– వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్న 80% పోలీసులు
– వినాయక చవితి నిర్వహణకు రుసుము వసూలు దారుణం
– రాసలీలల పార్టీని భూస్థాపితం చేయాలి సీఎం జగన్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి
– తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎన్.ఎస్.జీ కమాండోల భద్రత పెంపు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ విఫలమైందని.. 80% మంది పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై పోలీసులు తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ పరిస్థితులలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం పోయిందన్నారు. కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కనీసం వచ్చే ఎన్నికలవరకైనా కేంద్ర భద్రత ప్రజలకు అవసరమని అన్నారు. తన బాబాయ్ హత్య కేసులో నిందితుల ఎవరో ఇంతవరకు గుర్తించలేని స్థితిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని..మరోవైపు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు శృతి మించుతున్నాయన్నారు.
ఎన్నడూ లేని విధంగా గణపతి మండపాల నిర్వహణకు కూడా రుసుము చెల్లించాలని అనడం వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. భారతదేశం హిందూ దేశమని, హిందువులు ముందుగా కొలిచే వినాయకుడి పూజలకు కూడా విజ్ఞాలు కలిగించడం ఏమిటని ప్రశ్నించారు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కూడా ఇంతటి అరాచకమైన పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలనను అంతం చేసి ముఖ్యమంత్రి జగన్ ను గద్దె దించి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని రామ్ పిలుపునిచ్చారు.
రాసలీలల ప్రజాప్రతినిధుల పార్టీగా గుర్తింపు పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఏది ఏమైనా వైయస్ జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రామ్ జోస్యం చెప్పారు.