అదెప్పుడో మరి?!

2 COMMENTS

  1. […] అనుకున్నదే అయింది. యాపారమా? రాజకీయమా అన్న త్రాసులో కూర్చున్న ప్రశాంత్ కిశోర్ అనే బీహార్ రాజకీయ ఎన్నికల బేహారీ.. చివరాఖరకు యాపారాన్నే ఎంచేసుకున్నాడు. తననే నమ్ముకున్న కాంగ్రెస్‌కు జెల్ల కొట్టాడు. కాంగ్రెస్‌లో చేరాలా? వద్దా? అన్న మీమాంస కాలంలో అనేక రాజకీయ పార్టీ కంపెనీల వద్ద తన గిరాకీని విజయవంతంగా పెంచుకుని, కాంగ్రెస్‌ను నిజంగానే హవులాను చేశాడు. అంతలావు కాంగ్రెస్ కూడా, పీకే మాయాజాలంలో ఇరుక్కుని అభాసుపాలయింది. రేవంత్‌రెడ్డయితే.. నేనూ, పీకే కలసి జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి, టీఆర్‌ఎస్‌ను ఓడించాలని పీకేతోనే చెప్పిస్తానని తొందరపడి ముందే కూసి, ఇప్పుడు నగుబాటుపాలయ్యారు. ఆవిధంగా పీకే పుట్టించిన ఐప్యాక్‌ను తన దొడ్లో కట్టేసుకోవాలనుకున్న కాంగ్రెస్ కల చెదిరింది.ఇదికూడా చదవండి.. యాపారమా? రాజకీయమా? […]

  2. […] ‘‘ పదేళ్ల రోలర్‌కోస్టర్ ప్రయాణంలో ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించటం ద్వారా, ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఇప్పుడు రియల్ మాస్టర్స్ వద్దకు వెళ్లే సమయం ఆసన్నమయింది. ప్రజలే రియల్ మాస్టర్లు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని మరింత బాగా అవగాహన చేసుకుని, సుపరిపాలన దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాను’’ – పీకే గా ప్రచారంలో ప్రశాంత్ కిశోర్ అనబడే బీహార్ రాజకీయ బేహారీ, తాజాగా చేసిన ఐదారు లైన్ల ట్వీట్ ఇది.ఇదికూడా చదవండి.. యాపారమా? రాజకీయమా? […]