Suryaa.co.in

Andhra Pradesh

తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘దళిత తేజం- తెలుగుదేశం’ సన్నాహక సమావేశం

-దళిత ద్రోహి జగన్ రెడ్డి-దళితబాంధవుడు, పేదల పెన్నిది చంద్రన్న అనే నినాదం విస్తృతంగా తీసుకెళ్లటమే కార్యక్రమం ప్రధాన లక్ష్యం
-సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్ రాజు

వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లు అనుసరించిన దళిత వ్యతిరేక విధానాలపై, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన సాధికార సంక్షేమంపై ప్రతీ దళితవాడలో ‘దళిత తేజం-తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహిస్తామని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్ రాజు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వివిధ స్థాయి దళిత నాయకులు దాదాపు 100 మంది పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి రాజు ప్రసంగిస్తూ…‘దళిత ద్రోహి జగన్ రెడ్డి-దళితబాంధవుడు, పేదల పెన్నిది చంద్రన్న’ అనే నినాదం విస్తృతంగా దళితవాడలకు తీసుకెళ్లటమే కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. దళిత అభ్యున్నతి, ఆర్ధిక, సామాజిక ప్రగతి కోసం టిడిపి హయాంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, డా. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లాంటి 27 సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రద్దు చేసి దళితులను వంచించారు.

దశాబ్దాల నుంచి దళితులు సాగుచేసుకుంటున్న 12,000 ఎకరాల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కుని దళితులను రోడ్డునపడేశారు. నాలుగేళ్లలో 33 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ రాజ్యాంగబద్ద నిధులను దారిమళ్లించారు. టిడిపి హయాంలో 4 లక్షల మంది దళిత సోదరులకు ఉపాధి కల్పించిన ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. దళిత బిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తీసుకొచ్చిన అంబేడ్కర్ విదేశీ విద్యాపథకాన్ని నాలుగేళ్లుపాటు అటకెక్కించి, అంబేడ్కర్ పేరు తొలగించిన జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి డా. అంబేడ్కర్ ను అవమాపరిచారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీలకు ఇచ్చే రుణాలపై తెలుగుదేశం పార్టీ మొదటి ఏడాది నుంచే సబ్సిడీ అమలు చేస్తే జగన్ రెడ్డి మొదటి రెండేళ్లు తొలగించి మూడవ ఏట నుంచి అమలయ్యేలా మార్చి వారి సాధికారతపై దెబ్బకొట్టారు. వ్యవసాయ భూమి ఉండటం భవిష్యత్తుకు ఒక భరోసా. సొంత భూమి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. దళితులు ఆత్మగౌరవంతో సగర్వంగా బ్రతికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము) తీసుకొస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు.

అంటరానితనం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమీషన్ ను 2001 లో నియమించి ఆ కమిటి చేసిన 42 సిఫారసులు అమలు కోసం 18 జీఓలును విడుదల చేసిన దళితబాంధవుడు చంద్రన్న. చంద్రబాబు  హయాంలో జి.ఓ నం. 105 తీసుకొచ్చి అంటరానితనం, దళితులపై అత్యాచారాల నిరోధించాం. జి.ఓ నం.107 ద్వారా అత్యాచారాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో జిల్లా మానిటరింగ్ కమీటీలు ఏర్పాటు చేశాం. జి.ఓ నం. 108 తో అత్యాచారం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ లు సదర్శించి సమీక్షించేలా అధికారులను దళితవాడలకు పంపాం. జి.ఓ నం.109 – నేరస్తులను శిక్షించేందుకు 10 సం. అనుభవం ఉన్న న్యాయమూర్తులతో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు చేశాం. జి.ఓ నం. 117 – అత్యాచార బాధితులకు నష్టపరిహారం చెల్లించడం లాంటి వాస్తవాలను దళిత ప్రజానీకానికి చేరవేస్తాం అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్, దొప్పలపూడి జ్యోతిబసు, గుడిమెట్ల దయారత్నం, ఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల దాసు, బొల్లెద్దు సుశీల్ రావ్, బాపట్ల, మచిలీపట్నం, విజయవాడ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సురేష్, ఆదినారాయణ, దానియేలు…తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE